Thursday, 14 August 2014

మానవ జీవితానికి శ్రీసాయి సందేశాలు - 1వ.భాగం

    
         

14.08.2014 గురువారము
ఓంసాయి శ్రీసాయి జయజయ సాయి
సాయి బంధువులకు బాబావారి శుభాశీస్సులు
స్వాతంత్ర్యదినోత్సవ శుభాకాంక్షలు 

ఈ రోజునుండి సాయి.బా.ని.స. శ్రీరావాడ గోపాలరావుగారి "మానవ జీవితానికి బాబా వారు ఇచ్చిన సందేశాలు" ఉపన్యాసాలు వినండి.  

సాయి.బా.ని.స. కి బాబా వారు కలలో ఇచ్చిన సందేశాలకు, ఆయన ఆలోచనలకు శ్రీసాయి సత్ చరిత్రలో బాబా వారు తన భక్తులకు ఇచ్చిన సందేశాలను ఉదాహరణలుగ ఆయన చెపుతున్న ఉపన్యాసం.   
     

మూలం : సాయి.బా.ని.స. శ్రీరావాడ గోపాలరావు
తెలుగు అనువాదం: ఆత్రేయపురపు త్యాగరాజు 

 మానవ జీవితానికి శ్రీసాయి సందేశాలు - 1వ.భాగం 
ఓం శ్రీగణేశాయనమః, ఓంశ్రీసరస్వత్యైనమః, ఓంశ్రీసమర్ధ సద్గురు సాయినాధాయనమః

శ్రీసాయి సత్ చరిత్ర 10,15 అధ్యాయాలలో బాబా తాను తన భక్తులకు బానిసనని చెప్పారు.  తాను సర్వజనుల హృదయాలలోను నివసిస్తున్నానని కూడా చెప్పారు.  విషయానికి వచ్చేముందు మీఅందరికీ నాప్రణామములు.

ముందుగా మానవ జన్మయొక్క ప్రాముఖ్యతను మనం తెలుసుకొందాము.  భగవంతుడు ఈవిశ్వంలో కోట్లాది జీవరాశులను సృష్టించాడు.  

అందులో మానవులను కూడా  సృష్టించాడు.  పురాణాల ప్రకారం  జీవరాశులన్నీ కూడా జీవనం సాగించి తమతమ కర్మలను బట్టి పాపపుణ్యాలను బట్టి స్వర్గానికి గాని నరకానికి గాని చేరుకుంటాయి. 
          
 పుణ్యకార్యాలు చేసి స్వర్గప్రాప్తి పొందినవారు స్వర్గములో పుణ్యఫలాలను అనుభవించిన తరువాత మరలా జన్మనెత్తడానికి ఈలోకంలోకి త్రోసివేయబడతారు.  ఎవరయితే పాపకర్మల ప్రభావంతో నరకానికి వెడతారో వారక్కడ శిక్షలను అనుభవిస్తున్నారు.  ఎవరి పాపపుణ్యములు సమంగా ఉంటాయో వారు మరలా మానవులుగా జన్మిస్తున్నారు.  మానవులకు మాత్రమే మోక్షమును పొందడానికి ప్రత్యేకమయిన అవకాశం ఉంది.  జీవులన్నీటికీ కూడా, భయము,నిద్ర, ఆహారము,మైధునం అన్నీ ప్రధానమయిన కార్యకలాపాలు. అది సాధారణం.  



కాని మానవులకు మాత్రమే జ్ఞానము ప్రత్యేకముగా యివ్వబడింది.  తనకు ప్రత్యేకంగా యివ్వబడిన ఈజ్ఞానం సాయంతో మానవుడు భగవంతుని గూర్చి తెలుసుకొని మోక్షాన్ని పొందడానికి ప్రయత్నాలు చేయగలడు.  బహుశహ అందుకే దేవతలు కూడా మానవులపై అసూయ చెంది తాము కూడా మానవులుగా జన్మించాలని కోరుకొంటారు.   
అనేక రకాల జీవరాశులను సృష్టించినప్పటికీ భగవంతుడు తృప్తిచెందలేదు.  కారణం అవి తన శక్తిని గుర్తించలేకపోవడమె. అందుచేతనే భగవంతుడు మానవులను సృష్టించి, జ్ఞానాన్ని కూడా ప్రసాదించాడు.  అందుచేత జ్ఞానం భగవంతుడు మానవులకిచ్చిన గొప్ప వరం.  తాను ప్రసాదించిన జ్ఞానాన్ని అర్ధం చేసుకొని తన మహిమను మానవులు గుర్తించినందుకు భగవంతుడు ఎంతో సంతుష్టి చెందాడు. అందుచేత మనం మానవులుగా జన్మించడం గొప్ప అదృష్టం.  అ అదృష్టం వల్లనే మనం 'సర్వశ్య శరణాగతి కై సాయి మార్గంలోకి వచ్చాము. 

మనమందరమూ పూర్వ జన్మలో చేసుకొన్న పుణ్యం వల్లనే ఈ జన్మలో బాబాగారి ఉపదేశాలను, తత్వాన్ని అర్ధం చేసుకొని ఆయన సూచించిన మార్గంలో జీవనం సాగిస్తున్నాము. శ్రీసాయి సత్ చరిత్రను క్రమం తప్పకుండా ప్రతిరోజు పారాయణ చేసినచో అందులో మనకెన్నొ సందేశాలు, మార్గదర్శకాలు తారసపడతాయి.  మనం ఏవిధంగా జీవించాలో వాటిద్వారా బాబా మనకు నిర్దేశించాడు.   

శ్రీసాయి సత్ చరిత్ర 14వ.అధ్యాయంలో బాబా తార్ఖడ్ భార్యను ఆరురూపాయలు దక్షిణ అడిగి ఆరూపంలో ఆమెనుండి అరిషడ్వర్గాలను తొలగించుకోమనే సందేశాన్నిచ్చారు.  ఆవిధంగా బాబా అరిషడ్వర్గాలయిన కామ, క్రోధ, లోభ మోహ, మద, మాత్సర్యాలను విడిచి ధర్మ మార్గంలో జీవనం సాగించమనే ఉపదేశాన్ని మానవజాతికిచ్చారు బాబా. 

శ్రీసాయి సత్ చరిత్ర 25వ. అధ్యాయంలో దామూ అన్నా కాసార్ కి క్రొత్తగా ప్రత్తివ్యాపారం మొదలు పెట్టి త్వరలోనే ధనవంతుడినయిపోదామనే దురాశ కలిగింది  బాబా అతనిలో ధనం మీద దురాశ తగదనే హెచ్చరిక చేశారు.  బాబా దామూ అన్నాతో తొందర పడవద్దనీ భగవంతుడిచ్చిన దానితో తృప్తి చెందమనీ సలహా యిచ్చారు.  

జీవితంలో దురాశకు తావులేకుండా పూర్తి సంతృప్తితో జీవించాలనే ముఖ్యమయిన సందేశాన్నిచారు బాబా. 

శ్రీసాయి సత్ చరిత్ర 26వ.అధ్యాయంలో గోపాలనారాయణ అంబడేకర్ జీవితంలో బాధ్యతా రహితంగా ఉండేవాడు.  ఇక ముందు ముందు ఎటువంటి కష్టాలనెదుర్కొనవలసి వస్తుందోననే భయంతో ఉద్యోగానికి రాజీనామా చేశాడు.  ఏడు సంవత్సరాలు ఎన్నో బాధలు పడ్డాడు.  ఆతరువాత అతను బాబాను ఆశ్రయించి ఆయన సలహా కోరాడు.  "పూర్వ జన్మలో చేసిన చెడు కర్మలనుండి ఎవరూ తప్పించుకోలేరని కర్మననుభవించవలసినదేనని" చెప్పారు బాబా.   అందుచేత అతను నిరాశతో ఆత్మహత్య చేసుకోవాలనుకొన్నాడు.  సమస్యలకు పరిష్కారం ఆత్మహత్య కాదని, బాబా అతనిని రక్షించారు.  జీవితంలో ఎదురయే కష్టనష్టాలను ధైర్యంతో ఎదుర్కోవాలనే సందేశాన్నిచ్చారు బాబా. 

(ఇంకా ఉంది)
(సర్వం శ్రీసాయినాధార్పణమస్తు) 

No comments:

Post a Comment