Friday 5 September 2014

కలలలో శ్రీసాయి - 4వ.భాగం

  
         
05.09.2014 శుక్రవారము
ఓంసాయి శ్రీసాయి జయజయ సాయి
సాయిబంధువులకు బాబావారి శుభాశీస్సులు

కలలలో శ్రీసాయి - 4వ.భాగం

ఈ రోజు సాయి.బా.ని.స. గారు చెపుతున్న కలలలో శ్రీసాయి వినండి.


 శ్రీసాయి సత్ చరిత్ర 31వ.అధ్యాయంలో బాబా తన భక్తుడయిన బాలారాం మాన్ కర్ కి మశ్చీంద్రఘడ్ వెళ్ళి రోజుకు మూడుసార్లు ధ్యానం చేయమని సలహా ఇచ్చారు.  తాను సర్వత్రా నిండి ఉన్నానని నిరూపించడానికి బాబా అతనికి సశరీరంగా దర్శనమిచ్చి బాలారాం తో "నేను ఒక్క షిరిడీలోనే ఉన్నానని అనుకొంటున్నావు.   ఇపుడు  నన్ను చూస్తున్న రూపానికి, షిరిడిలో చూసిన రూపానికి నువ్వే సరిపోల్చుకో. షిరిడీలో చూసిన రూపానికి, యిచ్చట మశ్చీంద్రఘడ్ లో చూసిన రూపానికి, నా చూపులకి ఆకారానికి ఏమన్న భేదమున్నదా?" అని అడిగారు.  దీనిని బట్టి మనం గ్రహించవలసినదేమిటంటే బాబా ఒక్క షిరిడీలోనే ఉన్నారని అనుకోరాదు.  ఆయన చెప్పినట్లుగా బాబా ఎక్కడ ఉంటే అదే షిరిడి.  




శ్రీసాయి సత్ చరిత్ర 30వ.అధ్యాయంలో బొంబాయిలోని పంజాబీ వ్యక్తి రాం లాల్ కి బాబా స్వప్నంలో మహంతుగా కనిపించి షిరిడీకి రమ్మని చెప్పారు.  వణి గ్రామంలోని సప్తశృంగి దేవాలయ పూజారి కాకాజీ వైద్య కలలో దేవతగా దర్శనమిచ్చి షిరిడీకి రమ్మని పిలిచారు.  


ఈవిధంగా బాబాతన భక్తుల స్వప్నాలలో దర్శనమిచ్చి వారిని షిరిడీకి రప్పించుకొన్నారు.

1918వ.సంవత్సరం అక్టోబరు 15వ.తారీకున బాబా మహాసమాధి చెందారన్న విషయం మనకు తెలుసు.  అక్టోబరు 16వ.తారీకు వేకువఝామున బాబా పండరీపూర్ లో ఉన్న దాసగణు కలలో కనిపించి "ద్వారకామాయి కూలిపోయింది.  వర్తకులందరూ నన్ను చాలా చికాకులు పెట్టారు.  అందుకనే నేను యిక్కడినుండి నిష్క్రమించాను.  నీకు ఈవిషయం తెలియచేయడానికే నేనిక్కడికి  వచ్చాను.  వెంటనే నువ్వక్కడికి వెళ్ళి నాశరీరాన్నంతా పూలతో కప్పు" అని చెప్పారు.  దాసగణు షిరిడీకి వచ్చి బాబాకు పూలదండలు వేసి ఆయన చెప్పినట్లుగానె బాబా శరీరాన్నంతా ఎన్నోపూలతో కప్పాడు.  బాబా దేహాన్ని పూవులతో పూజించి రోజంతా సాయి నామాన్ని జపిస్తూ కూర్చున్నాడు.  బాబాకు అంత్యక్రియలు పూర్తయిన తరువాత దాసగణు బీదలకు అన్నదానం జరిపించాడు.       

తన భక్తుల మదిలో కలిగే సందేహాలకు బాబా యితర భక్తులద్వారా పరోక్షంగా సమాధానాలు చెప్పేవారు. శ్రీసాయి సత్ చరిత్ర 45వ.అధ్యాయంలో బాబా ఆనందరావు పాఖడే కలలో కనిపించి కాకాసాహెబ్ దీక్షిత్ కు భగవంతునిపై భక్తి అనే విషయంలో కలిగిన సందేహాన్ని నివృత్తి చేశారు.     

శ్రీసాయి సత్ చరిత్ర 48వ.అధ్యాయాన్ని గమనిద్దాము.  అక్కల్ కోట నివాసి న్యాయవాది అయిన సపత్నేకర్ ఒక్కగానొక్క కొడుకు 1913వ.సంవత్సరంలో గొంతువ్యాధితో మరణించాడు.  ఈసంఘటనకి సపత్నేకర్ దంపతులు చాలా కృంగిపోయారు.  ఒకసారి సపత్నేకర్ భార్య కలలో లకడ్ షా వద్దనున్న బావిలో నీరు తోడుతూ ఉంది.  బాబా ఆమె వద్దకు వచ్చి "ఎందుకు కలత చెదుతావు?  నీకుండను నేను స్వచ్చమయిన నీటితో నింపెదను" అని దీవించారు. 


  

 చనిపోయిన ఆమె కొడుకు ఆత్మను బాబా తిరిగి ఆమె గర్భంలోనికి ప్రవేశపెట్టారు.  1914వ.సంవత్సరంలో బాబా అనుగ్రహంతో సపత్నేకర్ దంపతులకు కుమారుడు జన్మించాడు.    

శ్రీసాయి సత్ చరిత్ర 47వ.అధ్యాయంలో బాబా గౌరికి కలలో మహదేవునిగా దర్శనమిచ్చి, ఆమెను భర్త అనుమతితో తండ్రియిచ్చిన నగలను అమ్మి వచ్చిన ధనంతో దేవాలయం మరమ్మత్తుల కోసం విరాళం యిమ్మని చెప్పారు.  ఈవిధంగా బాబా తన భక్తులకు స్వప్నంలో దర్శనమిచ్చి వారికి మంచి సలహాలు, సూచనలు యిస్తూ ఉండేవారు. 

(ఇంకా ఉంది)
(సర్వం శ్రీసాయినాధార్పణమస్తు) 

No comments:

Post a Comment