Tuesday 19 March 2013

పుణ్యభూమి శిరిడీలో దొరికిన రత్నమణి సాయి -15వ.అధ్యాయము

        
       
         
  

పుణ్యభూమి శిరిడీలో దొరికిన రత్నమణి సాయి - 
15వ.అధ్యాయము

                              

                                                                     20.01.1992

ప్రియమైన చక్రపాణి,

శ్రీసాయి సత్ చరిత్ర మొదటి సారిగ నిత్యపారాయణ మొదలు పెట్టినపుడు ఈ పదునైదవ అధ్యాయములో శ్రీసాయి తన భక్తులపై కురిపించిన ప్రేమ ఆదరణలకు నా కళ్ళు ఆనంద భాష్పాలుతో నిండిపోయినాయి.  అటువంటి ప్రేమ ఆదరణ  పొందిన చోల్కరు ధన్య జీవి. 



 ప్రతి సాయి భక్తుడు చోల్కరులాగ సాయి మార్గములో ప్రయాణము సాగించి మేఘశ్యాముడులాగ సాయి మార్గములో రాలి పోయి సాయిలో ఐక్యమైపోవాలి.  అందుచేత సాయి బంధువులలో చోల్కరు అన్నా మేఘశ్యాముడు అన్నా నాకు చాలా యిష్ఠులు.  నాజీవితము వాళ్ళు నడచిన మార్గములో నడచిపోయిన ధన్యము.  మన జీవితాలలో తృప్తితో జీవించాలి అంటే చోల్కరు కధ రోజూ మనము గుర్తు చేసుకోవాలి.  అందు చేతనే కాబోలు హేమాద్రిపంతు ఈ అధ్యాయము ఉత్తర లేఖనములో అంటారు "ఎవరియితే ఈ అధ్యాయమును భక్తి శ్రధ్ధలతో నిత్యము పారాయణ చేసెదరో వారి కష్ఠాలు అన్ని శ్రీసాయినాధుని కృపచే తొలగును".  యిక ఈ అధ్యాయములోని యితర విషయాలు ముచ్చటించేముందు ఒక విషయము చెబుతాను.  నేను చోల్కరులాగ ఒక మొక్కు మ్రొక్కుకున్నాను.  నాజీవితములో నాబరువు బాధ్యతలు పూర్తి అయిన తర్వాత శిరిడీ వెళ్ళ్లి ద్వారకామాయిలో శ్రీసాయి కి 15 కిలోల పటిక బెల్లము నైవేద్యముగా సమర్పించి అక్కడి భక్తులకు మరియు మనకు తెలిసిన సాయి బంధువులకు పంచి పెట్టాలి.  ఈ కోరికను తీర్చవలసినది శ్రీసాయినాధుడే.

శ్రీ సాయి సత్చరిత్రలో శ్రీసాయి అంటారు "ప్రపంచమున మీకు యిచ్చ వచ్చిన (ఇష్ఠమైన) చోటుకు పోవుడు.  నేను మీచెంతనే యుండెదను.  యిది అక్షరాల నిజము.  నావిదేశీ యాత్రలో శ్రీసాయి నా చెంతనే యుండేవారు అనేది సంతోషముగా చెప్పగలను.  సందర్భోచితముగా ఆవివరాలు మిగతా ఉత్తరాలలో వ్రాస్థాను.  రెండు బల్లులు కధ ద్వారా శ్రీసాయి మనబోటివాళ్ళకు యిచ్చిన సందేశము ఏమిటి అనేది ఆలోచించు.  నోరు లేని జీవులు సైతము తమ తోటి ప్రాణులను ప్రేమించుతున్నాయి.  మరి ఒకే గర్భమున జన్మించిన అన్నదమ్ములు ఎందుకు కీచులాడుకొంటారు అని ప్రశ్నించుతారు శ్రీసాయి.  05.05.91 నాడు నేను విదేశాలకు (కొరియా) వెళ్ళవలసిన రోజు 04.05.91 (శనివారము) నాడు శ్రీఆంజనేయస్వామి గుడికి వెళ్ళి ఆగుడిలో ఉన్న శ్రీసాయి బాబా పటము దగ్గర నిలబడి నావిదేశ యాత్రను విజయవంతము చేయమని మనసారా ప్రార్ధించినపుడు ఒక చిన్న అనుభవము కలిగినది.  నేను శ్రీసాయి పటము ముందు కళ్ళు మూసుకొని నావిదేశ యాత్ర గురించి ప్రార్ధించుతున్నాను. ఆపటము వెనుక ఒక పెద్ద బల్లి టిక్కు, టిక్కు, అని పదే పదే పలకటము నాకు శుభసూచకముగా అనిపించినది.  శ్రీసాయి ఆశీర్వచనములతో 05.05.1991 నాడు ప్రారంభమైన నా విదేశీయాత్ర విజయవంతముగా 21.05.91 నాడు ముగిసినది.  శ్రీసాయి బల్లి రూపములో ఆశీర్వదించినారు అనే భావన ఈనాటికి నామనసులో మిగిలినది.

యిక్కడ సరదాగా నామనసులో వచ్చిన ఒక ఆలోచన వ్రాస్తాను.  ఆనాడు ద్వారకామాయిలోని బల్లి టిక్కు టిక్కుమని ఔరంగాబాదునుండి తన చెల్లెలు తనను చూడటానికి వస్తున్నది అని శ్రీసాయికి తెలియచేసినది.  ఈనాడు. అంటే 04.05.91 (శనివారము) నాడు శ్రీసాయి పటము వెనుక యున్న బల్లి టిక్కు టిక్కు అని "నీవిదేశ యాత్రకు ఔరంగాబాదు మీదుగా వెళుతు మాచెల్లును గుర్తు చేసుకో" అన్నట్టుగా భావించవచ్చును.  కారణము బొంబాయినుండి బయలుదేరిన విమానము విదేశాలకు అంటే కొరియా దేశానికి ఔరంగాబాదు విమానాశ్రయము మీదుగా ప్రయాణము చేస్తున్నాము అని విమానము నడుపుతున్న పైలట్ మైక్ లో చెబుతున్నపుడు బల్లి టిక్కు టిక్కు అని పలకడమునకు నామన్సులో అర్ధము తెలిసినది.  ఆవిమానములో శ్రీసాయి నాప్రక్కన కూర్చొని నాతో ప్రయాణము చేసినారు.  ఆవివరాలు ముందు ముందు ఉత్తరాలలో వ్రాయడానికి ప్రయత్నము చేస్తాను.  అంతవరకు ఉత్సాహముతో వేచియుండు.

శ్రీసాయి సేవలో

నీతండ్రి 


(సర్వం శ్రీసాయినాధార్పణమస్తు)

No comments:

Post a Comment