Monday, 17 September 2012

శ్రీ శివస్వరూపము - సాయి (3 వ. భాగము)



                                                 

17.09.2012  సోమవారము
ఓం సాయి శ్రీసాయి జయజయ సాయి
సాయి బంధువులకు బాబావారి శుభాశీస్సులు



శ్రీ శివస్వరూపము - సాయి (3 వ. భాగము) 

గురుగీత - 24వ. శ్లోకములో పరమ శివుడు  పార్వతీదేవికి చెప్పినవిషయం 



ఓ ప్రియమైన పార్వతి, గురు స్వరూపమును అర్ధము చేసుకోకుండ, సాధకుడు చేయు జపము , తపస్సు, వ్రతము, యజ్ఞము, దానము మొదలగునవి అన్నీ వ్యర్ధములే -

శ్రీసాయి సత్ చరిత్రలో (32వ . అధ్యాయములో) శ్రీసాయి అన్నమాటలు.  
 

"ఒకానొకప్పుడు మేము నలుగురము మత గ్రంధములు చదువుచు అజ్ఞానము, బ్రహ్మమునైజము గూర్చి తర్కించ మొదలిడితిమి.  మాలో ఒకడు ఆత్మను ఆత్మచే ఉధ్ధరించవలెను గాని యితరులపై నాధారపడరాదు అనెను.  అందుకు రెండవవాడు మనస్సును స్వాధీనమందుంచుకొన్నవాడే ధన్యుడనియు మనము ఆలోచనలనుండి భావములనుండి ముక్తులమైనచో మనకంటే వేరైనది ఈప్రపంచములో మరెద్దియు లేదని చెప్పెను. మూడవవాడు దృశ్యప్రపంచము సదా పరిణామశీలమైనదనియు, నిరాకారమే శాశ్వతమైనదనియు కావున సత్యాసత్య విచక్షణ అవసరము అని చెప్పెను. నాలుగవవారు (శ్రీసాయిబాబా) పుస్తక జ్ఞానమెందుకు పనికిరాదు, మనకు విధింపబడిన కర్మను మనము పూర్తిచేసి, తనువును, మనస్సును, పంచప్రాణాలు గురువు పాదములపై పెట్టి శరణు వేడవలెను.  
 

గురువే దైవము.  సర్వమును నడిపించినవాడు.  యిట్టి ప్రత్యయమేర్పడుటకు, ఢృఢమైన యంతులేని నమ్మకము అవసరము" అనెను. భగవంతుని వెదకుటకు అడవులలో తిరగనారంభించిరి.

గురుగీత ;    29వ. శ్లోకం:
 
గురువు పాద తీర్ధమును త్రాగి, మిగిలిన తీర్ధమును ఎవడు తలమీద ధరించుచున్నాడో అట్టి పుణ్యాత్ముడు సర్వతీర్ధస్నాన ఫలమును పొందుచున్నాడు. 

శ్రీసాయి సత్చరిత్ర 4వ. అధ్యాయములో - దాసగణు మహారాజ్ తను గంగాయమునలు కలసే ప్రయాగ సంగమములో స్నానము చేయుటకు వెళ్ళిరావటానికి అనుమతిని ప్రసాదించమన్నపుడు శ్రీ సాయి అన్నమాటలు, "అంత దూరము పోవలసిన అవసరమేలేదు. మన ప్రయాగ యిచ్చటనె కలదు.  నామాటలు విశ్వసింపుము."  దాసగణు శ్రీసాయి పాదములపై శిరస్సునుంచగానే సాయియొక్క రెండు పాదముల బొటన వ్రేళ్ళనుండి గంగా యమున జలాలు కాలువలుగా పారెను.  
అపుడు దాసగణు ఆతీర్ధాన్ని తలపై వేసుకొని తర్వాత ఆతీర్ధాన్ని త్రాగలేదే అని బాధపడెను.  ఆవిచిత్ర మహిమను చూసి ఆంతరిక ప్రేరణతో బాబాను వారి లీలను పాట రూపముగా వర్ణించెను. 

గురుగీత 32వ. శ్లోకం: 

నిరంతరము గురుపాద తీర్ధము పానముగను,  గురువు భుజింపగా మిగిలినది భోజనముగను, ఎల్లపుడు గురుమూర్తియే ధ్యాన రూపముగను,  గురు నామమునే జపముగా చేయుచుండవలెను. 
 
ఇదే విషయము శ్రీ సాయి సత్చరిత్రలో వివరింపబడినది. "ద్వారకామాయిలో భక్తులు సాయి పాదాలను నీటితో కడిగి, ఆనీటిని పవిత్ర తీర్ధముగా త్రాగుచుండేవారు.  వారి పాదాలను ఒత్తుచు శ్రీసాయి నామ జపము చేస్తూ ఉండేవారు.  వారు స్వీకరించి తినగా మిగిలిన భోజనపదార్ధములను భక్తులు ప్రసాదముగా స్వీకరించేవారు. ముఖ్యముగా రాధాకృష్ణమాయి రోజూ  శ్రీసాయి తినగా మిగిలిన భోజనము మాత్రమే తినేది.  నేవాస్కర్ పాటిల్ శ్రీసాయి స్నానము చేసిన నీరును పవిత్ర తీర్ధముగా త్రాగేవాడు.

గురుగీత 33వ. శ్లోకం:   తన గురు దేవుని పవిత్ర నామమును కీర్తించడమే అనంతుడగు పరమేశ్వరుని కీర్తనమగును.  గురు నామమును ధ్యానించటమే అవ్యయుడైన మహేశ్వరుని నామమును ధ్యానించుట యగును. 
 
శ్రీ సాయి సత్ చరిత్ర 4వ. అధ్యాయయము :  శిరిడీలో రాధాకృష్ణమాయి శ్రీసాయి నామ జపమును, సాయి నామ సంకీర్తన ప్రారంభించెను.  శ్రీసాయి ఈపద్ధతికి ఆమోదము తెలిపిరి.  దాసగణుచేత ఏడురాత్రింబవళ్ళు అఖండ నామసప్తాహము చేయించిరి, బాబా. 


(యింకా ఉంది)
సర్వం శ్రీసాయినాధార్పణమస్తు)


No comments:

Post a Comment