Thursday 16 February 2012

సాయి.బా.ని.స. డైరీ - 1994 (28)



 సాయి.బా.ని.స. డైరీ  -  1994  (28)

05.10.1994

నిన్నటిరోజున నా దగ్గర బంధువుతో ఉన్న శత్రుత్వము గురించి ఆలోచించినాను.  శ్రీ సాయి తత్వము  ప్రకారము ఈ జన్మలోనే శత్రుత్వము వదిలించుకోవాలి.  లేని యెడల అది మరుజన్మలో కూడ తల ఎత్తుతుంది.  ఏమి చేయాలి అనే ఆలోచనలతో రాత్రి నిద్రకు ముందు శ్రీ సాయి సలహా కోరి నిద్రపోయినాను.


శ్రీ సాయి కలలో చూపిన దృశ్యాల సారాంశము.  1) నేను ముషీరాబాద్ జైలులో నా తప్పులకు శిక్ష అనుభవించి బయటకు వచ్చినాను.  జైలు నుండి బయటకు వచ్చినానే కాని  మనసులో పగ చల్లారలేదు.  నేను జైలులో కష్ఠపడి పని చేఇనందులకు నాకు  ప్రభుత్వమువారు యిచ్చిన ధనముతో ఒక తుపాకీని కొని నా శత్రువును కాల్చి చంపాలి అనే ఆలోచన కలిగినది. ఈ విషయము నా భార్యకు చెప్పినాను.  ఆమె నాకు చీవాట్లు పట్టి "మీకు  కళ్ళు సరిగా కనిపించని వయసు.  యింక పంతాలు పట్టింపులు మాని వేయండి.  మీరు మీ పగను  వదలకపోతే తిరిగి జైలుకు వెళ్ళవలసియుంటుంది ఆలోచించుకోండి" అన్నది.  నిద్రనుండి ఉలిక్కిపడి   లేచినాను.  నాగదిలో ఉన్న శ్రీ సాయి పటముముందు కూర్చుని ఆలోచించసాగినాను.  క్రిందటి  జన్మలోని శత్రుత్వమునకు ఈ జన్మలో మానసికముగా చాలా శిక్ష అనుభవించినాను.  ఈ శిక్ష అనుభవించిన తర్వాత కూడ యింకా పగ వైషమ్యాలకు పోతే తిరిగి జైలుకు వెళ్ళవలసి యుంటుంది.   అంటే వచ్చే జన్మలో కూడ ఈ శత్రుత్వము దానికి శిక్ష అనుభవించవలసి యుంటుంది.  అందుచే ఈ శత్రుత్వమును ఈ జన్మలోనే అంతము చేసుకోవాలి లేదా శ్రీ సాయి సత్ చరిత్రలో శ్రీ సాయి చెప్పిన  కధలలోని వీరభద్రప్ప (పాము), చెన్నబసప్ప (కప్ప) లాగ బాధపడాలి.  అందుచేత ఈ   జన్మలోనే శత్రుత్వము వదలించుకోవాలి అని నిశ్చయించుకొన్నాను.

06.10.1994

నిన్నటిరోజున ధైర్యముగాను. ప్రశాంతముగాను బ్రతకటము గురించి ఆలోచించినాను.  నా మనసుకు సమాధానము దొరకలేదు.  రాత్రి నిద్రకు ముందు శ్రీ సాయికి నమస్కరించి సమాధానము యివ్వమని వేడుకొన్నాను.  శ్రీ సాయి దృశ్యరూపములో యిచ్చిన సందేశముయొక్క సారాంశము.

1) మా ఆఫీసులోని నా పై అధికారి మీటింగులో నన్ను అనవసరముగా అవహేళన చేసినారు.  నా మనసు చాలా బాధపడినది.  నేను సహనమును కోల్పోకుండ జాగ్రత్తగా నెమ్మదిగా  నాపై అధికారికి అతని తప్పు గురించి చెప్పినాను ఈ విధముగా పదిమందిలో తప్పు, ఒప్పులను ధైర్యముగా చెప్పగలగటము శ్రీ సాయి శక్తి అని గ్రహించినాను.

2) నేను నా భార్య ఆధ్యాత్మిక రంగములో కలసి ప్రయాణము చేయటానికి తీర్ధయాత్రలకు బయలుదేరినాము.  ఒక పుణ్యక్షేత్రములో శ్రీ సాయిని పోలిన ఒక సన్యాసి కలసి అన్న మాటలు.  "నీవు నీ భార్యతో కలసి తీర్ధ యాత్రలు మాత్రమే చేయగలవు.  కాని ఆధ్యాత్మిక రంగములో నీవు ఒక్కడివే ప్రయాణము చేయాలి.  ఆధ్యాత్మిక రంగములో ప్రయాణము తీర్ధయాత్రల ప్రయాణము అంత సులభమైనది కాదు.  ఈ అధ్యాత్మిక మార్గము మిగుల కఠినమైనది.     కావలసినంత కృషి చేయవలసియుండును. "  నిద్రనుండి మెలుకువ వచ్చినది.  శ్రీ సాయి సత్చరిత్రలో 21 వ. అధ్యాయములో శ్రీ సాయి శ్రీ వీ.హెచ్.ఠాకూరు గారితో అన్న మాటలు గుర్తుకు వచ్చినవి.  జీవితములో ప్రశాంతముగా బ్రతకాలి అని ఉంది.  ఆధ్యాత్మిక శక్తిని ప్రసాదించమని శ్రీ సాయిని  వేడుకోవాలి అని నిశ్చయించుకొన్నాను. 

09.10.1994

నిన్నటిరోజున ధైర్యము, అధైర్యముల గురించి ఆలోచించినాను.  రాత్రి నిద్రకుముందు శ్రీ సాయికి నమస్కరించి ధైర్యము, అధైర్యముల గురించి వివరించమని వేడుకొన్నాను.  శ్రీ సాయి కలలో చూపిన దృశ్యాల వివరాలు. వాటి సారాంశము. "ధైర్యము అనేది నీమనసులోని దాగియున్న శక్తి.  అధైర్యము అనేది నీ మానసిక బలహీనత.  ఈ రెండు నీలోనే యున్నాయి.  వాటికి ఉదాహరణలు చెబుతాను విను" అన్నారు ఒక అజ్ఞాత వ్యక్తి.  వాటి వివరాలు.

1) ప్లేగు వ్యాధి సోకిన బిడ్డను ఒడిలో తీసుకొని ఆపసి పాపకు సేవ చేస్తున్న తల్లిని చూడు.

2) పిల్లలు లేకపోయిన అన్యోన్యముగా జీవించుతున్న నీ స్నేహితుని, అతని భార్యను చూడు.


3. టిబెట్ నుండి జీవనోపాధికి చిన్న చిన్న పిల్లలతో వచ్చిన ఆ కాందిశీకులను చూడు.

4. ఈ ఉదాహరణలద్వారా నేను తెలుసుకొన్న విషయము "అధైర్యము అనే మానసిక బలహీనతను నీవు జయించిననాడు, ధైర్యము అనే నీలోని శక్తి ఉద్భవించుతుంది."

(యింకా ఉంది)
సర్వం శ్రీ సాయినాధార్పణమస్తు 

No comments:

Post a Comment