Saturday, 6 September 2014

కలలలో శ్రీసాయి - 5వ.భాగం


          

07.09.2014 ఆదివారము
ఓంసాయి శ్రీసాయి జయజయ సాయి
సాయి బంధువులకు బాబావారి శుభాశీస్సులు

నిన్నటి రోజున కొన్ని అనివార్యకారణాలవల్ల ప్రచురించలేకపోయాను.  ఈ రోజు సాయి.బా.ని.స.గారు చెపుతున్న కలలలో శ్రీసాయి 5వ.భాగం వినండి.

ఆంగ్లమూలం: సాయి.బా.ని.స. శ్రీరావాడ గోపాలరావు
తెలుగు అనువాదం : ఆత్రేయపురపు త్యాగరాజు - 9440375411


కలలలో శ్రీసాయి - 5వ.భాగం

శ్రీసాయి తనకు కావలసిన పనులన్నిటినీ తన భక్తులకు కలలలో ఆదేశించి పనులు పూర్తి చేయించునేవారని చెప్పటానికి ఉదాహరణలు  శ్రీసాయి సత్ చరిత్ర 39,45 అధ్యాయాలలో చూడగలం.  శ్రీసాయి గోపాల్ ముకుంద్ బూటి మరియు శ్యామాలకు ఒకేసారి స్వప్నంలో దర్శనమిచ్చి వారిచేత బూటీవాడాను నిర్మింపచేసి అందులోనే ఆయన మహాసమాధి చెందారు.  ఆనందరావు పాఖడేకు స్వప్నంలో కనిపించి శ్యామాకు పట్టుపంచెను యిమ్మని ఆదేశించారు.    




1993వ,సంవత్సరం జూన్ 11వ.తేదీ నాకలలో బాబా నేను పనిచేసిన కంపెనీలోని చీఫ్ ఎగ్జిక్యూటివ్ రూపంలో దర్శనమిచ్చి నేను మీయింటిలో శాశ్వతంగా ఉండదలచుకొన్నాను. నాకు రోజ్ ఉడ్ కఱ్ఱతో టేబులు, కుర్చీ చేయించి పెట్టు అన్నారు.  నేను ఈవిషయాన్ని పూర్తిగా మర్చిపోయాను.  కాని బాబా ఈవిషయాన్ని మరచిపోలేదు.  1996వ.సంవత్సరం జనవరి 26వ.తారీకు రధసప్తమినాడు నేను మాయింటిలో సాయిదర్బార్ ను ప్రారంభించాను.  నేను చెప్పకపోయినా వడ్రంగి రోజ్ ఉడ్ కఱ్ఱతో బాబాకు సిమ్హాసనం చేసి తీసుకొని వచ్చి సాయి దర్బార్ లో పెట్టడం నాకు నాస్నేహితులకు చాలా ఆశ్చర్యాన్ని కలిగించింది.  


ఈవిషయంపై ఆవడ్రంగిని ప్రశ్నిస్తే తను టేకు చక్కతో సిమ్హాసనం చేద్దామనుకున్నాననీ అది సమయానికి అందకపోవటంతో రోజ్ ఉడ్ రంగు కఱ్ఱతో చేసి తీసుకొని వచ్చానని చెప్పాడు. బాబా తనకు కావలసిన పనులను సమయానుకూలంగా తన భక్తులచేత చేయించుకుంటారన్నదానికి జరిగిన ఈసంఘటనే నిదర్శనమని మేమందరం గ్రహించగలిగాము.   

    శ్రీ సాయి సత్ చరిత్ర 14వ.అధ్యాయంలో బాబా తన భక్తుల వద్దనుంచి దక్షిణ ఎలా స్వీకరించేవారో గమనిద్ద్దాము.  బాబా ద్వారకామాయికి వచ్చిన భక్తులందరి వద్ద దక్షిణ అడిగేవారు కాదు.  అడగకుండానే యిచ్చిపుడు ఒక్కొక్కప్పుడు పుచ్చుకొనేవారు కాదు.  ఒక్కొక్కప్పుడు నిరాకరిస్తూ ఉండేవారు.  కొంతమంది భక్తులవద్దనుండి ప్రత్యేకంగా అడుగుతూ ఉండేవారు.   

బాబా అడిగినప్పుడు యిద్దాములే అని అనుకున్నవారిని దక్షిణ అడిగేవారు కాదు.  తమ యిష్టానికి వ్యతిరేకంగా ఎవరన్నా దక్షిణ యిచ్చినా దానిని ముట్టేవారు కాదు.  అడిగినా దక్షిణ యివ్వని వారిపై బాబా కోపగించలేదు.  ఒక్కొక్కసారి బాబా అడిగిన మొత్తం భక్తుల వద్ద్ద లేకపోతే అప్పు చేసి ఆసొమ్ము తెమ్మని చెప్పేవారు.  ఈవిధంగా బాబా రోజుకు మూడు నాలుగు సార్లు కొంతమంది వద్ద దక్షిణ అడిగి తీసుకొంటూ ఉండేవారు.  ఈవిధంగా ద్వారకామాయిలో దక్షిణ వ్యవహారం  జరుగుతూ ఉండేది.       

ఈనాడు బాబా శరీరంతో లేకపోయినా ఆయన తన భక్తుల కలలలో కనిపించి దక్షిణ అడిగి స్వీకరిస్తారన్న దానికి ఉదాహరణ నా జీవితంలో జరిగిన ఒకసంఘటన.  ఆరోజున నేను విశాఖపట్నంలోని మాసోదరి యింటిలో నిద్రిస్తూ ఉన్నాను. అప్పుడు కలలో బాబా సూటు,బూటు, టోపీ, నల్లకళ్ళజోడు ధరించి ఒక పెద్దమనిషి రూపంలో దర్శనమిచ్చి యిలా అన్నారు "నీవు నీకుమార్తె వివాహ నిశ్చితార్ధానికి విశాఖపట్నం వచ్చావు.  వియ్యాలవారికి లాంచనాల నిమిత్తం ధనం యిచ్చావు మరి నాకు ఏమీ యివ్వవా?  అయిదు రూపాయలు దక్షిణ సమర్పించుకో" ఈమాటలతో నాకు మెలకువ వచ్చింది.  బాబా ఆవిధంగా నన్ను దక్షిణ అడగడం నా అదృష్టంగా భావించాను.  అదేరోజు ఉదయం 6గంటలకు విశాఖపట్నం రైల్వే స్టేషన్ ప్లాట్ ఫారం మీద హైదరాబాదు తిరుగు ప్రయాణానికి ఈస్ట్ కోస్ట్ ఎక్స్ ప్రెస్ కోసం చూస్తూ ప్లాట్ ఫారం మీద వేచి ఉన్నాను.  తూర్పు దిక్కున సూర్యుడు అప్పుడే ఉదయిస్తూ ఉన్నాడు.  అప్పుడే ప్లాట్ ఫారం చివరనుండి సూటు, బూటు, నెత్తిమీద టోపీ, నల్ల కళ్ళద్దాలు ధరించిన ఓపెద్దమనిషి వచ్చి నేను కూర్చున్న బెంచీ మీద కూర్చొన్నాడు. 

నాకళ్ళను నేను నమ్మలేకపోయాను.  ఆవ్యక్తిని చూడగానే అదే రూపంలో ఒక వ్యక్తి తెల్లవారుజామున నాకలలోకి వచ్చి అయిదు రూపాయలు దక్షిణ కోరడం గుర్తుకు వచ్చింది.  బాబా నానుండి దక్షిణ స్వీకరించడానికి నాకు కలలో దర్శనమిచ్చిన రూపంతోనే వచ్చారా లేక యిదంతా నా భ్రమా అనే ఆలోచనలో పడిపోయాను.  అవ్యక్తికి అయిదు రూపాయలు దక్షిణ యిచ్చినా స్వీకరిస్తారో లేదో అని అనుమానం.  ఈ విధమైన ఆలోచనలతో సతమవుతూ ఉండగా నాకొక ఆలోచన వచ్చింది.  నాపరసులోనుండి ఒక అయిదురూపాయల నోటు తీసి చేతితో పట్టుకొని ఆవ్యక్తి వెనుకభాగమునుండి నడుస్తూ ఆనోటును ఆయన పాదాల వద్ద పడేలాగ జారవిడచి కొంత ముందుకు వెళ్ళి తిరిగి వెనక్కి వచ్చి "అయ్యా! మీరు అయిదు రూపాయల నోటు పడవేసుకొన్నారు.  మీపాదాల వద్ద పడివుంది.  దయచేసి తీసుకోండి" అని ఆవ్యక్తితో అన్నాను.   అపుడా పెద్దమనిషి ఏమీ మాట్లాడకుండా ఒక చిరునవ్వుతో ఆనోటును తీసుకొని ప్లాట్ ఫారం రెండవవైపునుండి వెళ్ళిపోతూ అదృశ్యమైపోయాడు.  రాత్రి కలలో కనిపించి అయిదు రూపాయలు దక్షిణ కోరి నా అమాయకత్వానికి చిరునవ్వును ప్రసాదించి నానుండి దక్షిణ స్వేకరించిన ఆపెద్దమనిషి నాసద్గురువయిన సాయినాధులవారే అని నేను నమ్ముతున్నాను.      

  శ్రీసాయి కలల ద్వారా అనేక సందేశాలను ప్రసాదించి తన భక్తుల ఆధ్యాత్మిక ప్రగతికి దోహదం చేసేవారు.  ఇప్పటికీ ఆయన తన భక్తుల నిజ జీవితాలలో అనేక అనుభవాలను ప్రసాదిస్తూ మీకు సదా నేను తోడుగా ఉంటానని ఋజువు చేస్తూ ఉన్నారు.  బాబా నాజీవితంలో నాకు కలలద్వారా ప్రసాదించిన ఆధ్యాత్మిక సందేశాలు, బాబా నాకు ప్రసాదించిన అనుభవాలను మీతో పాలు పంచుకోదలచాను.  1914వ.సం.ఏప్రిల్ 2వ.తారీకున బాబా శ్రీ బీ.వీ.దేవ్ కు కలలో దర్శనమిచ్చి జ్ఞానేశ్వరి (భగవద్గీత) బోధ పడుతున్నదా అని అడిగి దగ్గిర ఉండి జ్ఞానేశ్వరిని చదివించి తెలియని శ్లోకాలకు అర్ధం చెప్పి బీ.వీ.దేవ్ ఆధ్యాత్మిక ప్రగతికి తోడ్పడ్డారు.         

శ్రీసాయి నాకు అనేక సందర్భాలలో కలలలో దర్శనమిచ్చి తెలియచేసిన సందేశాలను కొన్నిటిని మీకు వివరిస్తాను.   

జీవితంలో ప్రతివారికి ఎదురయే ప్రశ్న "జీవితం అంటే ఏమిటి?" ఈప్రశ్న ఏదో ఒక సందర్భంలో ప్రతివాడికి ఎదురయేదే.  ఇదే ప్రశ్న నాలో కలిగినపుడు నాకలలో సాయి నాకు యిచ్చిన సమాధానం "జీవితం ఒక తెల్ల కాగితంవంటిది.  ఆకాగితం మీద మంచి మాటలు వ్రాస్తే ఆకాగితాన్ని అందరూ ఎంతో గౌరవ భావంతో నెత్తిమీద పెట్టుకొంటారు.  


అదే చెడ్డ విషయాలను వ్రాస్తే ఆకాగితాన్ని అందరూ చించి వేస్తారు".  అనే విషయాన్ని గ్రహించిన తరువాత నేను నా  జీవితంలో చెడుకు దూరంగానే ఉంటున్నాను.    

ప్రతివారు ప్రశాంతమయిన జీవితాన్నే కోరుకొంటారు.  నేను కూడా ప్రశాంతమయిన జీవితాన్ని ప్రసాదించమని శ్రీసాయిని కోరుకొన్ననాటి రాత్రి శ్రీసాయి నాతో కలలో అన్న మాటలు - "జీవిత శిఖరాలపై ఉన్న ప్రాపంచిక మంటలలో బాధపడేకన్నా జీవిత లోయలలోని ఆధ్యాత్మిక సెలయేరు ప్రక్కన ప్రశాంతంగా జీవించడం మిన్న".  ఈసందేశంలోని అర్ధం తెలుసుకొని ప్రశాంత జీవితానికి ప్రయత్నాలు ప్రారంభించాను."  

(ఇంకా ఉంది)
(సర్వం శ్రీసాయినాధార్పణమస్తు) 

No comments:

Post a Comment