27.08.2012 సోమవారము
ఓంసాయి శ్రీసాయి జయజయసాయి
సాయి బంధువులకు బాబావారి శుభాశీస్సులు
121. నిజ జీవిత ప్రయాణము నీవాళ్ళతో కలసి సాగించే రైలు ప్రయాణము వంటిది. ఆధ్యాత్మిక జీవిత ప్రయాణము ఏకాకిగా నింగి నేల కలిసే చోటుకు
చేరుకోవాలనె తపనతో సాగించే ప్రయాణమువంటిది.
- 28.03.94
122. గతజన్మలో చేసిన పాపాలకు ప్రాయశ్చిత్తము ఈజన్మలో మనము అనుభవించుతున్నాము అని తలచటము ఆధ్యాత్మిక రంగ ప్రవేశ ద్వారము. తోటిమానవుడు చనిపోయినపుడు అతని శరీరానికి అంతిమ సంస్కారాలు జరుగుతున్న సమయములో మనము శరీర సుఖాలగురించి ఆలోచించటము ఆధ్యాత్మిక రంగ నిష్క్రమణ ద్వారము.
- 30.04.94
123. నాపేరిట గారడీ విద్యలు చేసి చూపించి పొట్ట నింపుకొనే స్వాములువారి దగ్గరకు వెళ్ళటము నీతప్పు. అంతేగాని ఆస్వాములువారి తప్పు మాత్రము కాదు.
- 15.05.94
124. ధన సంపాదన విషయములో పరుగులు పెట్టరాదు. ఆపరుగులు నీజీవితానికి మెరుగులు పెట్టేబదులు ఆశాంతిని కలిగించుతుంది.
- 11.06.94
125. తగాదాలు, గొడవలు పడవద్దు. పగవైషమ్యాలు పెంచుకోవద్దు. వీలు అయితే నీశత్రువులను క్షమించు. లేదా వాళ్ళనుండి దూరంగా ఉండు.
- 12.06.94
126. నీకు సహాయము చేసినవారిని నీవు మరచిపోతున్నావే. మరి నీకు అపకారము చేసినవారిని గుర్తు పెట్టుకోవటములో అర్ధము లేదు.
- 24.06.94
127. నాకు నైవేద్యముగా ధనముతో కొన్న బత్తాయి ఫలాలుకంటే చెట్టునుండి రాలిపడిన తాటిపండును సమర్పించితే నేను చాలా సంతోషించుతాను.
- 11.08.94
128. జంతువు ప్రాణముతో ఉన్నా లేకపోయినా మానవుడికి ఉపయోగపడుతుంది. మానవుడు చనిపోయిన తర్వాత ఎలాగు ఎవరికి ఉపయోగపడడు. అందుచేత మానవుడు బ్రతికి యుండగానే తోటిమానవునికి ఉపయోగపడాలి.
- 02.09.94
129. నాపూజకు మడిబట్టలు, తడిబట్టలు ధరించనవసరములేదు. శుచి, శుభ్రతయుంటే చాలు. కొబ్బరిబొండాలు నాకు నైవేద్యముగా పెట్టిన చాలు. నీయింటికి ప్రసాదము స్వీకరించడానికి వచ్చినవారిలో నన్ను చూసుకొని వారితో ఆప్యాయముగా మాట్లాడినా అదే నాకు నీవు అర్పించే భక్తితో కూడిన పూజ.
- 07.09.94
130. నిలుటద్దములో ఒకసారి నన్ను చూడు. నానిజస్వరూపము నీకు చూపిస్తాను. నీవైపు కన్ను ఆర్పకుండ చూస్తాను.
- 13.09.94
(యింకా ఉంది)
సర్వం శ్రీసాయినాధార్పణమస్తు
No comments:
Post a Comment