Monday, 18 March 2013

పుణ్యభూమి శిరిడీలో దొరికిన రత్నమణి సాయి - 14వ. అధ్యాయము

          
     
           
పుణ్యభూమి శిరిడీలో దొరికిన రత్నమణి సాయి - 
14వ. అధ్యాయము
                          

                              
                                                                                                                                                                                      19.01.1992

ప్రియమైన చక్రపాణి,

ఈ అధ్యాయములో హేమాద్రిపంతు యోగీశ్వరుని లక్షణాలు వర్ణించుతు ఒక చోట అంటారు.  మోక్షము సంపాదించాలి అంటే మనమెప్పుడును బధ్ధకించరాదు.  యిది అక్షరాల నిజము.  శ్రీసాయి ఎన్నడు బధ్ధకించి యుండలేదు.  



మధ్యాహ్న్న  సమయములో భక్తులు ఎవరు లేనప్పుడు ఏకాంతముగా కూర్చుని తన చినిగిపోయిన కఫనీ (చొక్కా) ని సూది దారముతో కుట్టుకుంటూ యుండేవారు.  ఆపనిని తన భక్తులు ప్రేమతో చే యటానికి సిధ్ధపడినా  ఆయన దానికి అంగీకరించేవారు కాదు.  మనము బధ్ధకమును దగ్గరకు రానిస్తే ఆబధ్ధకము, అబధ్ధము (అసత్యము) ను తోడుగా పిలుచుకొని వస్తుంది.  ఒకసారి బధ్ధకము, అబధ్ధము మనలో ప్రవేశించితే మనకు తెలియకుండానే దొంగతనము అనే బుధ్ధి మనలో చోటు చేసుకొంటుంది.  యింక ఈ మూడు మనిషి జీవిత ములో ప్రవేసించితే ఆమనిషికి మోక్షము మాట భగవంతునికి తెలుసు.  పతనము మాత్రము అందరికి తెలుస్తుంది.  హేమాద్రిపంతు శ్రీసాయి సత్ చరిత్రలో వ్రాస్తారు "ప్రతి నిత్యము సాయి లీలలు వినినచో, నీవు శ్రీసాయిని చూడగలవు.  నీవు యితరుల జీవితములో జరిగిన సాయి లీలలు వినకపోయినా  ఫరవాలేదు.  కాని, నీ జీవితములో జరిగిన సాయి లీలలను నీవు మరచిపోకుండ యుంటే చాలు.  నీకు జ్ఞాపకము చేయటానికి నీజీవితములో జరిగిన కొన్ని లీలలు యిక్కడ వ్రాస్తాను.  నీవు అంగీకరించుతావు అని నమ్ముతాను.
1990 లో నీకు ఒమేగా లో చదవటానికి సీటు రాలేదు అని తెలిసినపుడు నీవు పడ్డ బాధ, వెయిటింగ్ లిస్టులో నీపేరు చూసుకొని నీవు పడిన ఆనందము, అదే రోజు సాయంత్రము పోస్టుమాన్ సాయిబాబా పక్ష పత్రిక తెచ్చి యి చ్చినపుడు అందులోని సాయి సందేశము "నీకు కాలేజీలో సీటు మాత్రమే వచ్చినది.  కష్ఠపడి చదవాలి".  యిది నీజీవితములో శ్రీసాయి చూపించిన లీల కాదా! 24.07.1991 నాడు శ్రీసాయి సత్ చరిత్ర పారాయణలో శ్రీసాయి సందేశము "అతడు ఈ సంవత్సరము తప్పక ఉత్తీర్ణుడగును" గుర్తు  ఉండి యుంటుంది .  ఆ మరుసటిరోజు 25.07.1991 నాడు పరీక్షా ఫలితాలులో నీ రాంక్ 1331 అని తెలుపబడలేదా,  ఆలోచించు.  శ్రీసాయి నీకు ప్రతిసారి సందేశము యిచ్చిన పుస్తకము నెంబరు 1916.  నీ ఎంసెట్ హాల్ టికెట్టు నెంబరు 59318.  నీకు వచ్చిన రాంక్ 1331.  ఈ నెంబర్లు అన్నిటిని కూడు, ఆవచ్చే సంఖ్య 8.  శ్రీ సాయి నీకు ప్రసాదించిన అదృష్ఠ సంఖ్య 8 అని తలచడములో తప్పులేదు. 

శ్రీసాయికి హిందూ, ముస్లిం భక్తులే కాకుండ యితర మతాలు భక్తులు కూడా యుండేవారు. వారిలో పార్సీ మతస్థుడు రతంజీ షాపుర్జీ వాడియా ముఖ్యుడు.  ఈ రతంజీ జీవిత చరిత్ర నీవు తెలుసుకోవాలి.  జీవితములో ధనము ఒక్కటే ముఖ్యము అని నీవు అనేక సార్లు అన్నావు.  అది తప్పు అని గ్రహించు.  రతనజీ  కి ఆరోజులలో పెద్ద వ్యాపారి కోటీశ్వరుడు.  అందరికి అతను దాన ధర్మాలు చేస్తు ఉండేవాడు.  నాందేడులోని ప్రజలకు అతను దాన కర్ణుడు.  మరి అటువంటి వ్యక్తికి తీరని లోటు ఒకటి యండేది.  ఆలోటు ధనముతో పూడ్చలేనటువంటిది.  అదే పుత్ర సంతానము లేకపోవటము.  అతను ఎన్ని దాన ధర్మాలు చేసినా మరియు ధనముతో కొనలేనిది, పుత్ర సంతానము కలిగి యుండాలనే కోరిక.  ఈ కోరిక తీర్చగలిగేది  ఒక్క సాయి బాబా మాత్రమే అని తెలుసుకొని శిరిడీ వెళ్ళి శ్రీసాయి పాదాలను కన్నిళ్ళతో కడిగినాడు.  శ్రీసాయి ఆశీర్వచనాలతో పుత్ర సంతానాన్ని పొందినాడు.  అతనిని సంతోషపరిచినది అతని దగ్గర ఉన్న ధనమా లేక శ్రీసాయి ఆశీర్వచనాలా ఒక్కసారి అలోచించు.  నీకే తెలుస్తుంది.  యింక శ్రీసాయి ధనాన్ని దక్షిణ రూపములో స్వీకరించేవారు. అంతే గాని భిక్ష రూపములో ఏనాడు తను ధనాన్ని స్వీకరించలేదు.  తన భక్తులను స్వీకరించనీయలేదు.  శ్రీసాయి దక్షిణ కూడ ఉదయము నుండి సాయంత్రము వరకు స్వీకరించి, సాయంత్రము తిరిగి బీదలకు దానము చేసేవారు.  మరల మరుసటి రోజు ఉదయము చేతిలో చిల్లిగవ్వలేని ఫకీరుగా తన రోజు ప్రారంభించేవారు.
                    
                  
శ్రీ సాయి తన భక్తులకు ఎప్పుడు ఒక మాట చెబుతు ఉండేవారు.  "మన పారమార్ధికమునకు ఆటంకములు రెండు గలవు.  మొదటిది స్త్రీ.  రెండవది ధనము.  తన భక్తుడు ధనము మీద ఎంత వ్యామోహముకలిగి యున్నది లేనిది అనే విషయము తెలుసుకోవడానికి దక్షిణ రూపంలో ఆభక్తుని నుండి ధనాన్ని తీసుకొనేవారు.  ఈపరీక్ష లో ఆభక్తుడు ఉత్తీర్ణుడు కాగానే పరస్త్రీ వ్యామోహము ఉన్నది లేనిది తెలుసుకోవటానికి ఆభక్తుని శిరిడీలో నివసించుచున్న రాధాకృష్ణమాయి అనే భక్తురాలి యింటికి పంపేవారు.  ఈరెండు పరీక్షలయందు ఆభక్తుడు తట్టుకొని నిలబడిననాడు శ్రీసాయి అతనికి పారమార్ధిక ప్రగతిలో సహాయము చేసేవారు.  ఈనాడు శ్రీసాయి మనమధ్య శరీరముతో లేరు.  ప్రతిసాయి భక్తుడు శ్రీసాయిని తన మనసులో నిలుపుకొని ఈరెండు పరీక్షలను తామే స్వయముగా జరుపుకొని ఉత్తీర్ణులు కావాలి.  శ్రీసాయి ఆశీర్వచనాలు పొందాలి. 
శ్రీసాయి  సేవలో
నీతండ్రి 

(సర్వం శ్రీసాయినాధార్పణమస్తు)

No comments:

Post a Comment