Friday 29 March 2013

పుణ్యభూమి శిరిడీలో దొరికిన రత్నమణి సాయి - 22 వ.అధ్యాయము

 30.03.2013  శనివారము
ఓం సాయి శ్రీసాయి జయజయసాయి
సాయి బంధువులకు బాబావారి శుభాశీస్సులు



        
    
   
పుణ్యభూమి శిరిడీలో దొరికిన రత్నమణి సాయి - 
22 వ.అధ్యాయము

                                      25.01.1992

ప్రియమైన చక్రపాణి,

ఈ అధ్యాయములో శ్రీసాయి తన భక్తులను విషజంతువుల బారినుండి కాపాడిన సంఘటనలు వివరించబడినవి.  మరి మనిషికి నిలువెల్ల విషమే కదా - అటువంటి మనుషులనుండి కూడ తన భక్తులను అనేకసార్లు కాపాడినారు శ్రీసాయి.  




ఈ అధ్యాయము ఆఖరిలో శ్రీసాయి అంటారు "అనవసరమైన కలహములందు, చంపుటయందు పాల్గొనక యోపికతో నుండవలెను.  దేవుడందరిని రక్షించువాడు" అని మానవాళికి సందేశము యిచ్చినారు.  ఈ సందేశమును ప్రతిసాయి భక్తుడు అర్ధము చేసుకొని సుఖప్రదమైన జీవితము గడపాలని నాకోరిక.  ఈ ఉత్తరములో శ్రీసాయి, ద్వారకామాయిని మశీదు తల్లి" అని పిలవటము గురించి మరియు మశీదు తల్లితో నా అనుభవాలు వ్రాస్తాను.  1991 డిశంబరులో శిరిడీకి వెళ్ళినాను.  ఆసమయములో తెల్లవారుజామున ఉదయము ఆరతి ద్వారకామాయిలో చదివినాను.  ఆరతి చదివిన తర్వాత శ్రీసాయికి నైవేద్యము పెట్టడానికి జేబులోని పంచదార పొట్లము గురించి వెతికినాను.  పొట్లము దొరకలేదు.  శ్రీసాయికి పంచదార నైవేద్యము పెట్టలేకపోతున్నాననే బాధ నాలో ఎక్కువ కాసాగినది.  ఏమి చేయాలి? వెనక్కి హోటల్ కి వెళ్ళి కొంచము పంచదార తెచ్చి శ్రీసాయికి నైవేద్యము పెట్టాలా లేకపోతే నైవేద్యము పెట్టలేకపోతున్నందులకు శ్రీసాయిని క్షమాపణ కోరాలా! అనే ఆలోచనలతో సతమమగుతుంటే - ఒక 60 సంవత్సరాల ముసలి స్త్రీ ఒక డబ్బా నిండ పంచదార తెచ్చి అందులోని కొంచము పంచదార శ్రీసాయికి నైవేద్యము పెడుతున్నది.  నాలో తెలియని ఆనందము కలిగినది.  ద్వారాకామాయిలో తన భక్తులను ఎట్టి పరిస్థితిలోను శ్రీసాయి నిరుత్సాహము పరచరు.  భక్తుల సమస్యలను శ్రీసాయి తన సమస్యలగా భావించి వారే పరిష్కార మార్గము తన భక్తులకు చూపించుతారు అని భావించి, నేను ఆ స్త్రీని కొంచము పంచదార యివ్వమని కోరినాను.  ఆమె సంతోషముగా ఒక చెంచా పంచదార కాగితములో యిచ్చినది.  ద్వారకామాయి (మశీదు) లో శ్రీసాయి (స్త్రీ రూపము అంటే తల్లి రూపములో) నా సమస్యకు పరిష్కారము చూపించటానికి తల్లి రూపములో దర్శనము యిచ్చినారు.  అందుచేత శ్రీసాయియే ద్వారకామాయి అంటే మశీదు తల్లి అని గుర్తించుకో.  నేను నీకు 9వ.అధ్యామునకు సంబంధించి 9వ.ఉత్తరములో భిక్ష గురించి ఆవశ్యకతలో నేను ఏపరిస్థితిలో రోజూ శ్రీసాయి యొక్క భిక్ష జోలిలో పిడికెడు బియ్యము వేస్తున్నది వాటి వివరాలు నీకు వ్రాసినాను.  ఆవిధముగా రోజు పిడికెడు బియ్యము శ్రీసాయి జోలిలో వేయటానికి శ్రీసాయి నాకు కలలో మశీదును, ఆమశీదు ప్రక్క నిలబడిన నామాతృమూర్తి అంటే నాతల్లిని చూపి, మశీదు తల్ల్లియొక్క ప్రాముఖ్యమును నాకు గుర్తు చేసినారు.

శ్రీసాయి సత్ చరిత్రలో శ్రీసాయి అంటారు "భగవంతుడు సకల జీవులందు నివసించుచున్నాడు"  ఈ సత్యాన్ని ప్రతిసాయి భక్తుడు గ్రహించి సాయి మార్గములో ప్రయాణము చేయాలి.  నేను ఈ మార్గములో ప్రయాణము చేయాలి అనే తపనతోనే నోరు లేని జీవులకు వేసంగిలో దాహము బాధ తీర్చడానికి యింటి బయట నీళ్ళ తొట్టి పెట్టినాను.  నా తర్వాత నీవు కూడా ఈమార్గములో ప్రయాణించుతు ఆనోరులేని జీవాల దాహము తీర్చడానికి ప్రయత్నించు.  శ్రీసాయి అనుగ్రహాన్ని పొందు.  అపుడు నీవు నిజమైన సాయి భక్తుడివి అగుతావు.

శ్రీసాయి సేవలో 
నీతండ్రి 

(సర్వం శ్రీసాయినాధార్పణమస్తు)

No comments:

Post a Comment