Saturday, 14 January 2012

సాయి బా ని స డైరీ - 1994 (8)

 

 14.01.2012  శనివారము

ఓం సాయి శ్రీ సాయి జయజయ సాయి

సాయి బంధువులకు సంక్రాంతి శుభాకాంక్షలు

సాయి బా ని స డైరీ  -  1994 (8)

01.03.1994

నిన్నటిరోజున భార్య పిల్లల మీద విసుగు కలిగినది.  రాత్రి నిద్రకు ముందు శ్రీ సాయికి నమస్కరించి "ఈసంసారము మధ్య ఉంటు ఈ సంసారముపై వ్యామోహము లేకుండ యుండే మార్గము చూపు తండ్రీ" అని వేడుకొన్నాను.  శ్రీ సాయి కలలో చూపించిన దృశ్యము నాకు కనువిప్పు కలిగించినది.  వాటి వివరాలు.



"జీవితము అనే రైలు బండి స్టేషన్ లో ఆగినది.  నేను చికాకుతో రైలు పెట్టెనుండి దిగి ప్లాట్ ఫారం మీద తిరుగుచున్నాను.   యింతలో గార్డు పచ్చ జండా చూపించినాడు. 



 

రైలు కదలసాగినది.  వేగము పుంజుకోసాగింది.  నేను రైలు ఎక్కాలా వద్దా అనే ఆలోచనలతో ప్లాట్ ఫారం మీద నిలవడిపోయినాను.  నాముందునుండి రైలు వేగముగా వెళ్ళిపోసాగినది.  రైలు ఎక్కాలని మనసులో కోరిక ఎక్కువ కాసాగినది.   రైలు వెనకాల పరిగెత్తుతూ గార్డు పెట్టెలోనికి ఎక్కినాను.  ఆ గార్డు తెల్లని వస్త్రాలు ధరించి యున్నారు.   
 
 నన్ను చిరునవ్వుతో తన సీటు ప్రక్కన కూర్చుండపెట్టుకొన్నారు.  ఆయన అంటారు "తోటి ప్రయాణీకులపై కోపముతో నీయిష్ఠము వచ్చిన స్టేషన్ లో దిగరాదు.  నీ ఆఖరి స్టేషన్ వచ్చేవరకు నీవు ప్రయాణము చేయక తప్పదు.  నీ స్టేషన్ లో నీవు దిగిన తర్వాత నలుగురు కూలీలు నీ ఋణము తీర్చుకోవటానికి, నిన్ను మోయటానికి వస్తారు.  కాని నీవు పరుండే శవపేటిక మూత వేయటానికి మాత్రము ఎవరూ తమ డబ్బు యిచ్చి మేకులు కొనరు.  అందుచేత యిప్పుడే నీకు కావలసిన మేకులును నా దగ్గర కొని నీదగ్గర ఉంచుకో.  రైలుదిగిన తర్వాత అంతిమ యాత్రకు సిధ్ధపడు."  ఒక్కసారిగా మెలుగువ వచ్చినది.  ఈ విధమైన కలకు అర్ధము గ్రహించినాను.   శ్రీ సాయి, సంసారము మీద వ్యామోహము లేకుండ యుండే మార్గము చూపినందులకు కృతజ్ఞతలు చెప్పినాను.     

03.03.1994

నిన్నటిరోజున గుండెనొప్పితో చాలా బాధపడినాను.  డాక్టర్ దగ్గరకు వెళ్ళలేదు.  రాత్రి శ్రీ సాయికి నమస్కరించి నా ఆరోగ్యము బాగుపడటానికి సూచనలు యివ్వమని వేడుకొన్నాను.  శ్రీ సాయి అజ్ఞాత వ్యక్తి రూపములో దర్శనము యిచ్చి అన్నారు.  1) నీ జీవితములో నీ మనసుకు ఆందోళన కలిగించిన ఆ ముగ్గురుకు నీవు దూరంగానే యుంటున్నావుకదా.  యింకా ఎందుకు వాళ్ళ గురించి ఆలోచించుతావు.  వాళ్ళను మర్చిపోయి ప్రశాంతముగా జీవించు.  2) నీ యింటి వ్యవహారాలులో ఎక్కువగా ఆలోచించకు.  జరిగేది జరగక మానదు.  3)  నీ ఆరోగ్యము కోసము సాత్విక ఆహారము తిను.  4)  నీ పని డబ్బు సంపాదించి నీ కుటుంబ సభ్యులకు యివ్వటము మాత్రమే.  ఖర్చు విషయము నీకు అనవసరము.  5)  నీ బంధువులతో గొడవలు పడటము మాని వేయి.  6) రోజు భగన్ నామస్మరణ చేస్తూ జీవించు.   

 (యింకా ఉంది)

సర్వం శ్రీ సాయినాధార్పణమస్తు

No comments:

Post a Comment