Wednesday 20 March 2013

పుణ్యభూమి శిరిడీలో దొరికిన రత్నమణి సాయి - 16,17 అధ్యాయములు


      
   
    

పుణ్యభూమి శిరిడీలో దొరికిన రత్నమణి సాయి  - 
  16,17 అధ్యాయములు

                              

                              
                                                        21.01.1992

ప్రియమైన చక్రపాణి,

శ్రీసాయి సత్ చరిత్రలో హేమాద్రిపంతు 16,17 అధ్యాయములు ఒకేచోట వ్రాసినారు.  అందుచేత నేను ఈ రెండు అధ్యయములుపైన ఒకటే ఉత్తరము వ్రాస్తున్నాను.  



బ్రహ్మజ్ఞానము విషయములో శ్రీసాయి యొక్క ఆలోచనలనుశ్రీహేమాద్రిపంతు చక్కగా వివరించినారు.  ఈ బ్రహ్మజ్ఞానము అందరికి అంత సులువుగా అబ్బదు.  బ్రహ్మ జ్ఞానమును   సంపాదించవలెనని తపన మానవుని జీవితములో తృప్తిని మిగుల్చుతుంది.  తృప్తితో గడిపిన జీవితము ధన్యము.  అందుచేత ప్రతి ఒక్కరు బ్రహ్మ జ్ఞానము సంపాదించాలి అనే తపనతో జీవితము గడపాలి.  1991 ఏప్రియల్ నెలలో ఒకనాటి   రాత్రి భయంకరమైన కల వచ్చినది.  నేను ఒక సరస్సులో పెద్ద పెద్ద మొసళ్ళు మధ్య జీవితము గడుపుతున్నాను.  
         
ఆజీవితము చాలా బాధాకరముగా యున్నది.  అనుక్షణము భయంతో వణికిపోసాగాను.  ఉదయము లేచి సాయి సత్ చరిత్రలో ఈకలకు అర్ధము వెతికినాను.  16,17 అధ్యాయములో 147 పేజీలో నాకు అర్ధము దొరికినది.  ఆనాటినుండి జీవితమునుండి అసూయ, అహంభావములను పారద్రోలడానికి ప్రయత్నించుచున్నాను.  ఈ నాప్రయత్నములో శ్రీసాయి నాతోడు ఉంటే అదేనాకు గొప్ప అదృష్ఠము.  బ్రహ్మజ్ఞానము సంపాదించుటకు శ్రీసాయి చూపిన యోగ్యత విషయములో ప్రయత్నము చేయుము.  ఈచిన్న వయసులో ప్రయత్నము మొదలిడిన నీ సంసార బాధ్యతలు తీరునాటికి బ్రహ్మజ్ఞాన సంపాదనపై ఆసక్తి కలుగుతుంది.
          
ఆరోజులలో 01.01.1991 ఉదయము 6 గంటలకు శ్రీసాయి సత్ చరిత్ర 16,17 అధ్యాయములు పారాయణ చేయు చున్నాను. 147 వ. పేజీలో శ్రీసాయి పలికిన మాటలు నన్ను చాలా ఆకర్షించినవి.  అవి "నాఖజానా నిండుగానున్నది.  ఎవరికేది కావలసిన, దానిని వారికివ్వగలను.  కాని వానికి పుచ్చుకొను యోగ్యత గలదా లేదా? యని నేను మొదట పరీక్షించవలెను.  నేను చెప్పిన దానిని జాగ్రత్తగా విన్నచో నీవు తప్పక మేలు పొందెదవు.  ఈమశీదులో కూర్చుని నేనెప్పుడు అసత్యములు పలుకను".  నామనస్సు లో సంతోషము కలిగినది.  ఉ. 8.30 నిమిషాలకు ఆఫీసుకు బయలుదేరుతున్న సమయములో శ్రీసాయి భక్తురాలు శ్రీమతి రాజ్ మన యింటికి వచ్చి నాకు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపే గ్రీటింగు కార్డు యిచ్చినారు.  ఆకార్డుపై చిరునవ్వుతో శ్రీసాయిబాబా ఫొటో.  ఆఫొటో క్రింద శ్రీసాయి సందేశము -  ఆసందేశము నేను ఆనాడు నిత్యపారాయణలో పొందిన "నాఖజానా నిండుగా నున్నది........నీవు తప్పక మేలు పొందెదవు".   సందేశము ఒకటి కావడము నేను దానిని శ్రీసాయి లీలగా భావించి శ్రీసాయికి కృతజ్ఞతలు తెలుపుకొన్నాను. 
శ్రీసాయి సేవలో


నీతండ్రి
(సర్వం శ్రీసాయినాధార్పణమస్తు)

No comments:

Post a Comment