Tuesday 11 November 2014

గృహస్థులకు సాయి సందేశాలు - 6వ.ఆఖరిభాగం

  
   

11.11.2014 మంగళవారం
ఓం సాయి శ్రీసాయి జయజయసాయి
సాయి బంధువులకు బాబావారి శుభాశీస్సులు

గృహస్థులకు సాయి సందేశాలు - 6వ.ఆఖరిభాగం

ఆంగ్ల మూలం: సాయిబానిస శ్రీరావాడ గోపాలరావు
తెలుగు అనువాదం : ఆత్రేయపురపు త్యాగరాజు - 9440375411
                               హైదరాబాద్ 
  
                

ఈ రోజు సాయి బానిస గారు చెపుతున్న గృహస్థులకు సాయి సందేశాలు వినండి.

ముందుగా సాయిప్రేరణ : 4వ.వాక్యం

ఒక్కసారి నావైపు ఒక్క అడుగువేసి చూడు, నిన్ను ఎల్లప్పుడు అన్ని వేళలా కాపాడుతాను.  


పిల్లలకు మంచి భవిష్యత్తు కలగాలనే ఉద్దేశ్యంతో తల్లి పూజలు, వ్రతాలు, నోములు చేస్తుంది.  వాటిఫలితం ఉద్యాపన అంటే అన్నదానాలు చేసినప్పుడే లభిస్తుంది.  



ఈవిషయానికి సంబంధించి శ్రీసాయి సత్ చరిత్రలోని ఒక విషయాన్ని గుర్తుకు తెచ్చుకొందాము.  శ్రీ బీ.వీ.దేవ్ గారి  తల్లి 25, 30 నోములు నోచుకొంది.  తరువాత శ్రీవీ.బీ.దేవ్ గారు మామల్తదారు అనగా తహసీల్ దారు ఉద్యోగం చేసుకొంటూ తల్లి మాటను గౌరవించడానికి ఆమె నోచిన నోములన్నిటికీ ఉద్యాపన అనగా అన్నదానం చేసి తల్లి ప్రారంభించిన మంచి పనులను పూర్తి చేశారు.       



తండ్రి అనారోగ్యంతో బాధపడుతున్నపుడు కుమారుడు తండ్రి ఆరోగ్యం కోసం ప్రయత్నాలు చేసి తండ్రి ఆరోగ్యవంతుడయేలా చూడాలి.  ఈ విషయం మనకు శ్రీసాయి సత్ చరిత్ర 34వ.అధ్యాయంలో కనిపిస్తుంది.     

హార్దా పెద్దమనిషి ముసలివాడు.  అతనికి 80సం.వయస్సు.  మూత్రకోశవ్యాధితో బాధపడుతున్నాడు.  అతని కుమారుడు తండ్రిని ఆయన ఖర్మానికి వదలివేయకుండా సాయి భక్తులనుండి ఊదీని తీసుకొనివచ్చి, నీటిలో కలిపి తండ్రిచేత త్రాగించాడు.  వెంటనేమూత్రకోశంలో ఉన్న రాయి కరిగి బయటకు వచ్చేసింది.  ఈవిధంగా అతని కుమారుడు తండ్రి ఆరోగ్యవంతుడవడానికి పాటుపడ్డాడు.  

ఇప్పుడు మనం పిల్లల పట్ల తల్లిదండ్రుల బాధ్యతలను గురించి చెప్పుకొందాము.  పిల్లలు తప్పులు చేయడం సహజం.  అటువంటప్పుడు పెద్దలు పిల్లలను క్షమించాలి.  అంతేకాని పిల్లలమీద కక్షకట్టరాదు. ఈవిషయం మనకు శ్రీసాయి సత్ చరిత్ర 35వ.అధ్యాయంలో నిద్రపట్టని ఒకరోగి విషయంలో కనిపిస్తుంది. బాంద్రానివాసి కాయస్తప్రభు జాతి పెద్దమనిషి చిన్నతనంలో చేసిన తప్పులకు అతని తండ్రి కక్షకట్టి, చనిపోయిన తరువాత కుమారునికి రోజూ కలలో కనిపిస్తూ తిట్లు, శాపనార్ధాలు యిస్తూ ఉండేవాడు.  దానివల్ల ఆకుమారునికి రాత్రివేళలలో నిద్రపట్టేది కాదు. శ్రీసాయి అతని బాధను గుర్తించి ఆ కుమారుడికి ఊదీనిచ్చి ఆశీర్వదించారు.  రాత్రివేళ నుదుటికి విభూది పెట్టుకొని, తలగడ క్రింద కొంత ఊదీ పొట్లం పెట్టుకొని హాయిగా నిద్రపోయేవాడు.   దీనివల్ల మనకు తెలిసినదేమిటంటే, తల్లిదండ్రులు పిల్లలను ఆశీర్వదించాలే కాని వారిపై కక్ష కట్టరాదు.  

ఇక ముగించేముందు ఒక ముఖ్యమయిన విషయాన్ని మీకు చెప్పదలచుకొన్నాను.  తల్లిదండ్రులు ఎదిగిన తమ పిల్లలను పండుగలకు పిలచి వారిని సంతోషపెడుతూ ఉండాలి.  ఈవిషయాన్ని మనం శ్రీసాయి సత్ చరిత్ర 40వ.అధ్యాయంలో గమనించవచ్చు.  శ్రీసాయి హోళీ పండుగ సందర్భంగా హేమాద్రిపంతుకు కలలో ఒక సన్యాసి రూపంలో దర్శనమిచ్చారు.  తాను మధ్యాహ్న భోజనానికి వస్తానని మాట యిచ్చారు.  తానిచ్చిన మాట ప్రకారం పటం రూపంలో భోజన సమయానికి రావడం మనకు తెలిసిన విషయమే.  ఇక్కడ హేమాద్రిపంతు ఆరోజు హోళీపండుగ భోజనానికి తన అయిదుగురు కుమార్తెలను, వారి భర్తలను, మనవలను, తన కుమారుని, కోడలిని భోజనానికి పిలిచి తన పిల్లలందరికీ సంతోషం కలిగించాడు. 

ఈవిధంగా శ్రీసాయి సత్ చరిత్రలో గృహస్థాశ్రమ ధర్మాలను గురించి చెప్పబడ్డాయి.  మనం వాటిని ఆచరించి శ్రీసాయి అనుగ్రహాన్ని పొందాలి.

జై శ్రీసాయిరాం         

(రేపటినుండి శ్రీసాయి సత్ చరిత్రలోని కొన్ని నిగూఢ రహస్యాలు) 

(సర్వం శ్రీసాయినాధార్పణమస్తు) 

          

No comments:

Post a Comment