Saturday 6 April 2013

పుణ్యభూమి శిరిడీలో దొరికిన రత్నమణి సాయి - 25వ. అధ్యాయము

      
       

            
 06.04.2013 
శనివారము
 
ఓంసాయి శ్రీసాయి జయజయ సాయి
సాయి బంధువులకు బాబావారి శుభాశీస్సులు

పుణ్యభూమి శిరిడీలో దొరికిన రత్నమణి సాయి - 
25వ. అధ్యాయము

                                                         28.01.1992

ప్రియమైన చక్రపాణి,

ఈ ఉత్తరములో శ్రీసాయి తన భక్తుల భవిష్యత్ ను ఆలోచించి, యిచ్చిన సలహాల గురించి హేమాద్రిపంతు వివరించుతారు.  శ్రీహేమాద్రిపంతు మనస్సునందు బాబా జీవిత లీలలను వ్రాయ కోరిక జనించగానే, బాబా వెంటనే అతని చేత వ్రాయించెను.  శ్రీసాయితో నా అనుభవాలను ఈవిధమైన ఉత్తరాలు ద్వారా నీకు తెలియ చేయాలని కోరిక జనించగానే బాబా వెంటనే నాకు అనుమతిని ప్రసాదించలేదు.  నీకు ఈ ఉత్తరాలు 06.01.92 తేదీనుండి వ్రాయడము మొదలుపెట్టిన తర్వాత శ్రీసాయి 22.1.92 నాడు అనుమతిని ప్రసాదించినారు.  ఈ విషయాన్ని నీకు నావెనకటి ఉత్తరములో వ్రాసినాను.  ఒకసారి దాము అన్నా, తను ప్రారంభించబోయే వ్యాపారములో శ్రీసాయి ఆశీర్వచనాలు పలికిన, ఆవ్యాపారములో వచ్చే లాభాలనుండి కొంత పాలు ఇవ్వడానికి సిధ్ధపడినపుడు శ్రీసాయి అన్న మాటలు "ప్రపంచ విషయములలో తగుల్కొనుటకు నాకిష్టము లేదు".  కొంచము విడమర్చి చెప్పాలంటే శ్రీసాయికి లంచము తీసుకోవటము యిష్టము లేదు.  మరి శ్రీసాయికి యిష్టము కాని పనులు శ్రీసాయి భక్తులు కూడా చేయరాదు అనే విషయము మనము ఎల్లపుడు జ్ఞాపకము ఉంచుకోవాలి.

శ్రీసాయి మహాసమాధికి ముందు అన్న మాటలు గుర్తు చేసుకో.  "నేను సమాధి చెందినప్పటికి  నాసమాధినుంచి నాఎముకలు మాట్లాడును.  అవి మీకు ఆశను నమ్మకమును కలిగించును.  నేనే కాక నాసమాధి కూడా మాట్లాడును, కదులును.  మనస్పూర్తిగా శరణు జొచ్చినవారితో మాట్లాడును.  నేను మీవద్దనుండనేమో అని మీరు ఆందోళన పడవద్దు.  నాఎముకలు మాట్లాడుచు మీక్షేమమును కనుగొనుచుండును.  ఎల్లపుడు నన్నే జ్ఞప్తియందుంచుకొనుడు.  నాయందే మనఃపూర్వకముగను, హృదయపూర్వకముగను, నమ్మకముంచుడు.  అప్పుడే మీరు మిక్కిలి మేలు పొందెదరు". యివి భగవంతుడు స్వయముగా తన భక్తులతో అన్నమాటలు.  నీవు కూడా ఆభగవంతుని (శ్రీసాయి) భక్తుడువి.  ఎల్లపుడు ఈమాటలను  జ్ఞాపకము చేసుకొంటు యుండు.  అవినీకు కొండంత బలాన్ని యిస్తుంది.  ధైర్యముగా జీవితములో ముందడుగు వేయి.

శ్రీసాయి సేవలో
నీతండ్రి.
(సర్వం శ్రీసాయినాధార్పణమస్తు)

No comments:

Post a Comment