30.07.2014 బుధవారం (విజయవాడనుండి)
ఓం సాయి శ్రీసాయి జయజయసాయి
సాయి బంధువులకు బాబావారి శుభాశీస్సులు
గత రెండురోజులుగా శ్రీసాయి సత్చరిత్ర తత్వం ప్రచురించడానికి సాధ్యపడలేదు. కొన్ని స్వంతపనులమీద నరసాపురం వెళ్ళిన కారణంగా వీలుపడలేదు. ఈ రోజు నాలుగవ భాగం చదవండి.
శ్రీసాయి సత్ చరిత్ర - తత్వం - అంతరార్ధం - 4వ.భాగం
మూలం : సాయి బా ని స శ్రీరావాడ గోపాలరావు
తెలుగు అనువాదం : ఆత్రేయపురపు త్యాగరాజు
చాంద్ పాటిల్ తన గుఱ్ఱం తప్పిపోయినా మరొక గుఱ్ఱాన్ని కొనుక్కోగలిగిన సమర్ధుడు. అతను తన భుజం మీద గుఱ్ఱపు జీను వేసుకొని తిరుగుతున్నాడు.
జీను అరిషడ్ వర్గాలకు గుర్తు. అందుచేత యిక్కడ గుఱ్ఱమంటే భగవంతుని దయ. 9మైళ్ళ తరువాత అతను బాబాను కలుకొన్నాడు. అనగా దాని అర్ధం నవవిధ భక్తులను ఆచరణలో పెట్టిన తరువాతే అతను బాబాను కలుసుకోగలిగాడు.
మహాభారతంలో శ్రీమహావిష్ణువు అవతారాలలొ 'హయగ్రీవ ' అవతారం ఒకటి. హయగ్రీవుని తల అశ్వం యొక్క తల. అతనెంతో జ్ఞాని.
శ్రీసాయిసత్ చరిత్ర 25వ.అధ్యాయంలో 9గుఱ్ఱపు లద్దెల కధను మనం గమనిద్ద్దాము. బాబా అంకిత భక్తులలో ఒకరయిన దాదా కేల్కర్ అభిప్రాయం ప్రకారం 'గుఱ్ఱమనగా భగవంతుని దయ '9 గుఱ్ఱపు లద్దెలనగా భగవంతుని కృపకై నవవిధ భక్తులు '.
శ్రధ్ధా భక్తులతో నవవిధ భక్తులను ఆచరిస్తే భగవంతుడు తప్పక మనలని అనుగ్రహిస్తాడు. ఆవిధంగా చాంద్ పాటిల్ నవవిధ భక్తులలో ఒకదానిని ఆచరించి బాబావల్ల తప్పిపోయిన గుఱ్ఱమనబడే భగవంతుని దయను పొందాడు.
శ్రీసాయి సత్ చరిత్ర 37వ.అధ్యాయంలో బాబా, తాత్యాతో "నన్ను కనిపెట్టుకొని ఉండు. ఒకవేళ వెళ్ళాలనిపిస్తే రాత్రి యింటికి వెళ్ళు, కాని ఒక్కసారి మాత్రం వచ్చి నన్ను జాగ్రత్తగా గమనించు" అన్నారు. తన భక్తుల యోగక్షేమాలను తానే వహిస్తానన్న బాబా ఒక సామాన్య మానవునిలాగ ఆవిధంగా మాట్లాడటంలో భావమేమిటి?
రాత్రి సమయాలలో బాబా తన భౌతిక శరీరాన్ని విడచి ఏదో ఒక రూపంలో తన భక్తుల రక్షణార్ధమై వారి పిలుపులకు స్పందించి సంచరిస్తూ ఉండేవారు. తన భక్తుల సంక్షేమం కోసం ఆయన భగవంతుడిని ప్రార్ధిస్తూ ఉండేవారు. తన భక్తుల అవసరార్ధమై తాను ధ్యానంలో ఉండి ప్రార్ధన చేసే సమయంలో యితరులు ఎవరూ వచ్చి తన ధ్యానానికి భంగం కలిగించకుండా జాగ్రత్తగా కనిపెట్టుకొని ఉంటూ ఉండమని బాబా తన అంకిత భక్తులకు చేప్పేవారు.
ఒకరోజు రాత్రి ఒక భక్తురాలు నిమోన్ గ్రామంలో చావుబ్రతుకులలో ఉంది. బాబా ఆరోజు రాత్రంతా భగవంతుడిని ప్రార్ధించి ఆమెను కాపాడదామనుకొన్నారు. తాను ధ్యానంలో ఉండగా ఎవరూ వచ్చి భంగం కలిగించకుండా చూస్తూ ఉండమని మహల్సాపతితో చెప్పారు. కాని, ఉదయం 6 గంటలకు కోపర్ గావ్ తహసీల్దారు బంట్రోతు వచ్చి బాబా ధ్యానానికి భంగం కలిగించాడు. మహల్సాపతి వద్దని వారిస్తున్నా వినకుండా ద్వారకామాయి లోకి బలవంతంగా దూసుకొని వెళ్ళాడు. దాని ఫలితంగా నిమోన్ గ్రామంలోని ఆస్త్రీ జబ్బుతో మరణించింది. మహల్సాపతి చేసిన తప్పిదానికి ఆతరువాత బాబా అతనిని మందలించారు.
ఎప్పుడు ధ్యానంలోకి వెళ్ళినా తన థ్యానానికి గాని ప్రార్ధనకు గాని ఎటువంటి ఆటంకం కలుగకుండా బాబా తన నమ్మకస్థులయిన తాత్యా, మహల్సాపతి యిద్దరు భక్తులని కాపలాగా నియమించేవారు.
ఒకోసమయంలో బాబా చిరిగిపోయిన తన కఫనీని కుట్టుకుంటూ ఉండేవారు. తన భక్తుల పేర్లను ఉచ్చరిస్తూ ఆయన తన చేతితో నాణాలను నెమ్మదిగా రుద్దుతూ ఉండేవారు. దీనిలోని అంతరార్ధం ఏమిటి?
(ఇంకా ఉంది)
(సర్వం శ్రీసాయినాధార్పణమస్తు)
No comments:
Post a Comment