Tuesday, 9 September 2014

కలలలో శ్రీసాయి - 6వ.భాగం

   
                

09.09.2014 మంగళవారము
ఓంసాయి శ్రీసాయి జయజయసాయి
సాయి బంధువులకు బాబావారి శుభాశీస్సులు

కలలలో శ్రీసాయి - 6వ.భాగం

ఈ రోజు సాయిబానిస శ్రీరావాడ గోపాలరావుగారు చెపుతున్న కలలలో శ్రీసాయి 6వ.భాగం వినండి.

ఆంగ్లమూలం : సాయిబానిస శ్రీరావాడ గోపాలరావు
తెలుగు అనువాదం: ఆత్రేయపురపు త్యాగరాజు - 9440375411


నేను 1989వ.సంవత్సరంలో శ్రీ సాయికి భక్తుడిగా మారాను.  కాని నాకు కష్టాలు, చికాకులు ఏమీ తప్పటల్ల్లేదు.  ఇలా బాధ పడుతున్నపుడు శ్రీసాయి నాస్వప్నంలో కనిపించి ఈవిధంగా అన్నారు. "జీవితం అనే లోహాన్ని కష్టాలు,సుఖాలు అనే అగ్నిలో కాల్చబడనీ.  దానికి సమ్మెట దెబ్బలు తగలనీ.  దాని తరువాత సాయి అనబడే ద్రావకంలో ముంచి తియ్యి.  అపుడు దాని రంగునీ కాంతినీ చూడు.  ఈమాటలకు నేను 1996 లో అర్ధాన్ని గ్రహించాను.  2000 సంవత్సరం తరువాత కష్టాలకు, సుఖాలకు అతీతంగా జీవించడం ప్రారంభించగలిగాను. 



బాబా ఎప్పుడూ కాషాయరంగు వస్త్రాలు ధరించలేదు.  ఆయన ఎల్లప్పుడు తెల్ల రంగు కోరాబట్టతో కుట్టించిన కఫనీని మాత్రమే ధరించేవారు.  బాబా తెల్లని వస్త్రాలను ధరించారు కదా అని నేను కూడా తెల్లని వస్త్రాలను ధరిద్దామని కోరిక కలిగినపుడు శ్రీసాయి నాకు కలలో యిచ్చిన సందేశం - "జీవితంలో తెల్లని వస్త్రాలను ధరించడమంటే సుఖశాంతులను కోరుకోవడం.  ఆతెల్లని వస్త్రాలపై మురికిని చేర్చడమంటే కష్టాలను కొని తెచ్చుకోవడం.  ఆమురికిని సద్గురువు సహాయంతో మనమే శుభ్రం చేసుకొని సుఖశాంతులతో కూడిన జీవితాన్ని  గడపాలి."    


సాధారణంగా ప్రతివాడు సుఖాన్నే కోరుకొంటాడు.  కాని కష్టాలనేవి మనం కోరుకోకపోయినా మనవద్దకు వచ్చి మనలని బాధిస్తూనే ఉంటాయి.  అటువంటప్పుడు మనం ఏంచేయాలనే ఆలోచన వచ్చింది.  దానికి శ్రీసాయి నాకు కలలో యిచ్చిన సందేశం -"జీవితంలో నీవు కష్టాలు పడినప్పుడు ఆ కష్టాలను నీవు మరచిపోరాదు.  ఎదుటివానికి నువ్వు ఆకష్టాలను కలిగించరాదు.  అప్పుడే నువ్వు నిజమయిన మానవుడివి.  నీవనుభవించిన కష్టాలను ఎడుటివాడికి కల్పిస్తే నీవు దానవుడివి."     

మనము కష్టాలలో ఉన్నపుడు ఆధ్యాత్మిక రంగంలో ప్రయాణించడానికి కావలసిన అర్హతలేమిటనే ప్రశ్న నాలో కలిగి శ్రీసాయికి సమాధానమడిగాను.  దానికి శ్రీసాయి నాకు ప్రసాదించిన సమాధానం "జీవితంలో నీవు పొందిన కష్టాలు సుఖాలనుండే ఈఆధ్యాత్మిక భావాలు వస్తాయి.  ఆధ్యాత్మికం అనేది వేరేగా ఎక్కడా వ్రాసిలేదు.  జీవితంలో కష్టాలను మర్చిపోవడానికి మత్తు పానీయాలు త్రాగడం, భగవంతుని ప్రేమ పొందాలనే తపనతో ఉపవాసాలు చేయటం నాకిష్టం ఉండదు"అన్నారు బాబా.  ఈసందేశాలను నేను ఈనాడు అక్షరాలా పాటిస్తున్నాను.  ఈఆధ్యాత్మిక జీవనంలో మెట్టు మెట్టు పైకి ఎదగాలంటే భగవంతుని మీద స్థిరమయిన నమ్మకం ఉండాలి.    



సాయి భక్తులలో నూటికి 99మంది గృహస్థాశ్రమంలో ఉన్నవారే.  నాజీవితంలో నేననుభవిస్తున్న అంతులేని కష్టాలు, నేను మోస్తున్న బరువుబాధ్యతలను గురించి ఆలోచిస్తూ సాయిని ప్రశ్నించాను. అప్పుడు బాబా నాకు ప్రసాదించిన సమాధానం - "జీవితంలో గతించిన కాలం నిన్ను పగపట్టిన పాములాగ వెంటాడుతూ ఉంటుంది.  ఆధ్యాత్మిక చింతన కలవారిని ఆపాము ఏమీ చేయలేదు.  నీవు నీబరువు బాధ్యతలను పూర్తి చేయటం ఆ ఆధ్యాత్మిక చింతనలో ఒక భాగమే.  ఒకవేళ నీవు నీబరువుబాధ్యతలను పూర్తి చేయలేకపోతే నీగత చరిత్ర అనే పాము నిన్ను కాటేస్తుంది జాగ్రత్త." ఈసందేశాన్ని  గుర్తుపెట్టుకొని నాబరువు బాధ్యతలన్నిటిని నేను 2006వ.సంవత్సరానికి పూర్తి చేసుకొని ఈరోజున వానప్రస్థాశ్రమంలోనికి అడుగు పెట్టాను.  నాజీవిత పోరాటంలో నేను నావాళ్ళనుండి ప్రేమను పొందలేకపోయానే అని బాధపడుతున్నపుడు శ్రీసాయి నాకు కలలో యిచ్చిన సందేశం -"జీవితంలో నీవారినుండి నీవు ప్రేమను పొందలేనినాడు బాధపడటం సహజమే.  ఇటువంటి బాధలను అనుభవించే సమయంలో యితరులనుండి ఓదార్పును మాత్రం నీవు కోరవద్దు.  నీవు పొందలేకపోయిన ప్రేమను వేరే విధంగా ప్రసాదించమని ఆభగవంతుని వేడుకో"అన్నారు బాబా. 

మన జీవితాలలో పాత జ్ఞాపకాలు మనసుకు సంతోషాన్ని విచారాన్ని కలుగచేస్తూ ఉంటాయి. మరి పాత జ్ఞాపకాలు మనసులోకి వచ్చినపుడు వాటికి ప్రాధాన్యత యివ్వాలా వద్దా? అని నాకు వచ్చిన ఆలోచనకి బాబా నాకు కలలో యిచ్చిన సందేశం "జీవితంలో పాత జ్ఞాపకాలు పాడుబడిన భవనాలవంటివి. అవి నివాసయోగ్యం కావు.  అలాగే పాత జ్ఞాపకాలు మన వర్తమానానికి, భవిష్యత్తుకు పనికిరావు. అందుచేత పాత జ్ఞాపకాలను మర్చిపోవటమే మంచిది".  ఈసందేశాన్ని ప్రతివారూ పాటిస్తే కష్టాలు, కార్పణ్యాలు ఉండవు.  ప్రతివారు సుఖప్రదమయిన వర్తమానంలో జీవించగలుగుతారని నేను భావిస్తాను.    



నేను 1999వ.సంవత్సరంలో భారతప్రభుత్వ శాఖలో ఉన్నత పదవిలో ఉన్నప్పుడు బాబా ఒకనాడు కలలో దర్శనమిచ్చి"యిప్పుడు నువ్వు ఆకాశంలో విమానాన్ని నడుపుతున్నావు.  ఆవిమానంలోని యింధనం పూర్తిగా ఎగరడానికే వినియోగించకుండా కొంత యింధనాన్ని విమానాన్ని క్షేమంగా విమానాశ్రయంలో దిగడానికే వినియోగించుకో".  ఈసందేశాన్ని అర్ధం చేసుకొని భారత ప్రభుత్వ సేవలనుండి 2000 సంవత్సరం మార్చి నెలలో స్వచ్చంద పదవీ విరమణ చేసి శ్రీసాయి భక్తులసేవకు అంకితమయ్యాను.  


(ఇంకా ఉంది)
(సర్వం శ్రీసాయినాధర్పణమస్తు) 

No comments:

Post a Comment