శ్రీ షిరిడీ సాయితో ముఖా ముఖి
సాయిబానిస శ్రీ రావాడ గోపాలరావు
సాయి భక్తులందరికి ఒక ముఖ్య గమనిక
శ్రీ షిరిడీ సాయితో ముఖాముఖీ ని ప్రతివారమ్ చదివి ఆనందిస్తున్నమీకందరికీ
బాబా వారి శుభాశీస్సులు
శ్రీ షిరిడీ సాయితోముఖాముఖి చదువుతున్న సాయి భక్తులలోకొందరికి ఒక సందేహం వచ్చి
ఉంటుంది.
శ్రీ షిరిడీ సాయిబాబా గారు సాయిబానిసగారితో ఏవిధంగాసంభాషిస్తున్నారు? ఆయన కలలో ప్రత్యక్షంగా దర్శనమిచ్చిచెబుతున్నారా? లేక మరొక విధంగా చెబుతున్నారా? ఆయనఅడుగుతున్న ప్రశ్నలకు ప్రతిరోజు ఆయన వచ్చి సమాధానాలుచెబుతున్నారా? ఇటువంటి సందేహాలన్నిటికి సమాధానం నిన్నబాబా ద్వారా నాకు లభించింది.
సాయిబానిస శ్రీ రావాడ గోపాలరావుగారు 2019 వ.సంవత్సరం ఏప్రిల్నెల ఉగాదికి కొద్ది రోజుల ముందుగా నన్ను తన ఇంటికిఆహ్వానించారు. అప్పుడు ఆయన తన వద్ద ఉన్న కొన్ని పుస్తకాలనునాకు ఇచ్చారు. అందులో యోగి ఎమ్.కె. స్పెన్సర్ గారు (1888 – 1957) వ్రాసిన “HOW I FOUND GOD’ పుస్తకం ఒకటి. శ్రీఎమ్.కె. స్పెన్సర్ గారు కూడా మంచి సాయి భక్తులు. ఈయన 1888 సం. లో పూనాలో జన్మించారు. ఆ తరవాత కరాచీలో నివసించారు. ఈయనకు కూడా భగవంతునితో ముఖాముఖీగా మాట్లాడాలనే తపన అత్యధికంగా ఉండేది. ఈయనకు కూడా ఎన్నో ఆధ్యాత్మిక అనుభవాలు కలిగాయి.
(ఆ పుస్తకాన్ని చదవాలనే ఆసక్తి ఉన్న సాయి భక్తులు అమెజాన్ ద్వారా 'HOW I FOUND GOD' తెప్పించుకోవచ్చును)
ఆయనకు కూడా బాబా వారు సాయిబానిసగారికి ఇచ్చినట్లుగానేసందేశాలను ఇచ్చారు. ఆ పుస్తకన్ని నేను ఇంతవరకు చదవడంమొదలు పెట్టలేదు. అక్కడక్కడ రెండు మూడు వాక్యాలను చూసి ఉంటాను. ఆ పుస్తకంలో శ్రీ స్పెన్సర్ గారు తను వ్రాసిన ముందుమాటలలో ఒక అధ్బుతమయిన విషయం చెప్పారు.ముందుమాటలు మొత్తం 12 పేజీలు. నిన్న నేను ఎందుకనో ఆ పుస్తకం ఒక్కసారి చూద్దామని ముందుమాటలు గల పేజీలలో ఒకపేజీ తీసి చూసాను. బాబా ముఖాముఖీగా మాట్లాడతారా? లేకరచయిత శ్రీ సాయిబానిసగారు ఊహించి రాస్తున్నారా? అనే సందేహాల గలవారికి సమాధానం ఇప్పుడు ఆపుస్తకంలొ శ్రీ ఎమ్.కె.స్పెన్సర్ గారు చెప్పిన విషయాన్ని అనువాదం చేసి మీముందు ఉంచుతున్నాను.
1947 వ.సంవత్సరం నవంబరు నెల 5వ.తారీకున స్పెన్సర్ గారికిఆయన ఆధ్యాత్మిక గురువయిన ఋషి రామ్ రామ్ గారు ఇచ్చినసందేశం.
“ నేను నీకు చెబుతున్న విషయాలన్నిటినీ బాగా గ్రహించుకుని వాటిని ఆచరణలో పెట్టడానికి
ప్రయత్నించు. నేనునీహృదయంలోనే నివాసముండి జీవితసత్యాల గురించి బోధిస్తాను” ఈ విధంగా గురువు తన శిష్యుని హృదయంలోనే స్థిరముగా ఉండి,శిష్యునితో మాట్లాడటమనేది ఒక
ఆధ్భుతమయిన ప్రక్రియ. దానిప్రాముఖ్యత, గురుశిష్యులు ఇద్దరూ సంభాషించుకొనే విధానం, అదొకఅధ్బుతమయిన ప్రపంచం అనే చెప్పాలి. ఇంకా వివరంగా చెప్పాలంటేశిష్యునియొక్క ఆత్మ తన గురువుయొక్క ఆత్మతో నేరుగాసంభాషించే సమర్ధత కలిగి ఉంటుంది. అనివార్య కారణాల వల్ల(అనగా సంసార బాధ్యతల వల్ల) శిష్యుని
ఆత్మ మానసిక పొరలనుఛేదించుకుని బయటకు రాలేకపోయినా గురువు తన శిష్యునియొక్క
ప్రేమను గుర్తించి శిష్యుని ఆత్మలో లయమగుతాడు. తన హృదయంలోనే ఉన్న గురువు యొక్క
ఆత్మ చెప్పే మాటలను, సందేశాలనుశిష్యునియొక్క ఆత్మ వినగలదు. ఈ సిధ్ధాంతమును యోగి
స్పెన్సర్గారు షిరిడీ సాయినాధులవారితో ఆచరించారు.”
తిరిగి ఈనాడు శ్రీసాయిబానిస రావాడ గోపాలరావుగారు ఇదేసిధ్ధాంతముతో సద్గురు సాయినాధులవారితో ప్రతిదినము ఉదయంబ్రాహ్మి ముహూర్త కాలములో మాట్లాడుతున్నారని నేను గ్రహించాను.
…త్యాగరాజు
షిరిడీ సాయి భక్తులకు సాయిబానిసగా నామనసులోని మాట.
ముందుగా నా దైవము, నా సద్గురువయిన శ్రీషిరిడీ సాయినాధులపాదాలపై నా శిరస్సు ఉంచి నమస్కరించి ఈ రెండు మాటలు మీకుతెలియజేస్తాను.
నేను 1990 సంవత్సరమునుండి శ్రీసాయి సత్ చరిత్రనునిత్యపారాయణ గ్రంధముగా స్వీకరించాను. మరియు సాయిభక్తులకు సేవ చేసుకొన్నాను. అయినా తృప్తి కలగలేదు. నిత్యమునేను సాయిని ధ్యానములో నా సమస్యలకు, నా తోటి సాయిభక్తులసమస్యలకు బాబాగారినుండి పరిష్కార మార్గాలు మరియు వారిసలహాలను తీసుకుంటూ 16.03.2019 వరకు గడిపేశాను. ఆనాడుబాబా, నీకు మరణము త్వరలోనే రాబోతున్నదని చెప్పినపుడు నేనుసంతోషంగా ఒక నిర్ణయానికి వచ్చాను. బాబా, ఇన్ని సంవత్సరాలూనీవు చెప్పిన విధముగా నేను జీవించాను. ఇక మీదట ఎంత కాలంజీవించుతానో నాకు తెలియదు, అందుచేత, నిత్యము నీ ఆధ్యాత్మికధనాగారమునుండి నాకు కొంచము కొంచము ఆధ్యాత్మిక సంపదనుఇవ్వమని బాబాను కోరాను. అందుచేత 06.04.2019 వికారి నామ సంవత్సర ఉగాది పర్వదినము నుండి నేను శ్రీసాయి సత్ చరిత్ర మీదబాబాగారు నాకు స్వయంగా తెల్లవారుజామున బ్రాహ్మీముహూర్తములో ధ్యానములో నాతో మాట్లాడిన మాటలను “శ్రీసాయితో ముఖా ముఖీ” అని డైరీ వ్రాయటం ప్రారంభించాను. ఈఆధ్యాత్మిక సంపదను నేను అనుభవించాను. తోటి సాయి భక్తులతోపంచుకోవడానికి వీలుగా ఈ పుస్తకమును ముందుగా ఇంటర్ నెట్ లోప్రచురించమని నా తోటి
సాయి భక్తుడు సాయి ఉపాసక్ అయిన శ్రీఆత్రేయపురపు త్యాగరాజు గారిని కోరాను. ఇక ఈ
పుస్తకమును చదివి బాబాగారి ఆశీర్వచనాలు పొందండి.
ఇట్లు
సాయిబానిస
రావాడ గోపాలరావు
31.05.2019
హైదరాబాద్
ఇక శ్రీ షిరిడీ సాయితో ముఖాముఖీ ఈ వారం భాగమ్ చదవండి.
15.05.2019 నేను నా భక్తులనుండి ఆశించేది.
సనాతన ధర్మమును ఆచరించే నా భక్తులకు నేను ఇచ్చే సలహా – నీవు ఏపని ప్రారంభించినా, ఏ పూజ ప్రారంభించినా, ముందుగా శ్రీ మహాగణపతిని పూజించిన తరవాతనే నా పూజ ప్రారంభించు.
పదిమంది గొప్పవారికి నీవు పెద్ద పెద్ద హోటళ్ళలో విందులు చేసిన భగవంతుడు మెచ్చుకోడు. అదే ధనముతో వందమంది బీదవారికి అన్నదానము చేసిన, భగవంతుడు నీ పనికి మెచ్చుకొని నీ జీవితంలో ఏనాడూ భోజనమునకు లోటు లేకుండా చూస్తాడు. నాకు అన్నదానమంటే ప్రీతి. నేను ఏదో
ఒక రూపంలో ఆ అన్నదానములో పాలు పంచుకుంటాను.
గృహస్థ ధర్మంలో భార్యా భర్తలు ఇద్దరూ కలిసి భగవంతునికి పూజ చేసిన ఆ దంపతులను నేను సదా ఆశీర్వదిస్తాను.
నీవు విదేశాలలో ఉన్నా, మరిచిపోకుండా మరణించిన నీ తల్లిదండ్రుల పేరిట ఆబ్దీకము చేసి బీదలకు అన్నదానము చేయి. నేను తప్పకుండా అటువంటి అన్నదానములకు హాజరవుతాను. భోజనము చేస్తాను.
రాత్రి మిగిలిపోయిన అన్నమును బయట పారవేయవద్దు. దానిలో పెరుగు కలిపి అందులో ఉల్లిపాయ ముక్కలు వేసి, నాకు ఉదయము నైవేద్యముగా పెట్టినా నేను సంతోషముగా స్వీకరిస్తాను. అన్నము పరబ్రహ్మ
స్వరూపమని గుర్తుంచుకో.
స్వరూపమని గుర్తుంచుకో.
16.05.2019 - గురువారం సందేశమ్
మానవ జీవితంలో కీర్తిప్రతిష్టల కోసం జీవించటం అర్ధం లేనిది. కీర్తిప్రతిష్టలు మనము చేసే మంచి పనులతోనే వస్తాయి. కీర్తిప్రతిష్టల కోసం అరాట పడితే రాదు. అందుచేత ఇంకా ఇంగ్లీషు భాషలో నీవు రచనలు చేయాలనే
ఆలోచన వదిలిపెట్టు. నీవు తెలుగు భాషలో వ్రాస్తే ఆపుస్తకాలు నా ఇతర
భక్తులకు నచ్చిననాడు వారే నీ రచనలను ఇంగ్లీషు భాషలో
అనువదించుకుని చదువుకుంటారు.
ఆకలితో ఉన్నవాడు దొంగతనంగా నీతోటలోని జామచెట్టునుండి రెండు జామపళ్ళను కోసుకొని తిన్నా దానిని పెద్ద నేరంగా భావించకు. ఆకలితో ఉన్నవాని చేత భగవంతుడె ఆపని చేయించినాడని తలంచి వానిని శిక్షించకు.
· దొంగతనము అధర్మము కదా అని సాయిబానిసగారిని
అడిగినపుడు వారిచ్చిన సమాధానమ్
టెంబేస్వామి ఇచ్చిన కొబ్బరికాయను పుండలీకరావు బాబా ఇచ్చిన ప్రేరణతో ఆకలి వేస్తున్నపుడు దొంగతనముగా తినలేదా?
ధులియా కోర్టులో ఆ దొంగ, మాజస్ట్రేట్ ఎదుట వాంగ్మూలము ఇస్తూ తాను దొంగతనము చేయలేదనీ బాబాయే తనకు ఆనగలు ఇచ్చినారని అబధ్ధము చెప్పలేదా? ఆ దొంగలో మానసిక పరివర్తన తీసుకురావడానికి తానే ఆ
దొంగకు నగలు ఇచ్చానని బాబా చెప్పలేదా?
ఈ రెండు ఉదాహరణలనించి తెలుసుకున్న విషయమేమంటే, ఆకలితో
ఉన్నవాడు దొంగతనము చేస్తే అది తప్పు కాదని బాబా ఉద్దేశ్యమయి
ఉంటుంది. ….. త్యాగరాజు
జీవన యాత్రలో సంసారమనే సైకిలు త్రొక్కడము నీ బాధ్యత. సైకిలు
సాఫీగా నడవడానికి సైకిలు చక్రాల ఇరుసుకు మానవసంబంధాలు అనే
నల్లని గ్రీజు పూయడం సహజము. సంసార సంబాంధాలు అనే నల్లని గ్రీజును ఎక్కువగా పూయటం వలన ఆగ్రీజు నీ శరీరానికి, బట్టలకు అంటుకుని నీ జీవనాన్ని అసహ్యంగా మారుస్తుంది అనే విషయాన్ని గుర్తుంచుకో.
17.05.2019 - ఇతర గురువులతో సంబంధాలు.
ఆనాడు ద్వారకామాయికి వచ్చిన భక్తపంతుకు నేను ఇదే విషయముపై
సలహా ఇచ్చాను.
(శ్రీ సాయి సత్ చరిత్ర 26 వ.ధ్యాయాన్ని గమనించండి)
నీవు నీసద్గురువు పాదాలను నమ్ముకుని జీవించుతున్న సమయంలో
ఇతర గురువుల గురించి ఆలోచించడము. వారి వద్దకు వెళ్లటము నీకు క్రొత్త తలనొప్పులను తెచ్చిపెడతాయి. *
నీ గురువును వదిలిపెట్టి కొత్త గురువు దగ్గరకు వెళ్లటమంటే జీవితంలో
వృధ్ధాప్యంలో తిరిగి కొత్త ఉద్యోగంలో చేరటంవంటిది. అందుచేత అటువంటి
ఆలోచనలను మానుకొని ప్రశాంతంగా జీవించి నీ గమ్యమును చేరుకో.
++
*సాయి భక్తులు సాయినే తమ సద్గురువుగా నమ్మినపుడు ఇతర గురువులతో పనిలేదు.
++ఈనాటి సమాజంలో కొంతమంది వ్యక్తులు గురువులుగా చలామణీ
అవుతూ ఆశ్రమాలను నిర్మించుకొని విలాసజీవితములు గడుపుతూ ఆఖరులో తాము చేసిన తప్పుడు పనులకు జైలుపాలవటం మనం చూస్తున్నాము.
--- సాయిబానిస
18.05.2019 - ఆత్మహత్య మహాపాపం
నీవు ఆత్మహత్యకు సిధ్ధపడినపుడు ఒక్క క్షణం ఆలోచించు. నీవు క్రిందటి జన్మలో చేసుకున్న పాపాలను ఈ జన్మలో అనుభవిస్తున్నావు. ఆ పాపాలను అనుభవించలేక ఆత్మహత్య చేసుకుంటే ఈ జన్మలో మిగిలిపోయిన పాపకర్మలను వచ్చే జన్మలో అనుభవించక తప్పదు. అందుచేత
ఆత్మహత్య చేసుకోవద్దు. నీ పాపకర్మలన్నిటినీ పూర్తిగా అనుభవించి
నూతన జన్మ ఎత్తు.
ఇదే సలహాను నేను నా అంకిత భక్తుడు గోపాలనారాయణ్ అంబడేకరుకు
ఇచ్చాను.
ఇక ఆత్మహత్య చేసుకోవడానికి మూల కారణాలు చెబుతాను విను.
ఇతరులతో ఆర్ధికపరమయిన లావాదీవీలలో తలదూర్చి నీవు మోసపోయినా, నీ ధనము పోగొట్టుకున్నా విరక్తితో చనిపోవాలనిపించుతుంది. అందుచేత అటువంటి పరిస్థితులు రానీయవద్దు.
కుటుంబ పెద్దల అనుమతి లేకుండా కులాంతర వివాహాలు, మతాంతర వివాహాలు చేసుకుని వివాహానంతరము పశ్చాత్తాప పడి ఏమీ చేయలేక ఆత్మహత్య చేసుకొనేవారు కొందరు. అందుచేత అటువంటి పరిస్థితి రానీయవద్దు.
ఈ మధ్య పండించిన పంటకు గిట్టుబాటు ధర దొరకక చేసిన అప్పులు తీర్చలేక ఆత్మహత్యలు చేసుకుంటున్న రైతులను చూసాను. వారి దీనస్థితిని తోటి మానవులు అర్ధం చేసుకుని వారికి ధనసహాయం చేసి వారి ప్రాణాలను కాపాడవలసిన బాధ్యత ఈనాటి సమాజముపై ఉందని నేను భావిస్తున్నాను.
నీవు మానసిక అందోళనతో దిక్కుతోచని స్థితిలో ఆత్మహత్య చేసుకోదలచిన అ సమయంలో భక్తిప్రధానమయిన *సౌందర్యలహరి గానము విను. అది నీకు మానసిక ప్రశాంతతను కలిగిస్తుంది. నీవు అపుడు ఆత్మహత్యా ప్రయత్నము విరమించుకుంటావు.
*సౌందర్యలహరి … పరమశివుని ఆశీర్వచనాలతో శ్రీ ఆదిశంకరాచార్యులవారు సౌందర్యలహరిని వ్రాశారు. ఆశ్లోకాలను మీరు యూట్యూబ్ లో వినగలరు.
మరియు ఆశ్లోకాల అర్ధమును తెలుగు భాషలోను, ఆంగ్లభాషలోను ఇంటర్ నెట్ లో చదవగరు.
శ్రీసాయి సత్ చరిత్ర 3వ.ధ్యాయంలో బాబా స్వయంగా అన్నమాటలు…
“నేనే జగన్మాతను” మరి శ్రీసాయి మనపాలిట జగన్మాత. ఆమె గొప్పతనాన్ని సౌందర్యగాన లహరిలో విందాము…
సాయిబానిస
19.05.2019 - విష్ణుసహస్ర నామము దాని ప్రాముఖ్యత
నీవు నన్ను విష్ణుసహస్రనామము యొక్క గొప్పదనము గురించి అడిగావు కదూ..
ఆధ్యాత్మిక రంగంలో విష్ణుసహస్ర నామము తీయటి ద్రాక్షపళ్ళ గుత్తివంటిది. ఈ గుత్తిని నేను నా అంకిత భక్తుడు శ్యామాకు కూడా ఇచ్చాను.
మానసిక వత్తిడికి తట్టుకోలేక నేను బాధపడుతుంటే ఈ పుస్తకమును నేను నా గుండెలకు హత్తుకొన్నాను. భగవంతుని దయతో నామానసిక వత్తిడి తొలగిపోయింది.
వృధ్ద్యాప్యంలో మతపరమయిన పుస్తకాలు చదివి అలసిపోవద్దు. విష్ణుసహస్రనామమును నిత్యము ఎవరయినా గానము చేస్తు ఉంటే నీవు విని భగవంతుని ధ్యానించి తరించు.
వృధ్ధాప్యంలో గృహస్థాశ్రమ బరువు బాధ్యతలు పూర్తి చేసుకొని విష్ణుసహస్రనామమును నీకన్న బిడ్డగా భావించి వీలయితే చదువు. లేదా వింటూ నీప్రశాంత జీవనాన్ని కొనసాగించు.
20.05.2019 - గీతా రహస్యము
నా అంకితభక్తుడు బాపూసాహెబ్ జోగ్ చేతిలోని ఈ గీతారహస్యము అనే పుస్తకాన్ని నేను చూసాను. అందులోని పుటలను త్రిప్పి చూసిన తరువాత ఆపుస్తకమును తిరిగి జోగ్ కు ఇచ్చివేస్తూ “నీవు దీనిని పూర్తిగా చదువుము. నీకు మేలు కలుగును.” అని ఆశీర్వదించాను.
ఆ పుస్తకములో లేని ఒక రహస్యమును నీద్వారా (సాయిబానిస) నా భక్తులకు తెలియచేయదలచాను.
శ్రీకృష్ణపరమాత్ముల వారు నాయజమాని నేను వారి విధేయసేవకుడిని. శ్రీకృష్ణుని బాల్యంలో వారికి ‘కృష్ణ’ అని నామకరణము చేసిన గర్గమునిని నేను
. శ్రీకృష్ణుని చిన్నతనములోని లీలలను ‘గర్గభాగవతముగా’ రాసినది నేనే. ఈ కలియుగంలో నేను షిరిడీ సాయిగా అవతరించాను. ఈ రహస్యమును నేను హేమాద్రిపంతుకు కూడా చెప్పలేదు. ధులియా కోర్టులో నావయసు లక్షల సంవత్సరాలని, నాది దైవకులమని చెప్పాను. అందుచేత లక్షల సంవత్సరాల క్రితం నేను *గర్గమునిని, అని గుర్తించు.
*గర్గమహాముని ద్వాపరయుగంలో భరద్వాజ ఋషి(బ్రాహ్మణ) మరియు సుశీల (క్షత్రియ) దంపతులకు జన్మించారు. ఈయన శ్రీకృష్ణపరమాత్ములకు నామకరణ సంస్కారము చేయించారు. గర్గముని తండ్రి బ్రాహ్మణుడు. తల్లి క్షత్రియ వనిత. గర్గముని సోదరుడు ద్రోణాచార్యులవారు. ద్వాపరయుగంలోని గర్గమహాముని, నేటి కలియుగంలో షిరిడీ సాయినాదులవారు ఒక్కరే అని గుర్తించుదాము.
… సాయిబానిస
గర్గమహాముని జీవితచరిత్రను మీరు ఇంటర్ నెట్ లో చదవగలరు.
శ్రీ సాయి జీవిత చరిత్రలో శ్రీసాయి తాను అనేకసార్లు ద్వారకామాయిని బ్రాహ్మణమసీదు అని అన్నారు. జామ్ నేర్ చమత్కారములో బాబా మైనతాయిని రక్షించుటకు టాంగాగాను, టాంగావాలాగాను వెళ్ళి రాంగిరి బువాతో తాను ఘర్ వాల్ దేశపు క్షత్రియుణ్ణి అని చెప్పి వానికి ఫలహారము పెట్టిన సంఘటనను మరచిపోరాదు. బాబా, బ్రాహ్మణ క్షత్రియ దంపతుల వంశములో పుట్టిన గర్గమహాముని వంశమువాడని నేను భావిస్తున్నాను.
… త్యాగరాజు
21.05.2019 - గణేష్ శ్రీకృష్ణ ఖపర్డే దంపతులు
గృహస్థాశ్రమంలో జీవిస్తూ నన్ను పూజించి తరించిన దంపతులు వీరు. గృహస్థాశ్రమంలో ఉన్న స్త్రీ పురుషులు ఏవిధముగా భగవంతుని సేవించాలి అనే విషయాన్ని మనము ఖపర్దే దంపతుల జీవితమునుంచి నేర్చుకోవలసి ఉంటుంది.
నిజానికి గృహస్థాశ్రమంలో ఖపర్దేకు తన భార్యపై వ్యామోహము ఎక్కువగా ఉండేది. అది వాని ఆధ్యాత్మిక ప్రగతికి ఆటంకము కలిగిస్తూ ఉండేది. అందుచేత వారుభయులూ నా దర్శనానికి షిరిడీ వచ్చినపుడు నాలుగు నెలల తరువాత షిరిడీ వదిలి వెళ్లడానికి ఖపర్దేకు మాత్రమే ముందుగా అనుమతిచ్చాను. అ తరవాత అతని భార్యను మరి మూడు నెలలు షిరిడీలోనే ఉండమని చెప్పి ఆ తరవాత ఆమెను షిరిడీ వదలి వెళ్ళమన్నాను. ఈ విధముగా ఖపర్దేకు అతని భార్యపై వ్యామోహము తగ్గించాను. ఈ సంఘటన జరిగిన ఒక సంవత్సరానికి శ్రీమతి ఖపర్దే కాలము చేసింది. ఆ తరవాత శ్రీ ఖపర్దే జీవితముపై వైరాగ్యముతో ఆధ్యాత్మిక రంగములో ఉన్నత స్థానమును చేరుకొన్నాడు. దీని ద్వారా మనము తెలుసుకోవలసిన విషయం వానప్రస్థాశ్రమంలో భార్యపై వ్యామోహము విడనాడి భగవంతునిపై ఆలోచనలు కొనసాగిస్తూ మనము మన గమ్యము చేరుకోవాలి.
(మరికొన్ని సంభాషణలు వచ్చే ఆదివారమ్)
(సర్వం శ్రీ సాయినాధార్పణమస్తు)
No comments:
Post a Comment