28.04.2017 శుక్రవారమ్
ఓమ్ సాయి శ్రీసాయి జయజయ సాయి
సాయి బంధువులకు బాబావారి శుభాశీస్సులు
ఆధ్యాత్మిక మార్గములో ప్రయాణముపై సాయిబానిస ఆలోచనలు – 7
సంకలనం : ఆత్రేయపురపు త్యాగరాజు, ఆల్ ఖైల్ గేట్, దుబాయి
76. భగవంతుని తెలుసుకోవటానికి నీలోని ఆత్మను పరిశీలన చేయకుండ నీకళ్ళతో చూసేది ఈ చెవులతో వినేది, నీ నాలికతో మాట్లాడేది మాత్రమే నీకు సహాయపడుతుంది అని భావించటము అవివేకము.
77. భగవంతుడు ప్రేమస్వరూపుడు. ఆప్రేమయె మన జీవనానికి మూలాధారము.
78. ఈ ప్రపంచములో భగవంతుని గురించి మాట్లాడే ప్రతి వ్యక్తి ప్రేమ గురించి మాట్లాడితీరతాడు.
79. ఈ ప్రపంచములో వృక్షజాలము బ్రతకటానికి సూర్యరశ్మి ఎంత అవసరమో అలాగే మానవజాతి సుఖశాంతులతో వర్ధిల్లటానికి ఆధ్యాత్మిక శక్తి అంతే అవసరము.
80. నీవు నీకనులతో అన్నిటిని చూడు, అందరితోను కలసిమెలసి జీవించు. కాని దేనిమీద, ఎవరిమీద వ్యామోహం పెంచుకోవద్దు.
81. నిజమైన భక్తునికి, భగవంతుడిని ఏవిధముగా పూజించాలి అని నీవు చెప్పనవసరము లేదు. భగవంతునికి భక్తునికి మధ్య అనుసంధానానికి మధ్యవర్తులు అవసరము లేదు.
82. మనిషి జన్మించినపుడు భగవంతునిపై నమ్మకముతో జన్మిస్తాడు. కాని మొదటిసారిగా కనులు తెరచి ఈలోకాన్ని చూసి నూతన వాతావరణములో పెరుగుతు అపనమ్మకము మూటగట్టుకొంటాడు. ఆ అపనమ్మకమును వదిలించుకోవటానికి మనిషి ఆధ్యాత్మిక రంగములో ప్రయాణము చేయక తప్పదు.
83. ప్రాపంచికరంగములో నీవు ధనము సంపాదించి దానిని నీవు దాచిపెట్టినపుడు నీతోటివాడు నిన్ను హింసించి నీధనాన్ని దోచుకుంటాడు. అదే నీవు అందరి ప్రేమను సంపాదించి దాచుకొన్నపుడు అందరు నీవద్దకు వచ్చి తమకు ప్రేమను పంచిపెట్టమని ప్రాధేయపడతారు.
84. నీమనసు ఈర్ష్య, ద్వేషాలు, కామ క్రోధాలుతో నిండిపోయినపుడు నీ ఆత్మ అనే దీపముయొక్క చిమ్నీపై ధూళి పేరుకొనిపోయి ఆత్మజ్యోతి నుండి వెలువడే కాంతి తగ్గిపోతుంది. నీవు నీ మనసులోని కామక్రోధాలు, ఈర్ష్యాద్వేషాలను తొలగించిననాడు తిరిగి నీఆత్మజ్యోతి ప్రకాశవంతమైన కాంతిని వెదజల్లుతుంది.
85. భగవంతుడు తన భక్తులతో అంటాడు. “నీవు ప్రేమ అనే దీపము వత్తిని సరిచేయి. నేను ఆ దీపానికి కావలసిన చమురు పోస్తాను. అపుడు ఆదీపపు కాంతిలో నీవు నన్ను చూడగలవు.
86. భగవంతుని గురించి తెలుసుకోవాలి అంటే ముందుగా ఆయన సృష్ఠించిన ఈవిశ్వమును చూడు. ఒకవేళ ఇంకా ఆయన గురించి తెలుసుకోవాలి అన్నపుడు మొదటి ప్రయత్నముగా ఈవిశ్వములో ఉన్న నక్షత్రాలను లెక్కపెట్టడము ప్రారంభించు. ఒకవేళ ఈప్రయత్నములో నీవు విజయము సాధించిన భగవంతుని గురించి తెలుసుకొన్నట్లే.
(రేపు ఆఖరి భాగం)
(సర్వం శ్రీసాయినాధార్పణమస్తు)
No comments:
Post a Comment