Wednesday, 10 September 2014

కలలలో శ్రీసాయి - 7వ.భాగం

      

10.09.2014 బుధవారం
ఓంసాయి శ్రీసాయి జయజయ సాయి
సాయి బంధువులకు బాబావారి శుభాశీస్సులు

కలలలో శ్రీసాయి - 7వ.భాగం

ఈ రోజు సాయిబానిస శ్రీరావాడ గోపాలరావుగారు చెపుతున్న కలలలో శ్రీసాయి తరువాయి భాగం వినండి.

ఆంగ్లమూలం : సాయిబానిస. శ్రీరావాడ గోపాలరావు
తెలుగు అనువాదం : ఆత్రేయపురపు త్యాగరాజు - 9440375411



ప్రతీవారు జీవితం ఒక రైలు ప్రయాణంవంటిది అని అంటూ ఉంటారు.  మరి ఈప్రయాణానికి మొదటి స్టేషను ఆఖరి స్టేషను ఏది? అని ఆలోచిస్తూ పడుకున్నాను.  ఆరోజు రాత్రి బాబా నాకలలో నాతల్లి రూపంలో దర్శనమిచ్చి "నాగర్భం నుండి  నీజీవిత ప్రయాణం ప్రారంభింపబడింది.  నీమరణం తర్వాత తిరిగి వేరే తల్లి గర్భంలోకి చేరటమే నీజీవిత ప్రయాణానికి ఆఖరు మరల నూతన జీవితానికి ఆరంభం అని గుర్తుంచుకో"  అన్నారు.   



బాబా! నాకు నువ్వు అనేక సందేశాలను ప్రసాదించావు.  మరి జ్ఞానమార్గంలో (ఆధ్యాత్మిక మార్గంలో) ప్రయాణించడానికి సలహాలు, సూచనలు ప్రసాదించు తండ్రీ అని బాబాను వేడుకొన్న రాత్రి బాబా నాకలలో ఒక రైతు కూలీగా దర్శనమిచ్చి "నీజీవితంలో అజ్ఞానమనే కలుపుమొక్కలను తీసివేయటం నావంతు.  ఇక పొలంలో మిగిలిన జ్ఞానమనే మొక్కలను పెంచి పెద్ద చేయటం నీవంతు".ఈవిధంగా ప్రతి మానవుడు సద్గురు సహాయంతో మనలోని అజ్ఞానాన్ని తొలగించుకొని, జ్ఞానదీపాలను వెలిగించుకొని దాని సహాయంతో జీవితాన్ని ముందుకు కొనసాగించాలి.    

శ్రీసాయి తన భక్తుల మధ్యనే ఉన్నారు అనే భావన మనకు శ్రీసాయి సత్ చరిత్ర 40వ.అధ్యాయంలో తెలియచేశారు.  దానికి ఉదాహరణ 1917వ.సంవత్సరంలో హోళి పండుగరోజున   బాబా హేమాద్రిపంతుకు కలలో చక్కని దుస్తులు ధరించి సన్యాసి రూపంలో దర్శనమిచ్చి ఆనాడు మధ్యాహ్న్నం వారింటికి భోజనానికి వచ్చెదనని చెప్పారు.  సరిగా ఆయన చెప్పిన ప్రకారం మధ్యాహ్న్నం భోజన సమయానికి బాబా పటం రూపములో హేమాద్రిపంతు యింటికి వచ్చి తన మాటను నిలబెట్టుకున్న సంఘటన మనకందరకూ తెలుసు.        


ఇదేవిధంగా 1996వ.సం.మార్చి నెలలో ఒక ఆదివారం తెల్లవారుజామున బాబా, నేను పనిచేసినటువంటి కంపెనీ చీఫ్ ఎక్జిక్యూటివ్ శ్రీసిమ్హా గారి రూపంలో దర్శనమిచ్చి మధ్యాహ్న్న భోజనానికి నీయింటికి వస్తానని చెప్పారు.  ఈవిషయాన్ని నేను నాభార్యకు చెప్పినపుడు ఆమె నవ్వి "మీకు సిమ్హా గారితో పరిచయం లేదు కదా?  వారు మనయింటికి భోజనానికి ఎందుకు వస్తారని"ఎగతాళిగా మాట్లాడింది.  కాని, నాకు బాబాపై అచంచలమయిన నమ్మకం ఉంది.  ఆయన మాట తప్పరు.  బాబా హేమాద్రిపంతు యింటికి పటం రూపంలో వెళ్ళి వారి కుటుంబాన్ని ఆశీర్వదించారు. మరి బాబా నాయింటికి ఏరూపం లో భోజనానికి వస్తారు" వేచి చూద్దామని మధ్యాహ్న్నం భోజనం చేయకుండా బాబా రాకకోసం ఎదురు చూస్తూ కూర్చొన్నాను.  నాభార్యకు ఆరోజులలో బాబాపై అంత నమ్మకం లేదు.  ఆమె మధ్యాహ్న్నం ఒంటిగంట వరకు ఎదురు చూసి తన భోజనం పూర్తి చేసింది.  నేను మధ్యాహ్న్నం గం.2.30ని. వరకు బాబా కోసం ఎదురు చూసి యిక బాబా రారు అనే బాధతో నాభోజనానికి ఉపక్రమించాను. నేను భోజనం ప్రారంభించిన అయిదు నిమిషాలకు మాకంపెనీలో నాదగ్గిర పని చేస్తున్న శ్రీసత్తెయ్య వచ్చి నాతోపాటు భోజనం చేశాడని చెబితే మీరంతా ఆశ్చర్యపోతారు.  నేను భోజనం చేస్తున్న సమయంలో సత్తెయ్య అన్న మాటలు "తను ఫ్యాక్టరీలో మొదటి షిఫ్టులో పని పూర్తి చేసుకొని తన యింటికి బయలుదేరుతుంటే తన మనసులో యివాళ గోపాలరావుగారింటికి వెళ్ళి భోజనం చేయాలి" అని భావన కలిగిందట.  ఆకలిగా ఉంది ఏదయినా తినాలి అనే భావనతో మీయింటికి వచ్చాను సారు అని చెప్పినపుడు నాకళ్ళలో నీరు నిండిపోయింది. నాబాబా చీఫ్ ఎక్జిక్యూటివ్ రూపం లో అన్న తనమాటను నిలబెట్టుకోవడానికి ఒక కార్మికుడు రూపంలో నాయింటికి రావడం నాఅదృష్టంగా భావించాను.  ఈసంఘటనతో నాభార్యకు శ్రీసాయిబాబాపై తిరుగులేని నమ్మకం కుదిరింది.      

భీమాజీ పాటిల్ క్షయవ్యాధిని బాబా కలలో అతని చాతీపై బండరాయితో రుద్ది వీపుమీద బెత్తంతో దెబ్బలు కొట్టి ఆవ్యాధిని నయం చేశారన్న విషయాన్ని శ్రీసాయి సత్ చరిత్ర 13వ.అధ్యాయంలో మనం చూశాము.  బాబా నావిషయంలో నాకు రాబోయే గుండె నొప్పి గురించి 1992లో కలలో చూపించి దానికి ముందు జాగ్రత్తగా జేబులో ఎపుడూ 'సార్బిట్రేట్'  మాత్రను ఉంచుకోమని సలహా యిచ్చారు.  బాబా సూచించినట్లే నాకు 1996సం.ఏప్రిల్ 21వ.తారీకునాడు ఉదయం గుండె నొప్పి వచ్చింది.  అదృష్టవశాత్తు బాబా 1992లో సూచించిన విధంగా నాజేబులో ఉన్న 'సార్బిట్రేట్' మాత్రను నాలిక క్రింద ఉంచుకొని డాక్టర్ వద్దకు వెళ్ళాను.  డాక్టర్ నేను తీసుకొన్న ముందు జాగ్రత్తకి ఆశ్చర్యపడి బాబా మిమ్మల్ని కాపాడారు అన్నారు.  తరువాత నాకు అన్నిరకాల పరీక్షలు చేసి 1996సం.మే 17వ.తారీకున ట్రిపుల్ బైపాస్ సర్జరీ చేశారు.  బాబా ఈవిధంగా భవిష్యత్తులో రాబోయే ప్రమాదాన్ని ముందుగానే కలలో తెలియచేసి నన్ను కాపాడారు.  


(ఇంకా ఉంది)
(సర్వం శ్రీసాయినాధార్పణమస్తు) 

No comments:

Post a Comment