Monday, 11 March 2013

పుణ్యభూమి శిరిడీలో దొరికిన రత్నమణి సాయి - 10వ. అధ్యాయము

                                       
                                                     
                                                        
                                                       
12.03.2013 సోమవారము

పుణ్యభూమి శిరిడీలో దొరికిన రత్నమణి సాయి - 10వ. అధ్యాయము

ఈ ఉత్తరములో శ్రీసాయి గురించిన వివరాలు వ్రాయాలి.  నేను వ్రాసే విషయాలకంటే శ్రీహేమాద్రిపంతు వ్రాసిన విషయాలు ఘనమైనవి.  




అందుచేత శ్రీసాయి సత్ చరిత్రలో పదియవ అధ్యాయము విపులముగా చదువు.  శ్రీసాయి పై నమ్మకము ఉంచి జీవిత ప్రయాణము సాగించిన మన గమ్యముసు లువుగా చేరగలము అంటారు శ్రీహేమాద్రిపంతు.  ఈవిషయము నీకు బాగా అర్ధము కావాలి. అందుకు ఒక చక్కని ఉదాహరణ నీకు చెబుతాను.  మనము రైలులో సుఖముగా ప్రయాణము చేయటానికి రాత్రి పూట ప్రశాంతముగా నిద్రపోవటానికి స్లీపర్ కోచ్ లో బెర్తుకు ఛార్జీలు కట్టి ప్రయాణము సాగించుతాము.  బెర్తుకు ఛార్జీలు కట్టకపోతే అందరితోను కలసి జనరల్ కంపార్ట్ మెంట్  లో ప్రయాణము సాగించవలసియుంటుంది.  యిక్కడ జీవిత ప్రయాణములో శ్రీసాయికి శ్రధ్ధ మరియు సహనము అనే  చార్జీలు కట్టి సుఖప్రయాణము చేసుకొనే ప్రయాణీకులు అందరు మన సాయి బందువులు అనే విషయము గుర్తు చేసుకోవాలి.  బాబాయొక్క జన్మ తేదీ మరియు బాబాయొక్క తల్లిదండ్రుల వివరాలు ఆరోజులలో ఎవరికి తెలియవు.  అందుచేత హేమాద్రిపంతు ఆవివరాలు ఏమీ వ్రాయలేదు.  ఈనాడు శ్రీసత్యసాయిబాబా తెలియపర్చిన విషయాలు చాలా ఆసక్తిని రేకెత్తించినాయి .  వారు శ్రీశిరిడీ సాయి తల్లిదండ్రుల పేర్లు దేవగిరి అమ్మ, గంగా భవాడ్యుడు అని తెలియపర్చినారు.  శ్రీసాయిబాబా పుట్టిన రోజు 28.09.1835 అని తెలియపర్చినారు.  భగవంతుడు మానవ అవతారము ఎత్తినపుడు మానవుల మధ్య తల్లిదండ్రులకు జన్మించవలసినదే అని కొందరు అంటారు.  కొందరు దీనికి అంగీకరించరు.

ఈ విషయములో నేను ఏది సరి అయినది ఏది సరి అయినది కాదు అని చర్చించలేను కాని రెండిటికీ ఉదాహరణకు యివ్వగలను.  ఈవిషయాలు నాస్వంత విషయాలు కావు.  పురాణాలునుండి, మరియు చరిత్ర ఆధారముగా తెలుసుకొన్న విషయాలు మాత్రమే.  శ్రీరాముడు, శ్రీకృష్ణుడు, మొదటి కోవకు చెందినవారు.  మరి ఈకాలములో చరిత్ర ఆధారముగా సేకరించిన విషయాలు చూస్తే నామదేవు, కబీరు, సామాన్య మానవులుగా జన్మించి  యుండలేదు.  నామదేవు భీమారధి  నదిలో, కబీరు భాగీరధి నదిలోను చిన్న పాపలుగా వారి పెంపుడు తల్లిదండ్రులకు చిక్కిరి.  యిటువంటి పరిస్థితిలో శ్రీశిరిడీసాయి ఏకోవకు చెందియుంటారు అనేది ముఖ్యము కాదు.  వారు భగవంతుని అవతారము అని మాత్రము మనము నమ్మగలిగితే చాలు.  పదియవ అధ్యాయములో హేమాద్రిపంతు బాబా లక్ష్యము, వారి బోధలు విషయములో శ్రీసాయి అన్న మాటలు వ్రాసినారు.  అవి "హిందువుల దైవమగు శ్రీరాముడును, మహమ్మదీయుల దైవమగు రహీము ఒక్కరే" అందుచేత హిందూ, మహమ్మదీయులు చేతులు కలిపి స్నేహముతో జీవించమన్నారు.  నేను శిరిడీలోని ద్వారకామాయి హిందూ మహమ్మదీయుల మైత్రికి చిహ్నము అని నమ్ముతాను.  నాచిన్ననాటి స్నేహితులు హుస్సేని బేగ్, మరియు ఖలీల్ లను తలచుకొన్నపుడు స్నేహానికి మతాలు అడ్డు రావు అని భావించుతాను.  ఈకలి యుగములో యోగాభ్యాసాలు, యాగాలు, మంత్రోపదేశాలు సరిగా జరపలేము.  అందుచేత శ్రీసాయి నామ స్మ్రరణ చేస్తూ భగవంతుని చేరటము ఉత్తమమైన మార్గము అని నమ్మేవాళ్ళలో నేను ఒకడిని.

శ్రీసాయి సేవలో

నీతండ్రి. 

(సర్వం శ్రీసాయినాధార్పణమస్తు)

No comments:

Post a Comment