Friday, 26 April 2013

పుణ్యభూమి శిరిడీలో దొరికిన రత్నమణి సాయి -33వ. అధ్యాయము

        
            
26.04.2013  శుక్రవారము
ఓం సాయి శ్రీసాయి జయజయ సాయి
సాయి బంధువులకు బాబావారి శుభాశీస్సులు

గత వారం రోజులుగా మన బ్లాగులో ప్రచురించలేకపోయాను.33వ. అధ్యాయం కొంచం పెద్దదిగా ఉండటంవల్ల దానిని మరలా టైప్ చేసి ప్రచురించడానికి ఆలశ్యమయింది..మధ్య మధ్యలో నెట్ కి కూడా అంతరాయం కలుగుతూ ఉంది..

పుణ్యభూమి శిరిడీలో దొరికిన రత్నమణి సాయి - 
33వ. అధ్యాయము

                                 05.02.1992

ప్రియమైన చక్రపాణి,

ఈ అధ్యాయములో శ్రీహేమాద్రిపంతు ద్వారకామాయి ధుని నుండి వచ్చిన ఊదీ (బూడిద) యొక్క మహిమను వర్ణించినారు.  నీవు శ్రీసాయి సత్ చరిత్ర చదువుచున్నపుడు ఊదీ మహిమను అర్ధము చేసుకోగలవు.  నా నిత్య జీవితములో ఊదీని నుదుట ధరించటము నిత్య కృత్యముగా మారినది.  నేను 1991 సంవత్సరము మే నెలలో కొరియా దేశము వెళ్ళినపుడు అక్కడ సామీ కంపెనీ జనరల్ మేనేజరు నన్ను ఒక ప్రశ్న వేసినారు.  నేను చాలామంది భారతీయులను కలసినాను.  కాని నుదుట ఎఱ్ఱ తిలకము బొట్టు, తెల్లటి విభూతి ధరించిన వ్యక్తిని కలియలేదు.  మొదటిసారిగ మీనుదుట ఎఱ్ఱటి తిలకము, తెల్లటి విభూతి చూస్తున్నాను దీనికి అర్ధము ఏమిటి?  ఎందుకు ఈవిధముగా నుదుట పెట్టుకోవాలి?  వీటికి దయచేసి అర్ధమును తెలియచేయండి అని కోరినారు.  నేను ఏమీ సమాధానము చెప్పాలి అనే ఆలోచనలో మునిగిపోయినాను.  వెంటనే శ్రీసాయి సత్ చరిత్రలోని 33వ. అధ్యాయములో శ్రీసాయి చెప్పిన మాటలు జ్ఞాపకానికి వచ్చినవి.  "ప్రపంచములో కనిపించు వస్తువులన్నియు బూడిదవలె అశాశ్వతములు.  పంచ భూతములచే చేయబడిన మన శరీరములన్నియు సౌఖ్యములననుభవించిన పిమ్మట పతనమై పోయి బూడిదయగును."  వెంటనే నేను యిచ్చిన సమాధానము ఇదీ - "నేను ధరించిన ఈ ఎఱ్ఱని తిలకము నాలోని ప్రాణానికి గుర్తు.  నాలోని ప్రాణము పోయిన తర్వాత ఈశరీరము మంటలలో బూడిద అగుట ఖాయము.  ఈసత్యాన్ని అనుక్షణము గుర్తు చేసుకోవటానికి ఎఱ్ఱ తిలకము బొట్టు, విభూతి పట్టీని ధరించుతాను."



ఈ సమాధానము ఆకొరియా దేశస్తుని చాలా ఆశ్చర్యపరచినది.  వెంటనే తన డైరీలో వ్రాసుకొన్నాడు.  శ్రీసాయి హేమాద్రిపంతుకు ఊదీ గురించి చెప్పిన వివరణను నేను తిరిగి 1991లో  కొరియా దేశములో చెప్పగలగటము సాయి బంధుగా నాకు చాలా తృప్తిని కలిగించినది.

1904 - 1905 సంవత్సరములో నానాసాహెబు చాందోర్కర్ కుమార్తె ప్రసవ వేదన పడుతున్న సమయములో శ్రీసాయి శిరిడీనుండి రామ్ గిరి బువా అనే సన్యాసితో ఊదీని నానాసాహేబు చందోర్కర్ యింటికి పంపి ప్రసవ వేదన పడుతున్న మైనతాయిని కాపాడిన వైనము లోకుల దృష్టిలో నమ్మశక్యము కానిది.  సాయి బంధువుల దృష్టిలో అది శ్రీసాయి చూపిన లీల.  ఊదీ మహిమను నేను కళ్ళతో చూసిన సంఘటన తెలియచేస్తాను.  1991 అక్టోబరు నెలలో ఒకరోజు సాయంత్రము నామిత్రుడు శ్రీహోతా కామేశ్వ్రరరావు నాయింటికి వచ్చి తన తమ్మునికి మరుసటి రోజున గుండెకు ఆపరేషన్ (బై పాస్ సర్జరీ) నిజాం ఆసుపత్రిలో జరుగుతుంది రక్త దానము చేయండి అని కోరినారు.  సరే మరుసటి రోజు ఉదయము ఆసుపత్రికి వచ్చి రక్త దానము చేసెదను అని మాట యిచ్చినాను.  మరుసటి రోజు ఉదయము స్నానము చేసి శ్రీసాయి విభూతి పొట్లము తీసుకొని శ్రీసాయిని ప్రార్ధించి సందేశము కోరినాను.  నేను కండ్లు మూసుకొని శ్రీసాయినామ స్మరణతో శ్రీసాయి సత్ చరిత్రలో ఒక పేజీ తీసినాను.  అది 33వ. అధ్యాయములో ని పేజీ.  పేజీ పూర్తిగా చదివినాను.  శ్రీసాయి సందేశము అందు స్పష్టముగా యున్నది అది "గండము గడచినదని చెప్పిరి".  ఈ సందేశమును మనసులో దాచుకొని ఆసుపత్రికి వెళ్ళి రక్త దానము చేసి విభూతి పొట్లము విప్పి రోగి నుదుట ఊదీ బొట్టు పెట్టి యింటికి తిరిగి వచ్చినాను.  సాయంత్రము శ్రీకామేశ్వరరావుగారు నన్ను కలసి నాకు చెప్పిన మాటలు నీకు వ్రాస్తున్నాను. వాటిని అర్ధము చేసుకో.  డాక్టర్లు ఈరోజున మాతమ్ముని పరీక్ష చేసినారు.  పెద్ద ఆపరేషన్ చేయనవసరము లేదు.  గాలి బుడగను గుండెకు వెళ్ళే రక్త నాళములో పంపి ఆనాళములో ఉన్న అడ్డమును తొలగించుతారట.  ఈ చిన్న ఆపరేషన్ ఒక రెండు రోజుల తర్వాత చేస్తారు".  ఈ మాటలు విన్న తర్వాత ఉదయము శ్రీసాయి యిచ్చిన సందేశము గండము గడచినది అని చెప్పిరి" గుర్తుకు వచ్చినది.  ఈవిషయము శ్రీకామేశ్వరరావు గారికి తెలిపినాను.  శ్రీసాయి సత్ చరిత్రలోని సందేశము చూపినాను.  శ్రీకామేశ్వ్రరావు గారు నాసమక్షములో శ్రీసాయికి ధన్యవాదాలు తెలియచేసినారు.  యిది అంతా ద్వారకామాయిలోని ధునిలోని ఊదీ మహిమ అని నేను నమ్ముతాను. ఇదే అధ్యాయములో శ్రీహేమాద్రిపంతు యిలాగ వ్రాసినారు. "ఎవరయితే బాబాను ఒకసారి హృదయపూర్వకముగా ప్రేమించెదరో వారు ఎక్కడ ఉన్నప్పటికి ఎట్టి సమయమందుగాని బాబానుంచి తగిన జవాబు పొందెదరు.  వారెల్లపుడు మనప్రక్కనే యుందురు.  ఏరూపములోనో భక్తునకు దర్శనము యిచ్చి వాని కోరికను నెరవేర్చెదరు.  "యిది అక్షరాల నిజము.  నాజీవితములో జరిగిన కొన్ని సంఘటనలు నీకు చెబుతాను. 1991 లో గోదావరి పుష్కరాలకు వెళ్ళి తిరిగి వస్తున్నాను.  రాజమండ్రి స్టేషన్ లో నామేనమామ ఒక చిన్న ట్రంకు పెట్టి యిచ్చి దానిని హైదరాబాద్ లోని మన బంధువులకు అప్పగించమని కోరినాడు. నాదగ్గర ఒక చేతి సంచి మాత్రమే యున్నది.  లగేజీ ఎక్కువగా లేని కారణము చేత నేను ఆపెట్టెను హైదరాబాద్ లో మన బంధువులకు అప్పగించటానికి అంగీకరించినాను.  సికంద్రాబాద్ స్టేషన్ లో గేటు దగ్గర ఉన్న టికెట్ కలక్టర్ ఈపెట్టెను తూకము వేయవలెను అని చెప్పినాడు నేను దానికి అంగీకరించినాను.  పెట్టెతోపాటు నాచేతి సంచి కూడా తూకము వేయవలసి వచ్చినది.  మొత్తము మీద 10 కిలోలు ఎక్కువ బరువు ఉన్నది.  దానికి డబ్బు కట్టవలెను అని టికెట్టు కలెక్టర్ అనగానే నేను ఆ చేతి సంచిని తూకము వేయవద్దు అని కోరినాను.  అతను అంగీకరించలేదు.  మొత్తము 102/- రూపాయలు జరిమానా విధించినారు.  నాదగ్గర 20/- రూపాయలు మాత్రమే యున్నది.  యింటికి వెళ్ళి డబ్బు తెచ్చి సామానులు విడింపించుకోవలసినది అని ఆ టికెట్ కలెక్టర్ చెప్పినాడు.  ఆపెట్టి నాది కాదని అది ఒక స్నేహితునిది అని దయచేసి వదిలి పెట్టవలసినది అని ఎంత వేడుకొన్నా ఆటికెట్టు కలెక్టర్ అంగీకరించలేదు.  నాకు ఏమీతోచక శ్రీసాయినాధుని సహాయము కోరినాను.  కళ్ళలో నీరు వస్తున్నది.  ప్లాట్ ఫారం మీద జనము నన్ను దొంగగా భావించి తమాషా చూస్తున్నారు.  తల ఎత్తలేని స్థితిలో ఉన్నాను.  యింతలో తెల్ల దుస్తులు వేసుకొన్న రైల్వే అధికారి అక్కడకు వచ్చి నాభుజము మీద చేయి వేసి నన్ను ఓదార్చుతూ నాకు త్రాగడానికి చల్లని మంచి నీరు యిచ్చినారు.  ఎక్కడనుండో ఒక స్త్రీ వచ్చి నన్ను పట్టుకొన్న  టికెట్టు కలక్టెరుతో స్నేహముగా మాట్లాడుతున్నది.  నాకు మంచి నీరు యిచ్చిన రైల్వే అధికారి ఒక రైల్వే కూలీని పిలిచి నన్ను నాసామానులను ఆటొ రిక్షా వరకు తీసుకొని వెళ్ళమని ఆజ్ఞాపించినారు.  నన్ను నేను నమ్మలేకపోయినాను.  ఆ రైల్వే అధికారిలో నా సాయిని నేను చూడగలిగినాను.  రెండు చేతులతో నమస్కరించి, స్టేషన్ బయటకు వచ్చి ఆటోలో యింటికి చేరుకొన్నాను.  సికంద్రాబాద్ స్టేషన్ లో నేను మానసికమైన బాధ పడుతున్నపుడు నేను శ్రీసాయినాధుని సహాయము కోరినాను.  శ్రీసాయి ఒక పెద్ద రైల్వే అధికారి రూపములో వచ్చి నాబాధను అర్ధము చేసుకొని నన్ను ఓదార్చి నాకు గ్లాసుడు చల్లటి మంచినీరు యిచ్చి నన్ను కాపాడినారా?  అనేది నాలో మెదలిన ప్రశ్న.  ఈప్రశ్నకు నేను యిచ్చే జవాబు శ్రీసాయి స్వయముగా మనిషి రూపములో వచ్చి నన్ను ఆదుకొన్నారు అని పూర్తి విశ్వాసము, నమ్మకముతో చెబుతాను. ఈ నానమ్మకాన్ని సాయి బంధువులు కాదనలేరని నేను తలుస్తాను.  1991 సంవత్సరములో నాచిన్ననాటి స్నేహితుడు రవీద్రనాధ్ తల్ల్లి అజ్మీరులో స్వర్గస్తురాలు అయినది.  ఆవార్త తెలియగానే అజ్మీరు వెళ్ళి నాస్నేహితుని ఓదార్చినాను.  నాస్నేహితుడు అజ్మీరు వచ్చినావు కదా యిక్కడ ఒక ముస్లిం ఔలియా యొక్క దర్గా యున్నది దర్శనము చేసుకొని రమ్మనమని తన దగ్గర పనివాడిని తోడుగా పంపినాడు.  అజ్మీరుకు వచ్చిన ప్రతివారు మతపరమైన భేదము లేకుండ ఆదర్గాను సందర్శించుతారు.  నాస్నేహితుడు ఆదర్గాను దర్శించమని చెప్పినపుడు సాక్షాత్తు శ్రీసాయినాధుడు నన్ను ఆదర్గాను దర్శించమని చెప్పినట్లుగ భావించినాను.  నేను నాస్నేహితుని పనివాడు కలసి రోడ్డు వరకు వచ్చి ఒక ఆటోలో అజ్మీరులోని గరీబ్ నవాజ్ చిత్సిగారి దర్గాకు బయలుదేరినాము.  ఆటో ఒక కిలో మీటరు నడచిన తర్వాత రోడ్డ్ల్లుమీద ఒక ముసలివాడు ఆటోను ఆపి తనను దర్గా దగ్గర రోడ్డుమీద దింపమని ఆటో డ్రైవరు ను కోరినాడు.  ఆటో డ్రైవరు నాలుగు రూపాయలు అడిగితే అతను రెండు రూపాయలు మాత్రమే యిస్తాను అని చెప్పినారు.  నేను ఆటో డ్రైవరుకు నచ్చ చెప్పటముతో ఆముసలివానిని కూడా ఆటోలో ఎక్కించుకొన్నాము.  ఆటో దర్గా దగ్గరకు చేరుతున్న సమయములో ఆటోనుండి ముసలివాడు దిగి రెండు రూపాయలు యివ్వబోతుంటే నేను అంగీకరించలేదు.  నేనే ఆరెండు రూపాయలు ఆటో డ్రైవరుకు యిస్తాను అని చెప్పి ఆయనకు నమస్కరించినాను.  ఆముసలివాని చిరునవ్వులో శ్రీసాయినాధుని చూడగలిగినాను.  ఆముసలివాడు తన జేబునుండి ఒక చిన్న మందు సీసా తీసి యిచ్చి విపరీతమైన తలనొప్పి యుంటే ఈమందు నుదుట వ్రాసుకోమని చెప్పినాడు.  ఆమందు సీసాను కృతజ్ఞతా పూర్వకముగా స్వీకరించి నమస్కరించినాను.  ఆటో ముందుకు దర్గా వైపుకు వెళ్ళిపోతున్నది.  నామనసులో శ్రీసాయి నాప్రక్కనే కూర్చున్న ఆలోచన కలిగినది.  ఆటోనుండి వెనక్కి తిరిగి చూసినాను.  నాకంటికి ఆముసలివాడు కనిపించలేదు.  నేను ఎంత మూర్ఖుడిని సాక్షాత్తు శ్రీసాయినాధుడు నాప్రక్కన కూర్చుని ఆటోలో ప్రయాణము చేస్తే ఆతనిని ముసలివాడు, ముసలివాడు అని సంబోధించినాను.  శ్రీసాయి ఏదో ఒక రూపములో మన ప్రక్కన యుండి మనకోరిక తీర్చి అదృశ్యుడు అగుతాడు అనటానికి యికి ఒక నిదర్శనము. 

1989 నుండి శ్రీసాయికి నన్ను నేను అర్పించుకొన్నాను.  శ్రీసాయిని మనసార పిలిచినపుడు ఏదో ఒక రూపములో వచ్చి నాప్రక్కన నిలబడి నాకు సహాయము చేసి అదృశ్యులు అగుతున్నారు అని చెప్పటానికి నీకు యిప్పటికి మూడు నిదర్శనాలు వ్రాసినాను.  మొదటిది నేను కొరియా దేశానికి విమానములో ప్రయాణము చేస్తున్నపుడు నాప్రక్క సీటులో కూర్చుని హాంగ్ కాంగ్ లో దిగిపోతు నాకు చాక్లెటు పొట్లాము యిచ్చిన వ్యక్తి శ్రీసాయి.  రెండవది సికంద్రాబాద్ స్టేషన్ లో డబ్బు లేక మానసిక బాధ పడుతున్న సమయములో నాభుజముపై చేయి వేసి నాకు చల్లటి మంచినీరు యిచ్చిన వ్యక్తి శ్రీసాయి.  మూడవది అజ్మీరులో దర్గాకు వెళ్ళమని ఆదేశించి ఆటోలో నాప్రక్కన కూర్చుని నాతో ప్రయాణము చేసి ఆటొ దిగి వెళ్ళిపోతు నాకు తలనొప్పి మందు బహుమతిగా యిచ్చిన వ్యక్తి శ్రీసాయి.  ఈ మూడు నిదర్శనాలతో ఒక మాట గట్టిగా చెప్పగలను.  మనము ప్రేమతో శ్రీసాయిని పిలిస్తే ఆయన ఏదో ఒక రూపములో మన ప్రక్కకు వచ్చి మన కోరికను తీర్చుతారు.  ఆయన వచ్చినది లేనిది గ్రహించుకోవలసినది మనము.  శ్రీసాయి సత్ చరిత్రలో శ్రీహేమాద్రిపంతు శ్రీ అప్పాసాహెబు కులకర్ణికి జరిగిన సంఘటన వివరించినారు.  ఆ సంఘటన చదివిన తర్వాత 1991 మార్చి 22వ.తారీకు సాయంత్రము నాకు జరిగిన సంఘటన నీకు వ్రాస్తాను.  మార్చి 22వ.తారీకు మాపెండ్లి రోజు.  నేను, మీ అమ్మ ఆరోజున సాయంకాలము కన్యకాపరమేశ్వరి దేవాలయానికి వెళ్ళినాము.  నేను మీ అమ్మ గుడికి చేరుకొన్న సమయములో గుడిపూజారి గర్భగుడి తలుపులు తీయలేదు.  నేను శ్రీసాయి నామ స్మరణ చేస్తున్నాను.  యింతలో గుడి ముందు వాకలిలో ఒక సాధువు వచ్చి తను విజయవాడ కనక దుర్గమ్మ గుడి దగ్గరనుండి వచ్చినాను అని దక్షిణ కోరినాడు.  నేను వెంటనే ఒక రూపాయి దక్షిణ యిచ్చి పంపివేసినాను.  ఆసాధువు వెళ్ళిపోయిన తర్వాత అరే! ఈ రోజు నాపెండ్లి రోజు కనీసము పది రూపాయలు దక్షిణ యిచ్చి యుండిన బాగుండేది.  సరే ఆసాధువు తిరిగి వెనక్కి వచ్చి అడిగితే పది రూపాయలు దక్షిణగా యివ్వదలచినాను.  యింతలో గుడి పూజారి గర్భ గుడి తలుపులు తీసినారు.  నేను, మీఅమ్మ కుంకుమ అర్చన చేయించి గుడి బయట మెట్లమీద కూర్చుని యున్నాము.  యింతలో ఒక తెల్లని బట్టలు ధరించిన సర్దార్జీ (శిఖ్ సాధువు) గుడికి ప్రదక్షిణ పూర్తి చేసుకొని మాప్రక్కన వచ్చి కూర్చుని యున్నారు.  ఆయన భుజానికి జోలె యున్నది.  చేతిలో ఒక డబ్బా యుంది. యింకొక చేతిలో పొట్టి కఱ్ఱ యుంది.  ఆవ్యక్తిని చూడగానె నాకళ్ళముందు శ్రీసాయినాధుడు కనిపించసాగినారు.  నేను ఆ సాధువును మీరు ఎక్కడనుండి వస్తున్నారు అని అడిగినాను.  ఆయన తను గోదావరి తీరంలో ఉన్న నాసిక్ లోని ఒక ఆశ్రమమునుండి వస్తున్నాను అని సమాధానము చెప్పినారు.  నామనసులో ఆసాధువు శ్రీసాయి అని తలచి యింతకు ముందు శ్రీసాయికి యిస్తానని అనుకొన్న పది రూపాయలు ఆసాధువుకు యిచ్చినాను.  ఆసాధువు పది రూపాయలు స్వీకరించి మమ్మలను ఆశీర్వదించి వెళ్ళిపోయినారు.  ఆపది రూపాయలు ఆసాధువు స్వీకరించినపుడు నాకంటికి ఆసాధువు శ్రీసాయి లాగ దర్శనము యిచ్చినారు. 

శ్రీహేమాద్రిపంతు ఈ అధ్యాయము చివరలో శ్రీహరిభావు కర్ణిక్ గురించి వ్రాసినారు.  ఆయన చరిత్ర చదివిన తర్వాత నేను 1991 గురుపూర్ణిమనుండి శ్రీసాయి పేరిట వస్త్రదానము చేయాలి అని నిర్ణయించుకొన్నాను.  ప్రతి గురుపూర్ణిమకు శ్రీసాయి పేరిట వస్త్రదానము చేయాలి అని నేను నిర్ణయించుకొన్నానే కాని, ఆనిర్ణయాన్ని అంగీకరించవలసినది శ్రీసాయినాధుడు.  భవిష్యత్ లో గురుపూర్ణిమ ఎలాగ జరుగుతుంది నాచేతిలో లేదు.  అంతా శ్రీసాయినాధుని దయ.

శ్రీసాయి సేవలో

నీతండ్రి. 

(సర్వం శ్రీసాయినాధార్పణమస్తు) 

No comments:

Post a Comment