Tuesday 7 May 2013

పుణ్యభూమి శిరిడీలో దొరికిన రత్నమణి సాయి 35వ. అధ్యాయము

   

     

07.05.2013 మంగళవారము
ఓం సాయి శ్రీసాయి జయజయసాయి
సాయి బంధువులకు బాబావారి శుభాశీస్సులు

పుణ్యభూమి శిరిడీలో దొరికిన రత్నమణి సాయి - 35వ.అధ్యాయము

సాయి.బా.ని.స. తన కుమారుడు చక్రపాణికి సాయి తత్వముపై వ్రాసిన ఉత్తరాలు.

గత పది రోజులుగా ప్రచురణకు చాలా ఆలశ్యం జరిగింది..క్షంతవ్యుడను..35వ.అధ్యాయం కాస్త పెద్దది అవడం వల్ల, కాస్త సమయానుకూలంగా ప్రచురణకు తయారు చేసుకుంటూ ఈ రోజుకు ప్రచురిస్తున్నాను

పుణ్యభూమి శిరిడీలో దొరికిన రత్నమణి సాయి 

 35వ. అధ్యాయము

                                    07.02.1992

ప్రియమైన చక్రపాణి,

ఈ అధ్యాయములో శ్రీహేమాద్రిపంతు శ్రీసాయి చేసి చూపిన చిన్న చిన్న లీలలు, ఊదీ ప్రభావమును వర్ణించినారు.  ఈ లీలలు ఆయా వ్యక్తులకు మాత్రమే పరిమితమమయినవి.  అవి వారిలో చాలా సంతోషమును కలిగించి, శ్రీసాయి పై ఉన్న వ్యతిరేక భావాలను వారి మనసునుండి తొలగించినవి.  కాకా మహాజని స్నేహితుడు ద్వారకామాయి మెట్లు ఎక్కునపుడు శ్రీసాయి ప్రేమతో ఆహ్వానించెను. 




 కాకా మహాజనికి ఆకంఠ ధ్వని తన తండ్రి కంఠ ద్వనిలాగ వినిపించి తన్మయత్వములో తన్ను తాను మరచి శ్రీసాయి పాదాలకు నమస్కరించెను.  యిటువంటి అనుభవము నీజీవితములో జరిగినది. అది నీకు వివరించుతాను.  నీకు ఎనిమిది నెలల ప్రాయములో నాతండ్రి 1974 వ. సంవత్సరములో స్వర్గస్థులైనారు.  ఆనాటి నుండి ఏనాడు ఆయన నాకు కలలో కనబడలేదు. 1989లో నన్ను నేను శ్రీసాయికి అర్పించుకొన్న తర్వాత 1991 అక్టోబరు నెలలో (తేదీ జ్ఞాపకము లేదు).  ఒక రోజు ఉదయము 5 గంటలకు శ్రీసాయి పటమునుండి వచ్చిన మాటలు నేను మరువలేను. "నన్ను పూర్తిగా మరచిపోతున్నావా! నన్ను నీకొడుకు చక్రపాణిలో చూసుకో".  ఆకంఠద్వని చనిపోయిన నాతండ్రిది.  ఒక్కసారి నాలో సంతోషము, ఆశ్చర్యము కలిగినాయి.  దీనిని బట్టి చూస్తే శ్రీసాయి నాకంటే వయసులో పెద్దవారిలోను యున్నారు, మరియు నాకంటే వయసులో చిన్నవారిలోను ఉన్నారు అనేది తెలుస్తున్నది.  

ఇదే విషయమును శ్రీసాయి ఈ విధముగా 15వ.అధ్యాయములో అంటారు, "ఎల్లప్పుడు మీహృదయములోను సర్వజన హృదయములందు గల నన్ను పూజింపుడు".  ఈ విషయమును నిర్ధారణ చేయటానికి ఒక చిన్న సంఘటన ఉదహరించుతాను.  శ్రీ సాయిబాబా ఆఫ్ షిరిడీ ..రావు బహదూర్ ఎం.డబ్ల్యూ.ప్రధాన్ జే.బీ. ఇంగ్లీషు పుస్తకము 39వ. పేజీలో నానా సాహెబు యొక్క ఆఖరి రోజుల అనుభవాలు చదువు. నానా సాహెబు ఆఖరి రోజులలో తన భార్యలో కూడా శ్రీసాయిబాబాను చూడగలిగిన అదృష్ఠశాలి. 

ఈ ఉత్తరములో ఒక ముఖ్యవిషయము వ్రాస్తాను.  నీవు బాబాకు ప్రీతిపాత్రుడువి కాదలచుకుంటే, నీవు స్వయంకృషితో ఆయన గురించి తెలుసుకో.  మధ్యవర్తులు వద్దు.  కావాలంటే మధ్యవర్తుల మాటలు విను కాని వాళ్ళను సద్గురువు అని పిలవవద్దు. ఆవిధముగా పిలిచి సమర్ధ సద్గురువు శ్రీసాయినాధుని నామానికి మచ్చ తేవద్దు.  ఈనాడు చాలా మంది శ్రీసాయిబాబా పేరుతో వాళ్ళే సద్గురువులమని తమ పేరు ముందు సద్గురువు అని పెట్టుకొంటున్నారు.  సంఘములో తాము శ్రీసాయి అంకిత భక్తులుగా చెప్పుకొని చలామణి అగుతున్నారు.  శ్రీసాయి యూనివర్సిటీలో అనేకమంది ఆచార్యులు (ప్రొఫెసర్స్) యుండవచ్చును, కాని  చాన్సలర్ మాత్రము శ్రీసాయి బాబా యొక్కరు మాత్రమే.  అలాగనే శ్రీసాయికి అనేకమంది భక్తులు యుండవచ్చును.  వారు అందరు సద్గురువులు మాత్రము కారు.  

ఎవ్వరైన శ్రీసాయి గురించి చెబితే విను.  దానిలోని మంచిని గ్రహించు. వారి పాదాలకు నమస్కరించినపుడు మాత్రము శ్రీసాయి విశ్వరూప అని తలచుకొని నమస్కరించు.  ఆనమస్కారము శ్రీసాయినాధునికి చెందుతుంది.  శ్రీసాయిసత్ చరిత్రలో శ్రీసాయి కాకామహాజని స్నేహితుని విషయములో ఈవిధముగా అంటారు.  "నీవు దానిని తీసి వేయుము.  మన మధ్యయున్న అడ్డును తీసి వేయుము.  అప్పుడు మనము యొకరినొకరు ముఖాముఖి చూచుకొనగలము, కలసికొనగలము".  శ్రీసాయి ఈ విధముగా చెప్పిన తర్వాత కూడా సాయిభక్తులు శ్రీసాయి గురించి తెలుసుకోవటానికి మధ్యవర్తుల దగ్గరకు వెళ్ళటము హాస్యాస్పదముగా యుంది.  మరి నీవు నా విషయము ఏమిటి అని ప్రశ్నించుతున్నావు కదూ..మొదట్లో నేను అంటే 1989-90 సంవత్సరాలలో శ్రీసాయి గురించి తెలుసుకోవటానికి మధ్యవర్త్లుల దగ్గరకు సద్గురువులము అని చెప్పినవారి దగ్గరకు వెళ్ళిన మాట నిజమే.  కాని నాలోని తప్పును సరి దిద్దినది శ్రీసాయినాధుడే.  ఒకసారి మనము మన తప్పును సరిదిద్దుకొన్న తర్వాత అటువంటి తప్పు మళ్ళీ చేయము కదా!.

కాకామహాజని యొక్క యజమాని శ్రీసాయిని రక్షించిన విధము (ఎండు ద్రాక్షపళ్ళు సంఘటన) గుర్తు చేసుకో.  అటువంటి సంఘటన నాజీవితములో జరిగినది.  06.02.92 అంటే నిన్నటి దినము (గురువారము)న నిత్యపారాయణ చేస్తున్నాను.  రాత్రి శ్రీసాయికి ఏమి నైవేద్యము పెట్టాలి అని ఆలోచించుతున్నాను. 

వీధిలో కూరలు అమ్మే స్త్రీ ఆనపకాయలు కావాలా అని మీ అమ్మను అడుగుతున్నది.  మీ అమ్మ చికాకుతో అక్కరలేదు అని సమాధానము చెప్పినది.  వారి యిరువురి సంభాషణ నాకు వినిపించుతున్నది.  నేను పారాయణ చేస్తున్నాను కాబట్టి లేచి బయటకు వెళ్ళలేని స్థితి నాది.  ఆ స్త్రీ కాదు అయ్యగార్ని అడుగు అని మీ అమ్మకు చెబుతున్నది.  మీ అమ్మ కోపముతో అమెను కసరి పంపించివేసినది.  నాకు ఆరోజు రాత్రి శ్రీసాయికి ఆనపకాయ కూర నైవేద్యముగా పెట్టాలి అనే కోరిక ఎక్కువ కాసాగినది.  మళ్ళీ ఆనపకాయలు యింటి ముందుకు వస్తే కొని ఆరాత్రి ఆనపకాయ కూర వండాలి అని నిశ్చయించుకొన్నాను.  యింతలో నిత్య పారాయణ పూర్తిచేసినాను. పారాయణ పూర్తి చేసి ముందు గదిలోనికి వచ్చినాను.  యింకొక స్త్రీ గంపనిండ ఆనపకాయలు తెచ్చి మన యింటి గుమ్మములో నిలబడి "సారు ఆనపకాయలు కావాలా అని అడుగుతున్నది.  నాలో సంతోషానికి హద్దులు లేవు.  సంతోషముగా ఒక ఆనపకాయ కొని రాత్రి రొట్టె, ఆనపకాయ కూర తయారు చేసి రాత్రి శ్రీసాయికి నైవేద్యము పెట్టినాను.  శ్రీసాయి సత్ చరిత్ర చదివిన సాయి బంధువులు ఈ సంఘటనను సంతోషకరమైన సంఘటనగా బావించుతారు అని నానమ్మకము.  దాన ధర్మాలు విషయములో శ్రీసాయి చక్కగా చెప్పినారు.  "నేను ఒక రూపాయ దక్షిణ ఎవరి వద్దనైన తీసుకొనిన దానికి పది రెట్లు తిరిగి అతనికి ఇవ్వవలెను.  నేను ఊరకనే ఏమీ తీసుకొనను."  ఈ విషయములో నా అభిప్రాయము తెలియచేయమంటావా - విను.  శ్రీసాయి పేరిట ఒక రూపాయి దానము చేసిన రోజున నామనసులో నాకు తెలియని సంతోషము కలుగుతున్నది.  నాకు ఏనాడు అన్న వస్త్రాలకు లోటు యుండటములేదు.  1989 సంవత్సరము ముందు రోజులలో నేను చాకలివానికి యిస్త్రీ నిమిత్తము డబ్బు యివ్వలేక చేతిని ఉన్న బంగారు ఉంగరము అమ్మి చాలా మానసిక క్షోభ చెందినాను.  1990 తర్వాత నాకు అటువంటి దుస్థితి ఏనాడు కలగ లేదు. యింటికి చేసిన అప్పులు అన్నీ తీర్చివేసినాను.  1990 తర్వాత జీవితములో ఏనాడు అప్పు చేయలేదు.  బ్యాంక్ లో పెద్ద నిల్వ ఏమీ లేదు.  కాని, మనసులో తృప్తి అనే పెద్ద నిల్వ ఏర్పడినది.  బహుశ యిది శ్రీసాయి పేరిట చేసిన ఒక రూపాయి దాన మహాత్మ్యము అయి ఉంటుంది.  ఇదే శ్రీసాయి చేప్పిన "దానికి పది రెట్లు యివ్వవలెను" అంటే పది సుఖ శాంతులు యిచ్చెదను అని అర్ధముగా భావిస్తాను.  యిక్కడ యింకొక అనుభవము వ్రాస్తాను.  నీకు రాత్రివేళ నిద్ర కావాలి అంటే శ్రీసాయిని స్మరించి ద్వారకామాయి ధునిలోని విభూతిని నుదుట పెట్టుకొని పడమటి దిక్కుగా తలను పెట్టుకొని పరుండి నీకు ఉన్న సమస్యలు శ్రీసాయికి తెలియచేయి.  ఆయననుండి సలహాలను కోరు.  శ్రీసాయి నీకు కలలో ఏదో ఒక రూపములో దర్శనము యిచ్చి నీ సమస్యలకు సలహాలు యిస్తారు.యిది నేను ప్రత్యక్షముగా పొందిన అనుభవము. ఇదే విషయాన్ని శ్రీ రావు బహద్దూర్ ఎం.డబ్ల్యు.ప్రధాన్ గారు తన యింగ్లీషు పుస్తకము శ్రీ సాయిబాబా ఆఫ్ షిరిడి 49వ.పేజీలో విపులముగా వ్రాసినారు.  ఒకసారి చదువు.  నీనమ్మకమును బలపర్చుకో.  శ్రీ సాయి సత్చరిత్రలో హేమాద్రిపంతు అన్నదానము గురించి చక్కగా వివరించినారు.  శ్రీసాయి పేరిట ఏనాడైన అన్నదానము చేయదలచితే ధైర్యముగా చేయి.  నీవు వండించిన పదార్ధాలు అందరు తిన్న తర్వాత యింకామిగిలి ఉంటాయి అనేది నీవే గ్రహించుతావు.  శ్రీసాయి సత్ చరిత్ర్తలో శ్రీసాయి పాము రూపములో శ్రీబాలాజీ పాటిల్ యింట దర్శనము యిచ్చిన సంఘటన వివరించబడినది.  యిటువంటి అనుభూతిని నేను కూడా పొందినాను.  1982 జనవరి నెలలో ఒక రాత్రి కలలో (తెల్లవారుజామున) నేను రోజు స్నానానికి వేడినీళ్ళు పెట్టుకొనుచున్నాను.  నేను స్నానానికి సిధ్ధపడుతుంటే నాకంటే ముందుగా ఒక పాము స్నానము చేయటానికి బాత్ రూం లోనికి ప్రవేశించేది.  వెంటనే తెలివి వచ్చినది.  దీనికి అర్ధము ఏమిటి అని ఆలోచించినాను.  కండ్లు మూసుకొన్నాను.  శిరిడీలో శ్రీసాయినాధుని సమాదిపై పూజార్లు గోరువెచ్చని నీరు పోసి శ్రీసాయికి స్నానము చేయించుతున్న దృశ్యము చూడగలిగినాను.  శ్రీసాయి ఈవిధముగా తనకు నిత్యము అభిషేకము చేయమని కోరుతున్నారు అని భావించినాను. ఆరోజునుండి నేను ఉదయము స్నానము పూర్తి చేసిన పిదప చేతిలో నీరు పోసుకొని మనసులో శ్రీసాయిని తలచుకొని ఆనీరు వదలుతాను.  ఆవిధముగా నిత్యము శ్రీసాయికి అభిషేకము చేస్తున్న అనుభూతిని పొందుతున్నాను.  ఈనా అనుభూతిలోని ఆనందమును నేను వర్ణించలేను.  శ్రీసాయి బంధువులు నిత్యము ఈ విధముగా శ్రీసాయికి అభిషేకము చేస్తు, శ్రీసాయినాధుని అనుగ్రహాన్ని పొందగలరని నమ్ముతున్నాను.  శ్రీసాయి నాకు కలలో పాము రూపములో కనిపించిన రోజునే తిరిగి కలలో ఒక ముస్లిం స్నేహితుడు (శ్రీసంద్) రూపములో దర్శనము యిచ్చి తన జీవితములోని అనుభవాలు తన జీవితములో తాను అనుభవించిన కష్టసుఖాలు అన్నిటిని ఉత్తరాలు రూపములో నాకు వ్రాస్తున్నట్లు అనుభూతిని ప్రసాదించినారు.  దీనికి అర్ధము ఏమిటి అని ఆలోచించినాను.  శ్రీసాయి నాచేత నానుభవాలు, కష్టసుఖాలు శ్రీసాయి సత్ చరిత్రతో అన్వయించి నీకు వ్రాయమని ఆదేశించినట్లు భావించి  ఈ ఉత్తరాలు నీకు వ్రాస్తున్నాను.

శ్రీసాయి సేవలో

నీతండ్రి    

(సర్వం శ్రీసాయినాధార్పణమస్తు)      

No comments:

Post a Comment