Friday, 2 August 2013

పుణ్యభూమి శిరిడిలో దొరికిన రత్నమణి సాయి - 46 వ.అధ్యాయము

        
     

పుణ్యభూమి శిరిడిలో దొరికిన రత్నమణి సాయి - 
46 వ.అధ్యాయము

                                      17.02.92

ప్రియమైన చక్రపాణి,

ఈ అధ్యాయములో హేమాద్రిపంతు చక్కని శ్రీసాయి లీలలు వర్ణించినారు.  ఆలీలను అనుభవించిన శ్యామా చాలా అదృష్ఠవంతుడు.  నేను శ్యామా అంతటివాడిని కాను, కాని, శ్రీసాయి ఆనాడు శ్యామాకు కలిగించిన అనుభూతిని నాకు ప్రసాదించినారు.  




ఆవివరాలు ఈఉత్తరములో వ్రాస్తాను.  నాకు జరిగిన అనుభవాన్ని చెప్పేముందు శ్రీహేమాద్రిపంతు "నీభక్తుల కోరికలను నీవు నెరవేర్చెదవు" అని శ్రీసాయితో అంటారు.  శ్రీసాయి త్వరలో నాకోరికలు (నాబరువు బాధ్యతలు) తీర్చి నన్ను తన బా.ని.స.గా స్వీకరించే రోజు కోసము ఎదురు చూచుచున్నాను.  నాకు శ్రీసాయి ప్రసాదించిన అనుభూతిని వివరించుతాను.  శ్రీసాయి సత్ చరిత్రలో హేమాద్రిపంతు అంటారు "ఒకవేళ బాబా ఎవరైన భక్తుని అమోదించినచో రాత్రింబవళ్ళు అతని చెంతనే యుండి, యింటివద్దను గాని, దూరదేశమున గాని, వానిని వెంబడించుచుండును.  భక్తుడు తన యిష్ఠము వచ్చిన చోటుకు పోనిమ్ము.  బాబా అచ్చటకు భక్తుని కంటే ముందుగా బోయి యేదో ఒక ఊహించని రూపమున ఉండును.  ఈవిషయము శ్యామా గయ యాత్ర విషయములో ఆనాడు నిరూపించబడినది.  1990 సంవత్సరములో యిటువంటి అనుభూతి కొరకు శ్రీసాయిని ప్రార్ధించినాను.  నాప్రార్ధన వ్యర్ధము కాలేదు.  1991 సంవత్సరములో మా ఆఫీసు వారు నన్ను కొరియా దేశము పంపుచున్నారు అని తెలిసిన రోజున శ్రీసాయి నామన్సులో ప్రవేశించి నాతో అంటారు.  నీకంటే ముందుగా నేను కొరియా దేశము వెళ్ళి అక్కడ నీరాకకు ఎదురు చూస్తూ ఉంటాను.  యిది ఎంత చక్కటి ఊహ.  నిజముగా యిది జరిగిన ఎంత బాగుండును అనే ఆలోచనలతో ఆరోజు గడిపివేసి ఆసంగతి మర్చిపోయినాను.  నేను 06.05.91 నాడు సాయంత్రము 6 గంటలకు కొరియా దేశములోని చాంగ్ వాన్ పట్టణములోని ఒక పెద్ద హోటల్ లో బస చేయటానికి చేరుకొన్నాను.  ఆహోటల్ లోని రూము తాళము తీసి లోపలికి వెళ్ళి టేబుల్ లైటు వేసినాను.  టేబుల్ పైన ఒక రెక్కల పురుగు ఆలైటు చుట్టు మూడు సార్లు ప్రదక్షిణ చేసి నేను లోపలకు వచ్చిన ద్వారము గుండా బయటకు వెళ్ళిపోయినది. నా మనసు సంతోషముతో నిండిపోయినది.  శ్రీసాయి ఈరూపములో నాకంటే ముందుగా కొరియా దేశము చేరుకొని నన్ను ఆశీర్వదించినారు అనే భావన కలిగినది.  శ్రీసాయికి నమస్కరించినాను.  ఈ సంఘటన కాకతాళీయము అని కొంత మంది అనవచ్చును.  యిది కాకతాళీయము కాదు అని చెప్పటానికి అదే గదిలో జరిగిన యిటువంటి యింకొక సంఘటన వివరించుతాను.  18.05.91 నాడు తిరిగి యిండియాకు ప్రయాణము.  ఆరోజు తెల్లవారుజామున 5 గంటలకు శ్రీసాయి హారతి చదవటానికి లేచి టేబుల్ లాంప్ వేసినాను.  ఆశ్చర్యము 06.05.91 నాడు సాయంత్రము 6 గంటలకు దర్శనము యిచ్చిన రెక్కలపురుగు టేబుల్ ల్యాంప్ చుట్టు మూడు సార్లు ప్రదక్షిణ చేసి కిటికి ద్వారా బయటకు వెళ్ళిపోయినది.  శ్రీసాయి ఈ విధముగా తను నాకంటే ముందుగా యిండియా వెళ్ళిపోతున్న అనుభూతిని కలిగించినారు.  ఆనాడు శ్రీసాయి శ్యామాతో అన్నారు "కాశి ప్రయాగ యాత్రలు ముగియుసరికి నేను శ్యామా కంటే ముందుగనే గయలో కలసికొనెదను."  నావిషయములో శ్రీసాయి నాకంటే ముందుగా కొరియా దేశములోని చాంగ్ వాన్ పట్టణము వెళ్ళి నాకంటే ముందుగానే తిరిగి భారతదేశానికి తిరిగి వచ్చినారు.  ఈ అనుభూతిని నేను జన్మలో మరచిపోలేను.  శ్రీసాయి సర్వవ్యాపి అని చెప్పటానికి నాకీ ఒక్క అనుభూతి చాలును.  రెండు మేకల కధలో శ్రీసాయి తన గత జన్మలోని స్నేహితుల కధ చెప్పినారు.  గత జన్మ సిధ్దాంతము, తిరిగి జన్మించటము విషయములను నేను శ్రీసాయిని ధ్యానములో 
యుండ గా ప్రశ్నించినాను.  శ్రీసాయి చక్కని సమాధానము యిచ్చినారు.  ఆవిషయాలు యిక్కడ వ్రాయటము అంత సమంజసము కాదు  ఆవిషయాలు వీలు చూసుకొని ప్రత్యక్షముగా మాట్లాడుతాను.  

శ్రీసాయికి జంతువులపై ఎనలేని ప్రేమ.  ఆయన కుక్క రూపములోను, పిల్లి రూపములోను తన భక్తులను కాపాడిన సంఘటనలు కలవు.  శ్రీసాయి తాను భోజనము చేసేముందు ద్వారకామాయిలోని పిల్లులకు, కుక్కలకు ముందుగా రొట్టెముక్కలు పెట్టి మిగిలిన పదార్ధాలను తను భోజనము చేసేవారు.  ఈవిధముగా సర్వ జీవాలలోను భగవంతుని చూడమని శ్రీసాయి మనకు చెప్పినారు.  మన యింటి గుమ్మము దగ్గర పశువులు నీళ్ళు త్రాగటానికి కావలసిన నీళ్ళతొట్టిని శ్రీసాయి నాచేత ఏవిధముగా కట్టించినారు అనేది నీకు వెనకటి ఉత్తరములో వ్రాసినాను.  శ్రీసాయిని సర్వ జీవాలలోను చూడటానికి ప్రయత్నించు.

శ్రీసాయి సేవలో 

నీతండ్రి

(సర్వం శ్రీసాయినాధార్పణమస్తు) 

No comments:

Post a Comment