Wednesday 3 April 2013

పుణ్యభూమి శిరిడీలో దొరికిన రత్నమణి సాయి - 23వ. అధ్యాయము


   
        
                      

పుణ్యభూమి శిరిడీలో దొరికిన రత్నమణి సాయి - 
23వ. అధ్యాయము

                                                                           26.01.1992

ప్రియమైన చక్రపాణి,

ఈ ఉత్తరములో శ్రీసాయి యొక్క లీలకు గురించి నీకు ఎక్కువగా వ్రాయలేను.  కాని, నా మనస్సులో ఉన్న ఆలోచనలను నీముందు ఉంచుతాను.  శ్రీసాయి సత్ చరిత్రలో హేమాద్రిపంతు శ్రీసాయి విషయములో యిలాగ అంటారు, "నేను భగవంతుడను" అని వారెన్నడు అనలేదు.  భగవంతుని విధేయ సేవకుడనని చెప్పేవారు.  భగవంతుని ఎల్లపుడు తలచువారు. 




 హేమాద్రి పంతు ఈవిధముగా శ్రీ సాయిని గురించి వ్రాయడము ఏమిటో! శ్రీసాయి సాక్షాత్తు భగవంతుని అవతారము కదా, అని నీవు నేను అంటాము.  యిక్కడ బాబాయొక్క గొప్పతనమును మనము గుర్తించాలి.  శ్రీసాయి బ్రహ్మ జ్ఞాని, సాక్షాత్తు భగవంతుడే.  తను భగవంతుడు యొక్క అవతారమైనా, మానవ జన్మ ఎత్తిన తర్వాత మానవుడు ఏవిధముగా బ్రతకాలి అనేది తన తోటి మానవులకు తెలియచేయటానికి  మరియు మానవులలో అహంకార రహితమైన జీవితము ఏవిధముగా ఉండాలి అని తెలియచేయడానికి శ్రీసాయి ఎన్నడు తాను భగవంతుడిని అని అనలేదు.  వారు భగవంతుని విధేయ సేవకుడిని అని మాత్రము అనేవారు,  గుర్తుంచుకో.  శ్రీసాయి అంటారు, "నానా ! ఎవరికైతే ఉల్లిని జీర్ణించుకొనే శక్తి కలదో వారే దానిని తినవలెను"  ఈ విషయముపై నా ఆలోచనలు నీకు తెలియ చేస్తాను విను.- జీవితమును మనము ఒక ఉల్లిపాయతో పోల్చవచ్చును.  ఉల్లిపాయ మీద ఉన్న పొరలును ఒక్కొక్కటే తీసి వేస్తు వెళ్ళు.  ఆఖరులో నీకు రుచికరమైన తియ్యటి (ఘాటులేని) ఉల్లి దొరుకుతుంది తనటానికి.  జీవితము అనే ఉల్లి మీద ఉన్న పొరలే అరిషడ్ వర్గాలు.  నీవు ఆ అరిషడ్ వర్గాలను అంటే కామ, క్రోధ, లోభ, మోహ, మద, మాత్సర్యాలు తొలగించుకొని జీవించు అని తన భక్తునికి సందేశము యిచ్చినారు.  మరి శ్రీసాయి అరిషడ్ వర్గాలు అనే పొరలు కలిగిన ఉల్లిపాయను కూడా తినివేసి వాటి నామ రూపాలు లేకుండ జీర్ణించుకొనే శక్తి కలిగినవారు అని మనము గుర్తించాలి.  మన పెద్దలు చెప్పిన సామెత గుర్తు ఉందా - "ఉల్లి చేసే మేలు తల్లి కూడా చేయలేదు"  కాని, యిక్కడ చిన్న వివరణ చేస్తాను "అరిషడ్ స్వర్గాలు అనే పొరలును తల్లి శ్రీసాయి తీసివేసి ఆ ఉల్లిని తన పిల్లలకు పెట్టి ఆపిల్లలకు మేలు చేస్తుంది ఆతల్లి (శ్రీ సాయిమాత).   ఆనాటి సమాజములో ఉన్న చాదస్తాలను శ్రీసాయి వ్యతిరేకించినారు.  ఆవిధముగా వారిలోని అజ్ఞానమును తొలగించి వారిలో జ్ఞానమును కలిగించినారు.  ఈ విషయములో శ్రీహేమాద్రిపంతు రెండు ఉదాహరణలు సాయి సత్ చరిత్రలో వ్రాసినారు.  1. కలరా వ్యాపించి యున్న సమయములో కట్టెల బండ్లను గ్రామములోనికి రానీయరాదు. 2. గ్రామములో మేకను కోయరాదు.  ఈ రెండిటిని శ్రీసాయి ధిక్కరించి చాదస్తాలను నిర్మూలించినారు.

మూఢ నమ్మకాలు, చాదస్తాలు అంటే శ్రీసాయికి కిట్టవు అని చెప్పినాను కదా.  మూఢ నమ్మకాలు విషయము ఆలోచించుదాము.  1947 సంవత్సరములో శ్రీదయాభాయి దామోదర్ దాస్ మెహతా బొంబాయి నివాసి టైఫాయిడ్ జ్వరముతో బాధపడుతున్నపుడు అతను తన మిత్రుల మాటపై ఎవరో మంత్రగాడు యిచ్చిన తావీదు మెడలో కట్టుకొన్నాడు. జ్వరము తగ్గడము బదులు దుష్ఠశక్తులు అతనిని పీడిస్తున్నాయి అనే భావన కలిగినది.  రాత్రివేళ జ్వర తీవ్రత ఎక్కువగా ఉంది.  అతను శ్రీసాయి రక్షణ కోరుతాడు.  శ్రీసాయిని మనసార  పిలుస్తాడు.  అటువంటపుడు అతని మంచము ప్రక్కన యున్న శ్రీసాయిబాబా పటమునుండి వినబడిన మాటలు "ఎందులకు భయపడుతావు.  నేను ఉదయమునుండి నీరక్షణకోసము కఱ్ఱ చేతిలో పెట్టుకొని నీమంచము దగ్గర నిలబడినానే మరి యింకా ఆమెడలో తావీదు దేనికి, దానిని వెంటనే తీసి పారవేయి" శ్రీ మెహతా ఆవిధముగా చేసినారు.  ఆతరువాత శిరిడీకి వెళ్ళి శ్రీసాయి సమాధికి నమస్కారము చేసి పూర్తి ఆరోగ్యము పొందినారు.  దీనిని బట్టి శ్రీసాయి భక్తులు గ్రహించవలసినది ఏమిటి మూఢాచారాలకు, మూఢనమ్మకాలకు దూరముగా ఉండాలి అనే విషయము.  నీ జీవితములో ఎన్ని కష్టాలు, అవాంతరాలు వచ్చిన శ్రీసాయి వెలిగించిన ధునిలోని విభూతిని శ్రీసాయిపై నమ్మకముతో నుదుట పెట్టుకొని కొంత విభూతిని ఔషధముగా నీళ్ళలో కలపి త్రాగి, మానసిక బాధలు శారీరిక బాధలు తొలగించుకో.

శ్రీసాయి సేవలో
నీ తండ్రి
(సర్వం శ్రీసాయినాధార్పణమస్తు)

No comments:

Post a Comment