శ్రీ షిరిడీ సాయితో ముఖా ముఖి
సాయిబానిస శ్రీ రావాడ గోపాలరావు
26.05.2019 ఆదివారమ్
ఓమ్ సాయి శ్రీసాయి జయజయ సాయి
సాయి బంధువులకు బాబావారి శుభాశీస్సులు
శ్రీ షిరిడీ సాయితో ముఖా ముఖి – 6 వ.భాగమ్
సాయిబానిస గారి ద్వారా సాయి భక్తులకు బాబా వారు అందిస్తున్న
అమూల్యమయిన సాయి సందేశాలు
08.05.2019 – నీవు నన్ను నవవిధ భక్తుల గురించి అడిగావు కదా! నీకు నేను కొన్ని ఉదాహరణలు తెలియజేస్తాను.
1. ఒక తండ్రి తన కుమార్తె పెండ్లి సుముహూర్త సమయానికి తన చేతికి రావలసిన ధనము రాలేదు. పెండ్లి ఆగిపోతుందేమోననే భయంతో భగవంతుని ప్రార్ధించసాగాడు. అది స్మరణము.
2. ప్రపంచకప్ క్రికెట్ ఆటలో విజయానికి చేతిలో ఆఖరి వికెట్టు ఉండి ఒక బంతిని ఎదుర్కొని ఒక పరుగు తీయవలసిన సమయంలో ఆజట్టు ఆటగాళ్ళు భగవంతునితో స్నేహముతో మానసిక పూజ చేయటం కూడా నవవిధ భక్తిలో ఒక భాగమే.
3. నీ బంధువు భార్యను చూడు. ఆమెంత చక్కగా లలితా సహస్రనామము కీర్తన చేస్తూ, వచ్చిన భక్తులను ఆదరించి తీర్ధ ప్రసాదాలను ఇచ్చి వారి ఇళ్ళకు పంపుచున్నది. ఇది నవవిధ భక్తిలో కీర్తనము.
4. గుండెపోటుతో కిందపడి విలవిలలాడుతున్న తన భర్తను కాపాడమని భగవంతుని ప్రార్ధిస్తున్న ఆ భార్యను చూడు. అది నవవిధ భక్తిలో ఆత్మనివేదన.
09.05.2019 – పాముల విషయంలో
ఈనాటి సమాజంలో చాలామంది మానవులు నిలువెల్లా విషంతో పాములకంటె భయంకరంగా ఉన్నారు. ఈ భూమిపై ఉన్న పాములలో పది శాతం పాములు మాత్రమే విషముతో కూడినవి. వాటివలన మానవాళికి అంత హానికరము కాదు. నిజానికి పాములు రైతులకు మిత్రులు. అవి ఎలుకలను తమ ఆహారముగా తీసుకొని రైతుల పంటలను ఎలుకల బారినుండి కాపాడుతున్నవి. అందుచేత పాములను సంహరించవద్దు. ఒకవేళ పాముకాటుకు గురవుతున్నట్లు గ్రహించినపుడు తమ ఆత్మరక్షణ కోసం ఆపామును చంపవచ్చును. నా భక్తులలో అనేకమందిని పాముకాటునుండి కాపాడాను. విషము కలిగి యున్న పాములను గుర్తించి వాటినుండి దూరంగా ఉండాలి. వీలుకాని పరిస్థితులలో ఆ విషనాగులను చంపవచ్చును. అంతేగాని కనిపించిన ప్రతిపామును చంపరాదు. భగవంతుడు అన్ని జీవులలోను ఉన్నాడని గ్రహించాలి.
10.05.2019 – శ్యామాను పాముకాటునుండి కాపాడుట.
ఒకనాడు ఒక దుష్టశక్తి పాము రూపంలో వచ్చి శ్యామా చిటికెన వ్రేలిపై కాటు వేసింది. ఆపాములో విషము లేకపోయినా దుష్టశక్తి శ్యామాను పీడించసాగింది. అతని మిత్రులు అతని వింత ప్రవర్తనను చూసి, ద్వారకామాయికి తీసుకుని వచ్చారు. నేను వానిని చూడగానే, శ్యామాను ఆవహించి ఉన్న ఆ దుష్టశక్తి శ్యామాను ఇంకను బాధించసాగింది. శ్యామా బాధను అర్ధం చేసుకొని ఆ దుష్టశక్తిని ద్వారకామాయిలోకి అడుగుపెట్టకుండా ఉండటానికి ఆశక్తిని “దిగు, దిగు వెడలిపో” అని ఆదేశించాను. నా మాటలకు శ్యామాలో ఉన్న దుష్టశక్తి పారిపోయింది. శ్యామాను ఇంటికి తీసుకువెళ్ళి కావలసిన పదార్ధములను తినమని చెప్పాను. కాని రాత్రి అంతా అతను మెలకువగా ఉండేలా చూడమన్నాను. శ్యామా స్నేహితులు శ్యామాను వాని ఇంటికి తీసుకునివెళ్ళి శ్యామాను నిద్రపోకుండా కాపలా కాసారు. ఆ దుష్ట శక్తి తిరిగి శ్యామా మీదకు రాలేదు.
11.05.2019 – గురుభక్తి
1. ఈ రోజున గురుభక్తి గురించి అడిగావు కదా! నాతోపాటు బంగ్లా దేశమునకు రా అని నన్ను అక్కడికి తీసుకొని వెళ్ళారు. అక్కడ ఒక యువకుడు ఆరోజు తన నృత్యప్రదర్శన ఇచ్చేముందు తన గురువుయొక్క సమాధి దగ్గరకు వచ్చి గురువు సమాధికి నమస్కరించాడు.
ఆ సమయంలో సమాధినుండి మంటలు పైకి వచ్చాయి. ఆ యువకుడు వాటిని ఆశీర్వచనాలుగా భావించి తన నృత్యప్రదర్శనను విజయవంతంగా ప్రదర్శించాడు.
2. ఇక నేటి సమాజములో గవర్నమెంటు ఉద్యోగము చేసుకుంటూ ప్రవృత్తిగా కొన్ని మంత్రాలు, జాతకాలు చూడటం నేర్చుకొని తామే గురువులమని అటు ప్రభుత్వానికీ, ఇటు ప్రజలను మోసము చేస్తున్నారు. నీవు వారిని గుర్తించావు కదా. అతను నీతోపాటు నీ కంపెనీలో పనిచేస్తున్న వ్యక్తి కదూ. అటువంటివారికి దూరముగా ఉండటము మంచిది.
3. మాతృదేవోభవ, పితృదేవోభవ అయిన తల్లిదండ్రులు తమ పిల్లలచేత అబధ్ధాలు పలికిస్తూ బస్సు స్టాండులలోను, రైల్వే స్టేషన్ లలోను గురుదక్షిణ పేరిట మోసాలు చేయిస్తూ గురువులకు చెడ్డపేరు తెస్తున్నారు. ఇది నాకు చాలా బాధ కలిగించింది.
4. నీవు నాకు 25 సంవత్సరాలనుండి సేవ చేస్తున్నావు. నీవు ఇపుడు గురుపూజకు అర్హుడివి. నీవు నాతోపాటు గోదావరి గట్టున ఉన్న బ్రాహ్మణబాలుర ఆశ్రమానికి రా. ఇక్కడ విధివిధానాలు చూడు, అని నన్ను గోదావరి గట్టుకు తీసుకొని వెళ్ళారు. అక్కడ బ్రాహ్మణ బాలురు కౌపీనము ధరించి, యజ్ఞోపవీతము ధరించి శిరస్సుపై శిఖతో గోదావరిలో స్నానము చేసి తమ గురువుల పాదాలకు పూజ చేసి గాయత్రి మరియు వేదాలను ఉఛ్ఛరించసాగారు. ఆ విద్యార్ధులు నన్ను చూసి నన్ను ఒక పీటపై కూర్చుండబెట్టి నాపాదాలను గోదావరి జలాలతో కడిగి నాకు గురుపూజ చేసారు.
అక్కడ ఉన్న ఇతర గురువులు నీ గోత్రము ఏమిటి అని అడిగారు. నేను నా గోత్రము సాయిగోత్రము, నా గురువు సద్గురువు సాయిబాబా అని అన్నాను. నాకు నిద్రనుండి మెలకువ వచ్చింది. నాగదిలో ఉన్న సాయినాధుని పటానికి నమస్కరించాను.
12.05.2019 – శ్రీ సాయి సేవలో ఇతరుల జోక్యం పనికిరాదు
నా భక్తులకు నేను ఇచ్చే సలహాలు.
1. ప్రతిభక్తుడికి నా సేవను తనకు ఇష్టమయిన విధముగా చేసుకునే హక్కు ఉంది. ఒకరు చేసే సేవావిధానము, పూజావిధానములలో ఇతర భక్తుల జోక్యము ఉండరాదు.
2. కొందరు భక్తులు నాపేరిట యజ్ఞాలు, యాగాదులు చేస్తూ నన్ను పూజించుతున్నారు. ఇది అందరికీ సాధ్యము కాదు. నేను యజ్ఞయాగాదులకు వ్యతిరేకిని కాదు అని గ్రహించవలెను.
3. భగవంతునికి పూజా విధానములో నైవేద్యమునకు పనికిరాని నల్లనేరేడు పండ్లను నీవు నాకు భక్తితో అర్పించినా నేను ప్రేమతో స్వీకరిస్తాను.
4. నా భక్తులు ఈ ప్రపంచంలో ఎక్కడ ఉన్నా వారు కష్టాలలో ఉన్న సమయంలో నా నామస్మరణ చేస్తూ పిలిచినా నేను వెంటనే వారివద్దకు ఏదో ఒక రూపంలో చేరుకొని వారిని కాపాడుకుంటాను.
13.05.2019 – ధన సంపాదన – అహంకారము
1. నా భక్తులలో కొందరు బీదకుటుంబములనుండి వచ్చి, కష్టపడి ధనార్జన చేసి ఈనాడు కోటికి పడగలెత్తారు. ధనసంపాదన తప్పు కాదు. ధనమును చూడగానే అహంకారము పెరిగిపోయి సమాజమునకు ఒక చీడపురుగులా మారిపోతున్నారు. ధనసంపాదనకు అలవాటు పడినవాడు ఇంకా ధనము సంపాదించటానికి అక్రమ మార్గాలను వెడుకుతూ తన పిల్లలకు కూడా అక్రమ సంపాదన చేయడం నేర్పుతున్నారు. ఇక ఈ సమాజంలో ఈ పధ్ధతిని ఆపకపోతే సమాజము సర్వనాశనమవుతుంది. సాయిభక్తులమని చెప్పుకుంటూ అక్రమముగా ధనము సంపాదిస్తే నేను వారిని క్షమించను. వారు శిక్షకు అర్హులు.
2. ఈ జన్మలో నీవు నీ పినతల్లి భర్త 1992 లో చనిపోయినా, శ్రీ ఉపాధ్యాయుల పేరేశ్వర సోమయాజుల గారి ఇంట పెరిగి పెద్దవాడివైనావు. నీవు ఆకుటుంబానికి ఋణపడి ఉన్నావు. వారి ఋణము తీర్చుకునేందుకు వచ్చే జన్మలో వారి కుటుంబములోజన్మించి వారి ఋణము తీర్చుకో.
14.05.2019 – సంతాన ప్రాప్తి
నిన్నటిరోజున రాజమండ్రినుండి సాయిదర్బార్ కి వచ్చిన నా భక్తుల మానసిక ఆవేదన చూసాను. నీవు వారికి మనోధైర్యము కలిగించు. భగవంతుడు తప్పక వారికి సంతానము ప్రసాదించును. భగవంతునిపై నమ్మకముతో ఆ భక్తురాలిని డాక్టర్ ని సంప్రదించమని చెప్పు. ఆమె శరీరములోని కొన్ని లోపాలను డాక్టరు సరి చేస్తారు. వారు సంతోషముగా సంసార జీవితము గడుపుతారు. వారికి కవల పిల్లలు జన్మిస్తారు. ఆ తరవాత నాకు పిండివంటలతో భోజనము పెట్టనవసరము లేదు. నాకు ఇష్టమయిన అప్పడాలతో భోజనము పెట్టమని వారికి చెప్పు. వారు నా అంకిత భక్తులు. నేను వారి సుఖసంతోషాలలో వారితోనే ఉంటానని వారికి చెప్పు.
(మరలా వచ్చే ఆదివారమ్)
(సర్వం శ్రీ సాయినాధార్పణమస్తు)
(మరలా వచ్చే ఆదివారమ్)
(సర్వం శ్రీ సాయినాధార్పణమస్తు)
No comments:
Post a Comment