Tuesday 28 May 2013

పుణ్యభూమి శిరిడీలో దొరికిన రత్నమణి సాయి - 39 వ.భాగము

 
 

29.05.2013 బుధవారము
ఓం సాయి శ్రీసాయి జయజయ సాయి
సాయి బంధువులకు బాబావారి శుభాశీస్సులు

సాయి బంధువులకు ఒక గమనిక:  ఈ నెల 31వ.తేదీన కాశీ యాత్రకు వెడుతున్నందువల్ల పది రోజులపాటు ప్రచురణకు వీలు కుదరదు.  వచ్చిన తరువాత యధావిధిగా కాశీ యాత్ర విశేషాలతో మరలా  మీముందుంటాను.. సాయిరాం 


పుణ్యభూమి శిరిడీలో దొరికిన రత్నమణి సాయి - 

39 వ.భాగము

                                                              11.02.1992

ప్రియమైన చక్రపాణి,

ఈ అధ్యాయములో శ్రీహేమాద్రి పంతు శ్రీసాయికి ఉన్న సంస్కృత పరిజ్ఞానము గురించి, బూటీవాడ (రాతిమేడ) నిర్మాణము గురించి వివరించినారు.  




శ్రీసాయి సత్ చరిత్రలో శిరిడీ ప్రజలకు శ్రీసాయిపై గల ప్రేమ అభిమానాలను చక్కగ వర్ణించబడినది.  శ్రీసాయి నామము ఉచ్చరించటానికి ఒక సమయం, ఒక కాలము అవసరము లేదు.  సర్వకాల సర్వ అవస్థలయందు శ్రీసాయి నామము స్మరించవచ్చును.  భగవత్ గీతలోని సంస్కృత శ్లోకానికి శ్రీసాయి చక్కని వివరణ యిచ్చినారు.  నానాసాహెబ్ చందోర్కరు యొక్క గర్వాన్ని శ్రీసాయి ఎంత చక్కగా అణచినారు.  ప్రతిమనిషిలోని విజ్ఞానము ప్రకాశించి యితరులకు వెలుగు ప్రసాదించాలి.  కాని, నానాసాహెబ్ లో సంస్కృత పరిజ్ఞానము అతనిలోని అహంకారాన్ని పెరిగేలాగ చేసినది.  శ్రీసాయి చక్కటి మాటలతో ఆ సంస్కృత శ్లోకానికి అర్ధము విడమర్చి చెప్పి నానా సాహెబ్ చందోర్కర్ లోని గర్వము అణచివేసెను.  యిటువంటి సంఘటనలు ద్వారా శ్రీసాయి మనకు యిచ్చిన సందేశము ఏమిటి అనేది ఆలోచించు.  ఆ సంస్కృత శ్లోకములో నాకు నచ్చిన విషయాలు నీకు తెలియ పర్చుతాను.  "అజ్ఞానము నశింపచేయుటయే జ్ఞానము సంపాదించటము" "చీకటిని తరిమి వేయటమే వెలుతురుని పొందటము" "దైవత్వమును నశింపచేయటము అద్వైతము తెలుసుకోవటము".  ఈ సరళిలో మనము ఆలోచించతే మన పెద్దలు మాట వరసకు అనే మాటలు జ్ఞాపకానికి వస్తాయి.   

నీతోటివాడికి అపకారము చేయకుండ యుండటము ఉపకారము చేసిన అంత ఫలము" "భగవంతుని, యోగులను దూషించకుండ ఉండగలిగితే పూజించినంత ఫలము.  యివి ఎంత చక్కటి మాటలు.  మనము వీటిని మన మెదడులో జ్ఞాపకము ఉంచుకోవాలి.

యిక శిరిడీలో గోపాల్ ముకుంద్ బూటీ నిర్మించిన సమాధి మందిరము గురించి ఆలోచించుదాము.  తనకు ఒక వాడా మందిరముతో సహా నిర్మించమని ఒక రాత్రి శ్యామాకు, బూటీకి కలలొ దర్శనము యిచ్చి చెప్పటము విషయము గురించి ఆశ్చర్యపడుతున్నావా?  శ్రీసాయి సాక్షాత్తు భగవంతుడు కనుక ఒకే సమయములో తన భక్తులకు నిజ స్థితిలోను, స్వప్న స్థితిలోను దర్శనము యివ్వగలరు అనేది నిర్ధారించుకోవచ్చును.  ఈ సంఘటనతో శ్రీసాయి సశరీరముతో శిరిడీలో యున్న రోజులలో యిద్దరు భక్తులకు ఒకే సమయములో కలలో దర్శనము యిచ్చి  తనకు కావలసిన విషయాలు చెప్పటము - మరియు ఈనాడు సశరీరముతో శిరిడీలో లేకపోయిన భక్తులకు స్వప్నములో దర్శనము యివ్వటము  బట్టి శ్రీసాయికి ఆనాడు, ఈనాడు, మరియు ఏనాడు మరణము లేదు అని నిర్ధారించుకోవచ్చును.  14.12.89 గురువారమునాడు మీఅక్క బెంగళూర్ నుంచి శ్రీసాయినాధుని పంచలోహాలు విగ్రహము, మురళిధరుని విగ్రహము తెచ్చి నాకు బహుమతిగా యిచ్చినపుడు శ్రీసాయి సత్ చరిత్రలో చెప్పబడిన మాటలు "బాబాయే మురళిధరుడు" నిజము అని నమ్ముతాను.  


14.12.89 నాటికి మీఅక్కకు శ్రీసాయిని గురించిన వివరాలు ఏమీ తెలియకపోయిన శ్రీసాయినాధుడే ఆమె చేత ఆవిగ్రహాలు కొనిపించి నాకు బహుమతిగా యిప్పించినారు అని నమ్ముతాను. 

శ్రీసాయి సేవలో

నీతండ్రి   
(సర్వం శ్రీసాయినాధార్పణమస్తు) 

No comments:

Post a Comment