Wednesday 27 February 2013

పుణ్యభూమి శిరిడీలో దొరికిన రత్నమణి సాయి - 6వ.అధ్యయము

                                         
                                       
                                              
                                               
పుణ్యభూమి శిరిడీలో దొరికిన రత్నమణి సాయి - 6వ.అధ్యయము

ప్రియమైన చక్రపాణీ ,                                                                              హైదరాబాదు
                                                                                                          11.01.1992

నిన్నటి నా ఉత్తరములో శ్రీసాయితో నా అనుభవాలు ఎక్కువగా వ్రాసినాను అని తలుస్తాను.  నా అనుభవాలు నీకు వ్రాయడములోని ఉద్దేశము చెప్పమంటావా -  శ్రీసాయి 1918 వ.సంవత్సరము ముందు శరీరముతో ఉండగా అనేక లీలలు చూపించినారు.  




ఈనాడు వారు మన మధ్యలేరు.  ఆయన మన మధ్య లేరు అనే భావము సాయి బంధువులకు కలగరాదు.  ఆయన మన మధ్య ఉన్నారు అనే భావన కలిగేలాగ చేసుకొనేందుకు ప్రతి సాయి బంధు తన అనుభవాలను తోటి సాయి బంధువుతో పాలు పంచుకోవాలి.  అదే ఉద్దేశముతో ఈ ఉత్తరాలలో నా అనుభవాలు ఎక్కువగా చోటు చేసుకొంటున్నాయి.  ఈ అధ్యాయములో 54 వ.పేజీలో హేమాద్రిపంతు అంటారు "ఎవరితోనైన సంభాషించునపుడు సాయిబాబా కధలే ఉదాహరణగా నిచ్చుటకు జ్ఞప్తికి వచ్చును.  నేను ఏదైన వ్రాయతలపెట్టినచో వారి అనుగ్రహము లేనిదే యొక మాట గాని వాక్యముగాని వ్రాయలేను". యిది అక్షరాల నా జీవితములో నిజము అని గ్రహించినాను.  నేను నీకు ఈ ఉత్తరాలు వ్రాయగలుగుతున్నాను అంటే అది సాయిబాబా అనుగ్రహము అని భావించుతాను.  55వ. పేజీలో శ్రీసాయి పలికిన పలుకులు "నా భక్తుని యింటిలో అన్న వస్త్రములకు ఎప్పుడు లోటుండదు".  యిది అక్షరాల నిజము.  1989 ముందు నాయింటి పరిస్థితి ఈనాటి నాయింటి పరిస్థితిని చూస్తే శ్రీసాయి పలికిన పలుకులు నిత్య సత్యము అని భావించుతాను.  హేమాద్రిపంతు  శిరిడీలో జరిగిన శ్రీరామనవమి ఉత్సవాలు గురించి గొప్పగా వర్ణించినారు.

శ్రీరామనవమి అంటే జ్ఞాపకము వచ్చినది. 1991 సంవత్సరములో మన యింట శ్రీసాయి శ్రీరామనవమి జరిపించినారు.  ఆనాడు శ్రీసాయి చేసిన ఒక చిన్న చమత్కారాన్ని నీకు చెబుతాను విను.  ముందు రోజు రాత్రి కలలో శ్రీసాయి అజ్ఞాత వ్యక్తి రూపములో అంటారు నీ యింటికి రామలక్ష్మణులు వచ్చి ప్రసాదము తీసుకొంటారు అనే దృశ్యము ప్రసాదించినారు.  శ్రీరామ నవమి రోజు ఉదయము నేను మీ అమ్మతో అన్నమాటలు నీకు వ్రాస్తున్నాను గుర్తు పెట్టుకో.  "ఈరోజు ప్రసాదము తినడానికి  శ్రీ సాయి రామలక్ష్మణులు లాగ అన్నదమ్ముల రూపంలో వస్తారు చూడు" అని మీఅమ్మతో అన్నాను.  

                                        
                               
ఈమాట అన్న తర్వాత ఆవిషయము పూర్తిగా మరచిపోయినాము.  రాత్రి ఆరతి పూర్తయిన తర్వాత నేను మీ అమ్మ ఆనాటి పూజ కార్యక్రమము గురించి మాట్లాడుకొంటు మరి ఈరోజున శ్రీసాయి మన యింటికి వచ్చి ప్రసాదము తిన్నారా లేదా అని నన్ను అడిగినది.  నాకు అంతవరకు ఆవిషయము జ్ఞాపకము రాలేదు.  వెంటనే ఉదయమునుండి రాత్రి వరకు మన యింటికి వచ్చిన అతిధులను గుర్తు చేసుకోసాగాను.  నా ఆశ్చర్యానికి అంతులేదు.  నామిత్రుడు శ్రీరఘురామన్ తన యిద్దరు కుమార్తెలతో సాయంత్రము మన యింటికి వచ్చి ప్రసాదము తీసుకొని వెళ్ళినారు.  ఆయన యిద్దరు కుమార్తెలు కవల పిల్లలు అనే విషయము గుర్తుకు రాగానె నామనసు ఆనందముతో నిండిపోయినది.  నాశిరస్సు సాయినాధుని పాదాలపై ఉంచి కృతజ్ఞతలు తెలుపుకొన్నాను.                         
 ఆరోజులలో శ్రీగోపాలరావు గుండు శ్రీసాయి సేవ  చేసుకొని ధన్యుడు అయినాడు. మరి నీతండ్రి సాయి సేవలో ధన్యుడు అగుతాడు లేనిది శ్రీసాయి ఆశీర్వచనాల మీద ఆధారపడి యుంది.

శ్రీ సాయి సేవలో

నీ తండ్రి

(సర్వం శ్రీసాయినాధార్పణమస్తు) 

No comments:

Post a Comment