Thursday, 4 April 2013

పుణ్యభూమి శిరిడీలో దొరికిన రత్నమణి సాయి - 24వ. అధ్యాయము

     
            
            
         

05.04.2013 శుక్రవారము
పుణ్యభూమి శిరిడీలో దొరికిన రత్నమణి సాయి - 

24వ. అధ్యాయము
                                                                                                     27.01.1992

ప్రియమైన చక్రపాణి,

జీవితము కష్ట సుఖాలమయము. సుఖములో ఒక చిన్న భాగము హాస్యము.  శ్రీసాయి తన భక్తులకు ఏదైన కొత్త విషయాలు తెలియచేయదలచుకొన్నపుడు సందర్భానుసారము చెప్పేవారు.  అలాగ చెప్పటములో అవసరము వచ్చినపుడు హాస్య పధ్ధతిని కూడా అనుసరించేవారు.  యితరులకు పెట్టకుండ మనము తినరాదు అనే విషయమును హాస్య పధ్ధతిలో హేమాద్రిపంతుకు చెబుతారు శ్రీసాయి.  శ్రీసాయి తన భక్తులకు చక్కని సందేశము యిచ్చినారు.  అది "నీవు తినుటకుముందు నన్ను స్మరింతువా?  నేనెల్లపుడు నీచెంత లేనా? నీవేదైన తినుటకు ముందు నాకర్పించుచున్నావా"? ఈ సందేశమును అర్ధము చేసుకొని నీవు తినే భోజనమును, నీవు త్రాగే నీరును కూడా శ్రీసాయికి మనసులో అర్పించి సేవించు.  నీజీవితము ధన్యము చేసుకో.  ఇదే విధముగా నీలోని అరిషడ్ వర్గాలు అంటే కామము, క్రోధము, లోభము, మోహము, మదము, మాత్సర్యము పామువలె బుసలు కొడుతుంటే ఆపని చేసేముందు శ్రీసాయిని ఒక్క నిమిషము ధ్యానించు. శ్రీసాయి నిన్ను సవ్యమైన మార్గములో నడిపించుతారు.  నీతోటి సాయి భక్తుడు శ్రీసాయిని పూజించే విధమునకు నీవు పూజించే విధానానికి తేడా యుండవచ్చును.  అది నీకు అనవసరము.  నీపద్దతి నీది.  వాని పధ్ధతి వానిది.  నీవు ఆవిషయములో జోక్యము చేసుకోవద్దు.

ప్రతి గురువారము శ్రీసాయిగుడికి వెళ్ళి అక్కడ హారతిలో పాల్గొంటే సరిపోదు.  శ్రీసాయిని ప్రతి జీవిలోను చూడాలి.  ఆయన నామము అనుక్షణము స్మరించాలి.  ఆయన నడచిన బాటలో నడవటానికి ప్రయత్నించాలి.  అలాగ అని సంసారము వదలి సన్యాసము తీసుకొమ్మని కాదు.  జీవితములో నీవు పూర్తి చేయవలసిన బరువు బాధ్యతలు శ్రీసాయి నామస్మరణ సహాయముతో పూర్తి చేసుకొని ఆయన ప్రేమకు పాత్రుడివి కావాలి.

శ్రీసాయి సేవలో

నీతండ్రి

(సర్వం శ్రీసాయినాధార్పణమస్తు)

No comments:

Post a Comment