Thursday 8 August 2013

పుణ్యభూమి శిరిడీలో దొరికిన రత్నమణి సాయి - 50వ.అధ్యాయము

   
  
08.08.2013 గురువారము
ఓం సాయి శ్రీసాయి జయజయ సాయి

సాయి బంధువులకు బాబావారి శుభాశీస్సులు

పుణ్యభూమి శిరిడీలో దొరికిన రత్నమణి సాయి - 50వ.అధ్యాయము

                            విశాఖపట్నము  21.02.92

ప్రియమైన చక్రపాణి,

శ్రీ హేమాద్రిపంతు ఈ అధ్యాయములో ప్రముఖ సాయి భక్తుల చరిత్ర వర్ణించినారు.  శ్రీసాయికి తన భక్తులపై ఉన్న ప్రేమను గుర్తించు.  నీవు కూడా శ్రీసాయి ప్రేమను సంపాదించటానికి కృషి చేయి.  ఈరోజున ఈఉత్తరము నీకు విశాఖపట్నము నుండి వ్రాస్తున్నాను.  కారణము నిన్నటి ఉత్తరములో నీకు వివరించినాను.  నిన్నటిరోజు సాయంత్రము 5 గంటలకు శ్రీగంటి సన్యాసిరావుగారి యింటికి వెళ్ళి అక్కడ మీఅక్క పెండ్లి సంబంధమువారి పెద్ద అబ్బాయి చి.రామకృష్ణతో నిశ్చయము చేసినాను.  




వాళ్ళు కట్నము అడగలేదు.  లాంచనాల లిస్టు యిచ్చినారు.  ఆలిష్టుమీద శ్రీసాయి  అని పేరు వ్రాసియుంది, సంతోషముతో అన్నింటికి అంగీకరించాను.  మరి వివాహము ముహూర్తము ఈరోజున పెట్టించి తెలుపుతాము అన్నారు శ్రీసన్యాసిరావుగారు. శ్రీసాయి దయతో హైద్రాబాద్ లో వివాహము జయప్రదముగా చేయగలనని నమ్మకము ఉంది.  వేచి చూడాలి.  నిన్నటిరోజున విశాఖపట్నము రాకముందు మన బంధువులలో కొందరిపై కోపము యుండేది.  ఈరోజు ఉదయము శ్రీసాయి హారతి చదవటానికి ముందు శ్రీసాయి ఒక అజ్ఞాతవ్యక్తి రూపములో దర్శనము యిచ్చి తను ప్రేమదాసునని చెప్పి నన్ను నిద్రనుండి మేల్కొల్పినారు.  ఈరోజునుండి ఎవరిమీదను కోపగించుకోరాదని నిర్ణయించినాను.  ఈ నానిర్ణయానికి చేయూత యివ్వవలసినది శ్రీసాయినాధుడే.  ఈరోజు ఉదయము శ్రీసాయి సత్ చరిత్ర నిత్యపారాయణకు ముందు నీమేనత్త (నా అక్కగారు) నాతండ్రి 40 సంవత్సరముల క్రితము పూజచేసుకొన్న శ్రీసాయి పటము యిచ్చినది. 

ఆపటము ఒక ఆకుపచ్చని రంగు బట్టలో చుట్టబడియుంది.  ఆ ఆకుపచ్చని రంగు శ్రీసాయినాధునికి చాలా ప్రీతికరము అయి ఉండవచ్చును.  సుమారు 35 సంవత్సరాలు శ్రీసాయి ఆపటము రూపములో ఆ ఆకుపచ్చని రంగు వస్త్రము ధరించినారు.  ఆపటము చూసిన తర్వాత ఆపటములో స్వర్గస్థులైన నాతండ్రిని చూడగలిగినాను.  ఆపటమును టేబుల్ మీద పెట్టుకొని 50వ.అధ్యాయము నిత్యపారాయణ చేయసాగాను.  అందులో వివరించబడిన సంఘటన నాలో చాలా ఆశ్చర్యమును కలిగించినది.  "శిరిడీకి పోయి ఎవరినైతే దర్శించవలెనని నిశ్చయించుకొనెనో, వారే పటము రూపములో నచట తన్ను ఆశీర్వదించుటకు సిధ్ధముగానున్నట్లు తెలసి యాతడు మిక్కిలి ఆశ్చర్యపడెను".  నేను విశాఖపట్నములో యున్నాను.  శ్రీసాయి పటము రూపములో అక్కడకు వచ్చి నన్ను ఆశీర్వదించినారు అని నమ్ముతాను.  శ్రీసాయి సత్ చరిత్రలో  శ్రీసాయి చక్కని సందేశము యిచ్చినారు "మంచి గాని చెడుగాని చేయుటకు నీవు కర్తవని అనుకొనరాదు.  గర్వాహంకార రహితుడువయి ఉండుము.  అపుడే నీపరచింతన అభివృధ్ధి పొందును.  బాలారాం ధురంధర్ మరాఠీ భాషలో తుకారాం జీవితము వ్రాసెను. నాజీవితములో శ్రీసాయి సత్ చరిత్ర ప్రభావమును నీకు ఉత్తరాల రూపములో వ్రాసినాను.  ఈఉత్తరాలు యువతరానికి ఉపయోగపడితే తెలుగు, యింగ్లీషు భాషలలో ముద్రించి శ్రీసాయి తత్వప్రచారానికి సహాయము చేయి.

శ్రీసాయి సేవలో

నీతండ్రి

(సర్వం శ్రీసాయినాధార్పణమస్తు)  


No comments:

Post a Comment