ధనసంపాదన - సాయిబానిస ఆలోచనలు
ఈ రోజునుండి ప్రాపంచిక రంగములో ధన సంపాదనపై సాయి బానిస శ్రీరావాడ గోపాలరావు గారి ఆలోచనలు తేదీల వారీగా ప్రచురిస్తున్నాను. ఇవి చదివి మీ అభిప్రాయాలను నా మెయిల్ కి తెలపవసిందిగా కోరుతున్నాను.
-----త్యాగరాజు - tyagaraju.a@gmail.com
9440375411
21.01.1999
1. ఇతరుల సిరిసంపదలను చూసి నీవు నీజీవితాన్ని కష్టాలపాలు చేయకు. నీకు ఉన్న సగము రొట్టి తిని జీవించు.
2. తల్లిదండ్రులు, పిల్లలు, వారిమధ్యన ధన సంపాదన వ్యవహారాలు గత జన్మలోని ఋణానుబంధం వలన కలుగుతూ ఉంటాయి. నీవు నీ పిల్లలకు ఆస్తినిచ్చిన, లేదా నీ కుమారుడు నీకు పది రూపాయలు యిచ్చినా, అవి గత జన్మలోని ఋణానుబంధ మహత్మ్యమే.
3. నేడు సాయిభక్తిని వ్యాపారసరళిలో అమ్ముతున్నారు. అటువంటివారినుండి దూరంగా ఉండు.
25.02.1999
4. జీవితంలో బంగారాన్ని సంపాదించడం తప్పుకాదు. ఆ సంపాదన పేరిట బంగారంలాంటి జీవితాన్ని నాశనం చేసుకోవద్దు.
24.03.1999
5. సాయిపేరిట నీవు ఎవరినుండీ ధనాన్ని యాచించకు. ఎవరయినా సాయి తత్వప్రచారానికి ధనమిచ్చిన దానిని సాయితత్వ ప్రచారానికే వినియోగించు.
30.06.2000
6. మానవత్వాన్ని మంటకలిపి ధన సంపాదన చేసేవారికంటే మానవత్వాన్ని ప్రబోధించే భగవంతుని ప్రతినిధులు (భగవంతునిపై నమ్మకము కలవారు) నాకు ప్రీతిపాత్రులు.
30.07.2000
7. విద్యాదానం చేసే గురువు తన అర్హత ప్రకారము తన జీవితానికి కావలసిన ధనసంపాదన కావించుకోవాలి. అంతేకాని, తన శిష్యులు తనకంటె ఉన్నత చదువులు చదివి, తనకంటె ఎక్కువ ధనసంపాదన కావిస్తున్నారే అనే భావన రానీయకూడదు.
30.01.2000
8. గుళ్ళు,గోపురాలకు నీవు ఎంత చందా యిచ్చావు అన్నది ముఖ్యం కాదు. భగవంతుని పేరిట ఎంతమంది అన్నార్తులకు భోజనం పెట్టావు మరియు భగవంతుని ఆశీర్వచనాలను పొందగలుగుతున్నావు అనేదే ముఖ్యము.
22.03.2002
9. కొందరు మజ్జిగమెతుకులు తినడానికి కూడా నోచుకోలేదు. అదే కొందరు పెరుగన్నం కావాలని కోరుతూ యితరుల గురించి ఆలోచించకుండా పెరుగంతా తామే తినాలని తలచేవారిని ఏమనాలో ఒక్కసారి ఆలోచించు.
24.07.2002
10 నీకు ఉన్న కండబలంతో సమాజములో విఱ్ఱవీగేకన్నా నీకు ఉన్న అర్ధబలంతో సమాజంలోని అన్నార్తులకు అన్నదానం చేయటం మిన్న.
(మరికొన్ని ఆలోచనలు రేపటి సంచికలో)
(సర్వం శ్రీసాయినాధార్పణమస్తు)