Sunday 9 November 2014

గృహస్థులకు సాయి సందేశాలు - 4వ.భాగం

  
      

09.11.2014 ఆదివారము
ఓం సాయి శ్రీసాయి జయజయసాయి
సాయి బంధువులకు బాబావారి శుభాశీస్సులు

గృహస్థులకు సాయి సందేశాలు - 4వ.భాగం

ఆంగ్ల మూలం : సాయి బా ని స శ్రీరావాడ గోపాలరావు
తెలుగు అనువాదం : ఆత్రేయపురపు త్యాగరాజు - 9440375411
                               హైదరాబాద్ 

ఈ రోజు సాయి బా ని స శ్రీరావాడ గోపాలరావు గారు చెబుతున్న గృహస్థులకు సాయి సందేశాలను వినండి.

      

ముందుగా సాయిప్రేరణ 2వ.వాక్యం

ఒక్కసారి నాకొరకు ఒక్క పైసా ఖర్చుపెట్టి చూడు, నీ ఇంట్లో లక్ష్మీదేవి కొలువుండేలా చేస్తాను.

శ్రీసాయి సత్ చరిత్రలో భర్తయొక్క బాధ్యతలు కూడా వివరింపబడ్డాయి.  ముఖ్యంగా భర్త భార్యపై అధికంగా వ్యామోహాన్ని పెంచుకోరాదు.  ఈవిషయం మనకు శ్రీసాయి సత్ చరిత్ర 27వ.అధ్యాయంలో కనపడుతుంది.  ఖాపర్దే బార్ ఎట్ లా.  అమరావతిలో ప్రముఖ లాయరు, మరియు ఢిల్లీ బార్ కౌన్సిల్ మెంబరు, మంచి వక్త, ధనవంతుడు.  కాని అతనికి భార్యా వ్యామోహం ఎక్కువ. 



 భార్యభర్తలిద్దరూ బాబా దర్శనానికి షిరిడీ వచ్చినపుడు, ఖాపర్దే షిరిడీనుంచి తిరిగి వెళ్ళడానికి 4 నెలల తరువాత అనుమతిచ్చారు బాబా.  అతని భార్యకు ఏడు నెలల తరువాత అనుమతిచ్చారు.  ఖాపర్దే కళ్ళముందే అతని భార్య ప్రాణాలు వదులుతున్న సమయంలో శ్రీసాయి ఖాపర్దేకు జ్ఞానోదయం కలిగించి భార్యను బానిసలాగ చూడకూడదు ఒక స్నేహితురాలిగా చూడాలని సలహా యిచ్చారు.  అలాగే భార్య బ్రతికి ఉండగా భర్త సన్యాసం తీసుకోరాదు అన్న విషయం మనకి 43,44 అధ్యాయాలలో కనిపిస్తాయి.  బాపూ సాహెబ్ జోగ్ రిటైర్డ్ పీ.డబ్ల్యూ.డీ.సూపర్ వైజర్.  అతను 1909 లో షిరిడీ వచ్చాడు. బాబాకు నిత్యం హారతినిస్తూ పూజిస్తూ ఉండేవాడు.  తనకు సన్యాసాన్ని ప్రసాదించమని బాబాను కోరాడు.  బాబా అంగీకరించక కొద్దిరోజులు ఆగమని చెప్పారు.  ఆతరువాత 3నెలలకు జోగ్ భార్య కాలం చేసింది.  ఆతరువాతనే బాబా జోగ్ కు సన్యాసాన్ని ప్రసాదించారు.  దీనిని బట్టి మనకు భార్య అనుమతి లేనిదే భర్త సన్యాసం తీసుకోరాదు లేకపోతే భార్య మరణానంతరమే భర్త సన్యాసం తీసుకోవచ్చు అన్న విషయం శ్రీసాయి సత్ చరిత్ర ద్వారా తెలుస్తోంది.          

పరస్త్రీ వ్యామోహానికి దూరంగా ఉండాలి.  దీని గురించి వివరణ మనకు శ్రీసాయి సత్ చరిత్ర 49వ.అధ్యాయంలో కనపడుతుంది.  నానాసాహెబ్ చందోర్కర్ విషయంలో ఈసంఘటన జరిగింది.  ద్వారకామాయిలో శ్రీసాయిని దర్శించడానికి బిజాపూర్ నుండి ఒక భక్తుడు తన కుటుంబంతో వచ్చాడు.  ఆకుటుంబంలోని ఘోషా స్త్రీ తన మేలిముసుగును తొలగించి బాబా పాదాలకు నమస్కరించింది. 
 ఆసమయంలో నానాసాహెబ్ చందోర్కర్ బాబా ప్రక్కనే ఉన్నాడు.  మేలిముసుగు తొలగిన ఆస్త్రీ అందానికి ముగ్ధుడయిన నానాసాహెబ్ కు మనశ్చాంచల్యం కలిగింది.  బాబా తన సటకాతో నానాసాహెబ్ చందోర్కర్ ని ఒక చిన్న దెబ్బవేసి "నానా అనవసరంగా చికాకు పడవద్దు.  చెడు ఆలోచనలను నీమనసునుండి తొలగించుకో" అని హితబోధ చేసి, తన భక్తులను పరస్త్రీ వ్యామోహం నుండి దూరంగా ఉండమని సలహా యిచ్చారు.      

గృహస్తు ధనవ్యామోహాన్ని, పరస్త్రీ వ్యామోహాన్ని విడనాడాలని శ్రీసాయి సత్ చరిత్ర 14వ.అధ్యాయంలో బాబా తన భక్తులకు ముఖ్యంగా చెప్పారు.  మన పారమార్ధిక జీవితానికి ఆటంకాలు స్త్రీ.  తరువాత ధనం.  ఈ స్త్రీ వ్యామోహం ఉన్నదీ లేనిదీ తెలుసుకోవటానికి సాయి తన పురుష భక్తులను పాఠశాలకు అనగా రాధాకృష్ణమాయి యింటికి పంపుతూ ఉండేవారు.  తరువాత బాబా తన భక్తులను రోజుకు రెండు మూడు సార్లు దక్షిణ అడుగుతూ ఉండేవారు.    

నాఉద్దేశ్యంలో భార్య పంచదారవంటిది.  ఇంటిలో పంచదార ఉండగా బయటనుండి పంచదారను పొందడంలో అర్ధం లేదు.  అందుచేత బయటనుండి పొందే పంచదారవల్ల మధుమేహ వ్యాధికి మూలకారణమవుతుంది.  కనుక మనము పరస్త్రీ వ్యామోహాన్ని విడనాడాలని నేను భావిస్తున్నాను. 

వివాహానంతరం భర్త ధనాన్ని సంపాదించి తనకుటుంబాన్ని పోషించాలి. అది అతని బాద్యత.  ఈవిషయం మనకు శ్రీసాయి సత్ చరిత్ర 26వ.అధ్యాయంలో గోపాలనారాయణ అంబడేకర్ కధలో తెలుస్తుంది.  పది సంవత్సరాలు ప్రభుత్వ ఉద్యోగం చేసిన తరువాత ఆఉద్యోగానికి రాజీనామా చేసి, ఉన్న డబ్బునంతా ఖర్చు చేసేశాడు.  అంతా అయిపోయిన తరువాత శ్రీసాయి సహాయం కోరి షిరిడీ వచ్చాడు.  శ్రీసాయి అంబడేకర్ కు ఏడు సంవత్సరాల వరకు సహాయం చేయలేదు. అతను ఆర్ధిక యిబ్బందులకు తట్టుకోలేక ఆత్మహత్యకు పాల్పడినపుడు, శ్రీసాయి అతనిని రక్షించారు.  అతనికి ఒక గృహస్థుగా బాధ్యతలు ఏమిటో తెలియచేశారు.  అతనికి జ్యోతిష్యశాస్త్రంలో ఉన్న ఆసక్తిని గమనించి దానినే వృత్తిగా చేసుకొమ్మని అందులో అతనికి పావీణ్యం కలిగేలా ఆశీర్వదించారు. 


 బాబా అనుగ్రహంతో అతను జ్యోతిష్యశాస్త్ర వృత్తిలో బాగా డబ్బు సంపాదించి తన శేష జీవితాన్ని ఆనందంగా గడిపాడు.  ఈవిధంగా శ్రీసాయి సంసార జీవితంలో గృహస్థ ధర్మాలను గురించి తన భక్తులకు చక్కగా వివరించారు.       
(ఇంకా ఉంది)
(సర్వం శ్రీసాయినాధార్పణమస్తు)   

No comments:

Post a Comment