10.04.2013 బుధవారము
ఓం సాయి శ్రీసాయి జయజయ సాయి
సాయి బంధువులకు బాబావారి శుభాశీస్సులు
సాయిబంధువులందరకి శ్రీ విజయనామ సంవత్సర శుభాకాంక్షలు
పుణ్యభూమి శిరిడీలో దొరికిన రత్నమణి సాయి -
28 వ.అధ్యాయము
01.02.1992
ప్రియమైన చక్రపాణి,
ఈ ఉత్తరములో అనాటి సాయి భక్తుల అనుభవాలను వివరించుతాను. మద్రాసు భజన సమాజము శిరిడీకి వచ్చి శ్రీసాయి సన్నిధిలో భజన చేసినట్లు, వారి అనుభవాలను హేమాద్రిపంతు వివరించినారు.
ఆసమాజములోని సభ్యుల పేర్లు తెలపలేదు. కొంతమంది శ్రీసాయి భక్తులు మద్రాసులో వారి వివరాలు సేకరించినారు. ఆ భజన సమాజములోని పెద్ద వ్యక్తి పేరు శ్రీగోవిందస్వామి మరియు ఆయన భార్య పేరు శ్రీమతి ఆదిలక్ష్మి. శ్రీగోవిందస్వామి మద్రాసులోని ట్రాం కంపెనీలో పని చేస్తూ ఉండేవారు. ఆ రోజులలో మద్రాసునుండి శిరిడీకి వ్యయ ప్రయాసలకు ఓర్చుకొని రైలులో ప్రయాణాలు సాగించుతు భక్తులు శిరిడీకి చేరుకొనేవారు. దీని వలన మనము గ్రహించవలసిన విషయము ఏమిటి అని ఆలోచించు. శ్రీసాయి అనుగ్రహము లేకుండ ఎవరు శిరిడీకి చేరలేకపోయేవారు. శ్రీసాయి సత్ చరిత్రలో హిందువులు, మహమ్మదీయ దేవతలను పూజించు సంఘటనలు వివరించబడినవి. ఆనాడు అంటే 1918 సంవత్సర ప్రాంతములో హిందువులు, మహమ్మదీయులు చాలా స్నేహముతో కలసి మెలసి యుండేవారు. కాని ఈనాడు చాలా దురదృష్టకరమైన సంఘటనలు జరుగుటవలన హిందూ, మహమ్మదీయుల మధ్య స్నేహము కరువు అయిపోయినది. నేను క్రిందటి సంవత్సరము భోపాల్ కు స్వంత పనిమీద వెళ్ళి వస్తున్నాను. రైలులో అనుక్షణము శ్రీసాయి నామము జపించుచున్నాను. ఒక స్టేషన్ లో రైలు ఆగి తిరిగి బయలుదేరినది. ఒక వృధ్ధుడు సుమారు 65 సంవత్సరాల పైబడియుండును. తెల్లని గడ్డము తెల్లని తల జుట్టు, శరీరము దబ్బపండు రంగులో యున్నది. ఆజానుభావుడు పరిగెత్తుకుంటు వచ్చి నేను ఉన్న రైలు పెట్టెలో ఎక్కి ఏమాత్రము ఆయాసము పడకుండ చిరునవ్వుతో నన్ను చూడసాగినారు. అతను వేసుకొన్న దుస్తులు మాత్రము కాలేజీ కుఱ్ఱవాడు వేసుకొనే దుస్తులువలెనున్నాయి. ఆయనను చూస్తు ఉంటే (శ్రీసాయి సత్ చరిత్రలో "మీరు వృధ్ధులుగా గనబడుచున్నారు. మీవయస్సు మీకు తెలియునా బాబా?" నేను ముసలివాడననుకొనుచున్నావా? నాతో పరుగెత్తి చూడు" యిట్లనుచు బాబా పరుగిడమొదలిడెను. ) శ్రీసాయిబాబా అనే భావన పొందినాను. శ్రీహేమాద్రిపంతు తెండూల్కర్ చదువు విషయములో శ్రీసాయి ప్రకటించిన లీలలను వివరించినారు. నీ ఎంసె.ట్ పరీక్షలో నీకు శ్రీసాయి చేసిన సహాయమును తలచుకుంటు ఉంటే ఆనాడు శ్రీసాయి తెండూల్కర్ కు చేసిన సహాయము నిజము అని నేను నమ్ముతున్నాను. తెండూల్కర్ తండ్రి రఘునాధ్ రావుగారు ఉద్యోగ విరమణ అనంతరము ఆయనకు యివ్వవలసిన నెలసరి పించను విషయములో శ్రీసాయి చేసిన సహాయము మరువలేనిది. మరి నేను ఉద్యోగ విరమణ చేసిన అనంతరము నేను గౌరవముగా బ్రతకటానికి కావలసిన పించను నాకు అనుగ్రహించి నేను ఎవరి ముందుచేయిచాపనిస్థితిలో నాజీవితాన్ని శ్రీసాయి నడిపించుతారు అని నేను నమ్ముతున్నాను. దీనికి కాలమే సాధ్యముగా నిలబడుతుంది.
నేను చదివిన పుస్తకములో కెప్టెన్ జహంగీర్ ను శ్రీసాయి కాపాడిన విధానము చూస్తే ఆనాడు గజేంద్రుడిని శ్రీహరి కాపాడిన విధముగా యుంది. అవి ప్రపంచ యుధ్ధము జరుగుతున్న రోజులు. శ్రీ కాప్టెన్ జహంగీర్ ఒక నౌకలో పెద్ద అధికారి. అనౌక సముద్రములో మునిగిపోతున్న సమయములో కెప్టెన్ జహంగీర్ శ్రీసాయియొక్క సహాయము కోరుతారు. శ్రీసాయి ద్వారకామాయినుండి తన శక్తితో మునిగిపోతున్న నౌకను రక్షించుతారు. ఈవిషయాన్ని కెప్టెన్ జహంగీర్ స్వయముగా ద్వారకామాయిలో తోటి సాయిబబంధువుల ముందు వివరించుతారు. దీనినిబట్టి శ్రీసాయి "సూపర్ మాన్" అని అనడములో ఎవరు ఆశ్చర్యపడనవసరములేదు. శ్రీసాయి సత్ చరిత్రలో శ్రీసాయి యిలాగ అంటారు "ఆనాణెము విలువ 25 రూపాయలకంటే హెచ్చైనది. శ్యామా! ఈ రూపాయిని తీసుకొని మనకోశములో నుంచుము." ఈమాటలు జ్ఞాపకము వచ్చినపుడు నాకు పూజామందిరములో ఉన్న రెండు కానులు గుర్తుకు వస్తాయి. ఒక కాని 1862 సంవత్సరములో ముద్రించబడినది. యికొక కాని 1919 సంవత్సరములో ముద్రించబడినది. బహుశ శ్రీసాయి అశీర్వచనాలతో ఆరెండు కానులు మన పూజామందిరములోనికి వచ్చి యుంటాయని నానమ్మకము. ఆరెండు కానులు నాకు నాదగ్గర ఉన్న పాత నాణేల డబ్బాలో దొరికినవి. అంతకంటే ఎక్కువ వివరాలు నేను చెప్పలేను. దేనికైన నమ్మకము ముఖ్యము అనేది గుర్తుంచుకో.
శ్రీసాయిపై నమ్మకముతో
నీతండ్రి
(సర్వం శ్రీసాయినాధార్పణమస్తు)
No comments:
Post a Comment