Thursday 8 November 2012

శ్రీకృష్ణునిగా శ్రీసాయి - 6వ. భాగము


08.11.2012 గురువారము
ఓంసాయి శ్రీసాయి జయజయ సాయి
సాయి బంధువులకు బాబావారి శుభాశీస్సులు 


                                                     

సాయి.బా.ని.స. చెప్పిన శ్రీకృష్ణునిగా శ్రీసాయి



శ్రీకృష్ణునిగా శ్రీసాయి - 6వ. భాగము

ప్రహ్లాదునికి తన తండ్రి హిరణ్యకశిపుని దుష్ప్రవర్తన చాలా క్షోభ కలిగించింది.  మీరు త్రిలోకాలను జయించారు గాని, మీలో ఉన్న అరిష్డ్వర్గాలను జయించలేకపోయారని తండ్రితో అంటు ఉండేవాడు ప్రహ్లాదుడు. 



నువ్వు వాటిని జయించు నేను నీకు దాసోహమంటాను అన్నాడు.

ఎవరిని జయించాలి అన్నాడు హిరణ్యకశపుడు.  

కామ, క్రోధ, లోభ, మోహ,మద,మాత్సర్యాలు, నీలో ఉన్న ఈ అరిషడ్వర్గాలను  జయించమని తన తండ్రికి సలహా ఇచ్చాడు. 

సాయి సత్చరిత్రలో  ఆత్మారాం తార్ఖడ్ భార్యకు బాబా ఇదే విధమైన సలహా ఇచ్చారు. తార్ఖడ్ బొంబాయిలోని ఖటావూ మిల్స్ కు జనరల్ మానేజర్. ఆమె బాబావద్ద శెలవు తీసుకొని వెళ్ళబోయేముందు ఆమెలో ఇంకా అహంకారం మిగిలి ఉంది. బాబా ఆమెను ఆరురూపాయలు దక్షిణ కోరారు. వారు షిరిడీనుంచి బొంబాయికి తిరుగు ప్రయాణములో ఉన్నందున వారి వద్ద అంత డబ్బులేదు. 

బాబా దక్షిణ అడగడంలోని ఆంతర్యం ఆత్మారాం తార్ఖడ్ ఆమెకు వివరించాడు. అరిషడ్వర్గాలనే దుష్ట శత్రువులను తిరుగు ప్రయాణంలో తన పాదాలవద్ద పెట్టి ఆశీస్సులు పొందమని బాబా ఉద్దేశ్యమని తార్ఖడ్ చెప్పారు. ఆమె తార్ఖడ్ చెప్పినట్లే చేసినతరువాత బాబా చిరునవ్వుతో ఆమెను ఆశీర్వదించారు. ఆవిధంగా భాగవతంలో చెప్పబడినదానికి, బాబా తన భక్తులకు చెప్పినదానికి గల పోలికలను గమనించగలము.   

భాగవతంలో గజేంద్రుడు శ్రీమహావిష్ణువుకు అత్యంత ప్రియతమ భక్తుడు. గజేంద్రుని కాలు మొసలి పట్టుకున్నపుడు 1000 సంవత్సరాలు దానితో పోరాడి ఇక శక్తి సన్నగిల్లి, తనను రక్షించమని శ్రీమహావిష్ణువుకు మొఱ పెట్టుకున్నాడు. శ్రీమహావిష్ణువు వెంటనే వచ్చి గజేంద్రుని రక్షించాడు. 

శ్రీసాయి సత్ చరిత్రలో కూడా మనకు ఇటువంటిదే కనపడుతుంది. అవి 1914 వ. సంవత్సరములో మొదటిప్రపంచపు యుధ్ధం జరుగుతున్న రోజులు.  బ్రిటిష్ వారి యుధ్ధ నౌకలో భారతదేశానికి చెందిన జెహీంగర్వాలా కాప్టెన్ గా  ఉన్నారు. 


రష్యా దేశపు దగ్గరలో ఉన్న సముద్రంలో యుధ్ధం జరుగుతోంది. శత్రువుల సబ్ మెరైన్  నించి ప్రయోగించిన టార్పెడొ యుధ్ధ నౌకని ఢీకొంది. మునిగిపోతున్న నౌకలోని నావికులందరూ ప్రాణభయంతో సముద్రంలోకి దూకారు. ఒక కాప్టెన్ గా తాను ఆవిధంగా చేయకూడదు. అతను బాబా భక్తుడు. అతని జేబులో ఎప్పుడు బాబా ఫొటో ఉంటుంది. ఆప్రమాదాన్నించి రక్షించమని అతడు సాయిని వేడుకొన్నాడు. అదే సమయంలో బాబా చుట్టూ ఉన్న భక్తులంతా బాబా శరీరరం నుండి 2,3 బకెట్ల నీరు పొంగి పొర్లడం చూశారు.  బాబా తన శరీరాన్ని కుదించుకొని, టార్పెడొ ఓడకు చేసిన రంధ్రంలోనికి ప్రవేశించి, ఓడను మునిగిపోకుండా, తన భక్తుడు కాప్టెన్ జెహంగీర్వాలాను అతని ఓడను  రక్షించారు. 


ఆసమయంలో ఈ దృశ్యాన్ని వీక్షించిన  భక్తులు మాత్రమే దీనిని  అర్ధం చేసుకోగలరు. యుధ్ధము ముగిసిన రెండు నెలల తరువాత కాప్టెన్ జెహెంగీర్వాలా  బాబా దర్శనానికి వచ్చి మునిగిపోతున్న నౌకనుండి తనను రక్షించినందుకు కృతజ్ఞతలు చెప్పుకొన్నాడు.  భాగవతంలో శ్రీమహావిష్ణువు గజెంద్రుని రక్షించడం, వేయి మైళ్ళ దూరంలో యుధ్ధంలో పోరాడుతున్న జెహంగీర్వాలాను బాబా రక్షించడం, ఈ రెండిటికి ఎంతటి అద్భుతమైన పోలిక ఉన్నదో  గ్రహించగలరు.

శ్రీసాయి సత్ చరిత్ర 7వ. అధ్యాయములో, ఒక కమ్మరివాని భార్య తన భర్త పిలిచినందున ఒడిలో బిడ్డ ఉన్న సంగతిమరచి హటాత్తుగా లేవగా, ఆమె ఒడిలోని బిడ్డ ప్రమాదవశాత్తూ  కొలిమిలో పడకుండా బాబా ఎట్లు రక్షించారో మనకు తెలుసు. బాబా ద్వారకామాయిలో ధుని ముందు కూర్చొనివుండగా 


బాబా తన చేతిని ధునిలో పెట్టి ఆ బిడ్డను ప్రమాదం నుంచి కాపాడారు.  బాబా చేయి ధునిలోని అగ్నికి కాలింది. శ్రీమహావిష్ణువు తన భక్తులను ఏవిధముగానైతే రక్షించారో అదే విధంగా బాబా కూడా తన భక్తులను ప్రమాదాల బారిన పడకుండా రక్షించారు. ఈ విధంగా మనకు ఎన్నో పోలికలు  భాగవతంలోను, శ్రీ సాయి సత్చరిత్రలోను కనపడతాయి


(యింకా ఉన్నాయి)
సర్వం శ్రీసాయినాధార్పణమస్తు

No comments:

Post a Comment