పుణ్యభూమి శిరిడీలో దొరికిన రత్నమణి సాయి 45వ.అధ్యాయము
16.02.92
ప్రియమైన చక్రపాణి,
ఈ అధ్యాయములో హేమాద్రిపంతు శ్రీసాయిని గూర్చిన కొన్ని వివరాలను, విషయాలను తెలియపర్చినారు. శ్రీసాయి సత్ చరిత్రలోని మాటలు ప్రతి సాయిబంధు గుర్తు పెట్టుకోవాలి.
"యితరులపై నాధారపడుటకంటె మన స్వశక్తియందే మనకు పూర్తి నమ్మకము ఉండవలెను.". నేను ఈ మాటలు శ్రీసాయి చెప్పిన మాటలుగానే భావించి శ్రీసాయిపై పూర్తి నమ్మకము ఉంచి బ్రతుకుతున్నాను. శ్రీసాయిపై మనకు నమ్మకము యుంది అంటే మనకు మనపై నమ్మకము యున్నట్లే. ఈబ్రతుకు ఈవిధముగా సాగిపోతే నేను అదృష్ఠవంతుడినే."
శ్రీసాయి సత్ చరిత్రలోని శ్రీసాయి దీవెనలు నా జీవితములో మరచిపోలేనివి. "యిక పొమ్ము. నీవు క్షేమమును పొందెదవు. భయమునకుగాని, ఆందోళనకు గాని, కారణము లేదు". ఈదీవెన అక్షరాల జరిగినది. 1990 సంవత్సరములో నేను ఆఫీసు పనిలో ప్రమోషన్ నిమిత్తము మద్రాసు వెళ్ళినాను. తెల్లవారితే ప్రమోషన్ నిమిత్తము యింటర్వ్యూ జరుగుతుంది. రాత్రి శ్రీసాయి నామస్మరణ చేస్తు నిద్రపోయి ఉదయము లేచి శ్రీసాయి సత్ చరిత్ర 45వ. అధ్యాయము పారాయణ చేసినాను. నేను ఆందోళనతో నిత్య పారాయణ చేస్తున్నాను. శ్రీసాయి సత్ చరిత్రలో శ్రీసాయి దీవెన చదవగానే నాలో నూతన ఉత్సాహము కలిగినది. ఆ ఉత్సాహముతో యింటర్యూకు వెళ్ళి విజయము సాధించినాను. నేను యింటర్యూకు వెళ్ళేముందు అక్కడి తోటలో కొంచము సేపు సాయి నామస్మరణ చేసినాను. ఆసమయములో నాఎదురుగా యున్న చెట్టుపై తెల్లరంగు కోకిల కూర్చుని కూత కూయుచున్నది. అది నాకు చాలా ఆశ్చర్యము కలిగించినది. ఆకోకిల శరీరము అంతా తెలుపు. కాని, దాని తల మాత్రము నలుపు రంగులో యున్నది.
ఆ విచిత్ర పక్షిని నాజీవితములో అంతకు ముందు ఎన్నడూ చూడలేదు. బహుశ శ్రీసాయి నాకు ధైర్యము యిచ్చినారు అని భావించినాను. ఈ విషయాన్ని శ్రీహేమాద్రిపంతు చక్కగా వివరించినారు. "గురువు నామము జపించుట వలను, వారి స్వరూపమునే మనమున నుంచుకొని ధ్యానించుట చేతను వారిని సర్వ జంతుకోటియందు చూచుటకవకాశము కలుగును. మనకు అది శాశ్వత ఆనందమును కలుగ చేయును. " శ్రీసాయి ఈవిధముగా నేను అధైర్యముతో ఉన్నపుడు నాకు పక్షిరూపములో దర్శనము యిచ్చి నాకు ధైర్యమును ప్రసాదించినారు. శ్రీసాయి సత్ చరిత్రలో హేమాద్రిపంతు అంటారు. "ఈలోకములో అనేకమంది యోగులు గలరు. కాని మన గురువు అసలైన తండ్రి. యితరులు అనేక సుబోధలు చేయవచ్చును. కాని, మనము మన గురువు యొక్క పలుకులను మరువరాదు. "ఈవిషయాన్ని ఎప్పుడు మరచిపోరాదు. మరచిపోయి ప్రక్కదారులు తొక్కిననాడు మనము మన జీవిత గమ్యాన్ని చేరలేము. నీకు జీవితములో నీతోటివాడితో భేదాభిప్రాయాలు వచ్చినపుడు శ్రీసాయి చెప్పినమాటలు గుర్తు చేసుకో "మంచి గాని, చెడ్డగని, ఏది మనదో అది మన దగ్గర యున్నది. ఏది యితరులదో, యది యితరుల వద్ద యున్నది." ఎంత చక్కటి మాట. ఈమాటను మననము చేసుకొంటు యుండు.
శ్రీసాయి సేవలో
నీతండ్రి.
(సర్వం శ్రీసాయినాధార్పణమస్తు)
No comments:
Post a Comment