23.07.2014 బుధవారము
ఓంసాయి శ్రీసాయి జయజయసాయి
సాయిబంధువులకు బాబావారి శుభాశీస్సులు
ఈ రోజునుండి సాయి బా ని స శ్రీసాయి సత్ చరిత్ర మీద పరిశోధనా వ్యాసాన్ని అందిస్తున్నాను. శ్రీసాయి సత్ చరిత్ర మీద ఇంతగా పరిశోధన చేసినవారు బహుశ ఇంతవరకు ఎవరూ లేరనే చెప్పవచ్చు. సాయి బంధువులందరూ ఈ పరిశోధనా వ్యాసాన్ని బాగా చదివి, తరువాత శ్రీ సాయి సత్ చరిత్రను కూడా చదవవలసినదిగా కోరుతున్నాను. ఈ వ్యాసాన్ని చదివిన తరువాత మీకు కలిగే సందేహాలను మొహమాటం లేకుండా కామెంట్స్ లో వ్రాయండి. లేకపోతే నా మైల్ ఐ.డీ.కి గాని పంపించవచ్చు. tyagaraju.a@gmail.com మీ సందేహాలను సాయి బా ని స గారు నివృత్తి చేస్తారు.
శ్రీసాయి సత్ చరిత్ర - తత్వం - అంతరార్ధం . 1 వ.భాగం
మూలం : సాయి.బా.ని.స. శ్రీరావాడ గోపాలరావు
తెలుగు అనువాదం: ఆత్రేయపురపు త్యాగరాజు
ఓం శ్రీసాయిరాం
ఓం శ్రీ గణేశాయనమః ఓం శ్రీ సరస్వత్యైనమః ఓం శ్రీ సమర్ధ సద్గురు సాయినాధాయనమః
శ్రీసాయి సత్ చరిత్ర 11,15 అధ్యాయాలలో బాబా స్వయంగా చెప్పిన మాటలు "నేను నా భక్తులకు బానిసను నేనందరి హృదయాలలోను నివసించువాడను"
ఈ విషయం గురించి వివరించేముందు సాయి బానిసగా మీ అందరికీ నా వినయపూర్వకమయిన ప్రణామములు సమర్పించుకొంటున్నాను. ఈనాటి నా ఉపన్యాసంలో నేను హేమాడ్ పంత్ వ్రాసిన శ్రీసాయి సత్ చరిత్ర, ఆర్ధర్ ఆస్ బోర్న్ వ్రాసిన 'ది యింక్రెడబుల్ సాయిబాబా' ఈ పుస్తకాలలోని కొన్ని ముఖ్యమయిన విషయాలను ఎన్నుకొన్నాను. వాటిపై నా అభిప్రాయాలను తెలియచేస్తాను.
బాబా తత్వం వాటిలోని అంతరార్ధాలను అర్ధం చేసుకోవడానికి నేను చేసిన ప్రయత్న ఫలితాలే ఈనాటి నా ఉపన్యాస కార్యక్రమం. ప్రారంభించేముందుగా నేను చెప్పదలచుకొనేది ఏమిటనగా యివి పూర్తిగా నాస్వంత అభిప్రాయాలు, నేను అర్ధం చేసుకొన్నవి.
హేమాడ్ పంత్ వ్రాసిన శ్రీసాయి సత్ చరిత్ర 25వ.అధ్యాయంలో బాబా "పదకొండు వాగ్దానాలనిచ్చారు. వానిలో ఒకటి "నాసమాధినుండే నాఎముకలు మాటలాడును. మీక్షేమమును కనుగొనుచుండును" అని బాబా వాగ్దానం చేశారు. ఇది ఏవిధంగా సాధ్యం? ఈవాగ్దానానికి సంబంధించిన భావం ఏమిటి?
బాబా చెప్పిన ఈమాటలను నేను బాగా పరిశోధించి నా అభిప్రాయాన్ని మీముందుంచుతున్నాను.
మొట్టమొదటగా మహాబారతం, మరియు పురాణాలలోను ఎముకలకు యిచ్చిన ప్రాధాన్యత వాటిని ఉపయోగించిన విధానం (అవి పోషించిన పాత్ర లను) ఒక్కసారి గుర్తుకు తెచ్చుకోమని కోరుతున్నాను.
దేవదానవులకు జరిగిన యుధ్ధంలో రాక్షసులను సం హరించడానికి ఇంద్రుడు మహర్షి దధీచి వెన్నెముకను వజ్రాయుధంగా ఉపయోగించాడు.
మహాభారతంలో కౌరవుల మేనమామ శకుని ధర్మరాజుని జూదానికి ఆహ్వానించమని దుర్యోధనుని ప్రేరేపించాడు. శకుని చనిపోయిన తన తండ్రి ప్రక్కటెముకలను మాయాపాచికలుగా ఉపయోగించాడు. ఆమాయా జూదంలో దుర్యోధనుడు ధర్మరాజుని ఓడించాడు. ఆవిధంగా మహాభారత యుధ్ధారంభానికి శకుని మూలకారణమయ్యాడు.
అయితే శకుని దుష్టపు ఆలోచనతో కౌరవులు నాశనమయ్యారు.
పైన చెప్పిన రెండు ఉదాహరణలలో శ్రేష్టులయొక్క ఎముకలను ప్రజల సంక్షేమం కోసం, ప్రయోజనం కోసం ఉపయోగించారు.
మనం మరికాస్త ముందుకు వెళ్ళి వైద్యశాస్త్రపరంగా ఎముకలను గూర్చి ప్రాధమిక విషయాలను అర్ధం చేసుకొందాము.
ఎముకలలో కాల్షియం, భాస్వరం ఉంటాయి. చితిమంటల వేడిమికి ఎముకలు బూడిదగా మారతాయి.
శాస్త్రజ్ఞులు చెప్పినదాని ప్రకారం శవపేటికలో శరీరాన్ని భూమిలో పాతిపెట్టినపుడు, సాధారణ ఉష్ణోగ్రత వద్ద ఎముకలు బూడిదవటానికి సుమారు 600 సంవత్సరాలు పడుతుంది. శాస్త్రీయ పరిభాషలో ఎముకలు బూడిదగా మారే ప్రక్రియను బయో డిజనరేషన్ (జీవ అధోకరణం) అంటారు. ఆతరువాత బూడిద పొడి ఒక నూతన శక్తికి మూల కారణమవుతుంది. కారణం ఏమిటంటే ఒక శక్తిని మనం సృష్టించలేము, నాశనం చేయలేము. కాని, రూపంలో మార్పు వస్తుంది. శక్తి సృష్టింపబడలేదని నాశనం చేయబడలేదనే విషయం మనకు తెలుసున్నదే.
షిర్దిసాయి విజయదశమి పర్వదినాన 15 అక్టోబరు 1918 లో మహాసమాధి చెందారు. కాని, ఆయనను అక్టోబరు 16వ.తేదీ 1918 లో సమాధి చేశారు. ఆయన శరీరం బూటీవాడలోని భూగృహంలో ఉంచబడింది. అందుచేత నేను చెప్పదలచుకునేదేమిటంటే బాబా శరీరావశేషాలకు సంబంధించిన శక్తి 600 సంవత్సరాల తరువాతనే మార్పులకు లోనవుతుంది. భక్తులందరూ కూడా నేను చెప్పిన సిధ్ధాంతంతో ఏకీభవిస్తే ఈ విషయంలో నేను సఫలీదృతడయినట్లే భావిస్తాను. షిర్దీ సాయి మీద మీకున్న నమ్మకం యింకా పెంపొందుతుంది.
ఇప్పుడు బాబా ధులియా కోర్టులో ఏమని చెప్పారో ఒక్కసారి గుర్తుకు తెచ్చుకొందాము.
"నన్ను సాయిబాబా అని పిలుస్తారు. నాతండ్రి పేరు కూడా సాయిబాబాయే. నావయస్సు లక్షల సంవత్సరాలు. నాది భగవంతుని కులం, నామతం కబీరు మతం."
శ్రీసాయి సత్ చరిత్ర 28వ. అధ్యాయంలో బాబా మేఘుడితో అన్న మాటలను ఒక్కసారి గుర్తుకు తెచ్చుకొందాము.
"నాకు రూపంలేదు, అస్తిత్వము లేదు. నేను సర్వాంతర్యామిని."
శ్రీసాయి సత్ చరిత్ర 14వ.అధ్యాయములో బాబా తార్ఖడ్ భార్య వద్దనుండి ఆరు రూపాయలు దక్షిణ అడిగి, ఆవిధంగా పరోక్షంగా ఆమెనుండి అరిషద్వర్గాలను సమర్పించమని అడిగారు.
శ్రీసాయి సత్ చరిత్ర 18వ.అధ్యాయంలో బాబా శ్యామానుండి దక్షిణగా పదిహేను రూపాయలకు బదులుగా పదిహేను నమస్కారాలను స్వీకరించారు. 34వ.అధ్యాయంలో బాబా లక్ష్మీబాయి షిండేకి తొమ్మిది రూపాయలనిచ్చి నవవిధ భక్తుల అంతరార్ధాన్ని బోధించారు.
(సర్వం శ్రీసాయినాధార్పణమస్తు)
No comments:
Post a Comment