Monday 29 October 2012

శ్రీకృష్ణునిగా శ్రీసాయి - 4వ.భాగము

29.10.2012  సోమవారము
ఓంసాయి శ్రీసాయి జయజయసాయి
సాయి బంధువులకు బాబావారి శుభాశీస్సులు

శ్రీకృష్ణునిగా శ్రీసాయి - 4వ.భాగము
                                               
                                                         


సాయి.బా.ని.స. చెపుతున్న శ్రీకృష్ణునిగా శ్రీసాయి వినండి 




మరలా ఇప్పుడు భాగవతంలోకి వద్దాము. ధృవుడు ఎంతో ధైర్యంగా యక్షులతో పోరాడినందుకు కుబేరుడు ప్రశంసించాడు.



అజ్ఞానాన్ని  తొలగించుకోవడానికి ఎల్లప్పుడు హరినామస్మరణ దోహదం చేస్తుందని కుబేరుడు ఆశీర్వదించాడు. 

సత్ చరిత్రలో ఇటువంటి సలహా ఎక్కడయినా ఇవ్వబడిందా?  నిజమే, 27 వ.అధ్యాయములో ఇవ్వబడింది.  బాబా శ్యామాని విష్ణుసహస్రనామ పారాయణ చేయమని సలహా ఇచ్చారు. దానిని తన హృదయం మీద పెట్టుకోగానే తానెంతో ప్రశాంతతను పొందినట్లు చెప్పారు బాబా. ఆవిధంగా బాబా, విష్ణుసహస్ర పారాయణయొక్క ప్రాముఖ్యాన్ని శ్యామాకు తెలిపి, దానిని చదివేవారికి కలిగే సత్ఫలితాలను గురించి చెప్పారు.  

మీకు నేను గట్టి నమ్మకంతో ఇచ్చే సందేశం ఏమిటంటే మీ జీవిత నౌక కష్టాల కడలిలో ఉన్నపుడు విష్ణుసహస్రాన్ని ఆశ్రయించండి. మీరు తప్పకుండా ఆకష్టాలనుండి బయటపడతారు. "సరియైన సమయంలో నాకు బాబా ఈ సలహానిచ్చారు. దానిని నేను మర్చిపోలేను".

శ్రీమహావిష్ణువు అనుగ్రహంతో ధృవుడు చిన్నతనంలోనే "ధృవతారగా" మారాడని చాలామంది అనుకుంటారు.  కాని మీరు జాగ్రత్తగా పరిశీలించినపుడు ధృవుడు 26,000 సంవత్సరాలు రాజ్యపాలన చేశాడు. తరువాత రాజ్యాన్ని తన పెద్ద కుమారుడికి అప్పగించాడు. తరువాత ధృవుడు భద్రక అరణ్యాలలో తపస్సు చేసుకోవడానికి వెళ్ళాడు.  విష్ణుదూతలు వచ్చి అతనిని విష్ణులోకానికి తీసుకొని వెళ్ళారు. అటువంటిది మనకెప్పుడయినా జరుగుతుందా? మనలని ఆహ్వానించడానికి యమదూతలు తయారుగా ఉంటారని నాకనిపిస్తుంది. కాని బాబా అనుగ్రహం వల్ల విష్ణులోకాని వెళ్ళడం సాధ్యమే అని చెప్పడానికి ఉదాహరణలు ఉన్నాయి.  

50వ. అధ్యాయములో కాకాసాహెబ్ దీక్షిత్, మహల్సాపతిలు దీనికి ఉదాహరణలుగా నిలుస్తారు. నేనిప్పుడు ఆవిషయం గురించి వివరిస్తాను. కాకా బాబాకు ప్రియతమ భక్తుడు. బాబా కాకాని అంత్యకాలములో విమానంలో తీసుకొని వెడతానని మాటిచ్చారు. బాబా తన మాటను నిలబెట్టుకొన్నారని హేమాద్రిపంత్ చెప్పారు. 1926 వ.సంవత్సరము జూలై 5వ.తారీకున కాకా సాహెబ్ దీక్షిత్, అన్నా సాహెబ్ ధబోల్కర్ (హేమాద్రిపంత్)  ఇద్దరూ విలే పార్లే నుంచి బాంద్రాకు లోకల్ రైలులో ప్రయాణిస్తున్నారు. 


కాకాసాహెబ్ బాబా గొప్పతనం గురించి అన్నాసాహెబ్ ధబోల్కర్ కి వివరిస్తూ ఎటువంటి బాధా లేకుండా హటాత్తుగా మరణించారు. ఆవిధంగా బాబా కాకాని విష్ణులోకానికి తీసుకొని వెళ్ళారు. 

1922 వ.సంవత్సరము,సెప్టెంబరు 22 న.బాబా మహల్సాపతిని కూడా అదేవిధంగా అనుగ్రహించారు. తన తండ్రికి ఆబ్ధీకము పూర్తిచేసిన తరువాత పవిత్రమైన ఏకాదశి ఘడియలలో మహల్సాపతి బాబా దర్శనము చేసుకొందామనుకుని ద్వారకామాయికి బయలుదేరాడు. 


 ఆసమయంలో అతనికి చాతీలో నొప్పివచ్చి అనాయాసంగా మరణించాడు. 

బాబా తన భక్తులను విష్ణులోకానికి తీసుకొనివెడతారన్నదానికి ఈరెండూ ఉదాహరణలు. ఇక వారికి జనన మరణ చక్రాలు లేవు. హిందూ సిధ్ధాంతం ప్రకారం ఏకాదశి రోజు చాలా పవిత్రమైనదనీ ఆరోజు విష్ణులోకానికి తలుపులు తెరుచుకొంటాయని హిందువుల నమ్మకం.

రాజులందరూ ఎల్లప్పుడు మునులను సేవిస్తూ హరినామమునే జపిస్తూ ఉంటారో వారు భగవంతునికి ప్రీతిపాత్రులవుతారని భాగవతంలో చెప్పబడింది. గృహస్థాశ్రమంలో ఉంటూ ప్రత్యకేస మహారాజు ఇటువంటి ధర్మాలన్నిటినీ ఆచరించడంవలన ఎంతో శ్లాఘించబడ్డాడు. శ్రీమహావిష్ణువు అతనిని ప్రశంసించి తనకు విధేయులైన భక్తుల హృదయాలలో నివసిస్తానని చెప్పాడు. 

సాయి సత్ చరిత్ర 15వ. అధ్యాయములో సాయినాధులవారు ఇవేమాటలను చోల్కర్ కు చెప్పినారు. 

"నేను భక్తికి కట్టుబడి ఉంటాను. నాభక్తులకు సమీపంలోనే ఉంటాను. భక్తితో నన్ను పూజించేవారి హృదయాలలోనే నా నివాసం" అని చెప్పారు బాబా.

వృషభుని వృత్తాంతాన్ని తెలుసుకుందాము. వృషభుడు నాభి  మేరుదేవి దంపతులకు జన్మించాడు. నాభి చేసిన యాగానికి శ్రీమహావిష్ణువు సంతుష్టుడై అతనికి పుత్రుడిని ప్రసాదించారు.  అతనికిని వృషభుడు అని నామకరణం చేశారు. వృషభుడు చాలా కాలం రాజ్యపాలన చేశాడు. తరువాత వివేక వైరాగ్యాలని బాగా అధ్యయనం చేశాడు. అవధూతగా మారి తపస్సు చేసుకోవడానికి అడవులకు వెళ్ళాడు.  అతనికి అష్టసిధ్ధులు లభించాయి.  ఇవి లభించడం చాలా దుర్లభం.  అష్టసిధ్ధులు కలిగినవారికి గాలిలో ఎగరగలిగే శక్తి, ఆలోచనా తరంగాలను పంపించడం, అదృశ్యమయే శక్తి, పరకాయ ప్రవేశం వంటి శక్తులు కలిగి ఉంటారు. ఇప్పుడు మనం టెలివిజన్లో  చూస్తున్నట్లుగా ఎక్కడొ దూరంలో జరిగిన వాటిని చూడగలగడం ఇటువంటి శక్తులన్నీ లభిస్తాయి. ఇవన్నీ కూడా వృషభునికి లభించాయి.  

మన సాయినాధులవారికి కూడా ఇటువంటి సిధ్ధులన్నీ సహజంగానే ఉన్నాయి. నేను మీకిప్పుడు కొన్ని ఉదాహరణలు చెపుతాను. తలుపులు మూసివున్న గదిలో మేఘుడు నిద్రపోతున్నపుడు బాబా అతని గదిలోకి ప్రవేశించి కొన్ని అక్షింతలను చల్లారు. 

బాబా అతనితో త్రిశూలమును గీయమని ఆజ్ఞాపించారు. తరువాత మేఘుడు ప్రశ్నించిన మీదట బాబా"మూసివున్న తలుపులు నాకు అడ్డంకి కావు. అక్షింతలను చల్లినది నేనే" అని చెప్పారు. 

మరొక ఉదాహరణలో తార్ఖడ్ యొక్క  భార్య,కొడుకు ఇద్దరూ షిరిడీలో ఉన్నారు. బాబా వారితో "ఈరోజు మధ్యాహ్న్నము బొంబాయిలోని మీ యింటికి వెళ్ళాను. నాకక్కడ తినడానికి ఏమీ దొరకలేదు. తలుపులకు తాళాలు వేసి ఉన్నా నేను ప్రవేశించాను." అన్నారు బాబా.  

మరికొన్ని పోలికలకై ఎదురు చూడండి...

(సర్వం శ్రీసాయినాధార్పణమస్తు)

No comments:

Post a Comment