07.08.2012 మంగళవారము
ఓం సాయి శ్రీ సాయి జయజయ సాయి
సాయి బంధువులకు ఒక మనవి.
మన సాయి బంధువులకు కూడా బాబావారి లీలలు, అనుభవాలు కలిగి ఉండవచ్చు. వాటిని నామెయిల్ ఐ.డీ. కి పంపితే మన బ్లాగులో ప్రచురిస్తాను. tyagaraju.a@gmail.com
శిఖరాలు లోయలలో శ్రీ సాయి (రెండవ భాగము )
సాయి బంధువులారా యింతకు ముందు సాయి.బా.ని.స శిఖరాలు లోయలలో శ్రీ సాయి - చదివారు. తరువాయి భాగాన్ని ఈ రోజునుండి అందిస్తున్నాను.
ఇక చదవండి.
************
ఒక్కమాట. గురుపూర్ణిమ 03.07.1993
శ్రీ షిరిడీ సాయి బాబా జీవిత చరిత్ర (21 వ అధ్యాయము) లో శ్రీ సాయి అన్నమాటలు "ఈలోయ మిక్కిలి లోతు అయినది. దీనిని దాటుట చాలా కష్ఠము" అటువంటి లోయలు - శిఖరాలను శ్రీ సాయి ఈ భక్తుడికి స్వప్నములో దృశ్యరూపముగాను, సందేశములుగాను ప్రసాదించినారు.
21 వ. అధ్యాయములో శ్రీ అనంతరావు పాటంకర్ శ్రీ సాయితో అన్నమాటలు. "నీ చమత్కారము మాటలవలన నీవు అందరికి శాంతిని ప్రసాదించుతావని వింటిని. నాయందు కూడా దాక్షిణ్యము చూపుము". చమత్కారపు మాటలతో శ్రీ సాయి శ్రీపాటంకర్ కు శాంతిని ప్రసాదించి ఆశీర్వదించెను. అదే విధముగా శ్రీ షిరిడీసాయి ఈ సాయి బా.ని.స కు చమత్కారపు మాటలతో శాంతిని ప్రసాదించెను.
శ్రీ షిరిడీసాయి స్వప్నములో ప్రసాదించిన దృశ్యాల సారాంశము, సందేశాల కూర్పు ఈ శిఖరాలు - లోయలలో శ్రీ సాయి. ప్రతీ సందేశము చివర తేదీ యిచ్చినాను. శ్రీ సాయి ఆతేదీ (రోజు) న ఈ భక్తుడికి ఆసందేశము యిచ్చినారని, సాయి బంధువులు గ్రహించగలరు.
యిట్లు
సాయిసేవలో
సాయి బా.ని.స. రావాడ గోపాలరావు 03.07.1993
సాయి.బా.ని.స. = సాయిబాధ్యతలను నిర్వర్తించే సన్యాసి.
1. నాపిల్లలు ఎగిరే గాలిపటాలు. వారి జీవితము అనే దారము చిక్కుపడకుండా యుండేలాగ ఉపయోగ పడే వారి చేతిలోని చక్రిని నేనే.
- 08.02.1996
2. హరిని దర్శించటానికి హరిద్వారము వెళ్ళనవసరములేదు. హరి శిరిడీలోనే యున్నాడు. హరిని దర్శించటానికి శిరిడీకి వెళ్ళనవసరము లేదు. హరి గుడిలోనే యున్నాడు. హరిని దర్శించటానికి గుడికి వెళ్ళనవసరము లేదు. హరి నీమనసులోనే యున్నాడు. నీవు నీమనోద్వారము తరచి హరిని నీమనసులోనే దర్శించు.
- 19.11.92
3. ధన సంపాదనలో మంచి మార్గాన్ని విడిస్తే నీజీవితానికి ముప్పు. భగవంతుని అనుగ్రహ సంపాదన కోసము చెడు మార్గాన్ని విడిస్తే నీజీవితానికి మెప్పు.
శిరిడీ సాయి
4. సాయి సాగరము ఒడ్డున గొప్పవారు నిర్మించుకొన్న మేడలపైన బీదవారు కట్టుకొన్న గుడిశెలపైన సాయి సాగరపు గాలి ఒక్కలాగే వీచుతుంది.
- 22.02.95
5. సాయి ప్రేమ తియ్యటి రేగుపళ్ళువంటిది. ఆరేగుపళ్ళు ధనవంతులు తిన్నా, బీదవారు తిన్నా ఆతియ్యటి రుచిని (ధనవంతులు, బీదవారు)ఒక్క విధముగానే అనుభూతి పొందుతారు.
6. ఆధ్యాత్మిక రంగములో ఉన్న వ్యక్తికి ధనసంపాదన ఒక తలనొప్పిగా మారుతుంది. కాని శరీర పోషణకు ధన సంపాదన చాలా అవసరము. అందుచేత ఆధ్యాత్మిక రంగములో తలనొప్పి కలిగించనంత ధన సంపాదన చేసి ఈమానవ జన్మకు సార్ధకత కలిగించు.
- 10.03.95
7. నీవు నాపేరిట ఉపవాసము ఉన్నరోజున యింకొకరికి ప్రేమతో కడుపునిండ భోజనము పెట్టిననాడు నీవు నాపేరిట చేసిన ఉపవాసాన్ని అంగీకరించుతాను.
- 25.03.93
8. ప్రశాంత జీవితము మత్తుమందు త్రాగితే రాదు. తాటిచెట్టుక్రింద కల్లు త్రాగితే రాదు.
జీవితములో నీబరువు బాధ్యతలు పూర్తి చేసిన తర్వాతనే ప్రశాంత జీవితము వస్తుంది. అటువంటి ప్రశాంత జీవితము పొందటానికి సారాయిని త్రాగటము మాని సాయి నామామృతము త్రాగాలి.
- 21.03.95
9. అనాధ ప్రేత సంస్కారము చేసిన తర్వాత చేసే స్నానము కాశీలోని గంగా స్నానముతో సమానము ఆత్మ శుధ్ధి కలిగిన జీవితము పుణ్యక్షేత్ర దర్శన ఫలముతో సమానము.
- 03.04.95
10. ఆధ్యాత్మిక రంగములో తమాషాలు చేసేవారినుండి, తమాషాలు చేయటానికి ప్రోత్సహించేవారినుండి దూరముగా యుండు. ఆవ్యవహారాలలో కలుగ చేసుకోవద్దు. అనవసరముగా వాటి గురించి మాట్లాడవద్దు.
- 06.04.95
(యింకా ఉంది)
సర్వం శ్రీసాయినాధార్పణమస్తు
No comments:
Post a Comment