పుణ్యభూమి శిరిడీలో దొరికిన రత్నమణి సాయి -
ప్రియమైన చక్రపాణి,
ఈ ఉత్తరములో ముందుగా శ్రీసాయికి రూపము ఉందా లేదా అనే విషయముపై ఒక రెండు మాటలు నీకు చెప్పదలచుకున్నాను.
శ్రీసాయి శిరిడీకి వచ్చినపుడు తన పేరు సాయి అని ఎవరికీ చెప్పలేదు. ఆయనను ఒక జడ్జిగారు మీపేరు ఏమిటి అని ప్రశ్నించినపుడు నన్ను సాయిబాబా అని పిలుస్తారు అన్నారు. ఆయనకు ఆ పేరు యిచ్చినది మన సాయి బంధు మహల్సాపతి. శ్రీసాయి తనకు రూపము లేదు అని తన భక్తులకు చెప్పియున్నారు. దానిని మన పెద్దలు నిర్గుణ స్వరూపము అని పిలుస్తారు. ఈ స్వరూపములో సాయిని పూజించటము అంటే నిర్గుణ స్వరూప బ్రహ్మను పూజించటము అగుతుంది. ఇది అందరికీ వీలుపడదు. అందుచేత మనము మానవ రూపములో ఉన్న భగవంతుని పూజించుతాము. ఆకోవకు చెందిన పూజా విధానమె శ్రీరాముని పూజ. శ్రీకృష్ణుని పూజ, మరియు శిరిడీసాయినాధుని పూజ.
ఈపూజా విధానము సగుణ స్వరూప పూజా విధానము అంటారు. యిది మన అందరికీ సులభమైన పధ్ధతి. శ్రీసాయి సర్వాంతర్యామి. ఎక్కడ జూచిన వారే యుండువారు. అని శ్రీహేమాద్రిపంతు అంటారు. ఈవిషయములో నేను హేమాద్రిపంతుతో ఏకీభవించుతాను. శ్రీసాయి సర్వాంతర్యామి అనే
విషయము నా జీవితములో అనేక సార్లు అనుభవ పూర్వకముగా తెలుసుకొన్నాను. యిపుడు అవి అన్నీ ఒక్కచోట ఒకే ఉత్తరములో వ్రాయటముకన్నా, సందర్భోచితముగా వ్రాయటము మంచిది అని తలుస్తాను.
శ్రీసాయి నుదుటిపై డాక్టర్ పండిట్ చందనము పూసెను అనే విషయము మనకు తెలుసు. కాని దాని వెనుక ఉన్న సాయి తత్వము ఏమిటి? అనేది మనము ఆలోచించాలి. శ్రీసాయి డాక్టర్ పండిట్ యొక్క గురువు రూపములో దర్శనము యిచ్చి భగవంతుడు భక్తుని వెనుక పరిగెడుతాడు అనేది సాయి నిరూపించినారు. డాక్క్టర్ ఫండిట్ అనుభవానికి వ్యతిరేకమైనది హాజీ సిద్దీఖ్ ఫాల్కేయొక్క అనుభవము. తొమ్మిది నెలలు వరకూ శ్రీసాయి హాజీ సిద్దీఖ్ ఫాల్కేను మశీదులోనికి రానీయలేదు. కారణము హాజీలోని అహంకారము పూర్తిగా తొలగిపోవక పోవటమే. శ్రీసాయిని నేను నిత్యము పూజించుతాను. మరియు ప్రతి శనివారము దేవతల గుళ్ళకు తప్పనిసరిగా వెళ్ళి పూజించుతాను అనే అహంకారము నాలో విపరీతముగా పెరిగిపోయినది. 1991 దత్త జయంతి రోజు (శనివారము) న నేను వెళ్ళిన ప్రతి గుడిలోను అక్కడి పూజార్లు చేత నాలోని అహంకారము తొలగించబడిన వైనము ఆలోచించుతూ ఉంటే, శ్రీసాయి అహంకారము అనేది తన భక్తులలో లేకుండ చేసి కనువిప్పు కలిగిస్తారు అనేది చెప్పక తప్పదు. ఆనాటి నుండి నేను అహంకారము వదలి భగవంతుడు సర్వాంతర్యామి ఆయన గుడిలోను, నీయింటిలోను, నీమనసులోను ఉన్నాడు అని నమ్ముతు యింటి దగ్గరనే భగవంతుని పూజ చేస్తున్నాను. ఈ పదకొండవ అధ్యాయములో హేమాద్రిపంతు బాబా స్వాధినములో పంచ భూతములు ఉండేవి అని వ్రాసినారు. వారు ఈవిషయములో రెండు ఉదాహరణలు యిచ్చినారు. నేను స్వయముగా చూసిన ఒక ఉదాహరణ నీకు చెబుతాను విను.
1989 జూలై నెలలో ఒక శనివారమునాడు మొదటిసారిగా శిరిడీ యాత్రకు బయలుదేరినాను. మధ్యాహ్న్నము బస్సుకు యింటినుండి ఆటోలో బయలుదేరినాము. ఆసమయములో కుంభవృష్టి వాన. ఏమి చేయాలో తెలియని పరిస్థితి. శ్రీసాయి నామము జపించుతూ ఆటో లో వానకు తడుస్తూ బయలుదేరినాము. ఆటో ఉస్మానియా యూనివర్శిటీ మశీదు దగ్గరకుచేరేసరికి ఒక్క చుక్క వాన లేదు. బహుశ శ్రీసాయి అలనాడు శిరిడీలోని వానను ఆపటానికి ద్వారకామాయి (మశీదు) బయటకు వచ్చి, ఆగు, యాగు, నీకోపము తగ్గించు, నెమ్మదించు" అన్న మాటలు తిరిగి ఈనాడు తన భక్తులు శిరిడీకి వస్తూ ఉంటే వారికి యిబ్బంది కలగకుండ యుండటానికి అదే మాటలు ఉచ్చరించి ఉంటారని నానమ్మకము. ఒక్కసారి శ్రీసాయిపై నమ్మకము కుదిరిన తర్వాత ఆనమ్మకము శిరిడీ యాత్రవరకు కాకుండ మన జీవిత యాత్రలో కూడా ఉంచుకొని మనము భగవత్ సాక్షాత్కారమును పొందవలెను.
శ్రీసాయి సేవలో
నీతండ్రి
(సర్వం శ్రీసాయినాధార్పణమస్తు)
No comments:
Post a Comment