Thursday, 25 July 2013

పుణ్యభూమి శిరిడీలో దొరికిన రత్నమణి సాయి - 43,44 అధ్యాయములు

     
    
25.02.2013  గురువారము

ఓం సాయి శ్రీసాయి జయజయ సాయి
సాయి బంధువులకు బాబావారి శుభాశీస్సులు

మనబ్లాగులో ప్రచురణకు 10 రోజులు ఆలస్యం జరిగింది..క్షంతవ్యుడను..పొద్దుటే ఆఫీసుకు, వెళ్ళడం..తిరిగి ఇంటికి వచ్చినాక కొన్ని పనులవల్ల సమయం కుదరలేదు...


పుణ్యభూమి శిరిడీలో దొరికిన రత్నమణి సాయి,
 43, 44 వ. అధ్యాయములు

                                                   15.02.1992

ప్రియమైన చక్రపాణి,

42,43,44వ.అధ్యాయములలో శ్రీహేమాద్రిపంతు శ్రీసాయిబాబా మహా సమాధి చెందటము గురించి వివరించినారు.  అందుచేత నేను కూడా ఈ మూడు అధ్యాయములను రెండు ఉత్తరాలలో వివరించుచున్నాను.  క్రిందటి ఉత్తరములో చివర్లో నాపిన తండ్రి శ్రీఉపాధ్యాయుల పేరేశ్వర సోమయాజులు గారు శ్రీసాయి దయతో మరణ శయ్యపై ఉండగా కుడా గృహప్రవేశము చేసిన సంఘటన వివరించినాను.  




శ్రీసాయి గృహప్రవేశము నిమిత్తము ఆయన చావు చీటీ తాత్కాలికముగా తీసివేసినారు.  ఒకవేళ శ్రీసాయి తాత్కాలికముగా ఆయన మరణమును తొలగించకపోయి యుంటే ఆయన తను కట్టుకొన్న యింటిపై వ్యామోహముతో మరణించి, ఆకోరిక తీర్చుకోవటానికి మళ్ళీ జన్మ ఎత్తవలసియుండేది.  శ్రీసాయి ఈ పరిస్థితిని గమనించి ఆయన మనసులోని కోరిక తీర్చి ఆయనకు ప్రశాంత మరణము కలగటానికి మార్గము ఏర్పరచినారు.  నేను యిపుడు ఆవిషయాలు నీకు వ్రాస్తాను.  శ్రీసోమయాజులు బాబయ్యగారు 29.01.92 నాడు నూతన ఉత్సాహముతో తన మంచము మీద నుండే బంధువులందరిని పరుపేరున పిలిచి మాట్లాడి భోజనము చేసి వెళ్ళమని కోరినారు.  తన చెల్లెలను పిలిచి తనకు యిష్ఠమైన భక్తిపాట, "నీవు ఉండేది కొండపైన, నేను ఉండేది నేలపైన" అనే పాటను పాడించుకొని శ్రీవెంకటేశ్వరస్వామికి నమస్కరించినారు. మధ్యాహ్నము అందరి భోజనాలు అయినవి.  అందరిని తమ తమ యిళ్ళకు వెళ్ళిరమ్మనమని చెప్పినారు.  నన్ను పిలచి సాయి మధ్యాహ్న్న హారతి చదవమన్నారు.  నాకు మనసులో బాధగాయున్నా శ్రీసాయికి మధ్యాహ్న్న హారతి యిచ్చినాను.  ఆయన నన్ను ప్రేమతో పిలిచి తన జ్ఞాపకార్ధముగా తన కళ్ళజోడు తీసి నాకళ్లకు పెట్టినారు.  నాపినతల్లిని పిలిచి తన మరణానంతరము తన చేతివేలికి యున్న ఉంగరమును నాకు యివ్వమని చెప్పినారు.  నేను ఆయన బాధ చూడలేకపోవుచున్నాను.  భగవంతుడా ఆయను త్వరగా తీసుకొనిపో అని ప్రార్ధించినాను.  భగవంతుడు నాప్రార్ధనను విన్నది లేనిది శ్రీసాయి సత్ చరిత్రలో శ్రీసాయిని సందేశము కోరినాను.  కళ్ళుమూసుకొని ఒక పేజీ తీసినాను.  26వ. అధ్యాయము 221వ.పేజీలో శ్రీసాయి ఇచ్చిన సందేశము "గత జన్మ పాపపుణ్యములను నీవు అనుభవించక తీరదు.  నీఅనుభవము పూర్తి కాకున్నచో ప్రాణత్యాగము నీకు తోడ్పడదు.  నీవింకొక జన్మ ఎత్తి బాధ అనుభవించవలెను.  వచ్చుటకు ముందు కొంతకాలమేల నీకర్మను అనుభవించరాదు? గత జన్మ పాపాలనేల తుడచివేయరాదు?  దానిని శాశ్వతముగా పోవునట్లు జేయుము".  ఈ సందేశమును అర్ధము చేసుకొన్నాను.  కాని, ఆయన బాధను చూడలేక అక్కడినుండి నాయ్హింటికి తిరిగి వచ్చి స్నానము చేసి శ్రీసాయికి రాత్రి హారతి యిచ్చినాను.  ఆహారతి సమయములో ఒక నల్లని పురుగు చూడటానికి చాలా భయకరముగా యున్నది.  దాని రెక్కలమీద మానవ కపాలం చిత్రించినట్లు యున్నది.  పరిస్థితిని అర్ధము చేసుకొన్నాను.  శ్రీసాయి శ్రీసోమయాజులుగార్కి ఏకాదశి ఘడియలలో మోక్షము ప్రసాదించుతారు అని నాలో నమ్మకము కుదిరినది.  రాత్రి కలత నిద్రతో కాలము వెళ్ళబుచ్చినాను.   30.01.92 గురువారము ఉదయము లేచి స్నానము చేసి నిత్యపారాయణ చేసి శ్రీసాయిని సందేశము కోరినాను.  27.వ.అధ్యాయములోని 230, 231 వ. పేజీలలో "రాజారాం అను మంత్రమును జపించు.  నీవట్లు చేసినచో నీజీవిత ఆశయము పొందెదవు.  నీమనసు శాంతించును" అనే సందేశాన్ని ప్రసాదించినారు.  వెంటనే శ్రీ సోమయాజులు బాబయ్యగారి యింటికి వెళ్ళినాను.  రాత్రి పరిస్థితి విషమించటము చేస్తే తిరిగి గాంధీ ఆసుపత్రిలో చేర్చినారు అని చెప్పినారు.  వెంటనే గాంధీ ఆసుపత్రికి వెళ్ళినాను. 

ఆయన మరణముతో యుధ్ధము చేయుచున్నారు.  చాలా నీరసముగా మాట్లాడుచున్నారు.  పరిస్థితిని అర్ధము చేసుకొన్నాను.  బయటనుండి తులసిదళములు, గ్లాసులో మంచినీరు తెప్పించినాను.  ఆయన తలప్రక్కన కూర్చుని శ్రీసాయి మధ్యాహ్న హారతి చదివినాను.  శ్రీసాయికి పంచదార నైవేద్యముగా పెట్టి ఆప్రసాదమును ఆయన నోటిలో వేసినాను.  ఆయన దానిని చప్పరించినారు.  ఆసమయమునుండి ఆయన పరలోక యాత్ర ప్రారంభమైనది.  నేను ఆయన చెవిలో రాజారాం -  సాయిరాం అని చెబుతున్నాను.  ఆయన రాం - రాం అని మెల్లిగా అంటున్నారు.  మధ్యాహ్న్నము 1 గంట ప్రాతములో డాక్టర్లు ఆక్సిజన్ పెట్టినారు. గుండె నిమిషానికి 180 సార్లు కొట్టుకొనుచున్నది అని ఆయన తలప్రక్కన ఉన్న యంత్రము చేబుతున్నది.  డాక్టర్లు ఆయనను బ్రతికించాలని ప్రయత్నాలు చేస్తున్నారు.  వారు ఆశ వదలి ప్రక్కకు తప్పుకొన్నారు.  నేను మాత్రము ఆయన చెవిలో రాజారం - సాయిరాం అని అంటున్నాను.  ఆయన అతి కష్ఠముమీద రాం అని అంటున్నారు.  సమయము 1 గంట 15 నిమిషాలు.  ఆయన నోటిలో తులసి నీరు పోసినాను.  ఆయన ఒక గుటక వేసినారు.  రెండవసారి ఆయన నోటిలో తిరిగి తులసి నీరు పోసినాను. అవి బయటకు వచ్చినవి.  ఆయన ఆఖరి శ్వాస 1 గంట 20 నిమిషాలకు "ఆహ" అని పెద్దగా వినిపించినది.  ఆయన మన మధ్యలేరు అని గ్రహించినాను.  దుఃఖాన్ని ఆపుకోలేక బిగ్గరగా ఏడ్చినాను. డాక్టర్లు వచ్చి వార్డులో ఏడవరాదు అన్నారు.  వాళ్ళకు ఏమి తెలుసు నామనసులోని బాధ.  నాసాయి నన్ను వదలి వెళ్ళిపోయినారు.  బంధువులు అందరు నాదగ్గరకు వచ్చి ఎన్ని గంటలకు ఆఖరి శ్వాస తీసుకొన్నారు అని అడిగినారు.  30.01.92 గురువారము మధ్యాహ్న్నము 1 గంట 20 నిమిషాలు అని చెప్పినాను.  బంధువులలో ఒకరు అన్నారు.  భీష్మాచార్యులు లాగ ఏకాదశి ఘడియలలో ప్రాణము విడిచినాడు.  సోమయాజులు ఎంత అదృష్ఠవంతుడు.  అవును ఆయన దశమి ఘడియలో మృత్యువుతో పోరాటము ప్రారంభించి ఏకాదశి ఘడియలలో తన శరీరాన్ని ఓడించి, సాయిలో ఐక్యమగుట ఆధ్యాత్మిక విజయము అని నేను భావించినాను.  ఆనాడు అంటే 1918 సంవత్సరము అక్టోబరు నెల 15వ.తారీకు మధ్యాహ్న్నము హారతి స్వీకరించిన పిదప, 2 గంటల 30 నిమిషాలకు శ్రీసాయి ఆఖరి శ్వాస తీసుకొన్నారు. 

శ్రీసాయి దశమి, ఏకాదశి ఘడియలలో నానాసాహెబు నిమోన్ కర్ చేతితో ఆఖరి దాహమును తులసినీళ్ళతో తీర్చుకొన్నారు.  నాపాలిట సాయి శ్రీసోమయాజులు గారు ఏకాదశి ఘడియలలో ఆఖరి దాహము తీర్చుకోవటానికి తులసి నీళ్ళను నా చేతితో స్వీకరించినారు.  ఈవిధముగా శ్రీసాయి ఆనాడు తను మహా సమాధి చెందినపుడు భక్తులు పొందిన అనుభవాలను నాకు ఈనాడు నాపాలిట సాయి శ్రీసోమయాజులుగారు ఆఖరి శ్వాస తీసుకొనే సమయములో చూపించి తన మాటను నిలబెట్టుకొన్నారు.  363 వ.పేజీలో వివరించబడిన సంఘటన నాజీవితములో జరిగినది.  బాబా లక్ష్మన్ మామా జోషికి బాబా స్వప్నములో కాంపించి చేయి పట్టిలాగి యిట్లు అనెను "త్వరగా లెమ్ము" బాపు సాహెబు నేను మరణించితిననుకొనుచున్నాడు.  అందు చేత అతడు రాడు. నీవు పూజ చేసి కాకడ హారతిని యిమ్ము."  ఆరోజు 11.02.92 శ్రీసోమయాజులు బాబయ్యగారు చనిపోయి 12 రోజులు పూర్తి అయినాయి.  శ్రీసాయికి ఉదయము హారతి ఇవ్వవలసియున్నది.  అలారము కొట్టలేదు.  బధ్ధకముగా యుంది.  నిద్రనుండి లేవలేదు.  శ్రీసాయి సోమయాజులు బాబయ్యగారి రూపములో కనిపించి తనకు యిష్ఠమైన ఉదయపు కాకడ హారతి చదవమని కోరినారు.  ఉలిక్కిపడి లేచినాను.  గోడ గడియారము ఉదయము 6 గంటలు చూపుతున్నది.  అలారం టైం గడియారము ఆగిపోయి ఉంది.  వెంటనే లేచి ముఖము కడుగుకొని శ్రీసాయికి కాకడ హారతి యిచ్చినాను. 

30.01.1992 నాడు సాయంత్రము సూర్యాస్థ సమయములో శ్రీసోమయాజులు బాబయ్యగారి శరీరాన్ని చితిపై పెట్టినపుడు 366వ.పేజీలో శ్రీ హేమాద్రిపంతు చెప్పిన మాటలు "పంచ భూతాత్మకమగు శరీరము నాశనము అగును.  లోననున్న ఆత్మ పరమ సత్యము.  అదియే సాయి."  సాయి నీలోను, నాలోను అందరిలోను ఉన్నారు అనే విషయాన్ని అందరు గ్రహించగలిగిననాడు ఈప్రపంచములో సుఖ శాంతులుకు లోటు యుండదు.

శ్రీ సాయి సేవలో 

నీతండ్రి  

(సర్వం శ్రీసాయినాధార్పణమస్తు) 

No comments:

Post a Comment