05.07.2012 గురువారము
ఓం సాయి శ్రీసాయి జయజయ సాయి
సాయి బంధువులకు బాబావారి శుభాశీస్సులు
సాయి.బా.ని.స. అనుభవాలు - 24
(సాయి.బా.ని.స.ఆత్రేయపురపు త్యాగరాజుకు చెప్పిన సాయి అనుభవాలు)
(కలలలో సాయిబానిస గారికి శ్రీసాయి ఒక ముస్లిం ఔలియాగా దర్శనమిచ్చి ప్రసాదించిన అనుభూతులు)
1. పాక్ (పవిత్రమైన) మిఠాయి భండార్
ఒకనాటి రాత్రి సాయి.బా.ని.స. తన స్వప్నంలో హైదరాబాదులోని పాతనగరం లో రాత్రి సమయంలో ఆకలి దప్పులతో ఒక పిచ్చివాడిలా తిరగసాగారు. ఆసమయంలో పాక్ (పాక్ అనగా పవిత్రమయిన - అని అర్ధము) మిఠాయి భండార్ వద్ద ఆకలితో తనకు ఏదయినా తినడానికి మిఠాయి పెట్టమని ఆదుకాణం యజమానిని అడిగినారు.
ఆ ఔలియను పోలిన దుకాణుదారుడు సాయి.బా.ని .స.ను తన చెంతకు చేరదీసుకుని త్రాగడానికి మంచినీరిచ్చి, కడుపునిండా తినడానికి వేడి వేడి జిలేబీ లోపలినించి తెచ్చియిచ్చినారు. సాయి.బా.ని.స. ఆకలి తీరిన తరువాత ఆ ఔలియా పాదాలకు నమస్కరిస్తున్న సమయంలో ఆ ఔలియా గారు సాయి.బా.ని.స. కళ్ళలోకి చూసి,
నీవు కళ్ళజబ్బుతో బాధపడుతున్నావు. నీకు నేను ఆజబ్బు ఈరాత్రికే నయం చేస్తాను, రేపు ఉదయం లేచి నీయింటికి వెళ్ళు అని రెండు తమలపాకులు తెచ్చి తననోటిలో తినుచున్న తాంబూలమును ఆరెండు ఆకులలోను వేసి కళ్ళకు కట్టుగా కట్టినారు. ఈరాత్రికి ఇక్కడే విశ్రాంతి తీసుకో అని చేప్పారు. మరుసటి ఉదయము ఆయన దుకాణము తెరచి సాయి.బా.ని.స.ను నిద్రలేపినారు. సాయి.బా.ని.స కళ్ళకున్న కట్టువిప్పి రెండు కళ్ళలోను మంచి నీరు పోసినారు. ఆ రెండు కళ్ళను శుభ్రము చేసిన తరువాత - నీరెండు కళ్ళు ఎట్లా ఉన్నవని సాయి.బా.ని.స.ను అడిగినారు. సాయి.బా.ని.స. తనరెండు కళ్ళల్లోను ఒక కన్ను స్పష్టముగా వెలుతురును చూడగలుగుతున్నదని, మరొక కన్ను మసకగా ఉన్నదని సమాధానమిచ్చినారు. దానికి ఆ ఔలియాగారు నవ్వుతూ నీవు ఒక సాయి భక్తుడిగా నమ్మకంతో జీవించుచున్నావు కనక ఒక కన్న్నుతో స్పష్ఠముగా వెలుతురుని చూడగలుగుతున్నావు. నీలో యింకా - నేను బ్రాహ్మణ కులములో పుట్టినవాడిని అనే అహంకారము ఉన్నది కనుక రెండవ కంటిలో మసక తొలగలేదు. నీలో బ్రాహ్మణుడు అనే కుల అహంకారము తొలగిన రోజున, నీరెండవ కన్ను కూడా స్పష్టముగా కనిపిస్తుంది అని చెప్పి సూర్యోదయము వేళ సాయి.బా.ని.స.ను తన యింటికి ఆ ఔలియాగారు పంపివేసినారు.
***********
రంజాన్ నెలలో సాయి.బా.ని.స. కు ఒకరోజు రాత్రి కలలో శ్రీ సాయి ఒక ముస్లిం ఔలియాగా దర్శనమిచ్చి సాయి.బా.ని.స.కు ఇచ్చిన అనుభూతిని మీకు వివరిస్తాను.
2. అల్లా - రామ్
సాయి.బా.ని.స. రంజాన్ మాసములో సాయంత్రము ఉపవాస దీక్షను విరమించే సమయములో హైదరాబాదు అసెంబ్లీ పక్కన ఉన్న పబ్లిక్ గార్డెన్ లోని మసీదు ప్రాంగణము ముందు తిరగసాగారు.
ఆసమయములో ముస్లిం భక్తులు తమ ఉపవాస దీక్షను విరమించి ఖర్జూరపు పళ్ళు తినసాగారు. సాయి.బా.ని.స.కు తనకు కూడా ఎవరయినా ఆఖర్జూరపు పళ్ళు ఇచ్చిన తినాలనే కోరిక కలిగింది. ఆసమయములో షిరిడీసాయిని పోలిన ఒక ఔలియాగారు మసీదునుండి బయటకు వచ్చి "గోపాల్ బేటా యహా ఆవో" అని పిలిచినారు. నీకు ఖర్జూరపు పళ్ళు తినాలని కోరిక వుందికదా! నేను నీకోరిక నెరవేరుస్తాను అని చెప్పి ఒక కాగితపు పొట్లంలో తినడానికి ఖర్జూరపు పళ్ళు మరియు అంజూర పళ్ళు, ఒక పింగాణీ పాత్రలో త్రాగడానికి ద్రాక్షరసము యిచ్చినారు. సాయి.బా.ని.స. ఆపళ్ళు తిని ద్రాక్షరసము త్రాగిన తరువాత ఆ ఔలియాగారిని ఉద్దేశించి, తమ నామధేయమును తెలపమని కోరినారు. ఆ ఔలియాగారు తనపేరు "అల్లారామ్ " అని చెప్పినారు. మీరు యింతమంది భక్తులకు విందు చేయుచున్నారు కదా, మీరు ఏమి వ్యాపారం చేసి యింత ధనం సంపాదించారు అనిసాయి.బా.ని.స. అడిగినారు. దానికి ఆ ఔలియాగారు తాను హిందువులను, ముస్లింలను కలపడానికి సిమ్మెంటును తయారుచేసి ఆ సిమ్మెంటును అమ్మే సిమెంటు వ్యాపారినని చెప్పినారు. సాయి.బా.ని.స. ఆ ఔలియాగారి పాదాలకు నమస్కరించి తన యింటికి వెళ్ళిపోయినారు.
సర్వం శ్రీసాయినాధార్పణమస్తు
No comments:
Post a Comment