Wednesday 16 July 2014

శ్రీసాయి తత్వం - 4వ.ఆఖరి భాగం

  
     
16.07.2014 బుధవారము
ఓం సాయి శ్రీసాయి జయజయసాయి
సాయి బంధువులకు బాబావారి శుభాశీస్సులు

శ్రీసాయి తత్వం - 4వ.ఆఖరి భాగం 

"శతృవులతో పోరాడుతున్నపుడు, స్నేహితులు, బంధువులు నీతో కలిసి పోరాడుతారు.  కాని, మృత్యువుతో పోరాడుతున్నపుడు నీకెవరూ సహాయపడరు".    

ఇదే విషయాన్ని మనం బాబా అంకిత భక్తుడయిన తాత్యా సాహెబ్ నూల్కర్ విషయంలో గమనించవచ్చు.  తాత్యా వ్రణంతో బాధపడుతూ ఉండేవాడు.  ఆసమయంలో అతని భార్యపిల్లలు షిరిడీలో లేరు.  నూల్కర్ చిన్ననాటి స్నేహితుడు బాబా సలహా ప్రకారం సేవ చేయడానికి తాత్యా దగ్గర ఉన్నాడు.    



చివరి దశలో బొంబాయినుండి అతని పెద్ద కుమారుడిని పిలిపించారు.  తాత్యా చనిపోవడానికి ముందు అతనికి బాబా పాద తీర్ధాన్నిచారు.    

"పురిటినొప్పులు పడుతున్న స్త్రీ మరొక జీవిని ఈప్రపంచంలోకి తీసుకురావడానికి ఎంతో ఆతృతగా వేచి చూస్తుంది.  చావుకు దగ్గరగా నున్న వృధ్ధుడు కూడా అలాగే జీవనభ్రమణంలో మరొక శరీరంలో ప్రవేశించడానికి అదే విధంగా బాధననుభవిస్తాడు". 

శ్రీసాయి సత్ చరిత్ర 33వ.అధ్యాయంలో ఈవిషయం గమనించవచ్చు.  జాం నేర్ లో నానా సహెబ్ చందోర్కర్ కుమార్తె మైనతాయి పురిటి నొప్పులతో బాధపడుతున్నపుడు ఆమె బాబాను ప్రార్ధిస్తుంది.  సరైన సమయానికి బాబా ఆమెకు ఊదీని పంపించారు.  ఆమెకు సుఖప్రసవమయేలా అనుగ్రహించారు బాబా.         
బాలారాం మాన్ కర్ యింటి బాధ్యతలన్నిటినీ తన పెద్ద కుమారునికి అప్పగించి, తన శేష జీవితాన్ని బాబా సేవలో గడిపాడు.  అతను పూర్తిగా బాబా ఉపదేశాలను ఆచరించి భౌతిక శరీరాన్ని విడచి మరొక జన్మ ఎత్తాడు.    

"భక్తులు బాధలననుభవిస్తున్నపుడు భగవంతుడు వారినాబాధలనుండి తప్పించడానికి ఏదో రూపంలో ఆదుకుంటాడు".   

ఉదాహరణ:  బాలషింపీ మలేరియా వ్యాధితో బాధపడుతున్నాడు.  బాబా నల్లకుక్క రూపంలో లక్ష్మీదేవి గుడిలోకి వచ్చి, బాలాషింపీ సమర్పించిన పెరుగన్నం తిని అతని మలేరియా జ్వరాన్ని నివారణ కావించారు.  

ఆస్త్మా వ్యాధితో బాధపడుతున్న తన భక్తుడయిన హంసరాజుని బాబా పెరుగన్నం తినకుండా నివారించారు.  బాబా అతని యింటిలోనికి వెళ్ళి హంసరాజ్ కు పెట్టిన పెరుగన్నం తిని, బెత్తం దెబ్బలు తిన్నారు.  బాబా బెత్తం దెబ్బలను భరించారు.  

అరణ్యంలో దారితప్పి దాహంతో బాధపడుతున్న నానాసాహెబ్ చందోర్కర్ కి అడవిలో భిల్లుని రూఫంలో కనిపించి నీరు దొరికే ప్రదేశాన్ని చూపించారు.      

"జీవితంలో కష్టాలెదురయినపుడు, జీవిత నౌక సుఖంగా ప్రయాణం సాగించడానికి విష్ణుసహస్రనామం పారాయణ చేయాలి".  

శ్రీసాయి సత్ చరిత్ర 27వ.అధ్యాయంలో దీని విషయం చెప్పబడింది.  శ్యామా బాబాకు అంకిత భక్తుడు.  వృత్తిరీత్యా అతను ఉపాధ్యాయుడు.  అతను జీవితంలో ఎన్నో కష్టాలు పడుతున్నాడు.  బాబా అతని చేత బలవంతంగా విష్ణుసహస్రనామం చదివించి అతని కష్టాలను తగ్గించారు.   

"ప్రతివారు తమ జీవితావసరాలకు తగినట్లుగా సుఖంగా జీవించడానికి సరిపడ ధనాన్ని సంపాదించి, మిగిలిన జీవితాన్ని సంతృప్తిగా గడపాలి.  ఎవరూ కూడా బాధ్యతలనుండి తప్పించుకొని పారిపోరాదు."   

శ్రీసాయి సత్ చరిత్ర 26వ.అధ్యాయంలో గోపాలనారాయణ అంబాడేకర్ గురించి తెలుసుకొందాము.  అతను అబ్ కారీ డిపార్ట్ మెంట్ లో పనిచేసి ఎంతో ధనాన్ని సంపాదించాడు.  కాని డబ్బంతా చాలా దుబారాగా ఖర్చు చేశాడు.  ఉద్యోగానికి రాజీనామా చేసి వీధుల పాలయ్యాడు.  షిరిడీ వెళ్ళి బాబా సహాయం కోరి అక్కడ ఏడు సంవత్సరాలు ఉన్నాడు.  ఎంతో మానసిక వ్యధననుభవించి ఆత్మహత్య చేసుకోవాలనుకొన్నాడు.  బాబా అతనిపై జాలి తలచారు.  అతనికి జ్యోతిష్యంలో ఉన్న మక్కువను గమనించి జ్యోతిష్యాన్ని వృత్తిగా చేపట్టమని సలహానిచ్చారు.  ఆతరువాత బాబా ఆశీర్వాదంతో తగినంత ధనాన్ని సంపాదించి తన బాధ్యతలన్నీ నిర్వర్తించాడు. 

"ఆధ్యాత్మిక దారిలో ఎప్పుడు ఒంటరిగానే ప్రయాణం చేయాలి తప్ప మరొకరితో కలిసి చేయరాదు.  సద్గురువు మార్గదర్శకత్వంలో నీవు మాత్రమే ప్రయాణం కొనసాగించాలి".  

శ్రీసాయి సత్ చరిత్ర 26వ.అధ్యాయంలో ఈసంఘటనను గమనించవచ్చు.  భక్త పంత్ బాబా దర్శనం కోరి షిరిడీకి వచ్చి తెలివితప్పి పడిపోయాడు.  బాబా అతని నుదుటిమీద నీళ్ళు చిలకరించారు.  పంత్ కు తెలివివచ్చిన తరువాత బాబా "ఏమయినాకాని, నీపట్టు విడవద్దు.  ఎప్పుడూ స్థిరంగా ఉండి నీగురువు మీద నమ్మకముంచు" అన్నారు.  ఈవిధంగా బాబా"గురువు చూపించిన మార్గంలోనే ప్రతివారు ముందుకు సాగాలని కోరుకొన్నారు".  


(అయిపోయింది)
(సర్వం శ్రీసాయినాధార్పణమస్తు) 

No comments:

Post a Comment