29.04.2012 ఆదివారము కాంప్: విజయవాడ
ఓం సాయి శ్రీసాయి జయజయ సాయి
సాయి బంధువులకు బాబావారి శుభాశీస్సులు
సాయి.బా.ని.స. డైరీ - 1995 (26)
27.11.1995
నిన్నటి రోజున ఒక విచిత్రమైన ఆలోచన వచ్చినది. అది శ్రీసాయి ఏనాడు తన భక్తులకు సంస్కృతములో నీతి బోధలు చేయలేదు. చిన్న చిన్న పిట్ట కధలు రూపములో వారికి ఆధ్యాత్మిక నీతి బోధలు చేసేవారు. కాని నేడు ప్రతి స్వామీజీ సంస్కృతములో వేదాలునుండి, పురాణాలునుండి శ్లోకాలు తీసుకొని వాటికి వివరణలు చెబుతు గొప్పవారుగా వెలిగిపోతున్నారే! ఈనాబాధకు పరిష్కారము చూపు తండ్రి అని శ్రీసాయిని వేడుకొన్నాను. రాత్రి కలలో శ్రీసాయి ఒక స్కూల్ మాస్టర్ రూపములో దర్శనము యిచ్చి ప్రసాదించిన సందేశము. "పవిత్రమైన నదులులోని నీరు తియ్యగా ఉండి కొన్ని వందలు చేపలు జీవించటానికి ఉపయోగపడుతుంది. ఆఖరికి ఆపవిత్ర నదులు అన్నీ సముద్రములో కలవవలసినదే కదా - మరి ఆసముద్రములోని నీరు ఉప్పగా ఉన్నా ఆసముద్రము కొన్ని కోటానుకోట్ల చేపలు జీవించటానికి ఉపయోగపడుతున్నది. ఆసముద్రములోని నీరు ఉప్పగా ఉన్నా ఆపవిత్ర నదులు కలయికతో ఆసముద్రము కూడ పవిత్రముగా మారిపోతుంది. నాకోటానుకోట్ల భక్తులు సముద్రములోని చేపలువంటివారు. వారు తియ్యటినీరు (సంస్కృతము) ఉన్న నదులలో జీవించలేరు. వారి జీవనానికి ఉప్పునీరు (పామరభాష) శరణ్యము.
09.12.1995
నిన్నరాత్రి శ్రీసాయికి నమస్కరించి " ఈశేష జీవితము నీసేవకు అంకితము చేసుకొని నాఅఖరి శ్వాస నీపాదాలపై తీసుకొనే భాగ్యము ప్రసాదించు తండ్రీ" అని వేడుకొన్నాను.
శ్రీసాయి నాకోరికకు సమాధానముగా చూపిన దృశ్యము, నాయింట బోర్ పంపునుండి నీరు తోడబడుతున్నది. అనేకమంది మంచినీరు బిందెలలో పట్టుకొనుచున్నారు. అకస్మాత్ గా పంపుమోటర్ నుండి మంటలు చెలరేగి మోటారు ఆగిపోయినది. నీటి ప్రవాహము ఆగిపోయినది.
18.12.1995
నిన్నటిరోజు అంతా శ్రీసాయి నామస్మరణతో గడపినాను. ఈవిధముగా జీవితము ఆఖరువరకు శ్రీసాయి నామస్మరణచేసుకొనే భాగ్యాన్ని ప్రసాదించమని రాత్రి నిద్రకు ముందు శ్రీసాయిని ప్రార్ధించినాను. శ్రీసాయి కలలో ప్రసాదించిన దృశ్యము. "నాయింట నేను కష్ఠముతో బాధపడుతున్న సమయములో గుమ్మములో నిలబడిన ఒక ఫకీరు కనిపించినారు. ఆయన నా నామస్మరణ చేయసాగినారు. నేను ఆశ్చర్యముతో వీధిలోనికి వచ్చి ఆయనపాదాలపై శిరస్సు ఉంచి ఆయన పాదాలకు పూజ చేసినాను. ఆయనకు రెండు రూపాయల బిళ్ళలు దక్షిణగా యిచ్చినాను. ఆయన నన్ను ఆశీర్వదించినారు."
27.12.1995
నిన్నటి రాత్రి శ్రీసాయికి నమస్కరించి "భగవంతునికి భక్తునికి మధ్య ఉన్న సంబంధము తెలియచేయి తండ్రి అని వేడుకొన్నాను. శ్రీసాయి కలలో ప్రసాదించిన దృశ్యము - "అప్పుడే పుట్టిన పసిబిడ్డ తన తల్లిని గుర్తించలేదు. కాని ఆతల్లి ఆ పసిబిడ్డను తన రొమ్ములకు హత్తుకోగానే తల్లి గుండె చప్పుడును విని ఆ పసిబిడ్డ తను తల్లి గర్భములో యున్నపుడు అదే గుండె చప్పుడుతో నవమాసాలు బ్రతికినాను అనే భావనతో ప్రశాంతముగా తల్లిఒడిలో నిద్రించుతుంది.
అదే విధముగా భవతంతుడు తన భక్తుల గుండెలలో భగవన్ నామస్మరణను విని భక్తుల గుండెలలో ప్రశాంతముగా నివసించుతాడు." ఆదృశ్యాన్ని చూసిన తర్వాత భగవంతుడు పసిబిడ్డ మనస్తత్వము కలవాడు. భక్తుడు తల్లి మనస్తత్వము కలవాడు అని గుర్తించగలిగినాను.
సాయి.బా.ని.స. డైరీ - 1995 సమాప్తము
సర్వం శ్రీసాయినాధార్పణమస్తు