Sunday 14 July 2013

పుణ్యభూమి శిరిడీలో దొరికిన రత్నమణి సాయి - 42వ.అధ్యాయము

   
      

పుణ్యభూమి శిరిడీలో దొరికిన రత్నమణి సాయి -
 42వ.అధ్యాయము

                                                             14.02.1992

ప్రియమైన చక్రపాణి,

ఈ అధ్యాయమునకు, నా జీవితానికి గల సంబంధము నేను మాటలలో చెప్పలేను.  నేను అనేక సార్లు శ్రీసాయి సత్ చరిత్ర పారాయణ చేసినాను.  42,43,44 అధ్యాయాలు పారాయణ చేస్తున్నపుడు నేను 1918 సంవత్సరానికి వెనక్కి వెళ్ళిపోయి బాబా మహాసమాధి గురించి ఆలోచిస్తూ ఉండేవాడిని.  




ఒకసారి వర్తమానములో బాబా మహాసమాధి సంఘటన చూడగలనా అనే ఆలోచన కలిగినది.  శ్రీసాయికి విన్నవించుకొన్నాను.  "సాయినాధ - నీవు 1918 సంవత్స్రరములో మహాసమాధి చెందినావు.  ఈనాటికీ నీఆత్మ, సాయిబంధువుల మధ్య తిరుగుచున్నది.  నీవు శరీరముతో మామధ్య లేని లోటు తీర్చుతున్నది.  కాని నీవు మహాసమాధి చెందినపుడు భక్తులు పొందిన అనుభూతిని నాకు ఈ వర్తమానములో కలుగచేయి తండ్రీ అని వేడుకొన్నాను.  శ్రీసాయి తన భక్తుల కోరికను తప్పక తీర్చుతాడు అనే నమ్మకము నాలో కలిగినది.  ఆ నమ్మకానికి రూపురేఖలు 1992 జనవరిలో జరిగినవి.  ఆవివరాలు ఈ ఉత్తరములో వ్రాస్తాను శ్రధ్ధగా చదువు. 

నాపాలిట సాయి, నాకు అన్నదాత, విద్యాదాత మరియు నాపినతల్లి భర్త అయిన శ్రీఉపాధ్యాయుల పేరేశ్వర సోమయాజులు గార్కి శ్రీశిరిడీ సాయినాధునిపై 1991 సంవత్సరములో నమ్మకము కలిగినది.  వెంటనె శ్రీసాయి సత్ చరిత్ర పారాయణ చేసినారు.  షిరిడీ వెళ్ళి రావాలని కోరిక వెల్లడించినారు.  అనివార్య కారణాల వలన 1991 డిశంబరులో నాతోపాటు శిరిడీ యాత్ర చేయలేకపోయినారు. 

ఆయనకు 12.01.1992 నాడు మనవడు జన్మించినాడు.  ఆ మనవడికి సాయిశంకర్ అని పేరు పెట్టినారు.  రోజులు ప్రశాంతముగా గడుస్తున్నాయి.  తుఫాన్ వచ్చేముందు కూడ సముద్రము ప్రశాంతముగా యుంటుంది.  23.01.92 గురువారము రోజున ఆయన అనారోగ్యముతో బాధపడుతు నన్ను చూడాలనే కోరికను వెళ్ళబుచ్చినారు.  24.01.92 నాడు ఉదయము 10 గంటలకు ఆయనను చూడటానికి వెళ్ళినాను  ఆయన కళ్ళలో నీళ్ళతో నన్ను కౌగలించుకొని ఏదో తెలియని బాధను వ్యక్త పరచినారు.  సాయంత్రము డాక్టర్ దగ్గరకు తీసుకొని వెళ్ళినాము. ఆయనను పెద్ద ఆసుపత్రిలో చేర్చమని డాక్టర్ సలహా యిచ్చినారు.  వెంటనే ఆయనను పెద్ద నర్సింగ్ హోం లో చేర్చినాము.  పెద్ద డాక్టర్లు ఆయనను పరీక్షించి రోగి పరిస్థితి క్షీణించుచున్నది.  బంధువులందరికి టెలిగ్రాంస్ యివ్వండి అని చెప్పినారు.  అంతకు వారము రోజుల ముందర తమ నూతన గృహానికి గృహ ప్రవేశ ముహూర్తము 12.02.92 నాటికి స్థిర పరచినారు.  ఆయన ఆసుపత్రిలో మరణశయ్యపై భీస్మాచార్యులులాగ బాధపడుతున్నారు.  మూడు లక్షలు పెట్టి నూతనముగా కట్టించుకొన్న యింటిలో ఆయన గృహప్రవేశము చేయగలరా?  అనే ఆలోచన వచ్చినది.  ఆనాడు శ్రీసాయి అనారోగ్యముతో యుండగా లక్షరూపాయలతో శ్రీగోపాల్ ముకుంద్ బూటీ కట్టిన రాతిమేడలో శ్రీసాయి ప్రవేశించి పునీతము చేస్తారా? లేదా? అనే ఆలోచన బూటీకి మరియు యితర భక్తులకు వచ్చినది. 

ఏమి చేయాలి యిటువంటి పరిస్థితిలో అని శ్రీసాయి నామస్మరణ చేసినాను.  12.02.92 నాటి ముహూర్తమునకు ముందుగా ఏదైన ముహూర్తము యున్న బాగుంటుంది అనే ఆలోచనలతో ఆయన అన్నదమ్ములను సంప్రదించి ఆసుపత్రి దగ్గరలో ఉన్న ఒక సిధ్ధాంతిగారి దగ్గరకు వెళ్ళినాను.  ఆసిధ్ధాంతిగారు నన్ను తన పూజా మందిరములోనికి పిలిచినారు.  ఆగదిలో శ్రీసాయినాధుడు పటము రూపములో చిరునవ్వుతో నన్ను ఆహ్వానించినారు.  యిది శుభసూచకము అని భావించినాను. పూజామందిరములో శ్రీసాయినాధుని విగ్రహము ముందు నూనె దీపము వెలుగుచున్నది.  నాలో ఆశాజ్యోతి కలిగినది.  ఆసిధ్ధాంతిగారు 29.01.92 నాడు ఉదయము దశమి ఘడియలలో గం.9.49 నిమిషాలకు ముహూర్తము పెట్టినారు.  శ్రీసాయికి ఆగదిలో సాష్ఠాంగ నమస్కారము చేసి ధైర్యముతో బయటకు వచ్చి నూతన గృహప్రవేశము 29.01.92 నాడు ఉదయము గం.9.49  నిమిషాలకు జరుగును అని బంధువులు అందరికి తెలియపర్చినాను.  ఈవిషయము అనారోగ్యముతో బాధపడుతున్న నాపినతండ్రికి తెలియపర్చినాను.  ఆయన 29.01.92 నాటి వరకు బ్రతకగలనా అని సందేహము వెళ్ళబుచ్చినారు.  ఆయన వయస్సు 73 సంవత్సరాలు.  ఆయనకు పిల్లలు పుట్టలేదు.  తనకు పిల్లలు లేకపోయిన తన బంధువర్గములోని చాలామంది పిల్లలకు అన్నదానము, విద్యాదానము చేసినారు.  ఆయన వలన మేలు పొందినవారిలో నేను ఒకడిని.  ఆయన చేసుకొన్న పుణ్యము అంటు యుంటే 29.01.92 నాడు నూతనముగా నిర్మించుకొన్న గృహములో గృహప్రవేశము చేస్తారు.  కొత్తముహూర్తము శ్రీసాయి సన్నిధిలో పెట్టబడినది.  డాక్టర్ ఈ కొత్త ముహూర్తానికి కూడా నిరాశ వ్యక్త పరుచుతున్నాడు.  ఏమి ఎట్లాగ జరిగిన భారము శ్రీసాయినాధునిపై వేసినాము.  శ్రీసాయినాధుని ఏకాదశ సూత్రములలో తొమ్మిదవ సూత్రము  "మీభారములను నాపై బడవేయుడు, నేను మోసెదను." యిది శ్రీసాయికి పరీక్ష - సాయి భక్తుల నమ్మకానికి పరీక్ష.  23.01.1992 నుండి ఆయన భోజనము చేయుటలేదు.  ఏమీ తినలేని స్థితిలో ఉన్నారు.  శ్రీసాయి దయతో 27.01.1992 నాడు మజ్జిగ త్రాగినారు.  శ్రీసాయి నామస్మరణ చేస్తు 29.01.1992 నాడు గృహప్రవేశ ముహూర్తమునకు ఎదురు చూస్తున్నారు.  27.01.92 రాత్రి ప్రశాంతముగా గడచిపోయినది. 28.01.92 నాడునూతన ఉత్సాహముతో మరణముతో యుధ్ధము ప్రారంభించినారు.  బందువులు అందరు నూతన గృహప్రవేశము జరగకపోవచ్చును అనే ఉద్దేశముతో ఆసుపత్రికి వచ్చి ఆయనను చూసి వెళుతున్నారు.  28.01.92 నాడు ఆయన బాధ చూడలేక డాక్టర్లు  మత్తుమందు యిచ్చినారు.  29.01.92 నాడు ఉదయము చిరునవ్వుతో మేల్కొన్నారు.  ఆయన ముఖములో చిరునవ్వు యున్నది.  కాని, అక్కడి డాక్టర్ల ముఖములో నిరాశ, ఆందోళన వ్యక్తమగుతున్నాయి.  గృహప్రవేశము ముహూర్తమునకు యింకారెండు గంటల వ్యవధి యున్నది.  నాలోని ఆశాజ్యోతి మినుకు మినుకుమని గాలికి ఆరిపోతున్న భావన కలుగుతున్నది.  రోగి కళ్ళలో తను తన నూతన గృహానికి వెళ్ళిపోవాలి అనే కోరిక కనబడుతున్నది.  మళ్ళీ సిధ్ధాంతిగారి దగ్గరకు వెళ్ళినాను.  అక్కడ పటము రూపములో ఉన్న శ్రీసాయినాధుడు చిరునవ్వుతో ప్రశాంతముగా యున్నారు.  ఆయన  భక్తులు తుఫాన్ లో కొట్టుకొంటున్నారు.  శ్రీసాయి చిరునవ్వుకు అర్ధము ఏమిటి?  నాలో ఏదో తెలియనై ధైర్యము వచ్చినది. పరిస్థితిని సిధ్ధాంతిగారికి  తెలియచేసినాను. ఆయన  పంచాంగము చూసి దశమి ఘడియలు ఉదయము 9 గంటలకు వస్తాయి.  అందుచేత 9గంటల తర్వాత గృహప్రవేశము చేయించండి అన్నారు.  వెంటనే ఆసుపత్రికి వచ్చి రోగికి విభూతి స్నానముచేయించి నూతన వస్త్రాలు ధరింపచేసి గం.8.30 నిమిషాలకు ఆంబులెన్సు తీసుకొని వచ్చి, ఆయన నూతన గృహానికి తీసుకొని వెళ్ళటానికి సిధ్ధపడినాను.  

ఈ విధముగా రోగిని తీసుకొని వెళ్ళటానికి డాక్టర్ ఆంగీకరించటములేదు.  శ్రీసాయికి నమస్కరించినాను.  యిది శ్రీసాయి నాకు పెట్టిన పరీక్ష.  ధైర్యముగా రోగిని నూతన గృహానికి తీసుకొని వెళ్ళినాను. 

బంధువులు అందరు శ్రీసోమయాజులుగారి రాక కోసము ఎదురు చూస్తున్నారు.  అందరి కళ్ళు ఆంబులెన్సు నుండి స్ట్రక్చరు మీద పరుండి బయటకు  చూస్తున్న రోగిమీద యున్నాయి.  కాని, రోగి కళ్ళు మాత్రము తన నూతన గృహముమీద యున్నాయి.  ఆక్షణము శ్రీసాయి నామస్మరణ చేస్తున్నాను.  టైము సరిగ్గా ఉదయము 9 గంటలు. సన్నాయి వాద్యము మ్రోగుతున్నది.  రోగి నడవలేడు.  స్ట్రక్చర్ మీద పరుండి యున్నాడు.  ప్రక్కన నాపినతల్లి, గుమ్మడికాయతో పురోహితుడు, అందరము కలసి గృహపవేశము చేసినాము  అప్పుడు అర్ధమైనది.  శ్రీసాయినాధును చిరునవ్వు.  మానసికముగా మేము అందరము చాలా బాధపడినాము కాని శ్రీసాయినాధుడు చిరునవ్వుతో హృహప్రవేశ భారాన్ని స్వీకరించి తన మాటను నిలుపుకొన్నారు.  గృహప్రవేశము జరిపించినారు.  యిది శ్రీసాయి లీల కాదా!  ఆయన యిచ్చిన ఏకాదశ సూత్రాలకు సాక్ష్యము కాదా!  ఒక్కసారి ఆలోచించు.  ఆయననే నమ్ముకో.  మిగతా విషయాలు రేపటికి ఉత్తరములో వ్రాస్తాను.  

నీతండ్రి

(సర్వం  శ్రీసాయినాధార్పణమస్తు)      


No comments:

Post a Comment