Tuesday, 30 April 2013

పుణ్యభూమి శిరిడీలో దొరికిన రత్నమణి సాయి - 34వ. అధ్యాయము


       
             
28.04.2013 సోమవారము

ఓం సాయి శ్రీసాయి జయజయ సాయి
సాయి బంధువులకు బాబావారి శుభాశీస్సులు
రెండు రోజులుగా ప్రచురణ చేయలేకపోయాను..నెట్ కనెక్షన్ కి అంతరాయం వల్ల. 



పుణ్యభూమి శిరిడీలో దొరికిన రత్నమణి సాయి - 
34వ. అధ్యాయము

                                       06.02.1992

ప్రియమైన చక్రపాణి,

ఈ అధ్యాయములో కూడా ఊదీ మహిమను వర్ణించినారు శ్రీహేమాద్రిపంతు.  శ్రీసాయి మహాసమాధి చెందక ముందు జరిగిన లీలలకు సాక్ష్యము శ్రీహేమాద్రిపంతు రచించిన శ్రీసాయి సత్ చరిత్ర.  1918 వ. సంవత్సరము తరవాత జరిగిన శ్రీసాయి లీలలకు సాక్ష్యము సాయి బంధువులే.  శ్రీసాయి సత్ చరిత్రలో శ్రీసాయి పలికిన మాటలపై నమ్మకము ఉంచుకో.  నమ్మకముతో "ఎవరయితే ఈ మశీదుకు వచ్చెదరో వారెన్నడు ఈ జన్మలో ఏవ్యాధి చేతను బాధపడరు".  1989 సంవత్సరమునకు ముందు నేను చాలా సార్లు కీళ్ళ నొప్పులు వ్యాధితో బాధపడినాను.  మరి 1990 సంవత్సరము తర్వాత ఈనాటి వరకు ఆవ్యాధి తిరిగి రాలేదు.  బహుశ యిది ద్వారకామాయి మహాత్మ్యము అని భావిస్తాను.  శ్రీసాయి డాక్టర్ పిళ్ళే విషయములో యిలాగ అన్నారు, నిర్భయముగా నుండమను, అతడేల పది జన్మల వరకు బాధపడవలెను?  పది రోజులలో గత జన్మ పాపమును హరింప చేయగలను."  నాదృష్ఠిలో మానవ మాత్రుడు ఎవడు యిటువంటి ధైర్యము కలిగించే మాట పలకలేడు.  సాక్షాత్తు ఆభగవంతుడే శ్రీసాయి రూపములో అవతరించి తన భక్తుల పాపాలను క్షమించి ఆభక్తునికి భగవంతునిపై ఎనలేని విశ్వాసము కలిగేలాగ చూడగలరు.  యిదే అధ్యాయములో శ్రీసాయి మానవ రూపములో అన్న మాటలు వారి ఔన్యత్యాన్ని చాటుతాయి అవి.."నేను భగవంతుడను కాను.  ప్రభువును కాను  నేను వారి నమ్మకమైన బంటును."  ఈ కలియుగములో ఎంతోమంది మహాత్ములు, యోగులు, భగవత్ స్వరూపులు జన్మించారు.  కాని వారు శ్రీసాయి మాట్లాడినట్లుగా మాట్లాడలేదు.  వారు ఎవరూ శ్రీసాయికి సాటికారు.  శ్రీసాయి అనేకమంది వ్యాధిగ్రస్తుల వ్యాధులను నయము చేసినారు.  కొంత మంది భక్తుల వ్యాధులను తానే స్వయముగా అనుభవించి వారిని వారి వ్యాధులనుండి విముక్తి గావించినారు. తన భక్తుల వ్యాధులను నయము చేసేటప్పుడు "అల్లా మాలిక్ హే - అల్లా అచ్చాకరేగా " అనేవారు.  (అందరికీ దేవుడే దిక్కు - దేవుడు అందరికి మేలు చేస్తాడు) ఈనాడు మన మధ్యయున్న యోగులు, సన్యాసులు, భగవంతుని అవతారమని చెప్పుకొనే వ్యక్తులు ఎవరైన ఈవిధమైన మాటలు అనగలగుతున్నారా!  ఒక్కసారి ఆలోచించు.  నీఆలోచనలలో శ్రీసాయిని పూర్తిగా నిలుపుకో.. శ్రీసాయి నిన్ను కాపాడుతారు.

శ్రీసాయి సేవలో

నీతండ్రి.

(సర్వం శ్రీసాయినాధార్పణమస్తు) 

(ద్వారకామాయి గీత్ మాలా లో పాత పాటల ప్రసారానికై వీక్షించండి..http://www.facebook.com/dwarakamai?ref=h )

Friday, 26 April 2013

పుణ్యభూమి శిరిడీలో దొరికిన రత్నమణి సాయి -33వ. అధ్యాయము

        
            
26.04.2013  శుక్రవారము
ఓం సాయి శ్రీసాయి జయజయ సాయి
సాయి బంధువులకు బాబావారి శుభాశీస్సులు

గత వారం రోజులుగా మన బ్లాగులో ప్రచురించలేకపోయాను.33వ. అధ్యాయం కొంచం పెద్దదిగా ఉండటంవల్ల దానిని మరలా టైప్ చేసి ప్రచురించడానికి ఆలశ్యమయింది..మధ్య మధ్యలో నెట్ కి కూడా అంతరాయం కలుగుతూ ఉంది..

పుణ్యభూమి శిరిడీలో దొరికిన రత్నమణి సాయి - 
33వ. అధ్యాయము

                                 05.02.1992

ప్రియమైన చక్రపాణి,

ఈ అధ్యాయములో శ్రీహేమాద్రిపంతు ద్వారకామాయి ధుని నుండి వచ్చిన ఊదీ (బూడిద) యొక్క మహిమను వర్ణించినారు.  నీవు శ్రీసాయి సత్ చరిత్ర చదువుచున్నపుడు ఊదీ మహిమను అర్ధము చేసుకోగలవు.  నా నిత్య జీవితములో ఊదీని నుదుట ధరించటము నిత్య కృత్యముగా మారినది.  నేను 1991 సంవత్సరము మే నెలలో కొరియా దేశము వెళ్ళినపుడు అక్కడ సామీ కంపెనీ జనరల్ మేనేజరు నన్ను ఒక ప్రశ్న వేసినారు.  నేను చాలామంది భారతీయులను కలసినాను.  కాని నుదుట ఎఱ్ఱ తిలకము బొట్టు, తెల్లటి విభూతి ధరించిన వ్యక్తిని కలియలేదు.  మొదటిసారిగ మీనుదుట ఎఱ్ఱటి తిలకము, తెల్లటి విభూతి చూస్తున్నాను దీనికి అర్ధము ఏమిటి?  ఎందుకు ఈవిధముగా నుదుట పెట్టుకోవాలి?  వీటికి దయచేసి అర్ధమును తెలియచేయండి అని కోరినారు.  నేను ఏమీ సమాధానము చెప్పాలి అనే ఆలోచనలో మునిగిపోయినాను.  వెంటనే శ్రీసాయి సత్ చరిత్రలోని 33వ. అధ్యాయములో శ్రీసాయి చెప్పిన మాటలు జ్ఞాపకానికి వచ్చినవి.  "ప్రపంచములో కనిపించు వస్తువులన్నియు బూడిదవలె అశాశ్వతములు.  పంచ భూతములచే చేయబడిన మన శరీరములన్నియు సౌఖ్యములననుభవించిన పిమ్మట పతనమై పోయి బూడిదయగును."  వెంటనే నేను యిచ్చిన సమాధానము ఇదీ - "నేను ధరించిన ఈ ఎఱ్ఱని తిలకము నాలోని ప్రాణానికి గుర్తు.  నాలోని ప్రాణము పోయిన తర్వాత ఈశరీరము మంటలలో బూడిద అగుట ఖాయము.  ఈసత్యాన్ని అనుక్షణము గుర్తు చేసుకోవటానికి ఎఱ్ఱ తిలకము బొట్టు, విభూతి పట్టీని ధరించుతాను."


Friday, 19 April 2013

పుణ్యభూమి శిరిడీలో దొరికిన రత్నమణి సాయి - 32వ.అధ్యాయం

                   
                    
                          
19.04.2013 శుక్రవారము
ఓం సాయి శ్రీసాయి జయజయ సాయి
సాయి బంధువులకు బాబావారి శుభాశీస్సులు

సాయి బంధువులందరికీ శ్రీరామనవమి శుభాకాంక్షలు

గత రెండు రోజులుగా ప్రచురణకు కొంత అంతరాయం కలిగింది.విపరీతమయిన కరెంటుకోత, ఇన్వర్టర్ ఉన్నా నెట్ కనెక్షన్ ప్రతి అయిదు నిమిషాలకు అంతరాయం కలగడం వల్ల ప్రచురించలేకపోయాను.

పుణ్యభూమి శిరిడీలో దొరికిన రత్నమణి సాయి - 

32వ.అధ్యాయం 

                                                      04.02.1992
                         
ప్రియమైన చక్రపాణి,

ఈ అధ్యాయములో శ్రీహేమాద్రిపంతు గురు శిష్యుల సంబంధము అనుబంధములపై చాలా చక్కగా వివరించినారు.  శ్రీ సాయి తనకు తన గురువుకు మధ్య ఉన్న అనుబంధమును చక్కగా వివరించి చెప్పినారు.  ఈ విషయములో నేను నీకు ఎక్కువగా చెప్పను కాని ఒకటి రెండు మాటలు చెబుతాను కొంచము విను.  



Tuesday, 16 April 2013

పుణ్యభూమి శిరిడీలో దొరికిన రత్నమణి సాయి -31వ. అధ్యాయము


           
                

16.04.2013 మంగళవారము
ఓం సాయి శ్రీసాయి జయజయసాయి
సాయి బంధువులకు బాబావారి శుభాశీస్సులు


పుణ్యభూమి శిరిడీలో దొరికిన రత్నమణి సాయి -

 31వ. అధ్యాయము

                                                               03.02.92

ప్రియమైన చక్రపాణి, 

ఈ అధ్యాయములో, శ్రీసాయి కొంత మంది భక్తులకు శిరిడీలో తన సమక్షములో ముక్తిని ప్రసాదించిన సంఘటనలు వివరింపబడినవి.  వారు చాలా అదృష్టవంతులు.  

Saturday, 13 April 2013

పుణ్యభూమి శిరిడీలో దొరికిన రత్నమణి సాయి - 30వ.అధ్యాయము

          

            

14.04.2013  ఆదివారము
ఓం సాయి శ్రీసాయి జయజయ సాయి
సాయి బంచువులకు బాబావారి శుభాశీస్సులు

పుణ్య భూమి శిరిడీలో దొరికిన రత్నమణి సాయి 30 వ.అధ్యాయము కాస్త పెద్దదిగా ఉండటం వల్ల గత మూడురోజులుగా ఇవ్వలేకపోయాను.  ఉగాదినాడు కూడా కుదరలేదు...అందుచేత కొంత ఆలస్యమయినా సాయిబంధువులందరికీ ఉగాది శుభాకాంక్షలు తెలుపుతూ, ఈ సంవత్సరం లాగే ప్రతీ సంవత్సరం అందరూ సుఖ సంతోషాలతో హాయిగా జీవితం గడిపేలా వరమివ్వమని, బాబావారి అనుగ్రహం మనందరి మీదా ఎల్లవేళలా ప్రసరింప చేయమని ప్రార్ధిస్తున్నాను. 
        


పుణ్యభూమి శిరిడీలో దొరికిన రత్నమణి సాయి - 
30వ.అధ్యాయము

                                                              02.02.1992

ప్రియమైన చక్రపాణి,

నాజీవితములో నేను గాయత్రి మంత్రమును రోజు జపించలేదు.  వేద శాస్త్రాలు పారాయణ చేయలేదు.  కాని, శ్రీసాయి సత్ చరిత్ర ప్రతిరోజు పారాయణ చేయటము వలన గాయత్రి మంత్ర జపము, వేద శాస్త్రాల పారాయణ ఫలము నిత్యము నేను అనుభవించుచున్నాను. ఈ నానమ్మకాన్ని కొందరు హేళన చేయవచ్చును.  


Wednesday, 10 April 2013

పుణ్యభూమి శిరిడీలో దొరికిన రత్నమణి సాయి - 28 వ.అధ్యాయము

       
               
                  

 10.04.2013 బుధవారము

ఓం సాయి శ్రీసాయి జయజయ సాయి
సాయి బంధువులకు బాబావారి శుభాశీస్సులు
సాయిబంధువులందరకి   శ్రీ విజయనామ సంవత్సర శుభాకాంక్షలు


పుణ్యభూమి శిరిడీలో దొరికిన రత్నమణి సాయి -  
28 వ.అధ్యాయము

                                                             01.02.1992

ప్రియమైన చక్రపాణి,
ఈ ఉత్తరములో అనాటి సాయి భక్తుల అనుభవాలను వివరించుతాను.  మద్రాసు భజన సమాజము శిరిడీకి వచ్చి శ్రీసాయి సన్నిధిలో భజన చేసినట్లు, వారి అనుభవాలను హేమాద్రిపంతు వివరించినారు.  


 

Tuesday, 9 April 2013

పుణ్యభూమి శిరిడీలో దొరికిన రత్నమణి సాయి - 28వ. అధ్యాయము

                  
                    
09.04.2013 మంగళవారము
ఓం సాయి శ్రీసాయి జయజయసాయి
సాయి బంధువులకు బాబావారి శుభాశీస్సులు


పుణ్యభూమి శిరిడీలో దొరికిన రత్నమణి సాయి - 
28వ. అధ్యాయము

                              

                                         31.01.1992
ప్రియమైన చక్రపాణి,

ఈ ఉత్తరములో నీకు 28వ. అధ్యాయముపై వివరణ యిస్తాను.  శ్రీసాయి ఏవిధముగా తన భక్తులను శిరిడీకి పిలిపించుకొన్నది వివరించుతారు శ్రీహేమద్రిపంతు.  ముఖ్యముగా శ్రీలాలా లక్ష్మీ చందును,  బరహంపూర్ లొని ఒక భక్తురాలిని శిరిడీకి రప్పించుకొన్న వైనము పరిశీలిస్తే చాలా ఆశ్చర్యము కలుగుతుంది.  శ్రీసాయిని గురించి తెలియని వ్యక్తులకు శ్రీసాయి స్వప్న దర్శనము ఇచ్చి వారిని శిరిడీకి రప్పించుకొన్నారు. దీనిని బట్టి మనము తెలుసుకోవలసిన విషయము ఏమిటి?  ఆలోచించు.  నీవే శ్రీసాయి భక్తుడువి కాకాపోయిన వెనుకటి జన్మలో నీకు శ్రీసాయికి సంబంధము ఉంటే చాలు, శ్రీసాయి ఈ జన్మలో నీకు స్వప్నములో కనిపించి నిన్ను శిరిడీకి రప్పించుకొంటారు.  దీనిని శ్రీసాయి ప్రత్యేకత లేదా గొప్పతనము అని కూడా అనవచ్చును.  శ్రీసాయి సత్ చరిత్రలో శ్రీసాయియొక్క అభిప్రాయమును శ్రీహేమాద్రిపంతు ఈ విధముగా తెలియపర్చుతారు.  "పండుగదినము గడుపుటకుగాని, తీర్ధయాత్రకు పోవుటకు గాని అప్పు చేయరాదు అనేది బాబా అభిప్రాయము".  ఇది మనబోటి సామాన్య కుటుంబీకులకు చాలా ముఖ్య విషయము.  అప్పుచేసి పూజ పునస్కారాలు, దానాలు ధర్మాలు చేయరాదు.  నాసంపాదనలో కొంత శాతము వీటి నిమిత్తము విడిగా పెట్టి ఆ డబ్బుతోనే ధార్మిక కార్యక్రమాలు నిర్వహించినాను.  నీవు కూడా ఈవిధానాన్ని పాటించిననాడు నీకు చికాకులు ఉండవు.  శ్రీసాయి తన ప్రియ భక్తులను పిచ్చుకతో పోల్చేవారు.  వారు తమ భక్తులను పిచ్చుక కాలికి దారముకట్టి లాగినట్లుగా శిరిడీకి రప్పించుకుందును అని చెప్పినారు.

శ్రీసాయికి ఉన్నప్రియ భక్తులలో ముఖ్యుడు మేఘశ్యాముడు.  అతని గురించి హేమాద్రిపంతు శ్రీసాయి సత్ చరిత్రలో వివరించినాడు.  ఆనాడు నేను మేఘశ్యాముడిని చూడలేదు.  కాని మేఘుని గురించి చదువుతుంటే నేనుకూడా మేఘశ్యాముడులాగ శ్రీసాయికి ప్రియభక్తుడిని కాగలనా లేదా అనే ఆలోచనలలో మునిగిపోతు ఉంటాను.  నిజమైనసాయి భక్తుడు కోరుకొనే కోరిక ఒక్కటే అది, శ్రీసాయి పాదాలమీద ఆఖరి శ్వాస తీసుకొని, శ్రీసాయి చేతుల మీదుగా పంచ భూతాలలో కలసిపోవాలి.  ఈఅదృష్టము మేఘశ్యామునికి లభించినది.  అటువంటి అదృష్టము కొరకు మనము    కూడా ప్రయత్నము చేయాలి.

శ్రీసాయి సేవలో

నీతండ్రి. 


(సర్వం శ్రీసాయినాధార్పణమస్తు) 
ద్వారకామాయి గీత్ మాలాలో ఆనాటి మధురగీతాలను చూడండి..
http://www.facebook.com/dwarakamai?ref=hl
షిరిడీ సాయి దర్బార్...
http://www.facebook.com/ShirdiSaidarbar1?ref=hl

Monday, 8 April 2013

శిరిడీలో దొరికిన రత్నమణి సాయి - 27వ. అధ్యాయము

               
                 
                   
08.04.2013 సోమవారము
ఓం సాయి శ్రీసాయి జయజయసాయి
సాయి బంధువులకు బాబావారి శుభాశీస్సులు

 
శిరిడీలో దొరికిన రత్నమణి సాయి - 
27వ. అధ్యాయము
                                                 30.01.1992

ప్రియమైన చక్రపాణి,

శ్రీసాయి ఏనాడు ఏ పుస్తకము చదవలేదు.  కాని, తన భక్తులచేత ఆధ్యాత్మిక రంగములో ముఖ్యమైన పుస్తకాలను తనే స్వయముగా చేతితో పట్టుకొని, ఆభక్తులను ఆశీర్వదించి, వారి చేత ఆపుస్తకాలను చదివించెను.  ఆయన తన హిందూ భక్తుల చేత చదివించిన ముఖ్య పుస్తకాలలో 1. గురుచరిత్ర 2. విష్ణుసహస్ర నామము 3. గీతా రహస్యము అనేవి ముఖ్యమైనవి.  మానవుని ఆధ్యాత్మిక రంగ అభివృధ్ధికి పుస్తక పఠనము కూడా చాలా అవసరము అని శ్రీసాయి ఈవిధముగా తెలియచేసినారు.  సాయి భక్తులు ఈ పుస్తకాలు చదివి ఆధ్యాత్మిక రంగములో ముందడుగు వేయాలని కోరుతున్నారు.  ఈ పుస్తకాల వ్యవహారములో రామదాసికి మరియు శ్యామాకు మధ్య జరిగిన ఘర్షణలో శ్రీసాయి ఇలాగ అంటారు.  "ధనము యిచ్చిన పుస్తకములనేకములు వచ్చును, కాని మనుష్యులు రారు".  ఈవిషయము నాజీవితములో అనుక్షణము జ్ఞప్తికి వస్తుంది.  ధనము ఉంది అనే అహంకారముతో నీవు ఏవష్తువునైన కొనగలవు.  కాని మనుష్యులను కొనలేవు.  అవసరమువచ్చినపుడు మంచి పనుల నిమిత్తము ధనము విరివిగా ఖర్చు పెట్టు, వెనకాడవద్దు.  ప్రతి విషయానికి ధనానికి లంకె పెట్టవద్దు.  ఎవరికైన ధన సహాయము  మరియు మర్యాద చేయవలసివచ్చినపుడు ప్రేమతో చేయి.  డబ్బు గురించి ఆలోచించుతు మనుషులను దూరంగా ఉంచకు.  ధనము ఖర్చు ఆగిపోతుంది అనే భావనతో నీబాధ్యతను నీవు చేయకపోతే భగవంతుడు ఏదో విధముగా ఆపని పూర్తి చేయించుతాడు.

ఆతర్వాత జీవించినంత కాలము ఆపని చేయలేదు అనే అసంతృప్తి నీకు మిగులుతుంది మరియు లోకులు వేసే నింద మిగులుతుంది.  ఈ విషయములో నాజీవితములో జరిగిన రెండు ఉదాహరణలు వ్రాస్తాను.  నాపినతల్లి భర్త నాతండ్రి దగ్గరనుండి ఏమీ ఆశించకుండానే నన్ను నా చిన్నతనములో తన యింట ఒక పది సంవత్సరాలు ఉంచు కొని నాకు విద్యాబుధ్ధులు నేర్పినారు.  నా ఈ శరీరములో ప్రాణము ఉన్నంత కాలము నేను నాపినతల్లి భర్తను మరచిపోలేను.  నేను సదా వారికి కృతజ్ఞుడిని. యింక నా జీవితములో ప్రవేసించిన యింకొక వ్యక్తి నామావగారు అంటే నీ తల్లియొక్క తండ్రి.  నేను ఆయన దగ్గరనుండి ధన సహాయము కోరుతాననే భయముతో ఆయన నానుండి తప్పించుకొని తిరుగుతు ఎదుట పడినపుడు నన్ను అవమానించుట వలన నేను జీవించినంత కాలము వారిని మరచిపోలేను.  మొదటి వ్యక్తిని చూచినపుడు, తలచినపుడు. తలను గౌరవము, భక్తి భావనతో క్రిందకు దించుతాను.  మరి రెండవ వ్యక్తి విషయములో గౌరవము, భక్తిలను ప్రదర్శించలేను.  అందుచేత జీవితములో ధనము ఒక్కటే ముఖ్యము కాదు అనే విషయాన్ని మరచిపోవద్దు.  శ్రీమతి ఖాపర్దే విషయములో శ్రీసాయి ఆమె భక్తికి మెచ్చి ఆమె గత జన్మల వివరాలను మనలకు తెలియపర్చుతారు.  మానవుడు మంచి పనులు చేయటము మన జన్మజన్మలలో ఏవిధముగా అభివృధ్ధి చెందుతాడు అనే విషయాన్ని తెలుసుకోవచ్చును.  మనము కూడా శ్రీసాయి ఆశీర్వచనములలో మంచి పనులు చేస్తు మంచి జన్మము పొందుదాము.
 

శ్రీ సాయి సేవలో
నీతండ్రి  

(సర్వం శ్రీసాయినాధార్పణమస్తు)

Sunday, 7 April 2013

పుణ్యభూమి శిరిడీలో దొరికిన రత్నమణి సాయి - 26వ. అధ్యాయము

      
         
       
 07.04.2013 ఆదివారము
ఓం సాయి శ్రీసాయి జయజయ సాయి
సాయి బంధువులకు బాబావారి శుభాశీస్సులు


పుణ్యభూమి శిరిడీలో దొరికిన రత్నమణి సాయి - 
26వ. అధ్యాయము
                                                   29.01.1992
ప్రియమైన చక్రపాణి,

ఈఉత్తరములో శ్రీసాయిని మానసికముగా ఏవిధముగా పూజించాలి అనేది శ్రీహేమాద్రిపంతు ఆంతరిక పూజా విధానములో వర్ణించినారు.  నిజముగా ఆవిధముగా పూజించాలి అనే తలంపు రాగానే మనసు సంతోషముతో నిండిపోతుంది.  నీవు ఎవరి పాదాలకైనా నమస్కరించు సమయములో శ్రీసాయిని మనసార తలచుకొని అవతలి వ్యక్తిలో శ్రీసాయిని చూస్తూ నమస్కారము చేయి.  ఆ అనుభూతిని, సంతోషాన్ని అనుభవించు.  శ్రీసాయి సత్ చరిత్రలో శ్రీసాయి తనతోటి యోగి యొక్క శిష్యుని చూచి పలికిన పలుకులు ఎంత గంభీరమైనవి.  "ఏమైనను కానిండు, పట్టు విడవరాదు.  నీగురునియందే యాశ్రయము నిలుపుము, ఎల్లపుడు నిలకడగానుండుము.  ఎప్పుడు వారి ధ్యానమునందే మునిగియుండుము.  మన అదృష్టము వలన మనము వారి పాదాలను నమ్ముకొన్నాము.  మన సంతోషానికి మనమనసులే సాక్షి.  శ్రీసాయి తనతోటి యోగీశ్వరులను సదా గౌరవించేవారు.  వారి సాంప్రదాయమును మనము గౌరవించాలి.  శ్రీసాయి ఆలోచనలలో ఆత్మహత్య మహాపాపము.  ఆవిషయములో శ్రీసాయి స్వయముగా ఏవిధముగా తన భక్తుడు గోపాలనారాయణ అంబాడేకర్ ను రక్షించినది శ్రీహేమాద్రిపంతు వివరించినారు.  చదివి అర్ధము చేసుకో.  జీవితములో కష్టాలు అనేవి ప్రతి మానవుడికి వస్తాయి.  వాటికి ఆత్మహత్య పరిష్కారము కాదు అంటారు శ్రీసాయి.  "కొడుకు కూడా తండ్రివలె భక్తుడు కావలెనని బాబా కోరిక" అంటారు శ్రీహేమాద్రిపన్తు.  మరి నేను కోరుకొనేది నీవు కూడా శ్రీసాయి భక్తుడుగా మారాలని -  నాకోరిక తీర్చుతావు కదూ.

నీతండ్రి


(సర్వం శ్రీసాయినాధార్పణమస్తు)

Saturday, 6 April 2013

పుణ్యభూమి శిరిడీలో దొరికిన రత్నమణి సాయి - 25వ. అధ్యాయము

      
       

            
 06.04.2013 
శనివారము
 
ఓంసాయి శ్రీసాయి జయజయ సాయి
సాయి బంధువులకు బాబావారి శుభాశీస్సులు

పుణ్యభూమి శిరిడీలో దొరికిన రత్నమణి సాయి - 
25వ. అధ్యాయము

                                                         28.01.1992

ప్రియమైన చక్రపాణి,

ఈ ఉత్తరములో శ్రీసాయి తన భక్తుల భవిష్యత్ ను ఆలోచించి, యిచ్చిన సలహాల గురించి హేమాద్రిపంతు వివరించుతారు.  శ్రీహేమాద్రిపంతు మనస్సునందు బాబా జీవిత లీలలను వ్రాయ కోరిక జనించగానే, బాబా వెంటనే అతని చేత వ్రాయించెను.  శ్రీసాయితో నా అనుభవాలను ఈవిధమైన ఉత్తరాలు ద్వారా నీకు తెలియ చేయాలని కోరిక జనించగానే బాబా వెంటనే నాకు అనుమతిని ప్రసాదించలేదు.  నీకు ఈ ఉత్తరాలు 06.01.92 తేదీనుండి వ్రాయడము మొదలుపెట్టిన తర్వాత శ్రీసాయి 22.1.92 నాడు అనుమతిని ప్రసాదించినారు.  ఈ విషయాన్ని నీకు నావెనకటి ఉత్తరములో వ్రాసినాను.  ఒకసారి దాము అన్నా, తను ప్రారంభించబోయే వ్యాపారములో శ్రీసాయి ఆశీర్వచనాలు పలికిన, ఆవ్యాపారములో వచ్చే లాభాలనుండి కొంత పాలు ఇవ్వడానికి సిధ్ధపడినపుడు శ్రీసాయి అన్న మాటలు "ప్రపంచ విషయములలో తగుల్కొనుటకు నాకిష్టము లేదు".  కొంచము విడమర్చి చెప్పాలంటే శ్రీసాయికి లంచము తీసుకోవటము యిష్టము లేదు.  మరి శ్రీసాయికి యిష్టము కాని పనులు శ్రీసాయి భక్తులు కూడా చేయరాదు అనే విషయము మనము ఎల్లపుడు జ్ఞాపకము ఉంచుకోవాలి.

శ్రీసాయి మహాసమాధికి ముందు అన్న మాటలు గుర్తు చేసుకో.  "నేను సమాధి చెందినప్పటికి  నాసమాధినుంచి నాఎముకలు మాట్లాడును.  అవి మీకు ఆశను నమ్మకమును కలిగించును.  నేనే కాక నాసమాధి కూడా మాట్లాడును, కదులును.  మనస్పూర్తిగా శరణు జొచ్చినవారితో మాట్లాడును.  నేను మీవద్దనుండనేమో అని మీరు ఆందోళన పడవద్దు.  నాఎముకలు మాట్లాడుచు మీక్షేమమును కనుగొనుచుండును.  ఎల్లపుడు నన్నే జ్ఞప్తియందుంచుకొనుడు.  నాయందే మనఃపూర్వకముగను, హృదయపూర్వకముగను, నమ్మకముంచుడు.  అప్పుడే మీరు మిక్కిలి మేలు పొందెదరు". యివి భగవంతుడు స్వయముగా తన భక్తులతో అన్నమాటలు.  నీవు కూడా ఆభగవంతుని (శ్రీసాయి) భక్తుడువి.  ఎల్లపుడు ఈమాటలను  జ్ఞాపకము చేసుకొంటు యుండు.  అవినీకు కొండంత బలాన్ని యిస్తుంది.  ధైర్యముగా జీవితములో ముందడుగు వేయి.

శ్రీసాయి సేవలో
నీతండ్రి.
(సర్వం శ్రీసాయినాధార్పణమస్తు)

Thursday, 4 April 2013

పుణ్యభూమి శిరిడీలో దొరికిన రత్నమణి సాయి - 24వ. అధ్యాయము

     
            
            
         

05.04.2013 శుక్రవారము
పుణ్యభూమి శిరిడీలో దొరికిన రత్నమణి సాయి - 

24వ. అధ్యాయము
                                                                                                     27.01.1992

ప్రియమైన చక్రపాణి,

జీవితము కష్ట సుఖాలమయము. సుఖములో ఒక చిన్న భాగము హాస్యము.  శ్రీసాయి తన భక్తులకు ఏదైన కొత్త విషయాలు తెలియచేయదలచుకొన్నపుడు సందర్భానుసారము చెప్పేవారు.  అలాగ చెప్పటములో అవసరము వచ్చినపుడు హాస్య పధ్ధతిని కూడా అనుసరించేవారు.  యితరులకు పెట్టకుండ మనము తినరాదు అనే విషయమును హాస్య పధ్ధతిలో హేమాద్రిపంతుకు చెబుతారు శ్రీసాయి.  శ్రీసాయి తన భక్తులకు చక్కని సందేశము యిచ్చినారు.  అది "నీవు తినుటకుముందు నన్ను స్మరింతువా?  నేనెల్లపుడు నీచెంత లేనా? నీవేదైన తినుటకు ముందు నాకర్పించుచున్నావా"? ఈ సందేశమును అర్ధము చేసుకొని నీవు తినే భోజనమును, నీవు త్రాగే నీరును కూడా శ్రీసాయికి మనసులో అర్పించి సేవించు.  నీజీవితము ధన్యము చేసుకో.  ఇదే విధముగా నీలోని అరిషడ్ వర్గాలు అంటే కామము, క్రోధము, లోభము, మోహము, మదము, మాత్సర్యము పామువలె బుసలు కొడుతుంటే ఆపని చేసేముందు శ్రీసాయిని ఒక్క నిమిషము ధ్యానించు. శ్రీసాయి నిన్ను సవ్యమైన మార్గములో నడిపించుతారు.  నీతోటి సాయి భక్తుడు శ్రీసాయిని పూజించే విధమునకు నీవు పూజించే విధానానికి తేడా యుండవచ్చును.  అది నీకు అనవసరము.  నీపద్దతి నీది.  వాని పధ్ధతి వానిది.  నీవు ఆవిషయములో జోక్యము చేసుకోవద్దు.

ప్రతి గురువారము శ్రీసాయిగుడికి వెళ్ళి అక్కడ హారతిలో పాల్గొంటే సరిపోదు.  శ్రీసాయిని ప్రతి జీవిలోను చూడాలి.  ఆయన నామము అనుక్షణము స్మరించాలి.  ఆయన నడచిన బాటలో నడవటానికి ప్రయత్నించాలి.  అలాగ అని సంసారము వదలి సన్యాసము తీసుకొమ్మని కాదు.  జీవితములో నీవు పూర్తి చేయవలసిన బరువు బాధ్యతలు శ్రీసాయి నామస్మరణ సహాయముతో పూర్తి చేసుకొని ఆయన ప్రేమకు పాత్రుడివి కావాలి.

శ్రీసాయి సేవలో

నీతండ్రి

(సర్వం శ్రీసాయినాధార్పణమస్తు)

Wednesday, 3 April 2013

పుణ్యభూమి శిరిడీలో దొరికిన రత్నమణి సాయి - 23వ. అధ్యాయము


   
        
                      

పుణ్యభూమి శిరిడీలో దొరికిన రత్నమణి సాయి - 
23వ. అధ్యాయము

                                                                           26.01.1992

ప్రియమైన చక్రపాణి,

ఈ ఉత్తరములో శ్రీసాయి యొక్క లీలకు గురించి నీకు ఎక్కువగా వ్రాయలేను.  కాని, నా మనస్సులో ఉన్న ఆలోచనలను నీముందు ఉంచుతాను.  శ్రీసాయి సత్ చరిత్రలో హేమాద్రిపంతు శ్రీసాయి విషయములో యిలాగ అంటారు, "నేను భగవంతుడను" అని వారెన్నడు అనలేదు.  భగవంతుని విధేయ సేవకుడనని చెప్పేవారు.  భగవంతుని ఎల్లపుడు తలచువారు.