Thursday, 6 November 2014

గృహస్థులకు సాయి సందేశాలు - 1వ. భాగం


   
  
06.11.2014 గురువారము
ఓంసాయి శ్రీసాయి జయజయ సాయి
సాయి బంధువులకు బాబావారి శుభాశీస్సులు
కార్తికపౌర్ణమి శుభాకాంక్షలు
నెలరోజుల తరువాత మరలా బ్లాగులో ప్రచురణకు సమయం కుదిరింది.  ఈ రోజు సాయిబానిస శ్రీ రావాడ గోపాలరావుగారు శ్రీసాయి సత్ చరిత్ర మీద చేసిన పరిసోధనా వ్యాసం "గృహస్థులకు సాయి సందేశాలు" ప్రారంభిస్తున్నాను.  ఇది చదివిన తరువాత మరలా మరొక్కసారి శ్రీసాయి సత్ చరిత్రను పారాయణ చేయండి.  ఈ వ్యాసంలో సాయిబానిస గారు చెప్పిన విషయాలను కూడా జాగ్రత్తగా గమనిస్తూ పారాయణ చేయండి.  సాయి తత్వం మనకు బోధపడుతుంది.  ఓం సాయిరాం.

ఓం శ్రీసాయినాధాయనమహ

గృహస్థులకు సాయి సందేశాలు -  1వ. భాగం 

ఆంగ్లమూలం: సాయిబానిస శ్రీరావాడ గోపాలరావు        

తెలుగు అనువాదం : ఆత్రేయపురపు త్యాగరాజు - 9440375411
                               హైదరాబాద్ 

ఓం శ్రీగణేశాయనమహ, ఓం శ్రీసరస్వత్యైనమహ, ఓంశ్రీసాయినాధాయనమహ 

ఈ రోజు సాయిభక్తులందరికీ, గృహస్థులకు సాయి సందేశాలను గురించి వివరిస్తాను.

వైవాహిక జీవితాన్ననుభవిస్తున్నవారందరూ గృహస్థులే.  శ్రీసాయి సత్ చరిత్ర 10,15 అధ్యాయాలలో బాబా తాను తన భక్తులకు బానిసనని తానందరి హృదయాలలోను నివసిస్తున్నానీ చెప్పారు. నాయజమాని సాయినాధుడు మీకు బానిస అయినప్పుడు నేను కూడా మీకు బానిసనే.  ముందుగా మీకందరికీ నాప్రణామములు సమర్పించుకొంటూ నా ఈ ఉపన్యాసాన్ని ప్రారంభిస్తున్నాను.  సమాజంలో అందరూ కూడా నీతి నియమాలతో జీవనం సాగించడానికి మన పూర్వీకులు గృహస్థాశ్రమ ధర్మాలకనుగుణంగా మనకు ఎన్నో మార్గదర్శక సూత్రాలనందించారు.  ముందుగా మను స్మృతిలోని కొన్ని ధర్మాలను మీకు వివరిస్తాను.        



మనుస్మృతి 3వ.అధ్యాయం 1,2 శ్లోకాలు : గృహస్థధర్మం:

ఈ విశ్వంలో పంచభూతాలలో అతి ముఖ్యమయిన ప్రాణవాయువే సర్వ జీవులకు ఆధారం.  ఇతర జీవులు, మానవులు అవసరార్ధమై ఒకరిపై మరొకరు ఆధారపడక తప్పదు.    

మనుస్మృతిలో మానవజీవితంలోని వివిధ దశలగురించి ప్రస్తావింపబడింది.  అవి బ్రహ్మచర్య, గృహస్థ, వానప్రస్థ, సన్యాసాశ్రమ ధర్మాలు.  ప్రతిమానవుడు జీవితంలో మూడు దశలను అనుభవించవలసినదే.  స్థూలంగా చెప్పాలంటే సమాజం అనేది అనేకమైన కాలువలనుండి, నదులనుండి వచ్చే నీరు మానవత్వమనే సాగరంలో కలసిపోవడంవంటిది.  మానవత్వానికి బలమయిన పునాది గృహస్థాశ్రమ ధర్మం.      

   మనుస్మృతిలోని 3వ.శ్లోకంలో అతిధి యింటి వాకిట ఉండగా గృహస్థు భోజనం చేయడం దోషమని చెప్పబడింది.  అటువంటి సమయంలో భోజనానికి ముందు పట్టిన ఔపోసన సురాపానముతోను, తిన్న ఆహారం గోమాంసముతోను సమానమని చెప్పబడింది.   

నాలుగవ శ్లోకంలో అగ్నిహోత్రము, స్వగృహము, పుణ్యక్షేత్రము, గర్భిణిస్త్రీ, ముసలివారు, బాలురు, రాజు, దైవము, గురువు, వీరి వద్దకు వెళ్ళునపుడు వట్టి చేతులతో పోరాదు.  ఏదయినా ఒక పండును గాని, పుష్పాన్ని గాని తీసుకొనిపోయి వారికి సమర్పించాలి.  

అయిదవ శ్లోకంలో, అతిధికి వడ్డించని ఏపదార్ధాన్ని గృహస్థు తాను భుజింపరాదు.  ఈ ధర్మాలను పాటించి అతిధి పూజ చేయు గృహస్థునిపై భగవంతుడు సంతుష్టి చెందునని, అటువంటి గృహస్థు పేరుప్రఖ్యాతులు, కీర్తి, యశస్సు ఆయురారోగ్యాలతో వర్ధిల్లుతాడని చెప్పబడింది. 

6వ.శ్లోకం:

గృహస్థుడు లేనిదానికోసం విచారించక, యితరులకన్న తాను ఎంతో ఉన్నతుడిననీ గర్వించకుండా జీవితాన్ని గడపాలి.  ఇతరులనుంచి ప్రతిఫలాన్ని ఆశించకుండా ఉపకారం చేయాలి.  సుఖదుఖ్ఖాలను  లాభనష్టాలను సమంగా అనుభవిస్తూ సాంసారిక విషయాలయందు అనురక్తి లేక జీవితాన్ని కొనసాగించాలి.    

7వ.శ్లోకం: 

కొన్ని సమయాలలో గృహస్థు అతిధికి భోజనం పెట్టుటకు శక్తి లేకపోవచ్చు. అటువంటి సమయంలో అతిధికి ఆశ్రయమిచ్చి, ప్రియ సంభాషణలతో పలకరించి అతని దాహార్తిని తీర్చి గృహస్థ ధర్మాన్ని నెరవేర్చాలి.    

8వ.శ్లోకం:

పశువులు, భార్యాపుత్రులు, యిళ్ళు వాకిళ్ళు, యివన్నీ ఋణానుబంధ రూపంగా వచ్చి ఋణం తీరిపోగానే, మళ్ళీ మనిషిని వదలి వెళ్ళిపోతున్నాయి.  అందుచేత వివేకవంతుడయిన గృహస్తుడు వాటి గురించి ఎక్కువగా ఆలోచించరాదు. 

భర్తృహరి గృహస్థాశ్రమంపై 9వ.శ్లోకంలో చెప్పిన మాటలు: 

చెట్లు మనకి ఫలాలను, ఆవులు మనకి స్వచ్చమయిన పాలను నదులు తాగడానికి నీటిని ఎటువంటి ప్రతిఫలాన్ని ఆశించకుండా పరుల కోసమే యిస్తున్నాయి.  

ఆవిధంగానే మానవ శరీరం కూడా యితరుల శ్రేయస్సుకోసమే ఉపయోగ పడాలనె విషయాన్ని ప్రతి గృహస్థూ గుర్తుంచుకోవాలి.      

ఇక శ్రీసాయి సత్ చరిత్ర విషయానికి వస్తే వైవాహిక జీవితంలో పురుషుడు తన మీద ఆధారపడినవారియందు నిర్వహించవలసిన బాధ్యతలు, వైవాహిక జీవితంలో స్త్రీ బాధ్యత, తల్లిదండ్రులపై పిల్లల బాధ్యత, పిల్లలపట్ల తల్లిదండ్రుల బాధ్యత యివన్ని చక్కగా శ్రీసాయి సత్ చరిత్రలో వివరింపబడ్డాయి.  వీటన్నిటినీ మీకు వివరంగా తెలియచేయడమే నాముఖ్య కర్తవ్యం.     

 శ్రీసాయి సత్ చరిత్రలో గృహిణి యితరుల సొమ్మును ఆశించరాదనే విషయం 1వ.అధ్యాయంలో వివరింపబడింది.  ద్వారకామాయిలో బాబా గోధుమలు విసురుతూ అన్నమాటలు:    

విసిరిన గోధుమపిండిని తీసుకొని వెడుతున్న స్త్రీలతో "ఓ వనితలారా! మీకు పిచ్చి పట్టినదా ఏమి?  ఎవరబ్బ సొమ్మని లూటీ చేస్తున్నారు"   

గృహిణికి తన పుట్టింటివారిచ్చిన "స్త్రీధనం"  మీద పూర్తి హక్కులు ఉన్నాయి.  ఈవిషయాన్ని మనం శ్రీసాయి సత్ చరిత్ర 47వ.అధ్యాయంలో యిచ్చిన సందేశం ద్వారా తెలుసుకొందాము.  గృహిణి తన పుట్టింటివారిచ్చిన స్త్రీధనాన్ని భగవంతుని గుడినిర్మాణానికి తన భర్త అనుమతితో వినియోగించవచ్చు.  అనగా దాని అర్ధం స్త్రీకి ఆర్ధిక స్వాతంత్ర్యం ఉండాలనే సందేశాన్ని బాబా ఆనాడే యిచ్చారు.    

(ఇంకా ఉంది)
(సర్వం శ్రీసాయినాధార్పణమస్తు) 

No comments:

Post a Comment