Monday, 10 December 2012

జన్మ పునర్జన్మలపై సాయి ఆలోచనలు - 6

ఈ రోజు సాయి బా ని స చెపుతున్న జన్మ, పునర్జన్మలపై సాయి ఆలోచనలు వినండి. 





                                                 

జన్మ పునర్జన్మలపై సాయి ఆలోచనలు - 6 


1989 వ.సంవత్సరంలో నేను సాయిమార్గంలోకి ప్రవేశించాను.  అప్పటినుండి క్రమం తప్పకుండా శ్రీసాయి సత్ చరిత్ర పారాయణ చేయసాగాను.  ఒక రోజు రాత్రి నా తరువాత జన్మ ఎట్లా సంభవిస్తుందో ఒక సూచన చేయమని బాబాని ప్రార్ధించాను.  

నాకు స్వప్నంలో కనిపించిన విషయాలు చాలా ఆసక్తికరంగా ఉన్నాయి. వాటిని నేను మీకు వివరిస్తాను. ఆత్మ శరీరాన్ని వదలి వెళ్ళిన రోజు భౌతిక శరీరానికి మరణం. ఆత్మ మరొక శరీరంలోనికి ప్రవేశించడమంటే తిరిగి పుట్టుట, అదే పునర్జన్మ. 

కలలో నాకు దృశ్యరూపంలో ఈ విధంగా కనిపించింది.  నాయొక్క ఆత్మ  సద్గురుని చేయి పట్టుకొని అరణ్యాన్ని దాటి, ఒక నదిని, తరువాత ఒక పర్వత శిఖరం మీదకు చేరుకోంది. పర్వత శిఖరాగ్రం మీద ఒక కోట దాని మీద నాలుగు బురుజులు వున్నాయి.  


మన సాంప్రదాయ ప్రకారం, మరణించిన పదవ రోజున గోదానం చేస్తాము.  దాని వల్ల ఆత్మ వైతరిణి నదిని ఎటువంటి కష్టములు లేకుండా దాటుతుంది. గోవుయొక్క తోకను పట్టుకొని ఆత్మ వైతరిణీ నదిని ఈదుతుందని ఒక నమ్మకం. 

నదిని దాటిన తరువాత, ఆత్మ నాలుగు బురుజులతో  ఉన్న కోటను చేరుకుంది. కోట మానవ జీవితానికి ప్రతీక. నాలుగు బురుజులు ధర్మ, అర్ధ, కామ, మోక్షాలకు గుర్తులు. మానవుడు తన ప్రయత్నంతో మొదటి మూడింటిని సాధించగలడు. కాని నాలుగవదియైన మోక్షం సద్గురువుయొక్క అనుగ్రహంతోనే లభిస్తుంది. ఆత్మ సద్గురువు యొక్క చేయి పట్టుకొని నాలుగవది అత్యంత ఉన్నతమైన బురుజుకు  చేరుకుంది. సద్గురువు అక్కడ ఆగి, నా ఆత్మతో  ఇలా అన్నారు 

"ఈ ప్రదేశాన్ని దాటి నేను నీతోముందుకు రాలేను. నా నామాన్ని స్మరిస్తూ భగవంతుని యొక్క చరణ కమలాల వద్దకు చేరుకో. 


కాని ఒక్కటి మాత్రం గుర్తుంచుకో. ఆ సమయంలో  క్రిందకు మాత్రం చూడవద్దు."  ఇక్కడ నేను మీకు మన పురాణాలలో ఏమని చెప్పబడిందో గుర్తు చేస్తాను. "భగవంతుని నామాన్ని గాని, భగవత్ స్వరూపుడయిన సద్గురువు యొక్క నామాన్ని గాని స్మరిస్తున్నట్లయితే ఈ కష్టాల కడలిని దాటగలము."

నా ఆత్మ గురువు చెప్పిన సలహాననుసరించి ఆకాశంలో ముందుకు ప్రయాణం కొనసాగించింది. కాని భూమి వైపు చూడాలనే ఉత్సుకత గురువు చెప్పిన సలహాను పెడచెవిని  పెట్టి క్రిందకు చూడగానే ఆత్మ ఆకాశం నుండి చాలా వేగంగా భూమి మీదకు పడి 


మరొక స్త్రీ గర్భంలోకి తిరిగి ప్రవేశించింది. ఆత్మ సద్గురువు చెప్పిన మాటలను అమలుచేయడంలో విఫలమయి మరొక కొత్త జీవితాన్ని ప్రారంభించింది. ఆత్మకు సంబంధించి అది పునర్జన్మ.  

ఇంతవరకు మనము భగవద్గీత లోను, హేమాడ్ పంత్ వ్రాసిన శ్రీ సాయి సత్చరిత్రలోను, ఇంకా ఆర్ధర్ ఓస్బోర్న్ వ్రాసిన 'ద ఇంక్రిడిబుల్ సాయి'  అనే పుస్తకాలలోను జన్మ పునర్జన్మ లపై అంతర్గతంగా ఉన్నటువంటి అంశాలను అర్ధం చేసుకొన్నాము.   


(ఇంకా ఉంది)
సర్వం శ్రీసాయినాధార్పణమస్తు 

Also follow www.telugublogofshirdisai.blogspot.com and subscribe it to know the postings 

No comments:

Post a Comment