31.08.2015 సోమవారం
సాయిబంధువులకు బాబావారి శుభాశీస్సులు
సరిగ్గా నెల రోజుల తరువాత మన బ్లాగులో ప్రచురణకి అవకాశం ఏర్పడింది. ఈ మధ్య కాలంలో బాబావారికి సంబంధించిన పుస్తకం ఒకటి ప్రచురించే పనిలో ఉండటం వల్ల సాధ్యపడలేదు. అంతా బాబా వారి కార్యమే కాబట్టి ఆలశ్యమయినందుకు మన్నించాలి.
ఆర్థర్ ఆస్ బోర్న్ గారు సాయిబాబా వారిపై " THE INCREDIBLE SAIBABA" అనే పుస్తకాన్ని రచించారు. ఆ పుస్తకాన్ని సాయిబానిస రావాడ గోపాలరావుగారు తెలుగులోకి అనువాదం చేశారు. నేటినుండి ఆయన అనువాదం చేసిన పుస్తకంలో నాకు నచ్చిన మధురమైన ఘట్టాలని మీముందుంచుతాను.
ఓం సాయిరాం
ఆర్థర్ ఆస్ బోర్న్ - THE INCREDIBLE SAIBABA
శ్రీసాయిరామచరిత్ర - తెలుగు అనువాదం : సాయిబానిస రావాడ గోపాలరావు
సంకలనం : ఆత్రేయపురపు త్యాగరాజు - నిజాంపేట్, హైదరాబాద్
శ్రీసాయిరామచరిత్ర
శ్రీసాయిభక్తులకు నమస్కారములు:
శ్రీషిరిడీ సాయిబాబావారి జీవిత చరిత్రను శ్రీసాయి ఆశీర్వచనాలతో శ్రీహేమాద్రిపంత్ గారు 1930వ.సంవత్సరంలో పూర్తి చేశారు. ఈనాడు కోటానుకోట్ల మంది సాయి భక్తులు ఈగ్రంధమును అనేక భాషలలో శ్రీసాయిబాబా జీవితచరిత్రగా అనువాదము చేసుకొని నిత్యపారాయణ గ్రంధముగా స్వీకరించి, తమ జన్మ సార్ధకము చేసుకొనుచున్నారు. 1930వ.సంవత్సరము తరువాత అనేకమంది రచయితలు శ్రీసాయిబాబా జీవితచరిత్రను అనేక భాషలలో తమ స్వంత ఆలోచనలను మేళవించి వ్రాసారు. నేను అనేకమంది రచయితలు శ్రీసాయిబాబాగారిపై వ్రాసిన పుస్తకాలను చదివాను వాటన్నిటిలో నామనసుకు హత్తుకుపోయిన పుస్తకము ఆర్థర్ ఆస్ బోర్న్ గారు ఆంగ్లభాషలో వ్రాసిన 'THE INCREDIBLE SAIBABA' అనే పుస్తకము. ఆంగ్ల పరిజ్ఞానము కలవారు ఆపుస్తకమును చదవమని కోరుతున్నాను. తెలుగుభాషకే పరిమితమయిన సాయిభక్తులకు ఉపయోగపడే విధముగా ఆర్ధర్ ఆస్ బోర్న్ గారు వ్రాసిన పుస్తకముపై నా ఆలోచనలు, విశ్లేషణలు మీకు అందచేస్తున్నాను. స్వర్గవాసియైన శ్రీఆర్ధర్ ఆస్ బోర్న్ గారి ఆత్మకు శాంతికలగాలని శ్రీసాయినాధులవారిని ప్రార్ధించుచున్నాను. ప్రతిసాయిభక్తుడు ఈ పుస్తకమును కొని చదవాలి.
శ్రీసాయి సేవలో
సాయిబానిస
శ్రీసాయిరామచరిత్ర - 1
శ్రీసాయి గురించి పరిచయము
ఈ అధ్యాయములో బాబాగారిని శ్రీఆస్ బోర్న్ గారు చక్కగా పరిచయం చేశారు. కాని, బాబా మొట్టమొదటిసారిగా షిరిడీకి తన 16వ.యేట క్రీ.శ.1872 లో వచ్చినారు అని వ్రాశారు. శ్రీహేమాద్రిపంత్ గారు వ్రాసిన శ్రీసాయిబాబా జీవిత చరిత్రలో బాబా 16 ఏండ్ల బాలునిగా 1854 సం.లో అని తెలపబడింది. నేను శ్రీహేమాద్రిపంత్ గారు వ్రాసిన ఈవిషయాన్ని అంగీకరిస్తున్నాను. ఇక బాబా షిరిడీలోని వేప చెట్టుక్రింద ఉన్న భూగృహము విషయంలో ఆర్ధర్ ఆస్ బోర్న్ గారు చక్కటి వివరణ యిచ్చారు. "అది శ్రీసాయిబాబాగారి వెనకటి జన్మలోని గురువుగారు ఆభూగృహములో తపస్సు చేసినారు" అనే విషయము.
బాబా గారు ధులియా కోర్టులో తన గురువు శ్రీవెంకుసా అని చెప్పారు. బాబాగారు ఈభూమిపై 1838 సం.లో జన్మించి యుంటారు అని అనేకమంది భక్తుల అభిప్రాయము. నేనుకూడా ఈ అభిప్రాయాన్ని అంగీకరిస్తాను. మరి యింతవరకు శ్రీవెంకూసాగారి మీద అనేకమంది వివరాలు ప్రచురించారు. కాని, ఎవ్వరూ శ్రీవెంకూసాగారు మహాసమాధి చెందిన సంవత్సరము తెలపలేకపోతున్నారు. ఈ విషయముపై శ్రీసాయి భక్తులు ఆలోచించాలి.
ఇక బాబాగారు భగవద్గీతలోని శ్లోకానికి అర్ధము చెప్పిన విధానం ఆర్ధర్ ఆస్ బోర్న్ గారు చక్కగా వివరించారు. ప్రతి సాయి భక్తుడు ఈవివరణను అర్ధము చేసుకొని ఆధ్యాత్మికరంగములో గురువు సహాయముతో ముందుకు సాగిపోవాలి.
ఈఅధ్యాయములో శ్రీఆస్ బోర్న్ తనకు శ్రీరమణమహర్షితో ఉన్న అనుభవాలను యింకా శ్రీసాయిబాబాగారి జీవితములో జరిగిన సంఘటనలతో క్రోడికరించటము సాయిభక్తులకు సంతోషాన్ని కలిగించుతుంది. ఇక ధులియా కోర్టులో న్యాయాధికారికి - శ్రీసాయిబాబాగారికి జరిగిన సంభాషణలు మనకళ్ళకు కట్టినట్లుగా యున్నాయి. ఇక మనము ఆర్ధర్ ఆస్ బోర్న్ గారి సాయిరామ చరిత్ర లోని కొన్ని ముఖ్య ఘట్టాలని చదవడం ప్రారంభిద్దాం.
శ్రీసాయిబాబావారి పేరు ప్రఖ్యాతులు 1900 తరువాతనే విస్తరించటం మొదలయింది. మద్రాసువంటి పట్టణ బజారులో మీరు కాలినడకన నడిస్తే మీరు చూసేది ప్రతి దుకాణములోను శ్రీసాయిబాబా పటము ముందు వెలుగుతున్న అగరువత్తుల వేదికలు. బహుశ భారతదేశములో ఏయితర యోగీశ్వరులకు లేని అంతమంది భక్తులు శ్రీసాయిబాబాకు ఉండి శ్రీసాయితత్వము విరివిగా ప్రచారములో ఉంది. (ఈవిషయ ప్రస్తావనలో మనము భగవంతుని అవతారాలు అయిన రాముడు, కృష్ణుడిని ప్రస్తావించరాదు. వీరు యోగీశ్వరులు కారు. వారు భగవంతుని అవతారాలు) భారత దేశంలో ఇంత ప్రచారము ఉన్నా, నా ఉద్దేశములో భారతదేశము బయట ఈ యోగీశ్వరుని గురించి ఎవరికి తెలియదు. నాకు తెలిసినంతవరకు పాశ్చాత్య దేశాలలో ఎవరూ సాయిబాబా గురించి పాశ్చాత్య భాషలో పుస్తకాలు ప్రచురించలేదు.
ఎందుకు ఆభేదము? శ్రీసాయిబాబా ఈనవయుగములోని యోగులువంటివారు కాదనా? ఆయన అధునాతన జీవితము గడపటములేదనా? ఆయన మాయలు మంత్రాలు ప్రదర్శించటములేదనా? ఆయన ఆధ్యాత్మిక ప్రసంగాలు చేయటములేదనా? ఏమిటి మరి? ఆయన తత్వముపై మేధావులు అవును కాదు అనే చర్చలు జరపటములేదనా? ఇవి అన్నీ శ్రీసాయిబాబావంటి యోగీశ్వరుల విషయములో అవసరము లేదు.
మహాత్ములు, యోగీశ్వరులపై చర్చలు జరపటము మన అవివేకము. వారిలోని జ్ఞానమును మనము గ్రహించగలితే చాలు. మనం ఒక పర్వత శిఖరాన్ని దాని పునాదినుండి వేరు వేరు దృక్పధాలులో చూస్తాము. అందరూ ఆఖరికి పర్వత శిఖరము గురించే ఆలోచిస్తారు.
శ్రీసాయిబాబా ఏనాడు గ్రంధాలు రచించలేదు. ఆయన ప్రవర్తన ఊహించలేనిది. ఆయన తన మహిమలను గొప్పలకు పోని విధముగా ఒకచిన్న పిల్లవాడు చేసినట్లుగా చేసి దానిపై ఎక్కువ ప్రచారము చేసేవారు కాదు. వారు ఏనాడు పుస్తకాలు చదవలేదు. పుస్తకాలు రచించలేదు. కాని కొన్ని సందర్భాలలో వారు తన భక్తులను ముఖ్యమైన మత గ్రంధములను చదవమనేవారు. అటువంటి సందర్భాలు చాల అరుదు. వారు బ్రహ్మ గురించి మాట్లాడుతు ఇలా అనేవారు "బ్రహ్మ గురించి పుస్తకాలు చదివి తెలిసికోగలను అనుకోవటము ఒక భ్రమ".
శ్రీరామకృష్ణపరమహంస ఆధ్యాత్మిక రంగములో ఏపుస్తకాలు చదవలేదు. భగవాన్ రమణమహర్షి మహా జ్ఞాని.
అనేక సంవత్సరాలపాటు శ్రీసాయి చదువురాని ఫకీరుగానే గుర్తించబడినారు. వారు ఏనాడు చదువుకోలేదు. అటువంటివారికి సంస్కృతభాషాపరిజ్ఞానం ఏమి ఉంటుంది అనే భావన చాలామంది భక్తుల మనసులో ఉండేది. ఒకనాడు శ్రీసాయిబాబా తన భక్తులకు సంస్కృతములోని శ్లోకానికి తేట తెల్లమైన భావముతో చక్కని వివరణతో అనువదించి తెలియ చేసి అందరిని ఆశ్చర్యపరచారు.
భగవత్ జ్ఞానమును యధావిధిగా యధార్ధముగా గుర్తించాలి గాని అది చెబితే వచ్చే జ్ఞానము కాదు. సాష్ఠాంగ నమస్కారము, పాదసేవ చేయుట, ప్రశ్నించుట, అనేవి గురువుయొక్క కరుణను పొందటానికి ఉపయోగపడే సాధనాలు.
అజ్ఞానము చావుపుట్టుకలకు విత్తనమువంటిది. గురువుయొక్క కటాక్షము అనే మందు కంటిలో వేసుకో. మాయ అనె కంటిలోనిపొర తొలగిపోతుంది. అపుడు జ్ఞానము నీలో మిగిలిపోతుంది. జ్ఞానము అనేది ఎక్కడినుండో పొందవలసిన అవసరము లేదు. అది శాశ్వతమైనది. అది నీలో దాగియున్నది. ఇంకొకవిధముగా చెప్పాలంటే అజ్ఞానమునకు ఒక కారణము ఉంటుంది. దానికి ఒక అంతము ఉంటుంది. వీటి అంతటికి మూలకారణము భక్తుడు వేరు భగవంతుడు వేరు అనే ఆలోచనె. ఇటువంటి ఆలోచనను నీనుండి తీసివేయి. అదే జ్ఞానము.
(రేపు మరికొన్ని ఘట్టాలు)
(సర్వం శ్రీసాయినాధార్పణమస్తు)
No comments:
Post a Comment