14.08.2014 గురువారము
ఓంసాయి శ్రీసాయి జయజయ సాయి
సాయి బంధువులకు బాబావారి శుభాశీస్సులు
స్వాతంత్ర్యదినోత్సవ శుభాకాంక్షలు
ఈ రోజునుండి సాయి.బా.ని.స. శ్రీరావాడ గోపాలరావుగారి "మానవ జీవితానికి బాబా వారు ఇచ్చిన సందేశాలు" ఉపన్యాసాలు వినండి.
సాయి.బా.ని.స. కి బాబా వారు కలలో ఇచ్చిన సందేశాలకు, ఆయన ఆలోచనలకు శ్రీసాయి సత్ చరిత్రలో బాబా వారు తన భక్తులకు ఇచ్చిన సందేశాలను ఉదాహరణలుగ ఆయన చెపుతున్న ఉపన్యాసం.
మూలం : సాయి.బా.ని.స. శ్రీరావాడ గోపాలరావు
తెలుగు అనువాదం: ఆత్రేయపురపు త్యాగరాజు
మానవ జీవితానికి శ్రీసాయి సందేశాలు - 1వ.భాగం
ఓం శ్రీగణేశాయనమః, ఓంశ్రీసరస్వత్యైనమః, ఓంశ్రీసమర్ధ సద్గురు సాయినాధాయనమః
శ్రీసాయి సత్ చరిత్ర 10,15 అధ్యాయాలలో బాబా తాను తన భక్తులకు బానిసనని చెప్పారు. తాను సర్వజనుల హృదయాలలోను నివసిస్తున్నానని కూడా చెప్పారు. విషయానికి వచ్చేముందు మీఅందరికీ నాప్రణామములు.
ముందుగా మానవ జన్మయొక్క ప్రాముఖ్యతను మనం తెలుసుకొందాము. భగవంతుడు ఈవిశ్వంలో కోట్లాది జీవరాశులను సృష్టించాడు.
అందులో మానవులను కూడా సృష్టించాడు. పురాణాల ప్రకారం జీవరాశులన్నీ కూడా జీవనం సాగించి తమతమ కర్మలను బట్టి పాపపుణ్యాలను బట్టి స్వర్గానికి గాని నరకానికి గాని చేరుకుంటాయి.
పుణ్యకార్యాలు చేసి స్వర్గప్రాప్తి పొందినవారు స్వర్గములో పుణ్యఫలాలను అనుభవించిన తరువాత మరలా జన్మనెత్తడానికి ఈలోకంలోకి త్రోసివేయబడతారు. ఎవరయితే పాపకర్మల ప్రభావంతో నరకానికి వెడతారో వారక్కడ శిక్షలను అనుభవిస్తున్నారు. ఎవరి పాపపుణ్యములు సమంగా ఉంటాయో వారు మరలా మానవులుగా జన్మిస్తున్నారు. మానవులకు మాత్రమే మోక్షమును పొందడానికి ప్రత్యేకమయిన అవకాశం ఉంది. జీవులన్నీటికీ కూడా, భయము,నిద్ర, ఆహారము,మైధునం అన్నీ ప్రధానమయిన కార్యకలాపాలు. అది సాధారణం.