Sunday, 3 August 2014

శ్రీసాయి సత్ చరిత్ర - తత్వం - అంతరార్ధం - 7వ.భాగం

   
    

03.08.2014 ఆదివారము
ఓం సాయి శ్రీసాయి జయజయ సాయి
సాయిబంధువులకు బాబావారి శుభాశీస్సులు

శ్రీసాయి సత్ చరిత్ర - తత్వం - అంతరార్ధం - 7వ.భాగం

ఈ రోజు సాయి.బా.ని.స. గారు చెప్పిన తత్వాన్ని మరికాస్త తెలుసుకొందాము.  వినండి.
      
మూలం : సాయి.బా.ని.స. శ్రీరావాడ గోపాలరావు
తెలుగు అనువాదం : ఆత్రేయపురపు త్యాగరాజు 


బాబా తన భక్తులను పిచ్చుక కాలికి దారం కట్టి లాగినట్లుగా తనవద్దకు రప్పించుకుంటానని చెప్పారు.  దీని అర్ధమేమిటి?  

మనం ఒక పిచుకను పట్టుకొని దాని కాలికి దారం కడితే అది మన చుట్టూనే తిరుగుతూ ఉంటుంది.  అది బ్రతకడానికి దానికి తిండిపెట్టి, త్రాగడానికి నీరిచ్చి రక్షించడం మన విధి.  



బాబా యిచ్చిన పదకొండు వచనాలలో ఒకటి తన భక్తుల యింటిలో లేమి అన్న శబ్దం పొడచూపదు అని కూడా చెప్పారు.  తన సమాధినుండే తన భక్తులను రక్షిస్తానని చెప్పారు. అందుచేతనే భక్తులందరూ కూడా బాబా వద్దకు లాగబడిన పిచ్చుకలే అని మనం అర్ధం చేసుకోవచ్చు.
              
వామన్ తాత్యా తయారుచేసి యిచ్చిన పచ్చి కుండలతో బాబా మొక్కలకు నీళ్ళు పోసేవారు.  ఆతర్వాత కుండలని మొక్కలవద్ద బోర్లించి పెట్టేవారు.  సాయంత్రమయేసరికి కుండలు విచ్చిపోయి మట్టిలో కలసిపోయేవి.  ఏమిటి దీని అంతరార్ధం?       
               
నీటిని నింపుకొనడానికి కుండలు తయారు చేయబడతాయి.  అయితే భగవంతుడు తన మహిమను మానవులు గ్రహించుకోవడం కోసం మానవులని సృష్టించాడు.  

మానవుడు పంచభూతాలతో కుండలను తయారు చేస్తాడు.  అలాగే భగవంతుడు కూడా మానవశరీరాన్ని పంచభూతాలతో తయారుచేశాడు.  మట్టికుండలయినా మానవశరీరమయినా ఆఖరికి విశ్వంలోని పంచభూతాలలో కలసిపోవలసిందే.  బాబా తన భక్తుల హృదయాలను భక్తి అనే ప్రకాశంతో నింపుతానని చెప్పారు.  బాబా మనకు అంతిమంగా చెప్పదలచుకొన్న సత్యమిదే. 

బాబా ఎప్పుడూ కాషాయ వస్త్రాలు ధరించనప్పటికీ నేడు కొన్ని కొత్త కొత్త ఫొటోలలొ బాబా కాషాయ వేషధారణలో ఉన్నట్లుగా చిత్రిస్తున్నారు.  

ఒకసారి బాబా ద్వారకామాయిలో ఉన్న భక్తులనుద్దేశించి కాషాయ వస్త్రాలను తెమ్మని చెప్పారు.  అందువల్లనే ఆయన మూలేశాస్త్రికి అతని గురువయిన ఘోలప్ స్వామిగా కాషాయ వస్త్రాలు ధరించి దర్శనమిచ్చారు.  ఈసంఘటనను ఎప్పుడూ గుర్తుడిపోయేందుకే చిత్రకారులు బాబా కాషాయవస్త్రాలు ధరించి ఉన్నట్లుగా చిత్రించడం ప్రారంభించారు.   
   
                  
జయకర్ చిత్రించిన బాబా చిత్రపటంలో బాబా శిరస్సుపై పుష్పం ఉన్నట్లుగా చిత్రించాడు.                  
బాబా శిరస్సుపై పుష్పాలనుంచి పూజించిన వ్యక్తి ఎవరు?  1908వ.సంవత్సరం వరకు బాబా తనను పూజించడానికి ఎప్పుడూ ఎవ్వరికీ అనుమతివ్వలేదు.  బాపూరావు అనే చిన్న పిల్లవాడు పాఠశాలకు వెడుతూ బాబా శిరస్సుమీద ఒక పువ్వునుంచి పూజించి  పాఠశాలకు వెళ్ళేవాడు.  ఆరోజునుండి బాబా తన భక్తులను తనను పూజించడానికి అనుమతించారు.  ఆవిధంగా బాఫురావు 6 సంవత్సరాల పిల్లవాడిగా ఉన్నపుడు బాబాను అందరూ పూజించడానికి ఆదర్శప్రాయుడయ్యాడు. 

1917వ.సంవత్సరంలో నర్వేకర్ కుమారుడు తన తండ్రి తరఫున బాబాకు 500 రూపాయల దక్షిణ సమర్పించాడు.  ఆదక్షిణను స్వీకరించగానే బాబా జ్వరంతో బాధపడసాగారు.  బాధ ఉన్నప్పటికీ ఈవిధంగా ఎందుకు జరిగిందని ప్రశ్నించిన శ్యామాతో బాబా "మనం ఎస్వరినుంచయినా ఏదయినా స్వీకరిస్తే, దానితోపాటుగా మనకు వారినుంచి సంభవించే కష్టనష్టాలన్నిటినీ కూడా అనుభవించాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది" అని వివరించారు.  

బాబా యింకా యిలా చెప్పారు.  "నాభక్తుడయిన నర్వేకర్ జ్వరంతో బాధ పడుతున్నాడు.  జ్వరంతో సహా అతను పంపించిన దక్షిణను నేను స్వీకరించాను".  బాబాకు ఒక్కరోజులో జ్వరం తగ్గిపోయింది.  ఆతరువాత నర్వేకర్ పంపించిన దక్షిణతో బాబా బీదవారికి అన్నదానం జరిపించారు.   

(ఇంకా ఉంది)
(సర్వం శ్రీసాయినాధార్పణమస్తు)     

No comments:

Post a Comment