పుణ్యభూమి శిరిడీలో దొరికిన రత్నమణి సాయి - 7వ.అధ్యాయము
క్రిందటి ఉత్తరములో ఎక్కువ విషయాలు వ్రాయలేదు. కాని సాయి ఆనాడు, ఈనాడు పలికిన పలుకులు నిత్యసత్యాలు అని నీవు ఈపాటికి గ్రహించి యుంటావు.
మరి ఈ ఉత్తరములో శ్రీసాయి అవతారములోని ముఖ్య విషయాలు వ్రాయాలంటే చాలా పేజీలు రాయాలి, అందుచేత అవి అన్ని యిపుడు వ్రాయలేను. కాని నేను నాజీవితములో శ్రీసాయినాధుని అవతారముపై స్వయముగా అనుభవించిన అనుభవాలను వ్రాస్తాను. హేమాద్రిపంతు ఏడవ అధ్యాయములో వ్రాస్తారు "బాబా హిందువు అన్నచో మహమ్మదీయ దుస్తులలో ఉండెడివారు. మహమ్మదీయుడు అన్నచో హిందూ మతాచార సంపన్నుడుగా కనిపించేవారు. 1987 లో శ్రీసాయి గురించి నాకు తెలియని రోజులలో సికంద్రాబాద్ స్టేషన్ దగ్గరలో ఉన్న పాండురంగని గుడిదగ్గర నిలబడి యుండగా ఒక ముస్లిం స్నేహితుడు నాకు ధనసహాయము చేసి నాకు ఉన్న డబ్బు యిబ్బందులనుండి కాపాడినాడు. దానికి కృతజ్ఞతా సూచకముగా నేను శ్రీపాండురంగని గుడికి మొదటిసారిగా వెళ్ళి అర్చన చేయించినాను. అర్చన అనంతరము గుడి ఆవరణలో ఉన్న టీ హోటల్ లో ఉన్న శ్రీసాయి యొక్క చాయా చిత్రము చూసినాను. (శ్రీసాయి తన భక్తులు బూటీ, నిమోంకర్, భాగోజీ షిండేలతో తీయించుకున్న ఫొటో. ఆ ఫొటొలో హిందూ ముస్లిం ల కలయిక అనేభావము కలిగినది. ఈరోజున ఆసంఘటన ఆలోచిస్తూ ఉంటే శ్రీసాయి నాకు తెలియకుండానె నాలో, హిందువు అయిన ముస్లిం అయిన అందరికి భగవంతుడు ఒక్కడే అనే సందేశము యిస్తున్నారు అని అనిపించుతున్నది.
హేమాద్రిపంతు శ్రీసాయి విషయములో వ్రాసిన విషయాలు చాలా ఆశ్చర్యము కలిగించుతాయి. ఆయన మహమ్మదీయుడు అంటే వీలులేదు. కారణము ఆయన చెవులకు హిందువులవలె కుట్లు యుండెను. మశీదులో ధునియు అగ్నిహోత్రమును వెలిగించెను, మశీదులో తిరగలిలో గోధుమలు విసిరేవారు, శంఖము ఊదువారు, మశీదులో గంటవాయించేవారు, హోమము చేయించేవారు, భజనలు చేయించేవారు. మరి హిందువా అని అంటే వీలు లేదు. కారణము ఆయన మశీదులో ఈదుల్ ఫితర్ నాడు తన మహమ్మదీయ భక్తుల చేత నమాజు చేయించేవారు. మొహర్రం నాడు మశీదులో తీజియా నెలకొల్పి నాలుగు దినముల తర్వాత తానే స్వయముగా తీసివేసేవారు. భగవంతునికి మతముఏమిటి, కులము ఏమిటి, ఈకులము, మతము భగవంతుని తెలుసుకోవటానికి మానవుడు ఏర్పరుచుకొన్న రోడ్లువంటివి. భగవంతుడు కులమతాలకు అతీతుడు. శ్రీసాయి భగవంతుని అవరారము. ఆయన కులమతాలకు అతీతుడు. శ్రీసాయి భగవంతుని అవతారము. ఆయన కులమతాలకు అతీతుడు అనేది గ్రహించు. ఆయన సాక్షాత్తు భగవంతుని అవతారమైనా ఏనాడు తాను భగవంతుడిని అని చెప్పలేదు. తాను భగవంతుని విధేయ సేవకుడిని అని మాత్రము చెప్పినారు. అల్లా మాలిక్ అని యెల్లపుడు పలుకుతూ ఉండేవారు. శ్రీసాయి తొలి దినములలో గ్రామములోని రోగులను పరీక్షించి వారికి ఔషధములు యిచ్చేవారు. వారు ఆవిధముగా మానవ సేవను మాధవసేవగా చూడమని తన భక్తులకు సూచించినారు. తన భక్తులు అనారోగ్యముతో బాధ పడుతు ఉంటే చూడలేక తాను ఆవ్యాధులను అనుభవించి కర్మఫలము పరిపక్వత చెందిన తర్వాత తన శరీరాన్ని ధౌతి మరియు ఖండయోగము ద్వారా శుభ్రపరచుకొనేవారు. 1910 లో దీపావళి పండుగనాడు తన చేతిని ధునిలో పెట్టి దూరదేశములో కమ్మరి కొలిమిలో పడిపోయిన పసిబిడ్డను రక్షించిన వైనము, ఖాపద్రే కుమారుని ప్లేగు వ్యాధిని తన శరీరముమీదకు తెచ్చుకొని రక్షించిన వైనము, బాబు కిర్వెండికర్ మూడు. సంవత్సరాల కుమార్తె నూతిలో పడిపోతే ఆపాపను సాయి రక్షించిన వైనము ఆలోచించు. ఆయనకు పసిపిల్లలపై ఎంత ప్రేమ యున్నది తెలుస్తుంది. శ్రీసాయి శిరిడీలోని చిన్న పిల్లలతో ఆటలు ఆడుతు వారిలోని స్వచ్చమైన ప్రేమను చూసి ఆనందించేవారు. యిక్కడ ఒక విషయము వ్రాస్తాను. యిది చాలా మందికి తెలియదు. 1908 సంవత్సరమునకు ముందు శ్రీసాయిబాబా ఎవరిని తనను పూజిం చటానికి అనుమతి యివ్వలేదు. 1908 సంవత్సరములో బాపురావు అనే నాలుగు సంవత్సరాల బాలుడు శ్రీసాయిబాబాను భగవంతునిగా గుర్తించి రోజూ ఒక పుష్పమును తెచ్చి శ్రీసాయి శిరస్సుపై ఉంచి నమస్కరించేవాడు. ఆనాటి చిన్న బాలుడు బాపురావు శ్రీసాయికి చేసిన పూజ ఈనాడు కోటానుకోట్ల సాయిభక్తులకు మార్గ దర్శకము అయినది.
శ్రీసాయి సేవలో
నీతండ్రి.
(సర్వం శ్రీసాయినాధార్పణమస్తు)
No comments:
Post a Comment