17.08.2014 ఆదివారము
ఓంసాయి శ్రీసాయి జయజయ సాయి
సాయిబంధువులకు బాబావారి శుభాశీస్సులు
ఈ రోజు సాయి.బా.ని.స. శ్రీరావాడ గోపాలరావుగారు చెపుతున్న మానవజీవితానికి శ్రీసాయి సందేశాలు తరువాయి భాగం వినండి.
మూలం: సాయి.బా.ని.స. శ్రీరావాడ గోపాలరావు
తెలుగు అనువాదం : ఆత్రేయపురపు త్యాగరాజు
మానవజీవితానికి శ్రీసాయి సందేశాలు - 4వ.భాగం
"అడవిలో ఎందుకూ పనికిరాని మొక్కగా బ్రతికేకన్నా మానవ జీవితం కొబ్బరిచెట్టులాగ పెరిగి సమాజానికి ఉపయోగపడాలి".
దీనికి బాపూ సాహెబ్ బూటీ జీవితమే ఒక ఉదాహరణ. బూటి కోటీశ్వరుడు. బాబాకు అంకితభక్తుడు. బాబా యిచ్చిన ఆదేశాలను ఆచరణలో పెట్టి తన స్వంత డబ్బుతో సమాధి మందిరాన్ని నిర్మించి కొబ్బరి చెట్టులాగ, ఈనాడు ఎంతోమంది సాయి భక్తులకు ఆదర్శప్రాయుడయాడు.
నేడు ఆయన చేసిన సేవ కోటానుకోట్ల సాయి భక్తులందరిలోను చిరస్థాయిగా నిలిచివుంది. ఇక ముందు కూడా నిలిచి ఉంటుంది.
"జీవితమనేది ఎప్పుడూ కళకళలాడే పచ్చని పైరులాగ ఎదిగి ప్రతిసంవత్సరం పంటలు పండిస్తూ సమాజానికి ఉపయోగపడాలి. అంతేగాని, ఒకసారి రాయి త్రవ్విన తరువాత నిలచిపోయే రాతిగనిలాగ పనికిరాని విధంగా మారరాదు."
ఈసందేశాన్ని మనము శ్రీసాయి సత్ చ్రిత్ర 35వ.అధ్యాయంలో చూడవచ్చు. బాలాజీ పాటిల్ నెవాస్కర్ ప్రతి సంవత్సరం తనపొలంలో పండిన వరి పంటను కోసి తెచ్చి బాబాకు సమర్పిస్తూ ఉండేవాడు. బాబా కొంత భాగాన్ని తానుంచుకొని దానిని బీదవారికి పంచిపెట్టేవారు. బాబా, నెవాస్కర్ కుటుంబ సభ్యులందరికీ క్రొత్త బట్టలను పెట్టేవారు.
"జీవితమనేది సుఖసంతోషాల మిశ్రమం. మనం వాటిని సమంగానే అనుభవించాలి"
ఈ సందేశం శ్రీసాయి సత్ చరిత్ర 26వ.అధ్యాయంలో గోపాల నారాయణ అంబడేకర్ కి వర్తిస్తుంది. అంబడేకర్ ఉద్యోగం లేక బాధలు పడుతూ ఆత్మహత్య ప్రయత్నంలో ఉన్నపుడు, బాబా అతనిని కాపాడి, నూతన జీవితాన్ని ప్రసాదించారు.
"జీవితం ఎల్లప్పుడూ నీవు నిర్వహించవలసిన బాధ్యతలను గుర్తు చేస్తూ ఉంటుంది."
ఈసందేశాన్ని మనం శ్రీసాయి సత్ చరిత్ర 31వ.అధ్యాయంలో గమనించవచ్చు. మద్రాసునుంచి వచ్చిన విజయానంద్ అనే సన్యాసితో బాబా అన్నమాటలు - "నీతల్లిమీద నీకంత ప్రేమ ఉన్నపుడు కాషాయ వస్త్రాలను ధరించి సన్యాసమెందుకు తీసుకున్నావు? కాషాయవస్త్రాలు ధరించినవాడు దేని మీద అభిమానం చూపుట తగదు" అని హితవు పలికారు.
"జీవితమనేది ఒక రైలు ప్రయాణం వంటిది. అందులో నీభార్యాపిల్లలు నీతోటి ప్రయాణీకులు. నీవు ఆధ్యాత్మిక రైలులోకి మారిన మరుక్షణం నీతో కూడా నీవారు రావడానికిష్టపడకపోవచ్చు, రారు."
పండరీపూర్ సబ్ జడ్జి తాత్యాసాహెబ్ నూల్కర్ జీవితమే పైన చెప్పిన సందేశానికి ఉదాహరణ. నూల్కర్ తన శేషజీవితాన్ని బాబా సేవ చేసుకొంటూ గడుపుదామని నిర్ణయించుకున్నపుడు అతని భార్యాపిల్లలు అతనికి తోడుగా షిరిడీ రావడానికి యిష్టపడలేదు. ఒకసారి నూల్కర్ అనారోగ్యంతో బాధపడుతున్నపుడు అతని చిన్ననాటి స్నేహితుడిని నూల్కర్ సేవకోసం సాఠేవాడలో నియమించారు. నూల్కర్ చనిపోవడానికి ఒకరోజుముందు బొంబాయినుండి అతని పెద్దకుమారుడు వచ్చి, బాబా పాదతీర్ధాన్ని నూల్కర్ నోటిలో పోశాడు. ఆతరువాత నూల్కర్ ఆఖరిశ్వాస తీసుకొన్నాడు. నూల్కర్ కి పునర్జన్మ లేదని బాబా చెప్పారు.
"జీవితంలో భగవంతునికై అన్వేషణ ముఖ్యం. కాని, అది చిన్న వయసులోనే చేయనక్కరలేదు. మధ్యవయసులోనే మొదలు పెట్టవచ్చు."
కాకాసాహెబ్ దీక్షిత్ యింగ్లాండులో బారెట్ లా చదివి బొంబాయిలో న్యాయవాద వృత్తిని చేపట్టారు. తరువాత ఆయన 1909 లో షిరిడీ వచ్చి బాబాకు అంకిత భక్తుడయారు. 1910లో అన్నాసాహెబ్ ధబోల్కర్ షిరిడీ వచ్చి బాబా అనుగ్రహంతో ఆశీర్వాదంతో శ్రీసాయి సత్ చరిత్రను వ్రాశారు. బాబా దీవెనలతో షేమాద్రిపంత్ గా ప్రసిధ్ధి చెందారు. అలాగే అమరావతిలో ప్లీడరుగా పనిచేస్తున్న ఖాపర్దే మధ్యవయసులోనే షిరిడీ వచ్చి బాబాకు అంకిత భక్తుడయారు.
"జీవితం ఏడంతస్తుల భవనం వంటిది. ఏడవ అంతస్తులో ఏడు తలుపుల గదిలో నివసిస్తూ భగవంతునికి చేరువగా ఉండాలి".
దీనికి సంబంధించి శ్రీసాయిసత్ చరిత్ర లోని 14వ.అధ్యాయాన్ని గమనిద్దాము. ఇందులో ఆరు అంతస్తులనగా అరిషడ్వర్గాలయిన కామ, క్రోధ, లోభ, మద, మాత్సర్యాలకు సంకేతం. ఇక్కడ భక్తులకిచ్చిన సందేశం ఏమిటంటే ఈ అరిషడ్వర్గాలను జయించి, విడనాడి ఏడవ అంతస్తులోని ఏడు తలుపుల గదిలో నివసించాలి. ఇక్కడ ఏడవ అంతస్తు అనగా మానవశరీరంలోని ఉన్నత స్థానమయిన శిరస్సు. శిరస్సుకి ఏడు తలుపులంటే అవి రెండు కళ్ళు, రెండు నాసికా రంధ్రాలు, రెండు చెవులు, నోరు. వీటి సహాయంతో భగవంతుని అన్వేషిస్తూ భగవంతుని చేరాలని బాబా ఉద్దేశ్యం.
(కళ్ళతో భగవంతుని కనులారా తిలకించు, నాసికా రంధ్రాలతో భగవంతుని వద్దనుండి వచ్చే సుగంధ పరిమళాలని ఆఘ్రాణించు, చెవులతో భగవంతుని లీలలను శ్రవణం చేయి, నోటితో భగవంతుని నామాన్ని ఉచ్చరించి, ఆయన లీలలను గానం చేయి ఆయనను స్తుతిస్తూ అందరికీ ఆయన గుణగణాలను విశదంగా తెలియ చెప్పు. ఆవిధంగా చేస్తే నీశిరస్సులో నీమనోనేత్రం ముందు భగవంతుని సాక్షాత్కారం లభిస్తుంది - విశ్లేషణ..త్యాగరాజు)
(ఇంకా ఉంది)
(సర్వం శ్రీసాయినాధార్పణమస్తు)
No comments:
Post a Comment